Fenugreek Benefits: సంతాన సమస్యలా... అయితే వీటిని తినండి!

శృంగారంపై ఆసక్తి పెరగటానికి మెంతులు (Fenugreeks) చాలావరకు ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయట.

Updated : 09 Jul 2023 19:18 IST

సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఇలాంటి పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీరికి మున్ముందు మధుమేహం వంటి జీవక్రియల జబ్బులు ముంచుకొచ్చే ప్రమాదముంది. స్వీడన్‌ పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిని ఎంచుకొని, ఇతరులతో పోల్చి చూడగా కొన్ని కొత్త సంగతులు బయటపడ్డాయి. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల లోపు వారిలో మూడింటి ఒక వంతు మందిలో టెస్టో'స్టిరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల స్థాయులు ఏడు రెట్లు తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది.

వీరిలో ఎముక సాంద్రత కూడా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గినవారిలో ఇది ప్రముఖంగా కనబడుతోంది. దీని మూలంగా ఎముక క్షీణించటం, తేలికగా విరగటం వంటివి తలెత్తుతాయి. అంతేకాదు.. గ్లూకోజు స్థాయులను సూచించే హెచ్‌బీఏ1సీ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇన్సులిన్‌ నిరోధకతా పెరుగుతోంది. ఇవి రెండూ మధుమేహం ముప్పును పెంచేవే కావటం గమనార్హం. అందువల్ల సంతాన చికిత్సలు తీసుకునే పురుషులంతా ఒకసారి సెక్స్‌ హార్మోన్ల పరీక్షలు చేయించుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. తీవ్రమైన జబ్బుల ముప్పులు గలవారు సంతాన చికిత్సల అనంతరం వాటిపై ఒక కన్నేసి ఉండటమూ మేలని చెబుతున్నారు.

ఉద్దీపన మెంతం

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకకాల పదార్థాలు తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం తెలియదు. వీటి ప్రభావాలు శాస్త్రీయంగానూ రుజువు కాలేదు. కానీ ఈ విషయంలో మెంతులు (Fenugreeks) కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం. కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని