సురక్షిత క్యాన్సర్‌ మందుల దిశగా..

సురక్షిత క్యాన్సర్‌ మందుల ఆవిష్కరణ దిశగా మరో ముందడుగు పడింది. కొన్ని క్యాన్సర్‌ చికిత్సలు గుండెను దెబ్బతీయటానికి గల కారణాన్ని యూసీఎల్‌ పరిశోధకులు గుర్తించారు మరి. క్యాన్సర్‌ చికిత్సలో అధునాతన ఔషధాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Published : 02 May 2023 00:39 IST

సురక్షిత క్యాన్సర్‌ మందుల ఆవిష్కరణ దిశగా మరో ముందడుగు పడింది. కొన్ని క్యాన్సర్‌ చికిత్సలు గుండెను దెబ్బతీయటానికి గల కారణాన్ని యూసీఎల్‌ పరిశోధకులు గుర్తించారు మరి. క్యాన్సర్‌ చికిత్సలో అధునాతన ఔషధాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరణాల నుంచి కాపాడుతున్నాయి. జీవనకాలాన్ని పెంచుతున్నాయి. అయితే కొన్ని క్యాన్సర్‌ చికిత్సలు గుండెను దెబ్బతీస్తుంటాయి. ఇది రకరకాల రూపాల్లో ఉండొచ్చు. కొందరిలో గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గితే.. కొందరిలో గుండె వైఫల్యం సంభవించొచ్చు. కానీ ఈ మందులు గుండెను ఎలా దెబ్బతీస్తున్నాయనేది తెలియకుండానే ఉండిపోయింది. దీని విషయంలో యూసీఎల్‌ పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని గుర్తించారు. గుండెజబ్బు ముప్పు పెరగటానికి దోహదం చేసే రక్తంలోని ప్రొటీన్లు క్యాన్సర్‌ చికిత్సలో వాడే మందులతోనూ ప్రభావితమవుతున్నాయని కనుగొన్నారు. ఈ మందులు గుండెను ఎలా దెబ్బతీస్తున్నాయో విశ్లేషించటానికి, గుండెజబ్బు ముప్పు గలవారిని గుర్తించటానికి తమ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు చెబుతున్నారు. మున్ముందు సురక్షిత క్యాన్సర్‌ మందుల ఆవిష్కరణకూ దారితీయగలవని ఆశిస్తున్నారు. గుండె వైఫల్యం వంటి గుండె జబ్బుల చికిత్సకు కొత్త మందుల రూపకల్పనకూ ఈ అధ్యయనం దారులు తెరచింది. గుండెజబ్బు ముప్పుతో ముడిపడిన ప్రొటీన్లను అడ్డుకోవటం లేదా ముప్పును తగ్గించే ప్రొటీన్లను ప్రేరేపితం చేయగలిగే మందులతో మంచి ఫలితం కనిపించొచ్చని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని