గడ్డ కాలం

రక్తనాళాల్లో సాఫీగా, ఎక్కడికంటే అక్కడికి తేలికగా ప్రవహించే రక్తానికి ఉన్నట్టుండి ఆటంకం ఎదురైతే? ఏదో కట్ట కట్టినట్టు చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడుతుంటే? అరుదే అయినా.. కొవిడ్‌-19లో కొందరికి ఇలాంటి పరిస్థితే ప్రమాదకరంగా మారుతోంది. వాపు ప్రక్రియతో ప్రేరేపితమయ్యే ఇది అవయవాలను దెబ్బతీస్తూ, ప్రాణాంతకంగా పరిణమిస్తోంది.మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను సరఫరా చేసేది రక్తమే. అలాంటి ప్రాణదాయినికి కొవిడ్‌-19 అడ్డుకట్ట వేస్తోంది. రక్తనాళాల్లో ఎక్కడికక్కడ రక్తం గడ్డలు కట్టేలా చేస్తోంది. దీంతో ఊపిరితిత్తులు, గుండె వంటి కీలక అవయవాలకు

Updated : 15 Sep 2020 01:37 IST

కరోనా జబ్బు-అనర్థాలు

రక్తనాళాల్లో సాఫీగా, ఎక్కడికంటే అక్కడికి తేలికగా ప్రవహించే రక్తానికి ఉన్నట్టుండి ఆటంకం ఎదురైతే? ఏదో కట్ట కట్టినట్టు చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడుతుంటే? అరుదే అయినా.. కొవిడ్‌-19లో కొందరికి ఇలాంటి పరిస్థితే ప్రమాదకరంగా మారుతోంది. వాపు ప్రక్రియతో ప్రేరేపితమయ్యే ఇది అవయవాలను దెబ్బతీస్తూ, ప్రాణాంతకంగా పరిణమిస్తోంది.

మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను సరఫరా చేసేది రక్తమే. అలాంటి ప్రాణదాయినికి కొవిడ్‌-19 అడ్డుకట్ట వేస్తోంది. రక్తనాళాల్లో ఎక్కడికక్కడ రక్తం గడ్డలు కట్టేలా చేస్తోంది. దీంతో ఊపిరితిత్తులు, గుండె వంటి కీలక అవయవాలకు తగినంత రక్తం అందక, విఫలమై చివరికి చేతులెత్తేస్తున్నాయి. నిజానికి ఒక్క కొత్త కరోనా జబ్బులోనే కాదు.. ఇతరత్రా వైరల్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు ఏవైనా రక్తం గడ్డలు ఏర్పడటానికి దారితీయొచ్చు. సెప్సిస్‌, ఆపరేషన్ల అనంతరం, పెద్ద పెద్ద ప్రమాదాలకు గురికావటం వంటి సమయాల్లోనూ ఇవి ఏర్పడొచ్చు. కానీ కొన్నిసార్లు రక్తం గడ్డ కట్టటానికి తోడ్పడే రక్షణ వ్యవస్థ అతిగా స్పందించటం మూలంగానూ రక్తం గూడు కడుతుంటుంది. కొందరిలో ఇది మెదడు, ఊపిరితిత్తులు, కాలి సిరలు.. ఇలా శరీరమంతటికీ విస్తరించొచ్చు. కొవిడ్‌-19లో జరుగుతోంది ఇదే.

కాపాడే ప్రక్రియే..
శరీరానికి రక్తం చాలా కీలకం. కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కోల్పోకుండా చూడటానికే శరీరం తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఏదైనా గాయమైనా, ప్రమాదం జరిగినా వెంటనే రక్తం గడ్డ కట్టేలా చూసుకుంటుంది. ఇందుకు యాంటీ ఫాస్ఫోలేట్‌ ప్రోటీన్లు, గ్లైకో ప్రోటీన్లు, ఇంటర్‌ల్యూకిన్‌ ప్రోటీన్లు, టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా ప్రోటీన్ల వంటివెన్నో తోడ్పడుతుంటాయి. వీటినే ఇంటర్‌ మీడియరీ ప్రొటీన్లు అంటారు. వీటికి రక్తం గడ్డ కట్టటానికి తోడ్పడే రకరకాల ఫ్యాక్టర్లు సాయం చేస్తుంటాయి. ఇంటర్‌ మీడియరీ ప్రొటీన్లు అవసరమైనప్పుడే ఉత్తేజితమవుతాయి. ఉదాహరణకు ఏదైనా గాయమైందనుకోండి. అక్కడి చర్మం వెంటనే ఇంటర్‌ మీడియరీ ప్రోటీన్లను విడుదల చేస్తుంది. ఇవి రక్తం గడ్డ కట్టటంలో పాలు పంచుకునే ఫ్యాక్టర్లను ప్రేరేపితం చేస్తాయి. ముందుగా ప్రొత్రాంబిన్‌ ఫ్యాక్టర్‌ త్రాంబిన్‌గా మారుతుంది. ఇది ఫైబ్రినోజెన్‌ను ఫైబ్రిన్‌గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్‌ ఇతర ప్లేట్‌లెట్లతో కలసి రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో రక్త స్రావం ఆగిపోతుంది. సాధారణంగా ఇంటర్‌ మీడియరీ ప్రొటీన్లు అవసరమైనప్పుడే.. అంటే గాయాలు, ప్రమాదాల వంటి వాటికి గురైనప్పుడే ఉత్తేజితమవుతాయి. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లతోనూ ఇవి ప్రేరేపితం కావొచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటానికి ఇదే మూలం.

 కొవిడ్‌-19లో ఎందుకిలా?
కొత్త కరోనా జబ్బులో రక్తం గడ్డలు ఏర్పడటానికి ప్రధాన కారణం వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) అతిగా స్పందించటం. నిజానికి రక్తం గడ్డ కట్టటం, వాపు ప్రక్రియ రెండూ ఒకదాంతో మరోటి ప్రభావితమై పనిచేస్తుంటాయి. ఒకటి ప్రేరేపిస్తుంటే మరోటి దాన్ని నియంత్రించటానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే కొవిడ్‌-19 బాధితుల్లో వాపు ప్రక్రియ అతిగా స్పందించటం, సైటోకైన్ల ఉప్పెనకు (సైటోకైన్‌ స్టార్మ్‌) దారితీయటం పెద్ద సమస్యగా మారుతోంది. సాధారణంగా రోగనిరోధక కణాల నుంచి పుట్టుకొచ్చే సైటోకైన్లు హానికారక సూక్ష్మక్రిములను నిలువరిస్తూ.. ఒళ్లంతా విస్తరించకుండా చూడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఐఎల్‌-6, ఐఎల్‌-1, టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా వంటి కొన్ని వాపు ప్రక్రియను ప్రేరేపించే సైటోకైన్లు రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడేలానూ చేస్తాయి. కొవిడ్‌-19లో జరుగుతోంది ఇదే. ఐఎల్‌-6 రక్తం గడ్డ కట్టే ప్రక్రియతో పాటు త్రాంబిన్‌ ఉత్పత్తినీ ప్రేరేపిస్తుంది. మరోవైపు ఐఎల్‌-1, టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా రక్తం గడ్డకుండా చూసే ప్రక్రియను నియంత్రిస్తుంటాయి. ఒకవేళ త్రాంబిన్‌ పెద్ద మొత్తంలో విడుదలయ్యిందనుకోంది. ఆ వెంటనే రక్తం గడ్డకట్టకుండా చూసే కారకాలు త్రాంబిన్‌ విడుదల ఆగిపోయేలా సంకేతాలు విడుదల చేస్తాయి. అయితే కొవిడ్‌-19లో వాపు ప్రక్రియ ఉద్ధృతమైనప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోతోంది. ఫలితంగా చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడటం మొదలవుతోంది. సార్స్‌-కోవ్‌2 ఊపిరితిత్తులపైనే ప్రధానంగా ప్రభావం చూపుతోంది. కాబట్టి ఊపిరితిత్తులోని రక్తనాళాల్లో రక్తం గూడు కట్టటం ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఒక్క ఊపిరితిత్తుల్లోనే కాదు.. మెదడు, గుండె, కాళ్లు ఇలా ఎక్కడైనా జరగొచ్చు. కొవిడ్‌ తీవ్రమై, సైటోకైన్ల ఉప్పెన తలెత్తినవారిలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

 హెపారిన్‌ ఇంజెక్షన్లతో మేలు
రక్తం గడ్డలు ఏర్పడుకుండా చూడటంలో హెపారిన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొవిడ్‌ జబ్బు మధ్యస్థంగా, తీవ్రంగా ఉన్నవారికి ముందు జాగ్రత్తగా 5- 7 రోజుల పాటు హెపారిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వటం మంచిది. ఇలా రక్తం గడ్డల ముప్పును తగ్గించుకోవచ్చు. రక్తంలో ఆక్సిజన్‌ శాతం వేగంగా తగ్గుతున్నవారికి, జ్వరం తగ్గకుండా ఎక్కువవుతున్నవారికి వీటిని ఇవ్వచ్చు. జ్వరం తగ్గటం లేదంటే వైరస్‌ వృద్ధి చెందుతోందని, ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువవుతోందని, ఒంట్లో సైటోకైన్లు విడుదలవుతున్నాయనే అర్థం. హెపారిన్‌ ఇంజెక్షన్లతో వచ్చే ముప్పేమీ లేదు. ఇవి 12-16 గంటల పాటే పనిచేస్తాయి. ఇంజెక్షన్లు ఆపేసిన మర్నాటి నుంచే ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల దీర్ఘకాలంలో వీటితో పెద్ద దుష్ప్రభావాలేవీ ఉండవు.
* చిన్న వయసువారికి రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు తక్కువ. వృద్ధులకు.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, దీర్ఘకాల కాలేయ జబ్బులు, కిడ్నీ జబ్బులు గలవారికి.. సిగరెట్లు ఎక్కువగా కాల్చేవారికి, గర్భిణులకు వీటి ముప్పు ఎక్కువ. ఇలాంటివారిలో రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే ప్రొటీన్లు అప్పటికే ఉత్తేజితమై ఉంటాయి. వీటికి ఇన్‌ఫెక్షన్‌ తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఇలాంటి వారికి కొవిడ్‌ మామూలుగా ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా హెపారిన్‌ ఇవ్వాల్సి రావొచ్చు. చిన్నవయసువారికి, ఎలాంటి జబ్బులు లేనివారికి జబ్బు మధ్యస్థ దశకు చేరుకున్నా కూడా కొంత కాలం వేచి చూడొచ్చు.
* కొవిడ్‌కు ఎక్కువరోజుల పాటు చికిత్స తీసుకునేవారు కదలకుండా ఉండిపోతుంటారు. వీరికీ రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువ. ఇలాంటివారికి లక్షణాలను బట్టి హెపారిన్‌ ఇవాల్సి ఉంటుంది.

అనవసర పరీక్షలు వద్దు
రక్తం గడ్డ కట్టే ముప్పును అంచనా వేయటానికి డీ డైమర్‌ పరీక్ష ఉపయోగపడుతుంది. అందరికీ దీని అవసరముండకపోవచ్చు. ఒక మాదిరి నుంచి తీవ్రమైన కొవిడ్‌ గలవారికే దీన్ని సూచిస్తారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే సీటీ స్కాన్‌, సీఆర్‌పీ, సీరమ్‌ ఫెరెటిన్‌, డీడైమర్‌ వంటి పరీక్షలన్నీ చేసేస్తున్నారు. అందరికీ అన్ని పరీక్షలు అవసరం లేదు. డాక్టర్‌ సిఫారసు మేరకే వీటిని చేయించుకోవాలి. సొంతంగా ఎవరికి వారు పరీక్షలను చేయించుకోవటం తగదు. పరీక్షల్లో కొన్నిసార్లు తప్పుడు ఫలితాలు రావొచ్చు. ఇవి అనవసర భయానికి గురిచేయొచ్చు. ఇప్పటికే కొవిడ్‌-19 భయంతో వణికిపోతున్నవారిని ఇది మరింత ఆందోళనలకు గురిచేయొచ్చు. లక్షణాల తీవ్రతను గమనిస్తూ అవసరమైనవారికి, అవసరమైన పరీక్షలు చేయించటమే ఉత్తమం. ఫలితాలను విశ్లేషించేటప్పుడూ లక్షణాలను, బాధితుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలనే సంగతినీ మరవరాదు.


నివారించుకోవచ్చా?

* నీటిశాతం తగ్గితే రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువ. అందువల్ల ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.
* తగినంత వ్యాయామం, శ్రమ చేయాలి. గంటల కొద్దీ ఒకేచోట కూర్చోకుండా చూసుకోవాలి.
* మద్యం, పొగ తాగే అలవాట్లకు దూరంగా ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని