Diabetes - Coffee: మధుమేహానికి కాఫీ కళ్లెం... ఎలాగంటే?

రక్తంలో కెఫీన్‌ మోతాదులు ఎక్కువగా గలవారికి టైప్‌2 మధుమేహం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు యూరప్‌ అధ్యయనంలో బయటపడింది. అయితే...

Published : 27 Feb 2024 10:43 IST

రక్తంలో కెఫీన్‌ మోతాదులు ఎక్కువగా గలవారికి టైప్‌2 మధుమేహం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు యూరప్‌ అధ్యయనంలో బయటపడింది. ఇది బరువును తగ్గించటం ద్వారా మధుమేహం ముప్పు తగ్గేలా చేస్తున్నట్టు వెల్లడైంది. ఇందులో కెఫీన్‌తో కూడిన పానీయాల వినియోగం కన్నా శరీరంలో కెఫీన్‌ ఎలా విచ్ఛిన్నమవుతోందనే దాని మీదే ఎక్కువగా దృష్టి సారించటం విశేషం. కెఫీన్‌ జీవక్రియ తక్కువగా గలవారిలో ఇది విచ్ఛిన్నం కావటానికి ఎక్కువ సమయం పడుతోందని, అందువల్ల రక్తంలో దీని మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

కెఫీన్‌ వాడకానికీ బరువు తగ్గటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు చాలాకాలంగా తెలిసిందే. అందుకే బరువు తగ్గించే మాత్రల్లో విధిగా కెఫీన్‌ను చేర్చుతుంటారు కూడా. ఇది శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేసుకునేలా పురికొల్పుతుంది. ఇలా బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. బరువు తగ్గితే మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పూ తగ్గుతుంది. మరి కాఫీ ఎక్కువగా తాగటం ద్వారా మధుమేహాన్ని నివారించుకోవచ్చా? కానే కాదు. తాజా అధ్యయనం కెఫీన్‌ వినియోగానికి బదులు రక్తంలో కెఫీన్‌ మోతాదుల గురించే చెబుతోందని గుర్తించాలి. పైగా ఇవి రెండూ జన్యువులతో ముడిపడి ఉంటుండటం గమనార్హం.

43 శాతం వరకు తక్కువగా...

శరీరంలో కెఫీన్‌ జీవక్రియలు వేగవంతం కావటంలో సీవైపీ1ఏ2, ఏహెచ్‌ఆర్‌ జన్యువులు పాలు పంచుకుంటున్నట్టు గుర్తించారు. ఈ జన్యువులు గలవారిలో కెఫీన్‌ జీవక్రియ నెమ్మదిగా సాగుతోందని, సగటున తక్కువ కాఫీ తీసుకున్నా రక్తంలో కెఫీన్‌ మోతాదులు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతోందని.. ఫలితంగా మధుమేహం ముప్పు 43% వరకు తక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు. అంటే కెఫీన్‌ జీవక్రియ నెమ్మదిగా సాగే స్వభావం గలవారు తక్కువ కెఫీన్‌ తీసుకున్నా దీని ప్రయోజనం ఎక్కువగా కనిపిస్తోందన్నమాట.

అంతే తప్ప కాఫీ ఎక్కువగా తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని అధ్యయనం సూచించటం లేదు. కాఫీ మితిమీరితే గుండె వేగం పెరగటం, ఆందోళన, చిరాకు, చేతుల వణుకు, నిద్రలేమి, తలనొప్పి వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది. అంతేకాదు.. కాఫీతో పాటు చక్కెర కూడా తీసుకోవటం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని