గుండెకు యోగా మంచిదేగా!
ఎల్లుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం
అడుగులు పాతవే. మార్గమూ ప్రాచీనమే. గమ్యమే కొత్తది. అనాదిగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమై సాగుతూ వస్తున్న యోగా.. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నెన్నో జఠిల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతోంది. ముఖ్యంగా రోజురోజుకీ పెరిగిపోతున్న ఒత్తిళ్ల భారాన్ని మోయలేక చతికిలపడిపోతున్న గుండెకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అనుక్షణం గుండెను దెబ్బతీయటానికి కాచుకొని చూస్తున్న ముప్పు కారకాలను ఆదిలోనే తుదముట్టిస్తూ.. పెద్ద సమస్యలుగా మారకుండా మూలం నుంచే నరుక్కుంటూ వస్తోంది. కాబట్టే వైద్యరంగం ఇప్పుడు యోగా ప్రయోజనాలపై నిశితంగా దృష్టి సారించింది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యల కారణంగా చేతులెత్తేసిన గుండెను గాడిలో పెట్టే ‘కార్డియాక్ రిహాబిలిటేషన్’ కార్యక్రమాల్లో యోగాకూ స్థానం కల్పిస్తోంది. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నేపథ్యంలో యోగా మూలంగా గుండెకు ఒనగూడుతున్న ప్రయోజనాలపై ప్రత్యేక కథనం అందిస్తోంది ఈవారం సుఖీభవ.
గుండెజబ్బులు మనకు కొత్త కాదు. వృద్ధులు, యువకులు అన్న తేడా లేదు. పట్టణాలు, గ్రామాలు అన్న భేదం లేదు. అన్ని వయసుల వారినీ, అన్ని ప్రాంతాల వారినీ ఇవి ఒక మహమ్మారిలా చుట్టుముడుతున్నాయి. సాంక్రమికేతర జబ్బుల్లో 70% వరకూ గుండెజబ్బులు ఉంటుండటమే దీనికి నిదర్శనం. మారిపోతున్న ఆహార పద్ధతులు, తగ్గిపోతున్న శారీరక శ్రమ, పెరిగిపోతున్న ఉప్పు వాడకం, విస్తరిస్తున్న పొగ తాగే అలవాటు, మితిమీరుతున్న మద్యం, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒత్తిడి.. ఇవన్నీ పెద్ద ఉపద్రవాన్నే తెచ్చిపెడుతున్నాయి. క్రమంగా ఇవి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తూ.. చివరికి గుండెజబ్బుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి ఆపత్తరుణంలో మనకు యోగా కొత్త బాసటను అందిస్తోంది. నిజానికి గుండెజబ్బుల ముప్పు అధికంగా గలవారికి స్టాటిన్స్, ఆస్ప్రిన్.. అలాగే రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్లు, ఏసీఈ ఇన్‌హిబిటార్స్ వంటి మందులను ఇవ్వటం పరిపాటి. అయితే వీటితో పాటు జీవనశైలిని మార్చుకోవటమూ కీలకమే. ఇందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందనే అవగాహన ఇప్పుడు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇది గుండెజబ్బులతో బాధపడేవారికే కాకుండా అసలు గుండెజబ్బుల బారినపడకుండా కాపాడుకోవటానికీ దోహదం చేస్తుండటం గమనార్హం. యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తూనే ప్రతికూల ఆలోచనలకు, కోరికలకు కళ్లెం వేసి జీవన వాస్తవం బోధపడేలా చేస్తుంది. ఫలితంగా చెడు అలవాట్ల వైపు ధ్యాస మళ్లకుండా కాపాడుతుంది. ఇలా గుండెజబ్బుల నివారణకు, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలుకోవటానికి తోడ్పడుతుంది.
మనో నిబ్బరం.. నైతిక విలువలు
పొగ తాగకూడదని, మద్యం జోలికి వెళ్లకూడదని.. ఆహారంలో కొవ్వులు, ఉప్పు తగ్గించుకోవాలని.. వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని అందరికీ తెలుసు. అయినా ఎందుకు పాటించటం లేదు? లోతుగా ఆలోచిస్తే మనసును నియంత్రణలో లేకపోవటం కూడా దీనికి ఒక కారణమని అర్థమవుతుంది. మనసు నియంత్రణలో ఉంటే జిహ్వ చాపల్యం తగ్గుతుంది. వ్యాయామం మానకుండా ఉండటానికి అవసరమైన మనో నిబ్బరం అబ్బుతుంది. యోగాతో శరీరంతో పాటు మనసు మీదా పట్టు లభిస్తుంది. ఫలితంగా మనసు కుదురుగా ఉంటుంది. నైతిక విలువలూ పెరుగుతాయి. ఇవన్నీ వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, సమాజం ఆరోగ్యంగా ఉండటానికి కూడా తోడ్పడతాయి.
ఒక్క గుండె ఆరోగ్యమే కాదు..
ఆరోగ్యమంటే కేవలం జబ్బులు లేకపోవటమే కాదు. మానసికంగానూ చురుకుగా ఉండటం. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించటం. ఇలా అన్నికోణాల్లోనూ మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తుండటమే యోగా ప్రత్యేకత. ఇది మన శరీరాన్ని, మనసును ఒక గాడిలో పెట్టి.. వాటిని సమతౌల్యంలోకి తెచ్చే అమోఘమైన ప్రక్రియ. ‘యుజ్’ అంటే కలయిక, ఐక్యత, జత చేయటం అని అర్థం. ఈ సంస్కృత ధాతువు నుంచే యోగా అనే శబ్దం పుట్టుకొచ్చింది. వేదకాలం నుంచీ అనుసరిస్తున్న యోగ సూత్రాలను పతంజలి మహర్షి క్రోడీకరించి ‘అష్టాంగ యోగా’ను సిద్ధం చేశారు. వీటిల్లో ‘యమ, నియమాలు’ మన విధులు, ఆహార విహారాలు, పరిశుభ్రత, నైతిక విలువలను నొక్కిచెబితే.. ‘ఆసనాలు’ శరీరంలోని ప్రతి కండరం మీదా, ప్రతి కీలు మీదా పట్టు సాధించుకోవటానికి దోహదం చేస్తాయి. శ్వాసను క్రమబద్ధీకరించటం, ఒక క్రమ పద్ధతిలో స్తంభింపజేసే పద్ధతులతో కూడిన ‘ప్రాణాయామం’ అసంకల్పిత వ్యవస్థలపై నియంత్రణ పొందటానికి తోడ్పడుతుంది. ఇక ‘ప్రత్యాహార, ధారణ, ధ్యానం’.. మనసు గాడి తప్పకుండా చూస్తూ ఆలోచనలు కుదురుగా సాగేలా, ఏకాగ్రత సాధించేలా చేస్తాయి. ఇవన్నీ చివరికి నిశ్చలానంద ‘సమాధి’ స్థితికి చేరుస్తాయి. అంటే యోగా శరీర సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికీ తోడ్పడుతుందన్నమాట. ఇతరత్రా శారీరక వ్యాయామాలకు మించిన ప్రయోజనాలు దీంతో లభిస్తుండటం విశేషం. అందుకే పలురకాల ఒత్తిళ్లతో సతమతమవుతూ.. ఎన్నెన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్న ప్రస్తుత తరుణంలో దీని ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది.
ఏంటీ తేడా?
ఒకసారి గుండె పోటు, గుండె వైఫల్యం బారినపడ్డాక.. సర్జరీ, యాంజియోప్లాస్టీ వంటివి చేయించుకున్నాక.. చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడేయటం, తిరిగి తమ ఉద్యోగాలు, తమ పనులు తాము చేసుకునేలా చూడటం చాలా అవసరం. అలాగే మున్ముందు మళ్లీ ఇలాంటి సమస్యల బారినపడకుండా చూసుకోవాల్సి ఉంటుంది కూడా. ఇందుకు కార్డియాక్ రిహాబిలిటేషన్ పద్ధతులు తోడ్పడతాయి. ఇందులో ఆహారం దగ్గర్నుంచి.. శారీరక సామర్థ్యాన్ని పెంపొందించటం, తమ పనులు తాము చేసుకునేలా మనో నిబ్బరాన్ని కల్పించటం వరకూ అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఇందులో యోగాను కూడా చేర్చితే మరింత ప్రయోజనం పొందొచ్చు. సంప్రదాయ రిహాబ్ కార్యక్రమంలో గుండె ఫిట్‌నెస్ మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఆయా పనులు చేస్తున్నప్పుడు పడే భారాన్ని గుండె తట్టుకునేలా చూడటానికి అవసరమైన వ్యాయామాలను సూచిస్తుంటారు. అయితే గుండెజబ్బుల విషయంలో గుండె సామర్థ్యం ఒక్కటే సరిపోదు. ఉదాహరణకు- రక్తనాళాల్లో పూడికలు గలవారు హఠాత్తుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనప్పుడు పూడికలు పెకిలిపోయి, రక్తనాళాలు చిట్లి గుండెపోటు తలెత్తొచ్చు. అలాగే వాతావరణ కాలుష్యం.. వైరల్ ఇన్‌ఫెక్షన్లతో తలెత్తే వాపు ప్రక్రియ వంటివీ ఇందుకు దారితీయొచ్చు. కొందరు గుండె లయ తప్పటం మూలంగానూ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. అందువల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, రోగనిరోధకశక్తి పెంపొందించుకోవటం కూడా ముఖ్యమే. ఈ విషయంలో యోగా చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ధ్యానం, ప్రాణాయామం మూలంగా ఒంట్లో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం (వేగల్ టోన్) పెంపొందుతుంది. మన శరీరంలో వేగస్ నాడి అతి పెద్ద కపాల నాడి. శ్వాస ప్రక్రియ, గుండె వేగం, జీర్ణ క్రియ వంటివన్నీ దీంతో ముడిపడినవే. కాబట్టి ఇది మెరుగ్గా ఉంటే ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యమూ పెరుగుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన నుంచి తేలికగా బయటపడటానికి వీలవుతుంది. ముఖ్యంగా రక్తపోటు బాగా అదుపులోకి వస్తుంది. గుండె వేగం, శ్వాసవేగం తగ్గుతాయి. రక్తపోటు 3 ఎం.ఎం తగ్గినా గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని గుర్తుంచుకోవటం అవసరం. ధ్యానం చేయటం వల్ల మనసు పూర్తి ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తుంది. దీంతో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసేవే.
అధ్యయనాలూ చెబుతున్నాయి
మనం ఎక్కువకాలం జీవించాలని కోరుకోవటం సహజమే. అదొక్కటే కాదు.. బాధలేవీ లేకుండా ఎంత హాయిగా జీవిస్తున్నామన్నది కూడా ముఖ్యమే. నిజానికి రోగాలతో రొప్పుతూ బతకటమంటే ఒకరకంగా శాపమే. ఇలాంటి దుస్థితిని తప్పించటానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్డియాక్ రిహాబిలిటేషన్‌లో యోగాను చేర్చిన తర్వాత గణనీయమైన మార్పులు కనబడుతున్నట్టు మా పరిశీలనలో గుర్తించాం. సమస్యల నుంచి త్వరగా కోలుకుంటున్నట్టు, త్వరగా మామూలు జీవితం గడపుతున్నట్టు కనుగొన్నాం. దీని ప్రయోజనాలను శాస్త్రీయంగా నిరూపించటానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రయత్నాలూ సాగుతున్నాయి. మనదేశంలో ఐసీఎంఆర్ వివిధ ఆరోగ్యకేంద్రాల్లో విస్తృత అధ్యయనం నిర్వహిస్తోంది. సంప్రదాయ కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో యోగాను చేర్చటం వల్ల కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేస్తోంది. ఇది పూర్తయితే శాస్త్రీయంగా యోగాతో ఎంతమేరకు ప్రయోజనం చేకూరుతోందో కచ్చితంగా నిరూపణ కాగలదు. అదలా ఉంచితే- అక్కడక్కడా చేసిన పరిశీలనాత్మక అధ్యయనాల్లో యోగా ప్రయోజనాలు విస్పష్టంగా బయటపడ్డాయి.
* ఇన్సులిన్ నిరోధక రుగ్మతలతో ముడిపడిన పలు గుండెజబ్బు ముప్పు కారకాలు యోగాతో తగ్గుముఖం పడుతున్నట్టు వర్జీనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం పేర్కొంది.
* గుండెజబ్బు బాధితులకు గాఢంగా శ్వాస తీసుకోవటం ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు.. ఇది ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
* ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం వల్ల శ్వాస వేగం తగ్గుముఖం పడుతున్నట్టు ఐజీబీఎంఆర్ పత్రికలో వెలువడిన అధ్యయనం పేర్కొంది. గుండె సామర్థ్యమూ గణనీయంగా పుంజుకోవటం విశేషం.
* హఠయోగ మూలంగా గుండె రక్తనాళాల్లో రక్తపోటును తట్టుకునే సామర్థ్యం మెరుగుపడినట్టు, గుండె కండరం బలోపేతం అవుతున్నట్టు హాంకాంగ్ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది.
* గుండె వైఫల్యం బాధితుల్లో యోగా సాధనతో గుండె వేగం, రక్తపోటు తగ్గుముఖం పడుతున్నట్టు భారతీయ వైద్యుల పరిశోధనలు చెబుతున్నాయి.
చిన్న వయసు నుంచే అలవడాలి
గుండెజబ్బులకు దారితీసే జన్యుపరమైన అంశాల విషయంలో మనమేమీ చేయలేకపోవచ్చు. కానీ మధుమేహం, అధిక రక్తపోటు వంటి ముప్పు కారకాలను మార్చుకోవటం మాత్రం మన చేతుల్లోనే ఉందనే సంగతిని విస్మరించలేం. ఈ ముప్పు కారకాల బారినపడకుండా చూసుకోగలిగితే.. ఒకవేళ ఏదైనా దాడిచేసినా దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగితే చాలావరకు గుండెజబ్బులను నివారించుకోవచ్చు. కాబట్టి సాంక్రమికేతర జబ్బుల నివారణకు పెద్దఎత్తున నివారణ చర్యలు (ప్రైమోడల్ ప్రివెన్షన్) తీసుకోవటం అవసరం. ముఖ్యంగా ఆహారం, శారీరక శ్రమ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కొవ్వులు తక్కువగానూ.. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, మంచి కొవ్వులతో కూడిన చేపల వంటివి ఎక్కువగానూ తీసుకోవాలి. ఉప్పు వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం, శారీరక శ్రమ చేయటం మంచిది. వీటికి యోగాను కూడా జతచేస్తే మరింత ప్రయోజనం పొందొచ్చు. యోగా సురక్షితమైన పద్ధతి. చాలా తేలికైంది, చవకైంది కూడా. దీనికి జిమ్‌లలో మాదిరిగా పెద్ద పెద్ద పరికరాల అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు. ఒక్కరు ఆరంభించినా కుటుంబ సభ్యులంతా చేయటానికి చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. కాబట్టి యోగాను చిన్న వయసు నుంచే సాధన చేయటం ఎంతో మంచిది. దీంతో భవిష్యత్ భారతం సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడేలా చూసుకోవచ్చు.
శరీరమంతా నవోత్తేజం మనం శ్వాస ద్వారా ఆక్సిజన్‌ను లోనికి తీసుకుంటుంటాం, కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు వదులుతుంటాం కదా. అయితే వేగంగా, పైపైన శ్వాస తీసుకుంటుంటే అవసరమైనంత ఆక్సిజన్ అందదు. అదే ప్రాణాయామం వంటి శ్వాస పద్ధతులతో గాఢంగా శ్వాస తీసుకున్నట్టయితే ఒంట్లోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల జబ్బుల వంటి వాటిల్లో శ్వాస వేగం పెరుగుతుంది. దీన్నే మనం ఆయాసంగా భావిస్తుంటాం. ఇలాంటివారికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. దీని మూలంగా శ్వాస తీసుకోవటానికి సాయం చేసే కండరాలు బలోపేతమవుతాయి. ఆందోళన, ఉద్రేకం వంటి వాటిని తట్టుకునే సామర్థ్యం పెంపొందుతుంది. ఇది హఠాత్తుగా గుండె ఆగిపోయే ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. ప్రాణాయామం మూలంగా మనసు ప్రశాంత స్థితిలోకి వెళ్లటం వల్ల దీర్ఘకాల ఒత్తిడి స్థాయులు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. ఒంట్లోని విషతుల్యాలు, ప్రతికూల భావనలు బయటకు వెళ్లిపోతాయి. సానుకూల ధోరణి అలవడుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది, నాడీ వ్యవస్థ పుంజుకుంటుంది. మొత్తంగా శరీరం మొత్తం నవోత్తేజంతో తొణికిసలాడుతుంది. అందువల్ల గుండెజబ్బులకు చికిత్స తీసుకునేవారు, శస్త్రచికిత్సల వంటివి చేయించుకున్నవారు కనీసం 3 నెలల పాటు యోగా సాధన చేసినా చాలు. త్వరగా కోలుకోవటానికి వీలవుతుంది. ఒకసారి సమస్యలు కుదురుకున్నాక.. క్రమంగా ఇతరత్రా ఆసనాలు వేయటం ఆరంభించొచ్చు. ఫలితంగా మున్ముందు ఇలాంటి సమస్యలు మళ్లీ దాడి చేయకుండా చూసుకోవచ్చు. కాకపోతే మధ్యలో మానెయ్యకుండా.. దీర్ఘకాలం సాధన చేయటం ముఖ్యం. |
జాగ్రత్త అవసరం యోగా సురక్షితమైన పద్ధతే అయినా - గుండెజబ్బులతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఎందుకంటే రక్తపోటు అదుపులో లేనివారు, లేచి నిలబడితే కళ్లు తిరిగేవారు తల కిందికి వంచి చేసే శీర్షాసనం వంటివి వేయకూడదు. కొందరికి చాలా వేగంగా శ్వాస తీసుకోవటం.. శరీరాన్ని పూర్తిగా ఒకవైపు తిప్పే, వంచే ఆసనాల వంటివీ ప్రమాదకరంగా పరిణమించొచ్చు. కాబట్టి సుశిక్షితులైన, అనుభం గల నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలోనే యోగా సాధన చేయటం మంచిది. |
నివారణ మార్గంగా.. గుండెజబ్బులతో బాధపడటం కన్నా వాటి బారినపడకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. ఆసనాలు వేసే సమయంలోనూ శ్వాస లయబద్ధంగా సాగుతుంది. కాబట్టి ముందు నుంచే కొన్ని ఆసనాలను సాధన చేయటం మంచిది. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Movies News
Social Look: సముద్రంలో హన్సిక షికారు.. ఆండ్రియా శారీ పిక్!
-
General News
AP ICET: ఏపీ ఐసెట్ దరఖాస్తులు ప్రారంభం.. రెండు షిఫ్టుల్లో పరీక్ష!