No Tobacco Day: పొగ చూరొద్దు!

ఉత్సుకత కొద్దీ ఊరిస్తుంది. ఉబలాటం కొద్దీ ఆకర్షిస్తుంది. క్రమంగా అలవాటుగా మారుతుంది. అవును.. పొగ తాగటం ముందు ఆసక్తితోనే ఆరంభమవుతుంది.

Updated : 30 May 2023 06:44 IST

రేపు పొగాకు వ్యతిరేక దినం

ఉత్సుకత కొద్దీ ఊరిస్తుంది. ఉబలాటం కొద్దీ ఆకర్షిస్తుంది. క్రమంగా అలవాటుగా మారుతుంది. అవును.. పొగ తాగటం ముందు ఆసక్తితోనే ఆరంభమవుతుంది. చివరికి వ్యసనం ఊబిలోకి లాగేసుకుంటుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు.. ఏవైనా గానీ తాగిన మరుక్షణం నుంచే శరీరంలోని అన్ని అవయవాల మీద విపరీత ప్రభావం చూపటం మొదలెడతాయి. పొగాకు పొగలోని నికొటిన్‌ వదల్లేని అలవాటుగా మారేలా చేస్తే.. విషతుల్యాలు ఊపిరితిత్తులు, గుండె జబ్బుల వంటి దీర్ఘకాల వ్యాధుల దగ్గర నుంచి క్యాన్సర్ల వరకూ రకరకాల సమస్యలకు దారితీస్తాయి. మనదేశంలో జబ్బులకు, మరణాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో పొగాకు అలవాటు ఒకటి. దీని మూలంగా ఏటా సుమారు 13.5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. మనదేశంలో 15, అంతకన్నా ఎక్కువ ఏళ్లు పైబడినవారిలో సుమారు 30% మంది పొగాకు వినియోగిస్తున్నారు. ఒక్క సిగరెట్లు, చుట్టలు, బీడీలు, హుక్కా రూపంలోనే కాదు.. గుట్కా, ఖైనీ, జర్దా వంటివి నమలటం ద్వారానూ పొగాకు వాడేవారు ఎందరో. రూపం ఏదైనా చేటు చేసేదే. కాబట్టి పొగాకుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పొగాకు వ్యతిరేక దినం (మే 31) సందర్భంగా పొగాకు వాడకంతో తలెత్తే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం.


గుండెకు శత్రువు

గుండెజబ్బులకు దారితీసే ప్రధాన ముప్పు కారకాల్లో పొగ తాగటం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25% వరకు ఇదే కారణమవుతోంది. పొగ అలవాటు గలవారికి చిన్న వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. సిగరెట్ల సంఖ్య పెరిగినకొద్దీ గుండెజబ్బు ముప్పూ పెరుగుతుంది. అలాగని తక్కువ తాగితే ప్రమాదం లేదనుకోవటానికీ లేదు. రోజుకు 20 సిగరెట్లు కాల్చేవారితో పోలిస్తే ఒకట్రెండు సిగరెట్లు తాగేవారికీ గుండెపోటు ముప్పు 40-50% ఉంటుంది. పొగాకులోని నికొటిన్‌, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి, పూడిక ఏర్పడుతుంది. దీంతో లోపలి మార్గం సన్నబడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. పొగ తాగేవారికి రక్తం గడ్డలు ఏర్పడే ముప్పూ ఎక్కువే. పొగ తాగినప్పుడు ఒంట్లో అడ్రినలిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది హఠాత్తుగా రక్తం గడ్డలు ఏర్పడేలా చేయొచ్చు. పొగ మూలంగా రక్తనాళాలు సంకోచించి, తాత్కాలికంగా రక్తపోటు పెరిగే ప్రమాదమూ ఉంది. ఇదీ గుండెజబ్బు ముప్పును పెంచేదే. రక్తనాళాలు దెబ్బతినటం ఒక్క గుండెలోనే కాదు.. ఏ అవయవంలోనైనా జరగొచ్చు. మెదడు రక్తనాళాల్లో పూడికలతో పక్షవాతం రావొచ్చు. కిడ్నీ రక్తనాళాల్లో పూడికలతో కిడ్నీ పనితీరు దెబ్బతినొచ్చు. కాళ్లకు వెళ్లే రక్తనాళాల్లో పూడికలతో పుండ్లు త్వరగా మానకపోవచ్చు. పొగ మూలంగా కొన్నిసార్లు రక్తనాళాల గోడలు పలుచబడి అక్కడ ఉబ్బొచ్చు (అన్యూరిజమ్‌). అంతేకాదు.. పొగ తాగేవారిలో జీవనకాలమూ పదేళ్లు తగ్గుతుండటం గమనార్హం.

ఇలా పొగాకుతో రకరకాల ఇబ్బందులు చుట్టుముడతాయి. కొందరు తక్కువ నికొటిన్‌ గల సిగరెట్లు, లైట్‌ సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి తక్కువ ప్రమాదకరమని భావిస్తుంటారు. ఇది తప్పు. ఏవైనా హానికరమే. ‘చాలారోజులుగా తాగుతున్నాం కదా, ఏమీ అవలేదు కదా. ఏమీ కాదు’ అనుకోవద్దు. ఏ వయసువారైనా పొగ అలవాటును మానెయ్యటం మేలు. మానేసిన క్షణం నుంచే దుష్ప్రభావాలు తగ్గుతూ వస్తాయి. పొగ మానేసిన ఐదేళ్లలోనే గుండెపోటు తలెత్తే ప్రమాదం పొగ అలవాటులేనివారితో సమాన స్థితికి చేరుకుంటుంది. సిగరెట్లు కాల్చటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తున్నా చాలామంది మానలేకపోతుంటారు. దీనికి కారణం పొగాకులోని నికొటిన్‌. ఇది మళ్లీ మళ్లీ సిగరెట్లు కాల్చాలనే కోరిక పుట్టిస్తుంది. రక్తంలో నికొటిన్‌ మోతాదులు తగ్గినప్పుడు ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు తలెత్తుతుంటాయి. దీంతో మళ్లీ కాల్చటం ఆరంభిస్తుంటారు. ఇలా ఇదొక వ్యసనంగా మారుతుంది. కానీ గట్టి నిర్ణయంతో ప్రయత్నిస్తే మానెయ్యటం కష్టమేమీ కాదు. 8-10 సార్లు విఫలమైనా, ఆ తర్వాత మానేసినవారూ ఉన్నారు. సిగరెట్లు మానెయ్యటం కష్టమైనవారు నికొటిన్‌ ప్యాచ్‌లు వాడు కోవచ్చు. ఇవి రక్తంలోకి నిర్ణీత మోతాదులో నికొటిన్‌ను విడుదల చేస్తాయి. ఆందోళన, చిరాకు వంటి లక్షణాలను తగ్గిస్తాయి. దీంతో క్రమంగా సిగరెట్లు కాల్చాలనే కోరికా తగ్గుతుంది. నికొటిన్‌ బబుల్‌గమ్‌ల వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. గట్టి సంకల్పం తీసుకొని, ఇలాంటి పద్ధతులను పాటిస్తే పొగ అలవాటును వదిలించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవచ్చు.


సంతానానికీ దెబ్బే

హెచ్‌పీవీ మాత్రమే కాదు.. పొగాకు పొగలోని నికొటిన్‌ కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీయొచ్చు. హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌కు  పొగ తాగటమూ తోడైతే ఆడవారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది. లైంగిక సంపర్కం ద్వారా మగవారికీ హెచ్‌పీవీ సోకొచ్చు. ఇది వీరిలో అంగం క్యాన్సర్‌కు దారితీయొచ్చు. పొగతాగే మగవారి వీర్యంలోకీ నికొటిన్‌ చేరుకుంటుంది. దీని మూలంగా శుక్రకణాలు దెబ్బతిని, సంతానం కలగటమూ కష్ట మవుతుంది. ఇంట్లో ఎవరైనా సిగరెట్లు కాలుస్తుంటే వీటి నుంచి వెలువడే పొగను ఆడవారూ పీల్చుకోవచ్చు. ఇలాంటివారు గర్భం ధరిస్తే పిండం ఎదుగుదల కుంటుపడొచ్చు. నికొటిన్‌ మూలంగా రక్తనాళాలు సంకోచించి, పిండానికి రక్త సరఫరా తగ్గుతుంది మరి. ఇటీవల ఆడవారిలో పొగతాగే అలవాటు పెరుగుతోంది. ఇది నెలసరి క్రమాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యంగా ఉండే అండాల సంఖ్యా తగ్గొచ్చు. దీంతో గర్భధారణ కష్టమవుతుంది. కృత్రిమ గర్భధారణ చికిత్సల సామర్థ్యమూ మందగిస్తుంది. పొగ తాగనివారితో పోలిస్తే పొగతాగే మహిళలు ఆలస్యంగా గర్భం ధరిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం ధరించినా కొన్ని దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. గర్భస్రావం, ఫలోపియన్‌ ట్యూబులో గర్భధారణ జరగటం, నెలలు నిండక ముందే కాన్పవటం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టటం, గ్రహణం మొర్రి వంటి లోపాలతో శిశువు పుట్టటం, నిద్రలో పిల్లలు హఠాత్తుగా మరణించటం (సిడ్స్‌) వంటి ముప్పులు పొంచి ఉంటాయి. అప్పటికే సంతానం ఉన్నట్టయితే ఇంట్లో ఎవరు పొగతాగినా దాని ప్రభావం పిల్లల మీదా పడుతుంది.


సంపూర్ణ క్యాన్సర్‌ కారకం

పొగాకు సంపూర్ణ క్యాన్సర్‌ కారకం! ఇందులో ఆర్సెనిక్‌, బెంజీన్‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్‌ ఆక్సైడ్‌ వంటి 72 రకాల క్యాన్సర్‌ కారకాలుంటాయి. ఇవి జిగురు పొరలు, ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసి శరీరమంతటికీ విస్తరిస్తాయి. కణస్థాయిలో మార్పులు తలెత్తటం (ఇనీషియేషన్‌), క్యాన్సర్‌ కణంగా మారటం (ప్రమోషన్‌), క్యాన్సర్‌ కణం తామరతంపరగా వృద్ధి చెంది (ప్రోగ్రెషన్‌).. కణితిగా తయారవటం.. ఇలా క్యాన్సర్‌ మూడు దశల్లో పరిణామం చెందుతుంది. వీటన్నింటిలోనూ పొగాకు ప్రభావం చూపుతుంది. ఇది ఒకవైపు క్యాన్సర్‌ ఏర్పడేలా చేసే ఆంకో జన్యువులను ప్రేరేపితం చేస్తుంది. మరోవైపు క్యాన్సర్‌ను అణచే కణాలను నిర్వీర్యం చేస్తుంది. దీనిలోని క్యాన్సర్‌ కారకాలు ముందుగా డీఎన్‌ఏ భాగాలకు అంటుకుపోయి, పనితీరును దెబ్బతీస్తాయి. చివరికి కణ విభజన ప్రక్రియ అస్తవ్యస్తమై, ఇష్టం వచ్చినట్టుగా కణాలు వృద్ధి చెందుతూ వస్తాయి. క్యాన్సర్‌తో పోరాడే శక్తినీ పొగాకు అడ్డుకుంటుంది. దీనిలోని విషతుల్యాలు రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. దీంతో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే శక్తీ సన్నగిల్లుతుంది. ఇది మరో ప్రమాదం.

పొగ మూలంగా పెదవి, నోరు, నాలుక, అంగిలి, అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌, కాలేయం, మూత్రాశయం, కిడ్నీ క్యాన్సర్ల వంటివెన్నో తలెత్తుతాయి. ఎముక మజ్జలోనూ క్యాన్సర్లు రావొచ్చు. పొగాకుతో సంభవించే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌. జీర్ణాశయ, గొంతు, అన్నవాహిక, నోటి క్యాన్సర్లూ ఎక్కువే. ఎందుకంటే పొగ ముందుగా నోరు, గొంతు నుంచి ఊపిరితిత్తులకు, అన్నవాహికలోకి, ముక్కు చుట్టుపక్కల గాలిగదుల్లోకే చేరుకుంటుంది. కొందరు జర్దా, గుట్కా, ఖైనీలను నోట్లో పెట్టుకొని నములుతుంటారు. ఇలా పొగ, లాలాజలం ద్వారా క్యాన్సర్‌ కారకాలు రక్తంలోకి, అక్కడ్నుంచి వివిధ అవయవాలకు చేరుకొని ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. ఒకసారి క్యాన్సర్‌ బారినపడి చికిత్స తీసుకున్నవారు తిరిగి పొగాకు వాడకం మొదలెడితే నూటికి నూరు శాతం క్యాన్సర్‌ తిరగబెడుతుంది. ఈసారి మరింత తీవ్రంగానూ వస్తుంది. అంతకుముందు వచ్చిన భాగాల్లో కాకుండా వేరే భాగాల్లోనూ క్యాన్సర్‌ రావచ్చు. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారు, తీసుకున్నవారు తిరిగి పొగాకు వాడితే నూటికి నూరు శాతం క్యాన్సర్‌ తిరగ బెడుతుంది. ఈసారి తీవ్రంగానూ ఉంటుంది.


‘ఊపిరి’కి చిచ్చు!

సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చటం నేరుగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తాయి. పొగలోని విషతుల్యాలు సున్నితమైన గాలి గొట్టాలను, గాలి గదులను కోలుకోలేనంత దెబ్బతీస్తాయి. ఇది దీర్ఘకాల ఊపిరితిత్తి సమస్య ‘సీవోపీడీ’కి (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) దారితీస్తుంది. సీవోపీడీలో క్రానిక్‌ బ్రాంకైటిస్‌, ఎంఫెసీమా అని రెండు సమస్యలు తలెత్తుతాయి. పొగ మూలంగా గాలిగొట్టాల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలై ఉబ్బిపోతాయి. దీంతో లోపలి మార్గం కుంచించుకుపోతుంది. దీన్నే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ అంటారు. ఇక ఎంఫెసీమాలో గాలిగొట్టాలతో పాటు గాలిగదులూ దెబ్బతింటాయి. ఫలితంగా శ్వాస ద్వారా తీసుకున్న ఆక్సిజన్‌ రక్తంలోకి, రక్తంలోని కార్బన్‌డయాక్సైడ్‌ ఊపిరితిత్తుల్లోకి మార్పిడి కావటం అస్తవ్యస్తమవుతుంది. దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు వేధిస్తాయి. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు దెబ్బతినటంతోనూ అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గొచ్చు. సీవోపీడీ గలవారిలో పొగ తాగనివారితో పోలిస్తే పొగతాగే వారికి మరణించే ముప్పు 10 రెట్లు ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. దీర్ఘకాలం సీవోపీడీతో బాధపడేవారికి గుండె విఫలమయ్యే ముప్పూ ఎక్కువే. దీనికి చికిత్స చేయటమూ కష్టమే. పొగ అలవాటు ఆస్థమా బాధితులకు మరింత శాపంగా పరిణమిస్తుంది. ఇది ఆస్థమాను ప్రేరేపించటమే కాదు.. లక్షణాలు నియంత్రణలోకి రావటమూ కష్టమవుతుంది. ఇన్‌హేలర్‌ మందులూ సమర్థంగా పనిచేయవు.

సిగరెట్లు, చుట్టల నుంచి రాలే బూడిద ఇంట్లో నేల మీద పడి, అది గాలికి పైకి లేచి అలర్జీ, ఆస్థమా ప్రేరేపితం కావొచ్చు. పొగ ఎక్కువగా తాగటం వల్ల ఆకలి మందగిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది పోషణ లోపానికి దారితీసి, క్షయ ముప్పు పెరుగుతుంది. నిద్రాణంగా ఉన్న క్షయ ప్రేరేపితమయ్యే అవకాశమూ ఉంది. పొగ తాగినప్పుడు ఊపిరితిత్తుల్లోని కణాలు ఎక్కువగా జిగురుద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. గాలిగొట్టాల సైజు, సంఖ్యా పెరుగుతుంది. దీంతో జిగురు ద్రవం ఇంకాస్త ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఊపిరితిత్తులు అంతగా బయటకు నెట్టలేవు. అందువల్ల అది ఊపిరితిత్తుల్లోనే ఉండిపోయి, గాలిగొట్టాలకు అడ్డుపడుతుంది. ఫలితంగా దగ్గు తలెత్తుతుంది. అధిక జిగురుద్రవంతో ఇన్‌ఫెక్షన్లూ రావొచ్చు. పొగ మూలంగా ఊపిరితిత్తుల్లోని రక్షణ వ్యవస్థ దెబ్బతినటంతోనూ ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లో సూక్ష్మ కేశాలు (సీలియా) ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు శుభ్రం కావటానికి తోడ్పడతాయి. పొగ తాగటం వల్ల వీటి కదలికలు మందగిస్తాయి. ఒక్క సిగరెట్‌ తాగినా వీటి కదలికలు గంటల కొద్దీ నెమ్మదిస్తాయి. పొగతో సూక్ష్మ కేశాల సంఖ్యా తగ్గుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులు శుభ్రం కావటమూ అస్తవ్యస్తమవుతుంది. సిగరెట్లు, చుట్టలు కాల్చేవారికే కాదు.. వీళ్లు వదిలే పొగతో చుట్టుపక్కల వారికీ హాని కలుగుతుంది. ఇదీ రకరకాల సమస్యలకు దారితీస్తుంది.


హాని రకరకాలుగా..

సిగరెట్లు, చుట్టలు, బీడీల పొగలోని రసాయనాలు శరీరంలో రకరకాలుగా హాని చేస్తాయి. వీటిల్లో కొన్ని ఇవీ..

* నికొటిన్‌: పొగ అలవాటుకు బానిసయ్యేలా చేసేది ఇదే. అంతేకాదు.. రక్తనాళాలు సంకోచించేలా చేస్తుంది. దీంతో గుండె మరింత బలంగా, వేగంగా పనిచేయాల్సి వస్తుంది. గుండెకు దూరంగా ఉండే కాళ్లు, చేతుల వంటి అవయవాలకు రక్తం, ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. 

* కార్బన్‌మోనాక్సైడ్‌: ఊపిరితిత్తుల నుంచి గుండెకు ఆక్సిజన్‌ అందటం తగ్గుతుంది. క్రమంగా గాలిగొట్టాలూ ఉబ్బుతాయి. దీంతో ఊపిరితిత్తుల్లోకి గాలి అంతగా చేరుకోదు. 

తారు: చిమ్నీ లోపల పొగ చూరినట్టుగా ఇది ఊపిరితిత్తుల్లో అంటుకుపోతుంది. 

* ఫెనాల్స్‌: ఇవి గాలిగొట్టాల్లోని సూక్ష్మకేశాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో గాలిగొట్టాల్లో శుభ్రత కొరవడుతుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది. 

* సూక్ష్మ రేణువులు: ఇవి గొంతు, ఊపిరితిత్తులను చికాకు పరచి దగ్గును ప్రేరేపిస్తాయి. జిగురుద్రవం ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి, ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. 

* అమోనియా, ఫార్మాల్డిహైడ్‌: ఇవి కళ్లు, ముక్కు, గొంతులో చికాకు పుట్టిస్తాయి. 

* క్యాన్సర్‌ కారక రసాయనాలు: కణాలు వేగంగా, అసాధారంగా వృద్ధి చెందేలా పురికొల్పుతాయి. ఇలా కణితులకు దారితీస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని