Updated : 14 Aug 2022 16:55 IST

పెళ్లి అంటున్నారు.. నాకేమో కలవాలంటే భయం.. ఏం చేయాలి?

సమస్య: నాకు 45 ఏళ్లు. నలుగురితో కలవాలంటే భయం. ఏదైనా పెళ్లికి వెళ్లాలన్నా భయమే. ఎవరింటికి వెళ్లాలన్నా, ఎవరైనా ఇంటికి వస్తున్నారన్నా గుండెలో దడ మొదలవుతుంది. ఎవరికైనా ఏదైనా సహాయం చేయలేకపోయినా, ఎవరితోనైనా స్నేహంగా లేకపోయినా, మంచిగా మెలగలేకపోయినా నన్ను నేను నిందించుకుంటాను. త్వరలో మా పిల్లల పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు నలుగురితో కలవాల్సి వస్తే ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారం ఏదైనా ఉందా?

- ఎన్‌. నరేశ్‌, అమీర్‌పేట్‌,హైదరాబాద్‌

 

సలహా: దీన్ని సోషల్‌ యాంక్జయిటీ డిజార్డర్‌ (ఫోబియా) అంటారు. సాధారణంగా ఇది యుక్తవయసు చివర్లో, 20ల ఆరంభంలో మొదలవుతుంటుంది. మీకూ అప్పుడే మొదలై ఉండొచ్చని అనిపిస్తోంది. దీని బారినపడ్డవారు నలుగురిలోకి వెళ్లటానికి, నలుగురితో మాట్లాడాలంటే తెగ భయపడిపోతుంటారు. తెలిసినవారితో కాస్త కలివిడిగా ఉంటారు గానీ అపరిచితుల సమక్షంలో బాగా ఇబ్బంది పడిపోతుంటారు. అంతా తననే చూస్తున్నారేమో, తన తీరుతెన్నులనే ఎంచుతున్నారేమో, తనలో లోపాలున్నాయేమో అనే భావనతో ఆందోళనకు గురవుతుంటారు. దీన్ని తట్టుకోవటానికి రాన్రానూ నలుగురు ఉండే చోటుకు వెళ్లటమే మానేస్తుంటారు. మీరూ ఇలాంటి స్థితిలో ఉన్నారని అనిపిస్తోంది. ముందు మిమ్మల్ని మీరు నిందించుకోవటం మానుకోవాలి. మీరు ఎదుర్కొంటున్నది మెదడు సమస్యే గానీ కావాలనుకొని చేస్తున్నది కాదనే విషయాన్ని గుర్తించాలి. అన్ని భయాల మాదిరిగానే ఇదీ ఒక సామాజిక భయమని తెలుసుకోవాలి. సమస్యకు మీరు బాధ్యులు కాదనే విషయాన్ని గుర్తించగలిగితే సగం సమస్య తగ్గినట్టే అనుకోవచ్చు. భయం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండటానికి, వాటిని ఎదుర్కోవటానికి వెనకాడుతున్నా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. కాబట్టి సమస్యను అంగీకరించి, తగు చికిత్స తీసుకోవటం ఉత్తమం. ఇప్పుడు సామాజిక భయం తగ్గటానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దీర్ఘకాలం వాడుకోవాల్సినవి, తక్షణ ప్రభావం చూపేవి.. ఇలా రెండు రకాలున్నాయి. దీర్ఘకాల మందులు లోతుగా పనిచేసి ఆందోళన పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. తక్షణం పనిచేసే మందులేమో ఇంటర్వ్యూల వంటి అత్యవసర సమయాల్లో ఆందోళన తగ్గిస్తాయి. మీరు పిల్లల పెళ్లి చేయాలి, నలుగురితో కలవాలని అనుకుంటున్నారు కాబట్టి దీర్ఘకాల మందులు వాడుతున్నా కూడా అప్పటికప్పుడు ఆందోళన తగ్గటానికి ఇలాంటి మందులు వాడుకోవాల్సి రావొచ్చు. అలాగే ఆలోచన విధానాన్ని మార్చే కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ సైతం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కౌన్సెలింగ్‌ ద్వారా నలుగురిలో ఉన్నప్పుడు ప్రశాంతగా ఉండటమెలా? ప్రతికూల ఆలోచనలను సానుకూలమైనవిగా మార్చుకోవటమెలా? భయం కలిగించే పరిస్థితులను ఎదుర్కోవటమెలా? అనేవి నెమ్మదిగా నేర్పిస్తారు. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. మానసిక నిపుణులను సంప్రదించి తగు చికిత్స తీసుకుంటే మీరు తప్పకుండా మామూలు మనిషి అవుతారు.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా

సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని