గాలివాన‌లో పిల్ల గాలి

పరీక్షిత్తు మహారాజుకు భాగవత కథలు చెబుతున్నాడు శుక మహర్షి. ...ఎంతటివారైనా, కాంతకు దాసులే. అహంలాగే కామశక్తిని కూడా జయించలేరు. అది అతిక్రమించినపుడు, అది తప్పు అని కూడా వారికి తెలియదు... ఒక చిత్రమైన కథ చెబుతాను. మా తండ్రి

Published : 08 Apr 2020 19:33 IST

ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మ‌ణ‌

 

పరీక్షిత్తు మహారాజుకు భాగవత కథలు చెబుతున్నాడు శుక మహర్షి.
...ఎంతటివారైనా, కాంతకు దాసులే. అహంలాగే కామశక్తిని కూడా జయించలేరు. అది అతిక్రమించినపుడు, అది తప్పు అని కూడా వారికి తెలియదు...
ఒక చిత్రమైన కథ చెబుతాను. మా తండ్రి 
వ్యాస భగవానుల సాక్షిగా ఇది జరిగింది. వారే 
ఒకమారు నాకు చెప్పారు.

అప్పటికి భాగవతం గ్రంథస్థమైంది. నగరాలలో, వనాలలో, దేవాలయాలలో, ఆశ్రమాలలో జనులు బహుధా ఆ గ్రంథాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండేవారు. ఒకనాడు ఒక ఋషి, అయిదుగురు శిష్యులూ అయిదారుగురు చక్కని యువతులూ 
వెంటరాగా- ఒక తాళపత్రాన్ని పట్టుకొని ఆవేశంగా వచ్చాడు. ‘భగవాన్‌ వ్యాసమహర్షీ! వందనం’ అన్నాడు కాస్త కటువుగా. తండ్రిగారు కన్నులు తెరిచారు...
వ్యాస: ఆయుష్మాన్‌ భవ!
బ్రహ్మ(రుషి): నా పేరు బ్రహ్మచారి, నా జీవనం కూడా అంతే. శ్రీమద్భాగవతాన్ని నేను అనునిత్యం నిష్ఠతో పాక్షిక పారాయణం చేస్తున్నాను.
వ్యాసుడు మందహాసం చేశాడు.
బ్రహ్మ: (ధాటీగా) కొన్ని సంవత్సరాలుగా...
‘సమస్య ఏమిటి?’ అన్నట్టు చూశాడు వ్యాసుడు.
బ్రహ్మ: నవమస్కంధం పందొమ్మిదవ అధ్యాయంలో పదునేడవ లకం నాకు దోషభూయిష్టంగా కనిపిస్తున్నది. ఎన్నాüఏళ ఆలోచించి ఈనాడు ధైర్యం చేసి 
అది చెప్పడానికి వచ్చాను.
‘తల్లి, సోదరి, పుత్రిక వీరితో ఏకాంతమున 
ఏకాసనమున కూర్చుండరాదు. శయనించరాదు. 
ఇంద్రియగ్రామ మతి బలవత్తరమైనది. ఎంతటి 
జ్ఞాని మనసునైనను ఇది విచలితం చేస్తుంది’.
మహర్షీ! విద్వాంసులను, జ్ఞానులను కూడా కామం పడగొడుతుందన్నారే. ఇక విద్యకీ జ్ఞానానికీ విలువ ఏమిటి? ఋషులకూ యోగులకూ గౌరవమెక్కడ? 
మీ కుమారుడు శుకయోగి కామాలకు అతీతుడుగాడా?
వ్యాస: నాయనా! నేను భాగవతాన్ని శుకుని కోసం వ్రాయలేదు. శుకుడు లోకోత్తర పురుషుడు... 
లోకరీతిపై నేను ఈ హెచ్చరిక చెప్పాను.
బ్రహ్మ: స్వామీ! నేను శుకయోగిలా లోకోత్తర 
పురుషుడను కాను. కానీ తమవంటి జ్ఞానుల 
ఉపదేశాలు చదివి శ్రీభాగవతం వంటి మహద్గ్రంథాలు చదివి- బుద్ధి, జ్ఞానం, వివేకం సంయమం అలవరచుకొన్నాను. నా 
ఆశ్రమానికి ఎందరో స్త్రీ, పురుషులు వస్తూ ఉంటారు. నేనేమీ ధర్మం తప్పి చరించలేదు. చరించబోను... నాలాగా విద్వాంసులు ఎందరో ఉన్నారు. అందువల్ల కామం ప్రమాదం అని విద్వాంసులను హెచ్చరించే 
ఈ శ్లోకం నాకు అసత్యవాదంగా కనిపిస్తున్నది. దీన్ని తుడిచివేస్తాను. అది చెప్పడానికే వచ్చాను.
వ్యాస: (నవ్వి) అస్ఖలిత బ్రహ్మచారీ! నీవు 
సంయమీంద్రుడవు. సంతోషం. నీకు నిగ్రహం ఉంది. కానీ నేను చేసిన హెచ్చరిక పదిమంది సుందరుల మధ్య తిరగడం గురించి కాదు- ఒంటరిగా ఉండటం గురించి. ఏ స్త్రీతోనూ ముఖ్యంగా తల్లి, సోదరి, కోడలు వంటి వారితో ఏకాంతవాసం చేయరాదని. కామాగ్ని కాక తగిలితే మనుష్యుడు పశువుకన్నా హీనుడైపోతాడు. దాని బలం గొప్పది. దాని వేగం 
మనోవేగంకన్నా ఎక్కువ. మంచిది. నీకు గురిలేకపోతే ఆ
శ్లోకాన్ని 
తిరస్కరించు. ఆ పత్రాన్ని చించివేయి.
బ్రహ్మ: తప్పకుండా. ఇది పామరులకు పనికిరావచ్చు. నావంటి పండితులకూ 
వివేకవంతులకూ కాదు. 
బ్రహ్మచారి తాటాకు చించిపడేసి విసురుగా 
తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
(బ్రహ్మచారి ఆశ్రమం)
ఆశ్రమంలో గది మధ్యన అగ్నికుండం నివురుగప్పి ఉంది. మరొకపక్కన పెద్ద ప్రమిదలో దీపం. 
బ్రహ్మచారి తాళపత్రాలు తిరగేస్తున్నాడు. రివ్వున 
గాలి వీచింది. దీపకళిక సంచలించి కదలాడిపోయింది. ఉరుములు మెరుపులు... కొద్ది క్షణాలకే జోరున వాన. బ్రహ్మచారి తాళపత్రాన్ని ముడిచి, కట్టి, పీఠంపై ఉంచాడు. తలుపులు మూయబోయాడు. గాలి బలంగా వీస్తోంది. పిడుగులు, మెరుపులు...
రాజకుమారిలా ఉన్న ఒక పడుచు పరుగునవచ్చి వసారాలో నిలిచి దండం పెట్టింది. వెంటనే బ్రహ్మచారి తలుపు మూయబోయాడు.
సుందరి: మూయకండి... తలుపు మూయకండి.
బ్రహ్మ: ఎవరమ్మా?
సుందరి: స్వామీ! నేను ఈ సీమ రాజకుమారుడికి ఉపరాణిని. పదిమందిమి వనవిహారానికి వచ్చాం. ఈ గాలివానలో చెల్లాచెదురైపోయాం. రాత్రికి మీ కుటీరంలో తలదాచుకుంటాను. 
ఉదయమే వెళ్ళిపోతాను.
ఆమె రూపం తెలియడంలేదు. ఒక నిలుచున్న నీడలా ఉంది.
బ్రహ్మ: (పెడమొహం పెట్టి కటువుగా) 
సాధ్యంకాదమ్మా, ఇది సాధువుల నివాసం. ఇక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు.
సుందరి: ఆకాశం బద్దలై కుంభవృష్టి కురుస్తున్నాకూడానా? ఆపదలో ఆడా మగా ఏమిటి?
బ్రహ్మ: అదంతే. దగ్గరలో మరొక కుటీరం ఉంది. అటు వెళ్ళు.
తళుక్కున మెరుపు మెరిసింది. ఆమె అందం 
క్షణం వెలిగింది.
సుందరి: మంచిది. ఈ చీకటిలో, వానలో నాకేదైనా ఆపద జరిగితే- ఆ పాపం మీదే!
వెనుదిరిగింది. మళ్ళీ మెరుపు. ఆమె జఘనాలు మెరిశాయి. బ్రహ్మచారికి ఒళ్ళు జలదరించింది.
బ్రహ్మ: (గొణుక్కుంటూ)హరిహరీ! 
ఎంతమాటన్నావు?
వెనక్కి తిరిగింది సుందరి. మళ్ళీ మెరుపు. ఆమె తడిపైటలో కుచాలు రెండూ చంద్రబింబాల్లా మెరిశాయి.
సుందరి: అనక ఏం చెయ్యను? నేను ఓ మూల పడుకుంటే మీకే ఆపదా రాదు గదా? తేలునో పామునో కానుగదా కాటువెయ్యడానికి?
బ్రహ్మ: (గుటక మింగి) అవుననుకో- నేను ఘోటక బ్రహ్మచారిని.
సుందరి: అయినా... మీ గురించి నేనే 
భయపడాలి. కానీ నా గురించి మీకేల? మీరు 
ఉత్తములని నమ్మకం కాబట్టే ఆశ్రయం అడిగాను.
బ్రహ్మ: నావల్ల నీకు ఏ హానీ కలలో కూడా 
జరగదు.
సుందరి: అంటే- నావల్ల మీకు జరుగుతుందనా?
బ్రహ్మ: అబ్బే, అదేమీలేదు.
సుందరి: మరికనేం, దారి ఇవ్వండి.
ముందుకు అడుగేసింది. అతడు దారి ఇచ్చాడు. దీపకళిక కాంతిలో ఆమె ఒక జ్యోతిలా వెలుగుతోంది.
బ్రహ్మ: తడిసిపోయావు... చలి... నావద్ద పొడిబట్టలు ఉన్నాయి... మార్చుకో. నీ చీరలు ఆరబెట్టుకో.
దండెంమీద ఉన్న రెండు నారచీరలు ఇచ్చాడు. గాజులచేయి వాటిని అందుకోగానే మునివేళ్ళు 
తగిలాయి. చీర ఇచ్చి, చటుక్కున తన చేయి వెనక్కి లాక్కున్నాడు. తన పంచకు తుడుచుకున్నాడు. ఆమె గమనించలేదు. ఒకపక్కకు వెళ్ళి చీర మార్చుకోసాగింది. అతడు దీపం పైకెత్తి పట్టుకుని, మరోవైపు తిరిగి నిలిచాడు. ఆమె విడిచిన వలువల సుగంధ 
పరిమశాలు మళ్ళీ గుప్పుమన్నాయి. ఊపిరి 
బిగబట్టాడు. ఆమె తడిచీరలు విడిచి, దండెంపై 
ఆరవేసింది. పాదాలు పైకిలేపి, చీరలు ఆరవేస్తుండగా అతడూ క్షణకాలం చూశాడు. ఒంపుసొంపులు 
కనిపించాయి. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. 
‘హరిహరీ!’ అని గొణుక్కున్నాడు.
సుందరి: ఏ పక్కన పడుకోను? 
అంటూ ఓ పక్కకు నడిచింది. బ్రహ్మచారి 
గుటకలు మింగాడు.
బ్రహ్మ: సుందరీ, నియమాలను ఉల్లంఘించడం ఎందుకో నాకు రుచించలేదు. పద, ఈ పక్కనే నాది మరొక చిన్నకుటీరం ఉంది. అందులో కట్టెలూ 
సమిధలూ ఇతర పూజాద్రవ్యాలూ ఉంచుకుంటాను. 
ఆ గదిలో హాయిగా నిద్రించవచ్చు.
సుందరి వింతగా చూసింది.
సుందరి: నేనేమీ తప్పి చరించను స్వామీ! ప్రమాణం చేస్తున్నాను.
బ్రహ్మ: ఆహా! మనం తప్పు చేస్తామనికాదు. 

ఉదయమే భక్తజనం వస్తారు. వారు నాలుగువిధాలుగా అనవచ్చు, అనుకోవచ్చు. పద...పద...
సుందరి: మంచిది స్వామీ! నాక్కావలసింది నిద్ర, వెచ్చని పక్క. అంతే. ఆ పక్కనయినా ఈ పక్కనయినా ఏ పక్కనయినా ఒక్కటే.
అనుసరించింది.
బ్రహ్మచారి ఎడమచేతిలో కాగడా, కుడిచేతిలో 
పెద్ద ప్రమిదలో దీపం ఉంది. తడక తలుపు తోశాడు. 
లోపలకు వెశ్ళాడు. దీపం ఆమె చేతికి ఇచ్చాడు. 
చేయి తగిలింది. ఆమెకేమీ లేదుగానీ అతనికి 
స్పర్శ ఛెళ్ళున తగిలింది. నిగ్రహించుకున్నాడు. 
దర్భశయ్యను పరిచాడు.
బ్రహ్మ: ఒక్క క్షణం.
పరుగున వెళ్ళి నారచీరనూ ఆమె తడి చీరలనూ తెచ్చాడు. నారచీరను దర్భశయ్యపై పరిచాడు. తడి చీరలను అక్కడ కట్టెలమోపుపై పరిచాడు.
బ్రహ్మ: (తనలో తానే) దర్భలు గీసుకుంటాయి. నీలాంటి కోమలాంగులకు మరీ కష్టం.
ఆమె దీపం పట్టుకుని కదలకుండా అలాగే చూస్తోంది.
బ్రహ్మ: తడిబట్టలు ఇక్కడే ఆరవేస్తే, చూరులోంచి గాలి వస్తుంది. తెల్లవారేవేళకు ఆరిపోతాయి.
(వాటిని చూస్తూ చీర పొరను వేళ్ళమధ్య పట్టి) 
దేవతా వస్త్రాలంటే ఇవే కాబోలు!
సుందరి నిశ్చలంగా చూస్తోంది. చేతిలోని దీపకాంతిలో ఆమె అందాలు జిగేల్మంటున్నాయి.
బ్రహ్మచారి బయటకు నడిచాడు.
బ్రహ్మ: తలుపువేసుకో అమ్మాయి.
సుందరి: అలాగే.
వెళ్తున్నవాడు వెనక్కి తిరిగాడు.
బ్రహ్మ: అలాగే అంటేకాదు. తలుపు మూయాలి, గడియ వేయాలి.
సుందరి: అలాగే స్వామీ!
తలుపులు మూయబోయింది.
బ్రహ్మ: అన్నట్లు ఒక్కమాట గుర్తుంచుకో. ఈ చుట్టుపక్కల ఒక మాయదారి పిశాచి తిరుగుతోంది. అది కామరూపిణి. నక్కలా పులిలా సివంగిలా- సివంగేమిటి? మనిషిలా. అచ్చంగా నా రూపంలో కూడా వచ్చి తలుపు తీయమంటుంది. తియ్యకు. అరిచి 
గీపెట్టినా గడియ మాత్రం తీయకు. తెల్లవారేదాకా తలుపు తెరవకు. బహుపరాక్‌!
సుందరి కళ్ళప్పచెప్పి చూస్తోంది.
మాటలు చెప్తూనే అతడు ఆమె అందాన్ని కళ్ళతో తాగేస్తున్నాడు.
ఆమె తలుపు మూసి గడియపెట్టింది. బ్రహ్మచారి ఒక్కక్షణం అటే చూసి నిట్టూర్చి తన కుటీరానికి వెశ్ళాడు.
(యాగశాల)
పరీక్షిత్తు: అక్కడ నిజంగా అలాటి పిశాచాలున్నాయా?
శుక: లేవు, అడవిలో లేవు. అతని గుండెలో ఉన్నాయి. ఆమె అందాన్ని చూడగాచూడగా అతనికి ఆనందంకన్నా భయం ఎక్కువ కలిగింది. తను ఏమి చేస్తాడో అని. అందుకే అలాంటి పిశాచ భయంతో ఆమెను హెచ్చరించాడు. తన భయానికి తగినట్టుగానే అతని తీరులో మార్పు రాసాగింది.
ఉరుములు... మెరుపులు... వర్షం... వసారాలో కుండలో నీరు తీసి, కాళ్ళు కడుక్కుని, కాసిని నీళ్ళు 
నెత్తినజల్లుకుని లోపలకు నడిచాడు బ్రహ్మచారి.
బ్రహ్మ: హదే దామ... హదే దామ... దామ 
దామ హదే హదే... హదే కృస్‌న... ఛీ! మాటలు మొద్దుబారాయ్‌. పెదిమలు పిడచకట్టుకుపోయాయ్‌. దాహం కాబోసు.
పక్కన కుండలో నీరుతీసి గడగడా తాగేశాడు- 
తననితనే అభినయించుకుంటూ.
బ్రహ్మ: నాకే ఇంత దాహమైతే- పాపం ఆ 
సుకుమారికెంత దాహమో!
పాత్రలో జలం తీసుకుని పరిగెత్తాడు. 
తలుపు తట్టాడు.
బ్రహ్మ: అమ్మాయీ!
సుందరి: స్వామీ!
బ్రహ్మ: నిద్రపోలేదా?
సుందరి: లేదు స్వామీ!
తడక కంతలోంచి చూశాడు. ఆమె జడ విప్పి 
కురులారబోసుకుంటోంది.
బ్రహ్మ: దాహానికి నీరుంచడం మరచాను. తీసుకో.
సుందరి: వద్దు స్వామీ! దాహంగా లేదు.
బ్రహ్మ: ఇప్పుడు లేకపోవచ్చు. ఆనక వేస్తే?
సుందరి: (నవ్వి) వెయ్యదు స్వామీ!
బ్రహ్మ: వెయ్యకపోయినా, అక్కడ ఉంచుకుంటే నీరు కరుస్తుందా? తలుపు తెరువు.
శృంగారం తొంగిచూసే కపట కోపం నటిస్తూ...
సుందరి: తెరవను.
బ్రహ్మ: అదేమిటి... నన్నే శంకిస్తున్నావా?
సుందరి: నాకు ఆశ్రయమిచ్చిన స్వామివారు 
గట్టిగా చెప్పారు. ఎవరు వచ్చినా - కుక్కలూ 
నక్కలూ వచ్చినా - చివరకు స్వామివారి రూపంలోనే వచ్చినా, తెల్లవారేవరకూ తలుపు తెరవరాదని 
వారు ఆజ్ఞాపించారు.
బ్రహ్మ: బాలా... అది చెప్పినది నేనేగదా! నేనో కాదో తెలియాలంటే తలుపు కంతలోంచి చూడు.
సుందరి: చూస్తూనే ఉన్నాను స్వామీ. మీరు 
మీరో, పిశాచం గారి కామరూపులో నాకెలా తెలుసు? తెల్లవారనీయండి.
బ్రహ్మ: బాలా! నన్ను విసిగించకు. పిశాచాలకు మాయలు తెలుసు. ఇట్టే లోపలకు వచ్చేస్తాయి.
వయ్యారాలు పోతూ...
సుందరి: అవి తలుపు కూడా కొడతాయని 
మీరేగదా చెప్పారు!
బ్రహ్మ: బుద్ధి గడ్డి తిని చెప్పాను తల్లీ! తియ్‌ తలుపు.
సుందరి: మా స్వాములవారికి కోపం రాదు. ఇంత కోపం ఉంది కాబట్టి, మీరు పిశాచాలే.
బ్రహ్మ: చూస్తూ ఉండు. నేను మాయలేకుండా సొంత బలంతో ఎలాగో తోసుకుని లోపలకు వచ్చేస్తాను.
సుందరి: అలా వస్తే మీరు మీరేకారు. పిశాచంగారే! మీరు బలవంతంగా రారు.
భుజంతో తలుపు నెట్టాడు. లోపల ఆమె తన బలంతో ఆపుతోంది. బ్రహ్మచారికి తిక్కరేగింది. పౌరుషం వచ్చింది. తలుపుకి కొంచెం అవతల చూరుకేసి చూశాడు. గోడకీ చూరుకీ మధ్యన ఒక అడుగు ఖాళీగా ఉంది. గాలికోసం పెట్టిన వసతి అది. పక్కనే ఉన్న రెండుకుండలు చూశాడు. ఒకదానిపై ఒకటి మోపి, పైకి ఎక్కాడు. చూరుబద్దలు పట్టి ఒక్క ఊపుతో పైకి లేచాడు. కుండలు పడిపోయాయి. చూరులో తలదూర్చి, చేతులతో ఎగబాకి లోపలకి 
ప్రవేశించాడు.
తల, రొమ్ము, నడుముదాకా లోపలకి దూరాడు. పొట్ట అడ్డు వచ్చి ఆగిపోయాడు. సుందరి ఆశ్చర్యంగా చూస్తోంది.
బ్రహ్మ: తెలిసిందా నేను పిశాచాన్ని కాదు 
నరమానవుడనే! చేతులు జాపి లాగు, కిందకు లాగు.
సుందరి నవ్వింది.
సుందరి: అందటంలేదే
బ్రహ్మ: అందుకో
సుందరి: నావల్ల కాదు. నిద్ర ముంచుకొస్తోంది. మీరూ పడుకోండి. ఆటలు చాలు.
ఆమె పడుకుని, చెంగు ముసుగుపెట్టింది.
బ్రహ్మ: ఛీ... అందుకే స్త్రీని నమ్మరాదన్నారు. 
విశ్వాసఘాతకీ... హింసాత్మక రాక్షసీ!
వెనక్కి పోబోయాడు. కుదరలేదు. వెదురులు 
గీసుకున్నాయి. గిలగిల తన్నుకుంటున్నాడు.
బ్రహ్మ: దేవుడా! ఇదేమి వినోదమయ్యా? ఈ చెర విడిపించు. బతుకు చెరకాదు... ముందు ఈ చూరు చెరనుంచి విడిపించు దేవుడా!
దేవుడు కూడా నిద్రపోతున్నాడు. పలకలేదు. 
బ్రహ్మచారి మొరలు వినిదేవుడు మేలుకొనేసరికి- 
సూర్యుడు ఉదయించాడు. బయట భక్తులు చేరారు.
భక్త: ఇదెక్కడి చోద్యం?
భక్త: గురువుగారు చూరులో దాగారు.
భక్త: ఏదేనా యోగాభ్యాసమేమో?
భక్త: గురువర్యా! దిగండి.
చూరు మధ్యనే సొమ్మసిల్లి ఉన్న బ్రహ్మచారి కన్నులు తెరిచాడు. కింద వ్యాస భగవానులు, పక్కన సుందరి నిలిచి నవ్వుతున్నారు.
వ్యాస: నాయనా! ఎంత విద్వాంసులకైనా యోగులకైనా జయించరాని పెద్ద మాయాజాలం- కామం. నువ్వు చేసిన ఈ రభసకి -  కారణం - తల్లి, చెల్లి, కూతురు అయితే- క్షణికమయిన ఆవేశానికి జీవితకాలం అంతా క్షోభపడాలి గదా! అందుకే విద్వాంసులను కూడా హెచ్చరించడానికే ఆ
శ్లోకం చెప్పాను. ఇక రా.
వ్యాసుడు చేయి ఊపాడు. క్షణంలో 
బ్రహ్మచారి చూరులో నుంచి జారి, నేలమీద 
నిలిచి తలవంచి వ్యాసునికి నమస్కరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని