Headache Issue: మీ తలలో నొప్పుందా? ఇవి కారణం కావొచ్చు!

తలనొప్పి తరచూ చూసేదే. ఎప్పుడో అప్పుడు అంతా దీంతో సతమతమైనవారే.  రోజువారీ ఎదురయ్యే ఒత్తిడితో పాటు  పరోక్షంగానూ కొన్ని అంశాలు తలనొప్పికి దారితీయొచ్చు.

Updated : 11 Sep 2022 17:18 IST

తలనొప్పి తరచూ చూసేదే. ఎప్పుడో అప్పుడు అంతా దీంతో సతమతమైనవారే. రోజువారీ ఎదురయ్యే ఒత్తిడితో పాటు పరోక్షంగానూ కొన్ని అంశాలు తలనొప్పికి దారితీయొచ్చు.

నీటిశాతం తగ్గటం: అకారణంగా తలనొప్పి వేధిస్తుంటే రోజూ ఎన్ని నీళ్లు తాగుతున్నారో ఒకసారి చూసుకోండి. నీటిశాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) తలనొప్పి రావొచ్చు మరి. ఒంట్లో నీరు తగ్గినప్పుడు మెదడు తాత్కాలికంగా కుంచించుకుపోతుంది. దీంతో మెదడు పుర్రె నుంచి కాస్త వెనక్కి జారి, నొప్పికి దారితీస్తుంది. తగినన్ని నీళ్లు తాగగానే యథాస్థితికి వస్తుంది. నొప్పీ తగ్గుతుంది.

సరిగా తినకపోవటం: భోజనానికీ భోజనానికీ మధ్యలో చాలా ఎక్కువసేపు ఎడం ఉన్నా తలనొప్పి రావొచ్చు. తరచూ తలనొప్పితో బాధపడేవారు దీన్ని గుర్తుంచుకోవాలి. కొందరికి పిండి పదార్థాలు, మిఠాయిల వంటివి తిన్నప్పుడూ నొప్పి వస్తుండొచ్చు. ఇలాంటివి గమనిస్తే ఆయా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

భంగిమ దెబ్బతినటం: సరిగా కూర్చోకపోవటం, నిలబడకపోవటం వల్ల తల, మెడ, దవడలు, భుజాల వెనక కండరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఎక్కువసేపు ఇలాగే ఉండిపోతే అక్కడి నాడుల మీదా ఒత్తిడి పెరుగుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది.

మద్యం అలవాటు: మద్యంతో మూత్రం ఎక్కువగా వస్తుంది. మూత్రంతో పాటు ఉప్పు, విటమిన్లు, ఖనిజాలూ పోతాయి. అందువల్ల మద్యం ఎక్కువగా తాగితే  నీరు, ఖనిజ లవణాల సమతుల్యత అస్తవ్యస్తమై తలనొప్పి రావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని