Published : 04 May 2021 00:30 IST

మహిళల గుండెకు ఒత్తిడి పోటు

హిళల గుండెలను మానసిక ఒత్తిడి విపరీతంగానే దెబ్బతీస్తోంది. దీనికి ఒంట్లో తలెత్తే హార్మోన్ల స్థాయులు కారణమవుతున్నట్టు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం సూచిస్తోంది. గుండెపోటు బారినపడుతున్నవారిలో సుమారు 10% మందిలో గుండె రక్తనాళాల్లో స్పష్టమైన కారణమేదీ కనిపించదు. కొందరిలో తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగాల మూలంగా తాత్కాలికంగా తలెత్తే గుండెపోటు (బ్రోకెన్‌ హార్ట్‌) ఉండొచ్చు. మిగతావారిలో అసలు ఎలాంటి కారణమూ తేలకపోవచ్చు. అయితే నిర్లక్ష్యం చేయటం తగదని, ఇలాంటివారిలో వీలైనంత త్వరగా ఎంఆర్‌ స్కాన్‌ చేయటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో జబ్బును కచ్చితంగా పట్టుకునే వీలుంటుంది. భావోద్వేగాలతో ముడిపడిన గుండెపోటుతో గుండె పనితీరు మందగిస్తుంటుంది. దీని బారినపడుతున్నవారిలో 80-90% మంది మహిళలే ఉంటున్నారని, ఇది మానసిక ఒత్తిడితో ముడిపడి ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులతో తలెత్తే ఒత్తిడి సైతం దీనికి దారితీసే అవకాశముందని భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు గుండెపోటు పరీక్షలు, చికిత్సల పరిశోధనలన్నీ మగవారిని దృష్టిలో పెట్టుకునే చేస్తుంటారు. మహిళల్లో గుండెపోటుకు అంతగా ప్రాధాన్యమివ్వరు. భావోద్వేగ గుండెపోటు కనిపించిన దాదాపు 10 రోజుల తర్వాతే ఎంఆర్‌ స్కాన్‌ చేయిస్తుంటారు. కానీ దీన్ని ఇంకాస్త ముందుగానే చేయించటం మంచిదని, ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స చేయటం వీలవుతుందన్నది పరిశోధకుల సూచన.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని