ఆనందమె జీవిత మకరందం
‘ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడానా?’ నవ్వుకుంది శాంత. ఇదే ఇల్లు... ఇవే పరిసరాలు... ఇదే జాజిచెట్టు. సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి ...
- వేదార్థం జ్యోతి
‘ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక...’ ఎఫ్.ఎం. రేడియోలో మధురగీతాల్లో విన్పిస్తున్న నాటి మేటి పాట... మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది. ‘ఏకాంతం’ ఈ పదం అందమైనదీ అపురూపమైనదీ. అయితే, అదే కొందరికి అరుదైనది కూడా. జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు. తనకి ఎంతో నచ్చిన పాట.. మళ్ళీమళ్ళీ వినాలన్పిస్తుంది. అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది.
‘ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడానా?’ నవ్వుకుంది శాంత. ఇదే ఇల్లు... ఇవే పరిసరాలు... ఇదే జాజిచెట్టు. సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడ్తున్న పెళ్ళికూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకొని కవ్వించేవి. ఉదయం తెల్లగా విచ్చిపోయి ‘మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరికా ఓపికా మీకు లేవా పాపం’ అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్లు అన్పించేది శాంతకు.
పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆ పూలమొక్కలు చూసి మురిసిపోయింది. వీధి చివర వేణుగోపాలస్వామి కోవెల, ఉదయమే విన్పించే సుప్రభాతం, కోవెలగంటలు... ‘ఆహా! ఏమి
నా భాగ్యం’ అనుకుంది పల్లెటూరి నుంచి వచ్చిన శాంత.
తను వచ్చింది హైదరాబాదుకనీ..
గడియారంతోపాటు పరుగులు... కుక్కరు కూతల్లో కల్సిపోయి విన్పించని కోవెలగంటలు... ఊపిరిసలపని పనులు... చెవులకు విన్పిస్తున్నా మనసుకు ఎక్కని సుప్రభాతాలు... బిందెడు నీళ్ళకోసం పడిగాపులు... మనుషులమధ్యే ఉన్నా కరువైపోయిన పలకరింపులు... ఇక్కడ మామూలనీ, తరవాత తెలిసింది శాంతకి. మెల్లగా అదే అలవాటైపోయింది.
పెళ్ళి అయిన వెంటనే తిరుపతి, చెన్నై అలా అలా సరదాగా తిరిగివచ్చారు శాంత, మూర్తి.
అంతే, అవే మరచిపోలేని, మళ్ళీ రాని మధురస్మృతులనీ ఇక మళ్ళీ అలాంటి రోజులు రావనీ అప్పుడు శాంతకి తెలియదు. తీయని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత- ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బందిపడింది. చదువులు ముగించి ‘పెళ్ళి ఎప్పుడు చేస్తారా’ అని ఎదురుచూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాకా ఊరికే ఉండలేకా చిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలో మునిగి తేలుతున్న మరిది, ‘ఇల్లు కట్టేశాను... అప్పులు మీరు కట్టండి’ అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు, ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులూ తనమీదే వేసుకొని క్షణం తీరికలేకుండా సతమతమయ్యే అత్తగారు, ‘మౌనమే నీ భాష’ అన్నట్లు తన పని తాను చేసుకొనిపోయే భర్త మూర్తి... అందరిమధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి.
‘నేను ఆఫీసు నుంచి రాగానే నవ్వుతూ ఎదురురావాలి, సపర్యలు చేయాలి’ అనే కోరికలు లేవుకానీ, లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడుకానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం’ అని చెబుతున్నప్పుడు... తుపానులో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత బోధిస్తున్న కృష్ణపరమాత్మలా అన్పించాడు మూర్తి- శాంతకి.
ఇంటినిండా జనం. ఉదయం లేచినప్పట్నుంచి గిరగిరా రంగులరాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం, మూర్తి రాకకోసం సాయంత్రం నుంచి ఎదురుచూడటం, శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియటంలేదు. అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరతాడు మూర్తి. నిద్రమత్తులో బరువెక్కిన కళ్ళతో, వాడిపోయిన ముఖంతో, వడలిన మందారంలా ఉన్న శాంతని చూసి చిరునవ్వు చిందిస్తాడు. వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేదతీరినట్లుగా తృప్తిపడుతుంది శాంత, ఆ నవ్వుకే.
వంటగదిలో పడక... గాజులు, కాలిపట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వప్రయత్నం చేయాల్సిందే. ఇక కబుర్లకి తావెక్కడిది?ఈ పరిస్థితుల్లో శాంత కోరికలూ ఆశలూ అటకెక్కాయి. మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలనీ ఒక్క ఆదివారం అయినా ఇద్దరూ ఏకాంతంగా గడపాలనీ సన్నని బెడ్‌లైట్ వెలుగులో ఘంటసాల పాటలు వింటూ నిద్రపోవాలనీ... ఇలా అన్నీ చిన్నచిన్న కోరికలే. కానీ శాంతకు అవి అసాధ్యాలు.
‘ఏకాంతం’ అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థం అయిపోయింది శాంతకు. అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే.
పెద్ద ఆడపడచు పెళ్ళికి ‘అమ్మా, వదినకి పట్టుచీర కొను. ఎప్పుడూ ఏమీ అడగలేదు’ అంది ఆ అమ్మాయి.
‘మా కోడలు బంగారం. అందుకే చీరలూ నగలూ మీద ఆశేలేదు’ మురిసిపోయిందా అత్తగారు.
శాంత నిరాశగా నవ్వుకుంది. ‘తన కోరికలు పట్టుచీరలూ నగలకంటే అమూల్యమైనవి’.
ఏనాడూ శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు. తనకింతే ప్రాప్తం అనుకునేది. మంచి భర్త, సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది.
ఇద్దరు పిల్లలు పుట్టడం... మరిది, ఆడపడుచుల పెళ్ళిళ్ళు... వాళ్ళ పురుళ్ళూ పుణ్యాలతో శాంతకి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు.
‘పిల్లలతో కష్టంగా ఉంది అన్నయ్యా, వదినని పదిరోజులు పంపించవా...’
‘నేను ఊరెశ్ళాలి. మా ఆవిడకి సాయం వదినని పంపించు’ అంటూ మరిదీ ఆడపడుచులూ శాంతని ఓ యంత్రంలా వాడుకున్నారు. ఎవరికే ఇబ్బంది వచ్చినా బస్సెక్కడానికి సిద్ధం శాంత.
ముందుగా అత్తగారూ తర్వాత రెండేళ్ళకు మామగారూ తమవంతు బాధ్యతల్ని నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు.
అత్తగారు పోయాక మామగారికీ మూర్తికీ కష్టమని శాంతని పిలవడం తగ్గించినా, తరచుగా వచ్చి వారం పదిరోజులు ఉండి వెళ్ళేవాళ్ళు.
చాకిరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళముందైనా ఉంచారని సంతృప్తిపడింది శాంత.
♦* * *
శాంత పెద్దకొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది. ‘మీరు కూడా నాతో వచ్చేయండి. ఇంకా ఎంతకాలం ఈ ఇరుకుగదుల్లో’ అని పట్టుపట్టాడు. శాంతకి అవి ఇరుకుగదుల్లా అన్పించలేదు. జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుతసౌధాల్లా చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అన్పిస్తుంది.
‘చిన్నవాడి చదువుందిగా’ అని సర్దిచెప్పి, పెద్దవాడి పెళ్ళిచేసి పంపించారు.
చిన్నవాడు ఫైనలియర్‌లో ఉండగానే ఉద్యోగం వచ్చింది.
పెద్దకోడల్ని పురిటికి రమ్మంటే ‘చిన్న ఇల్లు, వద్దు... మీరే రండి’ అన్నారు కొడుకూ కోడలు.
ఎలాగో మొక్కుబడిగా మూడు నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలికి అప్పగించివచ్చి మూర్తి చెంతన చేరింది శాంత. అంతలో చిన్నబ్బాయి పెళ్ళి, అమెరికా ప్రయాణం. శాంతనూ మూర్తి నీ వెంట
తీసుకెశ్ళాలని చాలా ప్రయత్నించాడు.
సున్నితంగా తిరస్కరించారు మూర్తి, శాంత.
సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడ్తుంటే, ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెల్సు. ‘ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు. అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది. కోటిరూపాయలిచ్చినా అక్కడికి వెళ్ళవద్దు. మన ఊరు, మన మనుషుల మధ్య ఉన్న ఆనందం, ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు’ అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి.
అందరూ వెళ్ళిపోయి బాధ్యతలూ బరువులూ తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంత, మూర్తి.
జీవితపు నలభయ్యో మైలురాయి దగ్గర ఆగి... ఇంత దూరం ఎలా నడిచాం, సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నదేంటి... అని వెనక్కితిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యౌవనం, వాడీవేడీ తగ్గి ఉస్సూరంటూ అణిగిపోయిన కోరికలు, ఆకాశ కుసుమాల్లా అందక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఊసులు కన్పిస్తున్నాయి.
అంట్లు తోమీతోమీ అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు, నీళ్ళల్లో నానీనానీ పగుళ్ళతో చీలిన పాదాలు, ‘మేము వచ్చేస్తున్నాం’ అంటూ హెచ్చరిస్తున్న తెల్లవెంట్రుకలు... మధ్యతరగతి ఇల్లాలికి ప్రతిరూపంలా ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి- ‘శాంతా, ఇప్పుడు మనకి సమస్యలేం లేవుకదా. ఒక్కసారి బ్యూటీపార్లర్‌కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదూ’ అన్నాడు.
‘వయస్సు పైబడుతుంటే బ్యూటీపార్లర్‌వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం, మీరే అప్పటి కళ్ళతో చూడండి’ జవాబిచ్చింది శాంత.
ఇప్పుడు శాంతకి కావాల్సినంత తీరిక. తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవడం... పూలమాలలు కట్టి మూర్తి ఆఫీసుకి వెళ్ళగానే కోవెలకి వెళ్ళడం... వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేదతీరడం... ఇంటికివచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురుచూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాల్ని ప్రశాంతంగా ఆలకించడం... శాంతకు ఇంతకంటే ఆనందం ఏదీలేదేమో అన్పిస్తుంది.
‘‘దేవి గారూ, భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా’’ మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత.
ఎదురుగా మూర్తి.
‘‘ఏవో ఆలోచనలు...’’ సిగ్గుపడింది శాంత.
‘‘నీవు సిగ్గుపడ్తుంటే మంచులో తడిసిన ముద్దమందారంలా ఉన్నావోయ్’’
చమత్కరించాడు మూర్తి.
‘‘ముసలి మందారమా ముద్దమందారమా?’’ నవ్వుతూ అడిగింది శాంత.
‘‘వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంతా. నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే. ఇప్పుడు మనం ఎవ్వరి గురించీ ఆలోచించక్కర్లేదు. నాకు నువ్వు నీకు నేను... అంతే’’ మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి.
ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అన్పించింది.
* * *
శాంత, మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతోంది. పలకరింపులు, ఛలోక్తులు, నవ్వులు, పండగ వాతావరణం కన్పిస్తోంది. అది మూర్తి రిటైర్ అయ్యేరోజు. ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళూ తమ్ముడూ పిల్లలూ అందరూ కల్సి చేస్తున్న సత్కారం. అందరూ మూర్తి సౌశీల్యాన్నీ ఔదార్యాన్నీ వేనోళ్ళ కొనియాడారు. చెమర్చిన కళ్ళతో శాంత- మూర్తిని తనివితీరా చూసుకుంటోంది. మూర్తిలో చెదరని అదే చిరునవ్వు. పొగడ్తలకి పొంగిపోని నిశ్చలత్వం. మూర్తికి తన బంధువులనీ ఆత్మీయులనీ చూస్తే ఆనందంగా ఉంది. ఇంతలో చిన్నబ్బాయి వచ్చి రెండు టిక్కెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు.
‘‘నాన్నా, ఈరోజు నువ్వూ అమ్మా సినిమాకి వెళ్ళిరండి’’.
‘‘మేమా, సినిమాకా? ఇంతమందిని, ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చూస్తాం. మాకిష్టంలేదు, వద్దు’’ అన్నారు.
‘‘లేదు నాన్నా, వెశ్ళాల్సిందే’’. అందరూ గోలగోలగా అరవడం మొదలుపెట్టారు.
పెద్దబ్బాయి కారు తీశాడు. అందరూ టాటా చెప్పారు.
శాంత మనసు దూదిపింజలా తేలిపోతోంది.
* * *
‘‘అన్నయ్యా, నువ్వూ వదినా మా దగ్గర వచ్చి ఉండండి’’ చెప్పింది చిన్నాడపడుచు.
ఇద్దరు పిల్లలు... భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు, క్షణం తీరికలేక సతమతమవుతూ శాంతని ఏ వందసార్లో అనుకునేది ఆ అమ్మాయి.
‘‘నీ దగ్గర అయితే వదినకు రెస్ట్ ఉండదు. వదినా అన్నయ్యా మా దగ్గర ఉంటారు. ఆయన ఏదో షాపు ఓపెన్ చేస్తారట. నమ్మకమైన మనిషి కావాలట. అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది’’ జీతం గీతం అక్కర్లేని ఇద్దరు (పని)మనుషులు దొరికిపోతున్నారని ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్దాడపడుచు.
‘‘తమ్ముడూ, నువ్వు చెప్పరా’’ అంటూ మూర్తి తమ్ముడివైపు చూసింది ఆవిడ.
‘‘అన్నయ్యా, మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు. మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు..? ఇల్లమ్మి మా వాటాలు మాకిచ్చేసి, మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి. మా పిల్లల చదువులు, మా ఆవిడ అనారోగ్యం... ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను’’ అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థంకావడంలేదు శాంతకి.
నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి ‘టప్’మంది.
నిన్నటివరకూ ఈ ఇంట్లో జరిగిన శుభ, అశుభ కార్యాలకి ‘అన్నయ్యా, డబ్బెలా చేస్తున్నావు, నేను ఇవ్వనా’ అని ఒక్కమాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడటం ఊహించలేకపోతోంది శాంత.
‘నిన్న అనుభవించిన ఆనందానికి ‘కొసమెరుపు’ ఇంత అందంగా ఉంటుందా?’ ఆలోచిస్తున్నాడు మూర్తి.
మూల విగ్రహాల్లా నిలబడిపోయిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు చిన్నకొడుకు.
‘‘వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయి- అని మిమ్మల్ని మేము అడగటంలేదు. ఇప్పటివరకూ తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతికర్పూరం చేశారు అమ్మా నాన్న.
వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడూ ఆలోచించలేదు. మనకోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళేం పోగొట్టుకున్నారో మనకి అంతా తెరచిన పుస్తకమే. ఇకచాలు, మీ పంచనో మా దగ్గరో చేరి మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు. ఇల్లు అమ్మే ప్రసక్తిలేదు. మీరు కాదూ కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కకట్టి మీ ముగ్గురి వాటాలు నేనూ అన్నయ్యా ఇచ్చేస్తాం. రెండునెలలు ఆగండి... మీకు మనసనేది ఉంటే. వాళ్ళిద్దర్నీ ప్రశాంతంగా వదిలెయ్యండి’’.
అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలూ ఆప్యాయతలూ మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంతా.
పెద్దబ్బాయి లేచి ‘‘అమ్మా, మీకు చెప్పకుండా మేము ఓ నిర్ణయం కూడా తీసుకున్నాం. మన ఇంటిపక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం. మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు. మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది. అది నాన్నగారి పేరుమీదే ఉంటుంది. మీరు ఎవ్వరిమీదా ఆధారపడక్కర్లేదు. ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలన్పిస్తే అప్పుడు రండి. మేమూ వస్తూనే ఉంటాం’’ అన్నాడు.
ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు శాంత, మూర్తి.
కోవెల గంటలు మధురంగా విన్పిస్తున్నాయి.
‘ఆనందమె జీవిత మకరందం...’ దూరంగా మైకులో ఘంటసాల పాట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kajal Aggarwal: అవన్నీ ఒకెత్తు.. ‘సత్యభామ’ ఒకెత్తు.. హైదరాబాద్‌లోనే ఉంటున్నా: కాజల్
-
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్‌లో 6 రాష్ట్రాలు అలర్ట్..!
-
Suryakumar: 222 పరుగుల టార్గెట్‌ను కాపాడేందుకు మా ప్లాన్ అదే.. కానీ విఫలమైంది: సూర్యకుమార్
-
Vizag: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి
-
Charlie Munger: వారెన్ బఫెట్ సక్సెస్ చిరునామా చార్లీ ముంగర్ ఇకలేరు
-
Airtel vs Jio: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..