నాన్న

వేణుగోపాలస్వామి గాలిగోపురం చిరుగంటలు చిరుగాలికి చేసిన మంజులనాదం వీనులవిందు చేసింది. ‘కంటే కూతుర్నే కనాలి’...

Published : 08 Apr 2020 20:00 IST


- పులిపాక కనకదుర్గ

వేణుగోపాలస్వామి గాలిగోపురం చిరుగంటలు చిరుగాలికి చేసిన మంజులనాదం వీనులవిందు చేసింది.

‘కంటే కూతుర్నే కనాలి’ గర్వంగా అన్న నాన్న మాటలు అంతకంటే వినసొంపుగా అనిపించాయి నాకు.

అప్పుడు సాయంకాలం ఆరయింది.

పండుగకు కొత్త బట్టలు తీసుకోవాలని నన్ను వెంటబెట్టుకుని బయటకు వచ్చాడు నాన్న.

ఒక్క స్కూలుకి వెళ్ళే సమయాన్ని మినహాయిస్తే నాన్న వెంట నేను లేనిదెప్పుడు?

అభిమానమున్నవాళ్ళు మమ్మల్ని నెహ్రూజీ, ఇందిరాగాంధీలతో పోలిస్తే, మరికొంతమంది అక్కసుగా నన్ను నాన్నకూచి అనటం కూడా కద్దు.

ఎవరెలా అనుకున్నా నాన్నంటే నాకు ఎంతో ఇష్టం.

ఇక నాన్నకు పంచప్రాణాలూ నేనే. కాలు కిందపెడితే కందిపోతానేమోనన్నంత అపురూపం. అయినా కందిపోవటానికి నేనసలు కాలు కదిపితేనే కదా! నన్ను గుండెలమీదే పెంచాడు నాన్న.

కూతుర్ని అంత ప్రాణప్రదంగా ప్రేమించే నాన్నతో అంతకుముందు సూరయ్య ఏమన్నాడు... నీకో మగనలుసు ఉంటే బాగుండేది అంటాడా, ఎంత ధైర్యం! అయినా ఆయనకు మా బాగా అయిందిలే.

‘‘ఇద్దరూ అబ్బాయిలే ఉన్న నీకేం తెలుస్తుంది కూతురి విలువ? ఎంతమంది కొడుకులున్నా నా బంగారుతల్లికి సరిరారు. అందుకే కంటే కూతుర్నే కనాలి’’ నన్నే చూసుకుంటూ గర్వంగా అన్నాడు నాన్న.

‘‘చెప్పొచ్చావులే! ప్రపంచంలో మీరిద్దరే తండ్రీకూతుళ్ళు అయినట్టు’’ నవ్వుతాలకి దెప్పుతూ వెళ్ళిపోయాడు సూరయ్య.

ఆయన ఏ ఉద్దేశంతో అన్నా ఆ మాటలు నూటికి నూరుపాళ్ళూ నిజం!

ప్రపంచంలో అందరు నాన్నలూ ఇలాగే ఉంటారో లేదో నాకు తెలియదు. మా నాన్న మటుకు ప్రేమకు ప్రతిరూపం. ఆ ప్రేమంతా నాకే సొంతం. అమ్మా నాన్నా తానే అయి పెంచిన నాన్న ప్రేమవల్ల అమ్మ లేనిలోటు నాకెప్పుడూ తెలియలేదు.

నాకు తెలిసి నానమ్మ ఎన్నిసార్లు పోరిందని, నాన్నను మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని? ఎంతమంది ఎన్నివిధాల బలవంతం చేసినా నాన్న మరో వివాహం చేసుకోలేదు.

‘‘నా తల్లిని పెంచి పెద్దచేయటంలోనే నాకు తృప్తీ ఆనందం ఉన్నాయి. దయచేసి నన్ను బలవంతపెట్టకండి’’ అంటూ తన ప్రాణంకంటే ఎక్కువగా చూసుకున్నాడు నన్ను.

పూర్తిగా నాన్న పెంపకంలోనే పెరిగిన నాకు ఏనాడూ ఏ చిన్న పని కూడా చేయాల్సిన అవసరం రాలేదు.

వంటచేసి, గోరుముద్దలు తినిపించి, తనే జడలు వేసి, నన్ను స్కూలుకి పంపేవాడు. నిజం చెప్తున్నాను, అమ్మ ఉన్నా నన్నంత అపురూపంగా చూసుకునేది కాదేమో. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన నా స్నేహితురాళ్ళు కూడా అమ్మ చేతిదెబ్బలు తినకుండా పెద్దవాళ్ళు కాలేదు. అలాంటిది నాన్న ఒక్కసారైనా చిన్నదెబ్బ అయినా వేయలేదు. దెబ్బలే కాదు అసలు నాన్నలో కోపం నేనెప్పుడూ చూడలేదు.

బాగా చిన్నతనంలో ఓసారి నానమ్మ నాన్నను పేరుపెట్టి పిలిచిందని నేనూ అలానే పిలిచాను.

కోపంతో మండిపడ్డ నానమ్మను నాన్న నవ్వుతూ వారించారు... ‘‘నువ్వు కన్నతల్లివి అయితే అది నా బంగారుతల్లి. పిలవనీ అమ్మా’’ అంటూ.

ఒకటేమిటి, నా బాల్యమంతా నాన్న ప్రేమను పంచి ఇచ్చిన తీపి జ్ఞాపకాలే!

నాన్న పక్కనుంటే ఆ ధీమాయే వేరు. ఓ జ్ఞాపకం నా కళ్ళముందు ఇంకా సజీవంగానే ఉంది.

నా పెళ్ళికని నాకు వూహ తెలియని వయసు నుంచీ నాన్న చేయించిన నగలకు బీరువాలో ఉన్న లాకర్‌ సరిపోకపోతే బ్యాంకు లాకర్లో పెట్టడానికి నన్ను వెంటతీసుకుని మరీ వెళ్ళాడు నాన్న. స్ట్రాంగ్‌రూంలోకి చిన్నపిల్లలను అనుమతించరని చెప్పిన మేనేజర్‌తో ‘‘మా అమ్మాయి నాకంటే తెలివైంది, జాగ్రత్తపరురాలు. కావాలంటే తననే లాకర్‌ దగ్గరకు తీసుకువెళ్ళండి, నేనిక్కడే ఉంటాను’’ అన్న నాన్న మాటలు మరొక జన్మకు కూడా మరచిపోలేను.

ఆ మాటల్లో ఎంతటి నమ్మకం!

అదంతా నామీదగల అవ్యాజమైన ప్రేమవల్లే కదా!

రెండువందల కాసుల బంగారంకంటే, ఇంకా చెప్పాలంటే తనకంటే కూడా నాన్నకు నేనే ఎక్కువ అని ఆ క్షణానే నాకు తెలిసింది.

గర్వంగా నాన్నతోపాటు స్ట్రాంగ్‌రూంలోకి వెళ్ళాను.

అలా ప్రపంచం అంతా నాకు నాన్నే.

నాన్నకు నేనే ప్రపంచం.

‘‘ఆడపిల్లమీద అంతలా ప్రేమ పెంచుకోకు’’ అన్న నానమ్మ మాటలు ఏనాడైనా చెవికెక్కించుకుంటేనే కదా.

పరీక్షలకు నాతోపాటుగా మేలుకునే నాన్న, స్నేహితురాళ్ళ అమ్మలకంటే అందంగా గోరింటాకు పెట్టి మురిసిపోయే నాన్న, ఎన్ని జన్మలకైనా ఈ నాన్నే కావాలనిపించే నాన్న, నన్ను మితిమించి ముద్దు చెయ్యవద్దనే నాన్నమ్మ మాటలను అసలు వినిపించుకునేవాడుకాదు. నా అరచేతిన పండిన గోరింటాకు ఎరుపుకంటే నాన్న కళ్ళలో మెరుపు మరింత ప్రకాశవంతంగా ఉండటం ఆయనకు నామీదగల ప్రేమకు చిహ్నం.

‘‘ఎందుకు నాన్నా, నేనంటే నీకంత ప్రేమ?’’ అని అడిగితే, ‘‘నువ్వు మీ అమ్మ నాకిచ్చిన అపురూపమైన బహుమతివిరా..! అయినా కన్నబిడ్డకుగాక ఎవరికిపంచను ప్రేమను?’’ అన్న నాన్న మాటలు అలానే హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి.

అలాంటి నాన్నను ఒక్కపూటైనా విడిచి ఉండటానికి మనసు అంగీకరించేదికాదు.

‘‘ఏమ్మా, నాన్నను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేనిదానివి, రేపు పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా ఉంటావు?’’ సెలవుల్లో తన దగ్గరికి రమ్మంటే రానన్నానని, పిన్ని నవ్వుతూ అందోసారి.

స్వయానా అమ్మకు చెల్లెలు అయితే అయింది, ఆ పరిహాసం నాకు అసలు నచ్చలేదు.

‘‘నేనసలు పెళ్ళే చేసుకోను. మా నాన్న దగ్గరే ఉంటాను’’ కోపంగా ముఖం తిప్పేసుకుంటూ అంతలోనే బావురుమన్నాను.

నేను మా నాన్నను విడిచి ఎక్కడికీ రానని అందరికీ అర్థమైంది.

ఆ తరవాత ఎవరూ నన్ను తమ ఇంటికి రమ్మనమని ఒత్తిడిచేయలేదు.

నాన్న పెంపకంలో ప్రేమ, సంతోషం తప్ప లోటు అన్నది తెలియకుండా పెరిగాను. చక్కగా చదువుకున్నాను.

డిగ్రీ పూర్తిచేసిన నాలుగు నెలలకు నాకు పెళ్ళి నిశ్చయమైంది.

‘‘నిన్ను విడిచి ఉండలేను నాన్నా. నేనసలు పెళ్ళి చేసుకోను’’ పెళ్ళిచూపులకు వచ్చినవారు వెళ్ళిపోగానే ఏడుస్తూ అన్న నా మాటలకు, నాన్న కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి.

‘‘తప్పురా బంగారూ..! నువ్వు పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటేనే కదా నాకు ఆనందం. నన్ను నాన్నా అని పిలిచే బంగారుతల్లి కడుపున పుట్టి, ‘అమ్మా’ అని పిలిచి ఆ రుణం తీర్చుకుంటాను’’.

‘‘నువ్వలా మాట్లాడితే నేనసలు పెళ్ళి చేసుకోను’’ దుఃఖం ఉధృతి పెరిగింది నాలో.

‘‘వద్దురా, అంత మాటనకు. నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. పెళ్ళయితే మటుకు ఏమైంది? ఎప్పుడంటే అప్పుడు నువ్విక్కడికి రావచ్చు. చూడాలనిపించినప్పుడు నేనొస్తాను’’ నచ్చజెప్తూ అన్నాడు నాన్న.

అలా హరికి భార్యనయ్యాను.

అమ్మాయిల మనసు దోచేంత అందగాడు ఆయన. అంతేకాదు, ప్రేమించే హృదయం తన సొంతం.

ఏ బంగారుపూలతో పూజ చేశానోగానీ ప్రాణమిచ్చే నాన్ననూ ప్రాణప్రదంగా ప్రేమించే భర్తనూ పొందాను.

ఆయనకు నేనంటే చాలా ప్రేమ.

మాది ఉమ్మడి కుటుంబం. ఆయన చెల్లెళ్ళిద్దరూ మా అత్తగారూ మాతోనే ఉంటారు. చిన్న వయసులోనే భర్త పోయినా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది అత్తగారు. విశాలమైన లోగిలి మా అత్తగారిల్లు.

కన్నకూతురిలా చూసుకోకపోయినా మా అత్తగారు నాతో సఖ్యంగానే ఉంటుంది. ఇక, మా ఆడపడుచులు గీత, సుధ నాతో ఇట్టే కలిసిపోయారు. తోబుట్టువులు లేక ఒంటరిగా పెరిగిన నాకు వాళ్ళతో కలిసి ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది.

సత్యనారాయణస్వామి వ్రతంతో మొదలైన కొత్త జీవితం చాలా ఆనందంగా ఉంది. పదిరోజులు పది క్షణాల్లా గడిచిపోయాయి.

అప్పుడు వచ్చాడు నాన్న!

ఒక్కక్షణం నాలో మార్పుని నేనే నమ్మలేకపోయాను. ఇన్ని రోజులు నాన్న లేకుండా ఎలా ఉండగలిగాను! తండ్రి ప్రేమను మరిపించే భర్త దొరికినందుకు సంతోషించాలో నాన్నను ఇంత త్వరగా మరిచిపోయినందుకు బాధపడాలో తెలియలేదు.

ఈ పదిరోజుల్లో నాన్న కొద్దిగా డీలాపడిపోయాడు.

నన్ను చూసిన ఆయన కళ్ళల్లో అమితమైన సంతోషం!

ఒక్కటంటే ఒక్కరోజే ఉండి నాన్న వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు నాకు.

‘‘ఏడవకు బంగారూ, నువ్విలా సంతోషంగా ఉంటే నాకెంత తృప్తిగా ఉందో తెలుసా..! నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి’’ తల నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నాన్న.

నాన్నతో ఉండలేని నా నిస్సహాయతకు నాకే ఏడుపు వచ్చింది.

నాన్న వెళ్ళిపోతుంటే వెక్కివెక్కి ఏడుస్తున్న నన్ను ఆయన తన గుండెల్లో అపురూపంగా పొదువుకున్నారు. అదే నాకు శాశ్వతమైన నెలవైంది.

అది మొదలు ఆయన గుండెలోనే కాపురముండిపోయాను.

ఇంటి కోడలిగా బాధ్యతలు అందుకుని, అత్తగారికి విశ్రాంతినిచ్చాను. బాధ్యతలు తీసుకున్నా, అత్తగారి మాటకు విలువిచ్చి, ఆవిడ మాటప్రకారమే నడుచుకుని మంచి కోడలనిపించుకున్నాను.

ఆడపడుచుల పెళ్ళిళ్ళు ఘనంగా చేశాం.

ఇప్పుడు నాన్న అరుదుగా వచ్చే అతిథి!

తెలియకుండానే నాన్న దూరపుబంధువు అయ్యాడు.

ఒకొక్కప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కరోజైనా నాన్నను విడిచి ఉండలేని నేను, ఇప్పుడు నెలలకు నెలలు నాన్నను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నానా అని!

అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి.

మా అనురాగ దాంపత్యానికి గుర్తుగా మాకిప్పుడు మూడేళ్ళ పాప.

* * *

సకుటుంబంగా అందరం పెద్దాడపడుచు గృహప్రవేశానికి వచ్చాం. గృహప్రవేశం నిర్విఘ్నంగా జరిగింది.

అక్కడ రాధత్తను చూడగానే సంతోషం ముప్పిరిగొంది. రాధత్తయ్య నాకు స్వయానా మేనత్త.

కుశలప్రశ్నలు అయ్యాయి.

‘‘నువ్వు కూడా మీ నాన్న చేసిన పొరపాటు చెయ్యకు ఇందూ. పిల్లకు మూడు నిండాయి కదా... ఈసారి అబ్బాయిని కను’’ మాటల సందర్భంలో అంది అత్తయ్య.

అత్తయ్య మాటలకు మనసు కీడు శంకించింది.

‘‘నాన్న ఎలా ఉన్నారు?’’ అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగాను భయంగా.

‘‘అదేమిటీ, నీకు తెలియదా? మీ నాన్నకు నెలరోజుల నుంచి ఒకటే జ్వరం. పాపం, కాస్త జావ కాచిచ్చే దిక్కు కూడా లేదు. నాకు వీలైనప్పుడు ఇంత ఉడకేసి పెట్టి వచ్చాను. నాలుగు రోజులైంది నేను కూడా వెళ్ళి’’ ఇది కూడా తెలియదా అన్నట్టుగా విచిత్రంగా చూస్తూ చెప్పింది అత్తయ్య.

అత్తయ్య మాటలకు ఒక్కసారిగా గుండె జారిపోయినట్టుగా అనిపించింది.

‘‘ఎంతైనా కూతురు కూతురే ఇందూ! పెళ్ళయ్యాక ఆడపిల్లకు ఏం స్వంతంత్రముంటుంది? మీ నాన్నకు పట్టిన గతి నీక్కూడా పట్టకూడదనే చెప్తున్నాను. వెంటనే ఓ కొడుకుని కను’’ తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది అత్తయ్య.

నా మెదడులో వేల విస్ఫోటనాలు.

విపరీతంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి, అక్కడినుండి పెరట్లోకి వచ్చేశాను.

అత్తయ్య నాకు నాన్న గురించి నెలరోజుల నుంచి మాత్రమే తెలియదనుకుంటోంది. పిల్ల ఆలనా పాలనలో, ఇంటి బాధ్యతల్లో తలమునకలైన నేను మూడేళ్ళలో నాన్నను రెండుసార్లు మాత్రమే చూడగలిగానని అత్తయ్యకు ఎలా చెప్పగలను?

ఏడాది కిందట నాన్నకు వంటమనిషిని కుదిర్చి వచ్చాక ఆ వూసే మరిచిపోయాను నేను. కొవ్వొత్తిలా తను కాలిపోతూ నాకు వెలుగునిచ్చిన నాన్నకు నేను చూపించిన కృతఘ్నతకు నాకు నిష్కృతి ఉండదనిపించింది.

నాకు సమస్తమూ ఇచ్చిన నాన్నకు నేనేం చేయగలిగాను? ‘నాన్నా’ అంటూ హృదయం మూగగా రోదించింది.

క్షణక్షణానికీ నాలో నిస్త్రాణ పెరిగిపోయింది.

నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆయన వెంటనే మమ్మల్ని తిరుగుప్రయాణం కట్టించారు. దారంతా ఆయనకు నా గురించిన ఆందోళనే. ఇంటికి రాగానే నీరసంగా మంచంమీద వాలిపోయాను.

ఎంత ప్రయత్నించినా కంటిమీద కునుకు రాలేదు.

మనసంతా నాన్న గురించిన ఆలోచనలే. అప్పటికప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళిపోదామన్నంత ఉద్వేగం.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నను వృద్ధాప్యంలో ఒంటరిని చేసేంతగా ఎందుకు విస్మరించాను? నేను కాకపోతే నాన్నను ఎవరు చూసుకుంటారు? తెలియకుండానే ఎందుకింత స్వార్థపరురాలినయ్యాను? నాన్న కూడా నాలాగే తన సుఖం తను చూసుకుని ఉంటే ఈరోజు నేనిలా ఉండగలిగేదానినా?

మూసి ఉన్న కన్నులనుంచి పశ్చాత్తాపం కన్నీటి రూపంలో ప్రవాహమైంది.

మర్నాడే వెళ్ళి నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పటికీ నాతోనే ఉంచేసుకుందామని నిర్ణయించుకున్నాక మనసు కాస్త కుదుటపడింది.

మర్నాడు ఉదయమే నా నిర్ణయాన్ని ఇంట్లో చెప్పాను.

‘‘మీ నాన్నను మనింట్లో ఉంచుకుందామా?’’ అదేదో చేయరాని పని అయినట్టూ ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించినట్టూ విడ్డూరంగా అంది మా అత్తగారు.

‘‘మీ అబ్బాయిని మీరెలా కష్టపడి పెంచారో, మా నాన్న నన్ను అంతకంటే ఎక్కువ కష్టపడి పెంచి పెద్దచేశారు. మీరు మీ అబ్బాయితో ఉన్నప్పుడు, మా నాన్న నా దగ్గర ఉంటే తప్పేముంది?’’ సాధ్యమైనంత మామూలుగా అన్నాను.

ఆవిడ నన్నొక పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది.

నిజం మాట్లాడేవాళ్ళు పిచ్చివాళ్ళలా కనిపిస్తారని నాకప్పుడే అర్థమైంది.

‘‘అమాయకంగా మాట్లాడకు ఇందిరా..! నేను నా కొడుకు దగ్గర ఉంటున్నాను. కానీ, మీ నాన్న అభిమానమున్న మనిషి. కూతురి దగ్గరకు వచ్చి ఉండటానికి ఆయన ఒప్పుకొంటారా? అసలు నలుగురూ హర్షిస్తారా?’’

ఆవిడ ద్వంద్వ వైఖరిని మొదటిసారి గమనించాను.

ఈమే కదూ, నాన్న ఆస్తి పత్రాలను ముందుచూపుతో తెప్పించి, నాచేత బీరువాలో పెట్టించింది. ఈతరం ప్రతినిధిగా మా నాన్న ఆస్తిలో ఆడపిల్లనైన నాకు హక్కుంది. బాధ్యత తీసుకోవటం దగ్గరకు వచ్చేసరికి, వెనకటికాలంనాటి అమ్మాయిలా, సంప్రదాయం పేరిట మా నాన్న బాధ్యతలు నాకు లేవు?

మనిషిలోని ఈ డబుల్‌స్టాండర్డ్స్‌ మీద తీవ్రమైన అసహ్యం వేసింది.

‘‘అలాగైతే మా నాన్న ఆస్తిపత్రాలు మా నాన్నకు ఇచ్చేస్తాను. ఎవరైనా అబ్బాయిని పెంచుకుని, తన ఆస్తిని ఆ అబ్బాయికి రాసిస్తే, ఆయనకు కాస్త ఆసరాగా ఉంటుంది’’ క్రీగంట అత్తగారినే గమనిస్తూ అన్నాను.

ఆవిడ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది.

‘‘ఏమిటమ్మా ఇందూ, కూతురి దగ్గర తండ్రి ఉండటం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉన్నమాట అన్నానని నీకంత కోపం అయితే ఎలా?’’ తెలివిగా బదులిచ్చింది ఆవిడ.

‘‘ఎవరన్నారు ప్రపంచంలో ఎక్కడాలేదని? ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం చైనా. అక్కడి దంపతులకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే బిడ్డ ఉండాలి. అందుకే కూతురి వివాహం అయ్యాక, తల్లిదండ్రులు కూడా కూతురితోనే ఉంటారు. మీకీ విషయం తెలియదు కాబోలు’’ ఆవేశంగా అన్నాను.

నా మాటలకు ఏ సమాధానం చెప్పాలో తోచక మా అత్తగారు మౌనం వహించారు.

‘‘అదికాదు ఇందూ...’’ అంటూ మావారు కల్పించుకోబోయారు.

‘‘మీరాగండి. అసలు మీ ప్రేమమైకంలో పడే మా నాన్నను పట్టించుకోలేదు’’ కోపంగా కస్సుమన్నాను.

నా మాటలకు ఆయన కళ్ళల్లో చిలిపితనం తొంగిచూసింది. కానీ, నా సీరియస్‌నెస్‌ గమనించి మామూలుగా మాట్లాడారు.

‘‘ఇందూ, నన్ను కాస్త మాట్లాడనిస్తావా’’ అని వాళ్ళ అమ్మవైపు తిరిగి అన్నారు- ‘‘అమ్మా, ఇందిర మాటల్లో వాస్తవముంది. వెనకటిరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆడపిల్ల పెళ్ళయ్యాక, ఆమె తల్లిదండ్రుల బాధ్యతని ఉమ్మడి కుటుంబసభ్యులు తీసుకునేవారు. అందువల్ల కొడుకులు లేనివారికీ ఇబ్బంది ఉండేదికాదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి? ఒక్కతే అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రులను ఆమె పెళ్ళయ్యాక ‘మీ ఖర్మ, మీరు అనుభవించండి’ అంటూ వదిలేయటం న్యాయం కాదు. కాలంతోపాటు మనమూ మారాలి. చెల్లాయిల పెళ్ళి ఘనంగా చేశామంటే అది ఇందూ నాన్నగారి సాయంవల్లే కదా! ఈరోజున మనకు ఇంత శాంతి, సంతోషం అంతా ఆయన కూతురివల్లే కదా? అలాంటి ఆయనను మనతో ఉంచుకుని ఒంటరితనం దూరం చేయటంవల్ల సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏమీలేదు’’.

ఆయన మాటలకు అత్తగారు కూడా కన్విన్స్‌ అయ్యారు.

నాన్నను ఇక్కడికి తీసుకురావటానికి అన్ని అభ్యంతరాలూ తొలగిపోయాయి. నాన్నను తీసుకురావటానికి నేనూ ఆయనా పాపను వెంటబెట్టుకుని మా వూరికి వెళ్ళాం.

శుష్కించిపోయిన నాన్నను చూడగానే ఏడుపు ఆపుకోలేకపోయాను.

అంత నీరసంలోనూ నన్ను చూడగానే నాన్న కళ్ళల్లో వెలుగు.

‘‘ఎందుకురా ఆ కన్నీళ్ళు... ఇప్పుడు నాకేమయిందని?’’ సముదాయింపుగా అన్నారు నాన్న.

కన్నీరు నిండిన కళ్ళతో ఓమారు ఇల్లంతా పరికించాను. అపరిశుభ్రతకు నిలయంలా ఉంది. శుభ్రతకు ప్రాణంపెట్టే నాన్న అలాంటి వాతావరణంలో ఉండవలసి వచ్చినందుకు చాలా బాధగా అనిపించింది.

అక్కడ ఒక్కక్షణం కూడా నాన్నను ఉంచాలని అనిపించలేదు.

‘‘నాన్నా, ఇక్కడ అసలు బాగోలేదు. నువ్వు నాతో బయలుదేరు. ఇక నుంచీ మనం కలిసే ఉందాం’’ అన్నాను.

‘‘నాకిక్కడ ఇప్పుడు ఏం తక్కువైందిరా ఇందూ. నువ్వు కుదిర్చి వెళ్ళిన వంటమనిషి మానేసింది. మరో మనిషి దొరకగానే అంతా సర్దుకుంటుంది. ఈమాత్రానికే నన్ను మీతో వచ్చేయమంటే ఎలా?’’ అభిమానంగా అన్నారు నాన్న.

ఎక్కడ నాకు భారమవుతానో అన్న భయం నాన్న మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రేమను పంచటం తప్ప నానుంచి ఏ చిన్న సేవను కూడా ఆశించటం నాన్నకు తెలియదు.

కానీ నాన్నతో ఎలా అవుననిపించాలో నాకు బాగా తెలుసు.

‘‘సరే, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. నీతోపాటు ఇక్కడే ఉంటాను’’ మొండిగా అన్నాను.

ప్రేమను పంచటం తప్ప, గదమాయించటం తెలియని నాన్న నిస్సహాయంగా ఉండిపోయారు. నిజంగానే ఆయనా, నేను విడిపోతామేమోనని విలవిలలాడారు.

‘‘మావయ్యా, దయచేసి ఒప్పుకోండి. మీకోసం ఇందిర, ఇందిర కోసం పాప ఇక్కడికి వచ్చేస్తే అక్కడ నేనూ నా వ్యాపారం ఏం కావాలి? దయచేసి నాకోసమైనా ఒప్పుకోండి’’ దిగులు అభినయిస్తూ నాటకీయంగా అన్నారు ఆయన.

‘‘వద్దొద్దు. అలా జరగటానికి వీల్లేదు. మీ ఇష్టప్రకారమే కానివ్వండి’’ ఎక్కడ మేం కష్టపడతామోనని గభాలున అనేశారు నాన్న.

నాన్నను మాతోపాటే తీసుకువచ్చాం. గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చే విశాలమైన గది నాన్నకు కేటాయించాం. తనకంటూ ప్రత్యేకంగా టీవీ, ఆయనకు ఇష్టమైన పాటల క్యాసెట్లతో టేప్‌రికార్డర్‌... అన్నీ ఏర్పాటుచేశాం.

టైముకు భోజనం, పండ్లు, పాలు అమరుస్తూ జాగ్రత్తగా చూసుకున్నాను.

రెండునెలల్లో నాన్న బాగా కోలుకున్నారు.

అయితే నాన్నలోని మార్పే నాకసలు మింగుడుపడలేదు.

ఒకప్పుడు నేనంటే ప్రాణంపెట్టే నాన్న పార్టీ ఫిరాయించాడు. అసలుకంటే వడ్డీ ముద్దనే మాటను నిజం చేశాడు.

నాన్న ఇంతలా మారిపోతాడని కల్లో కూడా వూహించలేదు.

ఇప్పుడు నాన్నకు మూడేళ్ళ నా కూతురుతోడిదే లోకం!

అదే నాకు అమితమైన కోపాన్ని కలిగించే అత్యంత ఆనందకరమైన విషయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని