ఉప్పు తగ్గిస్తే కిడ్నీ పునరుజ్జీవం

దెబ్బతిన్న కిడ్నీ తిరిగి కుదురుకుంటే ఎంత బాగుంటుందో కదా. అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం ఇలాంటి ఆశలే రెకెత్తిస్తోంది.

Published : 09 Jul 2024 00:43 IST

దెబ్బతిన్న కిడ్నీ తిరిగి కుదురుకుంటే ఎంత బాగుంటుందో కదా. అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం ఇలాంటి ఆశలే రెకెత్తిస్తోంది. స్వల్పకాలంలో ఉప్పు తక్కువ ఆహారం తినటం, శరీరంలో ద్రవాల మోతాదులు తగ్గించటం ద్వారా ఎలుకల కిడ్నీలోని కొన్ని కణాలు మరమ్మత్తు అవుతున్నట్టు, పునరుజ్జీవం పొందుతున్నట్టు బయటపడింది. కిడ్నీలోని మాక్యులా డెన్సా అనే భాగంలోని కణాలు ఇందుకు దోహదం చేస్తుండటం గమనార్హం. ఈ కణాలు ఉప్పును గుర్తించటం, రక్తం వడపోత, హార్మోన్ల విడుదల వంటి కీలకమైన పనులను పర్యవేక్షిస్తాయి. ఇవి కొద్ది సంఖ్యలోనే ఉన్నప్పటికీ దెబ్బతిన్న కిడ్నీ కణాల పునరుజ్జీవంలో గణనీయమైన పాత్ర పోషిస్తుండటం విశేషం. కిడ్నీ జబ్బు చాప కింద నీరులా దొంగ దెబ్బ కొడుతుంది. జబ్బును నిర్ధరించే సరికే కోలుకోలేనంతగా కిడ్నీ దెబ్బతిని ఉంటుంది. కిడ్నీ విఫలమైతే డయాలిసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. దీనికి పరిష్కారం కనుగొనే దిశగా యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోని కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన జానోస్‌ పెటి-పెటెర్డి బృందం సంప్రదాయేతర పద్ధతిలో అధ్యయనం నిర్వహించింది. దెబ్బతిన్న కిడ్నీలు పునరుజ్జీవం కావటంలో ఎందుకు విఫలమవుతున్నాయో అనే దానికి బదులు అసలు కిడ్నీలు ఎలా పరిణామం చెందాయో తెలుసుకోవటానికి ప్రయత్నించారు. చేపల్లోని ఆదిమ కిడ్నీల నిర్మాణం రాన్రానూ ఉప్పు, నీటిని మరింతగా సంగ్రహించుకునేలా సమర్థంగా తయారైంది. జీవులు ఉప్పుతో కూడిన సముద్రం నుంచి పొడి వాతావరణంలోకి విస్తరించే క్రమంలో ఇది తప్పనిసరైంది. ఇందులో భాగంగానే పక్షులు, క్షీరదాల కిడ్నీల్లో మాక్యులా డెన్సా భాగం ఏర్పడింది. జీవుల మనుగడకిది తోడ్పడింది. సరిగ్గా దీన్ని అనుకరించటానికే శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఎలుకలకు రెండు వారాల పాటు తక్కువ ఉప్పు ఆహారం.. అలాగే ఉప్పు, ద్రవాలను మరింత తగ్గించే ఏసీఈ ఇన్‌హిబిటార్‌ రకం మందులు ఇచ్చారు. దీంతో మాక్యులా డెన్సా కణాల పునరుజ్జీవం మొదలైంది. ఈ భాగం నుంచి వచ్చే సంకేతాలను నిలువరించే మందులతో పునరుజ్జీవ ప్రక్రియను అడ్డుకోవచ్చనీ బయటపడింది. అంటే కిడ్నీ కణాల మరమ్మతులో మాక్యులా డెన్సా కీలక భూమిక పోషిస్తున్నట్టు గట్టిగా రుజువైంది. ఈ కణాలను పరిశోధకులు విశ్లేషించగా వీటి జన్యు, నిర్మాణాలు నాడీ కణాలను పోలి ఉన్నట్టు తేలటం ఆశ్చర్యకరం. ఎందుకంటే చర్మం వంటి ఇతర భాగాల పునరుత్తేజంలో నాడీ కణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి మరి. ఉప్పు తక్కువ ఆహారంతో ఎలుకల్లో సీసీఎన్‌1 వంటి కొన్ని ప్రత్యేక జన్యువుల నుంచి వెలువడే సంకేతాలు పెంపొందుతున్నట్టూ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీర్ఘకాల కిడ్నీ జబ్బు బాధితుల్లో సీసీఎన్‌1 జన్యువు పనితీరు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప్పును తగ్గిస్తే ఈ జన్యువు పనితీరు పుంజుకునే అవకాశమున్నట్టు ఇది సూచిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని