ఆ అర‌వై

‘‘నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావ్‌. మళ్ళీ ఈ రోజు డబ్బులడుగుతావేంటి? ఆ వంద ఏం చేశావ్‌?’’ కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్‌. ‘‘నాకు బస్సుకు టైమవుతుంది. ముందు డబ్బులివ్వండి. ఆ వంద ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులెండి’’ అనేసి, ప్రశాంత్‌ ఇచ్చిన యాభై కాగితం బ్యాగ్‌లో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన.

Published : 08 Apr 2020 20:01 IST

- వేములపల్లి రాధిక


‘‘నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావ్‌. 
మళ్ళీ ఈ రోజు డబ్బులడుగుతావేంటి? ఆ వంద ఏం చేశావ్‌?’’ కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్‌.

‘‘నాకు బస్సుకు టైమవుతుంది. ముందు డబ్బులివ్వండి. ఆ వంద ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులెండి’’ అనేసి, ప్రశాంత్‌ ఇచ్చిన యాభై కాగితం బ్యాగ్‌లో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన.
‘‘నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏదో ఒక పిచ్చిపని చేసి డబ్బులు వేస్ట్‌ చేస్తుంటావు. ఎంత చెప్పినా నువ్వు మారవు’’ అంటూ విసురుగా బైక్‌ స్టార్ట్‌ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్‌.
‘ఈ గొడవ పుణ్యమా అని ఈ రోజుకు కాళ్ళు ఈడ్చుకుంటూ నడచి వెశ్ళాల్సిందే’ అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన. మెయిన్‌రోడ్డు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. అప్పుడప్పుడే డెవలప్‌ అవుతున్న ఏరియా కావడంతో, కొంచెం చవకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్‌ లోన్‌ 
తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. కొత్తగా కడుతున్న కాలనీ అవడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్‌ ఆటోలూ రిక్షాలూ అందుబాటులోకి రాలేదు. దాంతో రోజూ ఉదయం కల్పనను బస్టాపులో వదిలి తన ఆఫీసుకు వెశ్తాడు ప్రశాంత్‌. ఇలా ఎప్పుడైనా గొడవపడినరోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెశ్ళాల్సిందే.
హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్లని గమనించలేదు. మార్నింగ్‌ వాక్‌ నుండి తిరిగి వస్తున్న వెంకట్రామయ్యగారు, ఆయన స్నేహితుడు నారాయణరావుగారు 
కల్పనను చూసి ఆగారు.
‘‘ఏమ్మా! ప్రశాంత్‌ ఏడి? నువ్వు నడిచి 
వస్తున్నావేమిటి?’’ అని ప్రశ్నించిన మామగారికి,
‘‘ఆయనకు వేరే పని ఉందంట. ముందే బయలుదేరి వెళ్లిపోయారు’’ అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన.
మెయిన్‌రోడ్‌ చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీబస్‌ ఎక్కింది. అక్కడి నుండి ఆమె ఆఫీసుకు చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం. బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చొన్న ఆమె తనను ప్రశాంత్‌ నిలదీయడం గురించి ఆలోచించసాగింది. ఈ ప్రశాంత్‌ ఎప్పుడూ ఇంతే! అన్నీ బడ్జెట్‌ ప్రకారం జరగాలంటాడు. ఎలా వీలవుతుంది? నెలనెలా వేసే బడ్జెట్‌ మించి ఖర్చులు అవుతున్నాయని గోల. ప్రతినెలా ఏదో ఒక ఎక్స్‌ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు. సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి? మనిషి మంచివాడే కానీ ప్రతిపైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరా తీస్తుంటాడు. అతని ప్రవర్తనకు ఒకొక్కసారి మనస్సు చివుక్కుమన్పిస్తుంది కూడా. అయినా ఇందులో అతని తప్పేమీలేదేమో! ఏడుగురు సంతానం అత్త మామలకు. వాళ్ళందరినీ పెంచి పోషించి, జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్‌, తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు.
ఈ విషయంమీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతున్నారు. ఎంతసేపూ డబ్బు సంపాదించి తరవాత తరానికి అందించాలనే తాపత్రయమే. ఆ తాపత్రయంలోపడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థంకావడం లేదు. ‘ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నెలకు కనీసం ముప్ఫైవేలు జీతాలు, తమకుంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజూ ఉదయం సాయంత్రం పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఎందుకు, మానెయ్య’మంటే వినడు. ‘పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా’ అని తానెంత చెప్పినా అతనికి అర్థంకాదు. ‘డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా, కడుపు నిండినవాళ్ళు చెప్పే కబుర్లు అవన్నీ’ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతోంది.
ఇంతలో తాను దిగాల్సిన స్టాప్‌ రావడంతో బస్సుదిగి వడివడిగా నడిచింది కల్పన. 
ఆఫీసు గేటు దగ్గర కలిసిన కొలీగ్‌ స్వప్న 
పలకరింపుతో ఆలోచనలను పక్కనపెట్టి రొటీన్‌ వర్క్‌లో పడిపోయింది.
తిరిగి సాయంత్రం ఆఫీసు అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన, అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్ళకు పాలు కలిపి ఇచ్చి, వంట ప్రయత్నంలో మునిగిపోయింది. పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చుమీద చాపవేసి కూర్చోపెట్టి హోమ్‌వర్క్‌ చేయిస్తూ వంట చేయసాగింది. ప్రతిరోజూ సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది. పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు. ‘డాడీ ఇంకా రాలేదేమిటి?’ అని. ‘డాడీకి చాలా పనులుంటాయి కదా! వచ్చేసరికి లేటవుతుంది. మీరు అన్నం తిని నిద్రపోండి’ అని వాళ్ళను సముదాయించినా మనస్సులో మాత్రం చాలా బాధపడుతుంది. ప్రశాంత్‌కు ఎంతసేపూ డబ్బు సంపాదించాలనే తపనే కానీ, ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థంకాదు. పిల్లలతో రోజు మొత్తంలో పది నిమిషాలైనా గడపని వ్యక్తి, 
ఆ పిల్లలకు కొండమీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం? ప్రశాంత్‌ తన ప్రవర్తనతో 
పిల్లలకు దూరమై, వారితో తండ్రిగా తన 
అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఏ రోజూ పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు. ఎప్పుడైనా వచ్చినా పొద్దున ఏడు గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండటంతో, 
ఇంటికిరాగానే ‘డాడీ’ అంటూ కాళ్ళకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకుపడతాడు. దాంతో తనో, అత్తగారో వాళ్ళని అవతలకు తీసుకెళ్ళి బుజ్జగించడం మామూలే. ఇంకా నయం...అత్త, మామలు తమతో ఉండటంతో తనకు పిల్లల గురించిన టెన్షన్‌ కొంతవరకూ తక్కువే. తన కొలీగ్‌ 
మాధవికైతే ఆఫీసులో లేటయితే ఇక పిల్లల గురించి టెన్షన్‌. ఎవరూ చూసేవాళ్ళు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్ళేవరకూ అలా వాకిట్లో కూర్చోవాలి. ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి. ‘పోనీ మీ అమ్మనో, అత్తనో రమ్మని అడగవచ్చుగా’ అంది తను. మాధవి విచిత్రంగా నవ్వి ‘‘కల్పనా, ఇది భారతదేశం తల్లీ! మనవాళ్ళింకా అంత ఎదగలేదు. తల్లి కూతురింటికి వచ్చి ఉంటే అల్లుడి ఇంట్లో ఉండటం మర్యాదకాదని రారు. ఇక చాలామంది అత్తగార్లేమో, సహజంగా మన సమాజంలో అత్తాకోడళ్ళ మధ్య అకారణంగా ఏర్పరచబడి తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనస్సుల్లో పాతుకుపోయిన ఫలితంగా ‘మాకు మీరు చెయ్యాలి కానీ, మీ పిల్లలకు పనిమనుషులుగా మేము రావాలా’ అని రారు. అందరూ ఇలా ఉంటారని కాదుకానీ చాలావరకూ ఇంతే. నీకు ఈ సమస్య తీవ్రత అర్థంకాదులే’’ అంది.
ఆలోచనల్లోపడి ప్రశాంత్‌ రావడం 
గమనించలేదు కల్పన. అప్పటికే పిల్లలు, 
అత్తమామలు భోంచేసి పడుకోవడంతో 
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
‘‘ఏంటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావ్‌? ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు’’ అంటూ స్నానానికి వెశ్ళాడు ప్రశాంత్‌.
ప్రశాంత్‌ వచ్చేలోగా స్టౌ అంటించి కూర వేడిచేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన. అన్నం తింటున్న ప్రశాంత్‌ సడెన్‌గా తలెత్తి ‘‘ఇంతకీ నిన్న ఇచ్చిన వంద రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి? పొద్దున అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు?’’ అంటూ ప్రశ్నించాడు కల్పనను.
‘‘ఏదో ఖర్చు పెట్టానులెండి. ముందు అన్నం తినండి చెబుతాగా’’ అంది కల్పన.
‘‘అంత దాపరికమేమిటి? ఉన్న విషయం చెప్పవచ్చుగా!’’ విసుక్కున్నాడు ప్రశాంత్‌.

‘‘ఏమీలేదులెండి. నిన్న ఎవరో ముసలి 
దంపతులు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేవంటే సాయం చేశాను’’ అంది కల్పన.
‘‘ఎంత ఇచ్చావేమిటి? పదా... ఇరవయ్యా?’’ వెటకారంగా అడిగాడు ప్రశాంత్‌.
‘‘అరవై’’ మెల్లగా అంది కల్పన. తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్‌కు.
గబగబా గ్లాసెత్తి నీళ్ళు తాగి ‘‘నిజంగా 
అరవై ఇచ్చావా’’ అని అడిగాడు. మెల్లిగా తల ఊపింది కల్పన.
పళ్లెంలో చెయ్యి కడుగుతున్న ప్రశాంత్‌ సీరియస్‌గా చూసి ‘‘నీకసలు బుద్ధుందా? ఎవరైనా అడుక్కునే వాళ్లకు ఐదో పదో ఇస్తారు. జాలి పుట్టే కథలు చెప్పి నమ్మించి అడుక్కునేవాళ్ళు బజారుకు పదిమంది తయారవుతున్నారు. అందరికీ ఇస్తూ కూర్చో. నీకు రోజురోజుకూ డబ్బంటే లెక్క లేకుండా పోతోంది’’ అన్నాడు.
ప్రశాంత్‌ మాటలకు ‘‘వాళ్లు పెద్దవాళ్లు. 
భార్యాభర్తలు. మీరు చెప్పినట్లు వాళ్లంతట వాళ్ళు అడగలేదు. నేనే ఇచ్చాను’’ అంది కల్పన.
ఇదంతా వింటున్న ప్రశాంత్‌ తల్లి జానకమ్మ ‘‘ఏంట్రా, అర్ధరాత్రి ఈ గొడవ? ఇరుగుపొరుగు వింటే ఏమనుకుంటారు? రేప్పొద్దున మాట్లాడుకోవచ్చు. వెళ్ళి పడుకోండి’’ అంటూ హెచ్చరించింది. తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెశ్లాడు ప్రశాంత్‌.
వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్రపట్టలేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్లముందు కదలాడింది. 
ఎప్పటిలానే తను బస్‌ దిగి తమ కాలనీ వైపు నడుస్తోంది. దారిపొడవునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజూ సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకు అలవాటే. పగలంతా ఆఫీసు పనితో సతమతమైనా సాయంత్రం తను నడిచే ఆ కాసేపూ రిలాక్స్‌ అవుతూ ఉంటుంది. రోజూ రెండు కిలోమీటర్లు నడవడం అంటే ఉరుకుల పరుగుల జీవితాలలో కష్టమే. అయినా ఉదయం భర్త బండిపై దింపటంతో, సాయంత్రం ఆటోకు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడంకన్నా నడవడాన్నే ప్రిఫర్‌ చేస్తుంది కల్పన.
ఎప్పటిలానే చెట్లవైపు చూస్తూ, గూళ్లు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్న వారిని గమనించింది. రోడ్డు మధ్యలో అందంగా ఉండటానికి చెట్లునాటి వాటికి రెండువైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలుపెట్టినప్పుడే. ఆ గట్టుపై కూర్చొని ఉన్నారు ఇద్దరు. బహుశా భార్యాభర్తలు కావచ్చు. అరవై, డెబ్భైల మధ్య వయస్సు వాళ్ళు. తమ లోకంలో తాముండి ఏం చెయ్యాలో దిక్కుతోచనట్లుగా, చుట్టూ ఏం 
జరుగుతోందో ఏ మాత్రం పట్టించుకోని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకుసాగలేదు. దూరం నుండే వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనను కానీ, రోడ్డుపై వెళ్తున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా 
తీవ్ర విచారంలో, నిర్వేదంలో మునిగి ఉన్న 
ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లన్పించి తల ఎత్తి చూశాడు. వాళ్ళను దాటి వెళ్ళలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిపింది. రెండడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్ళబుద్ధికాక వెనక్కు తిరిగింది. ‘‘మీరెవరు? ఇక్కడెందుకు కూర్చున్నారు?’’ అని అడిగింది. తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు. చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలానే నిలబడటంతో భార్యవైపు ఓసారి చూశాడు. తర్వాత నిదానంగా ‘‘ఏం చెప్పం తల్లీ మా గోడు! మాది తిరువూరు మండలంలో ఒక పల్లెటూరు. కాస్తంత పొలం ఉంది. వానల్లేక, పంటలు పండక, నానా ఇబ్బందులు పడ్డాం. చివరికి పస్తులు ఉండలేక 
ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం. నాలుగురోజులుండి బయల్దేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ, అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న ఐదొందల నోటు 
చేతిలోపెట్టి కన్నీళ్ళతో సాగనంపింది. కానీ 
మా దురదృష్టం! బస్టాండులో ఆ నోటునెవరో కాజేశారు. వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు. ఎలాగోలా మా ఊరు 
చేరదామని నిర్ణయించుకున్నాం. మా ఊరెళితే కనీసం కూలికైనా పోయి బతకొచ్చు. ఏలూరు బస్టాండు బయట ఒక లారీ డ్రైవరును బతిమాలితే ఇక్కడి వరకూ తీసుకొచ్చి వదిలాడు. ఇక్కడి నుండి తను వెళ్ళే దారి వేరని చెప్పి వెశ్ళాడు. ఇక్కడి నుండి మా ఊరు చేరేదెలాగో తెలియడం లేదు’’ అంటూ పై కండువాతో 
కüË•్ళత్తుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు.
‘‘మీ దగ్గర అసలేమీ డబ్బులు లేవా?’’ కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతిసంచీ అందుకుంది.
నడుం వంగిపోయిన ఆ ముసలమ్మ మరల మెల్లగా కూర్చొని చేతిసంచిలో నుండి తొంగిచూస్తున్న చిన్న స్టీలుబాక్సు తీసి అందులో నుండి ఐదు రూపాయల బిళ్ళలు రెండు తీసింది. 


‘‘ఇవేనమ్మా మా దగ్గరుంది. అమ్మాయికి ఇష్టమని ఈ బాక్సుతో బియ్యపు పరమాన్నం చేసి పట్టుకెశ్ళాను. ఇవితప్ప మా దగ్గర ఇంకేమీ లేవు. ఏనాడూ ఎవ్వరినీ చెయ్యిచాచి అడిగిన వాళ్ళం కాదు. మాకున్న ఆ కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికీ చేతైన సాయం చేశాం. కాలం కలసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం’’ అంటూనే భర్తతో, ‘‘పదయ్యా, ఎలాగోలా నడవగలిగినంత దూరం నడుద్దాం. మన ఊరికిపోతే ఉంటానికి ఇల్లైనా ఉంది. పద’’ అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ.
వెంటనే కల్పన ఆ వృద్ధుడ్ని ఆపింది ‘‘పెద్దయ్యా మీ ఊరికి పోవడానికి బస్సు 
టిక్కెట్టెంత?’’ అంటూ.
‘‘ఇక్కడి నుండి ఇరవై ఎనిమిది రూపాయలమ్మా. ఇద్దరికి యాభై ఆరు రూపాయలు కావాలి. సిటీబస్‌కి మా దగ్గరున్న పదిరూపాయాలు సరిపోతాయి’’ అన్నాడు.
అరవై రూపాయలా? ఆలోచనలోపడింది కల్పన. ఐదో పదో, అయితే ఫర్వాలేదు. వాళ్ళు చెప్పేది నిజమైతే, వాళ్ళకి నిజంగా అరవై రూపాయలు ఇవ్వడానికామె సిద్ధమే. కానీ మనస్సులో ఏ మూలో చిన్న అనుమానం. వీళ్ళు చెప్పేది నిజమేనా అని. ఈమధ్య అడుక్కోవడానికి కూడా ఇలాంటి ట్రిక్‌లు, కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. ఎలా కనుక్కొనేది వీళ్ళ మాటలు నిజమో అబద్ధమో. పోనీ ఒక పది రూపాయలు ఇచ్చి వెశ్దామా అన్పించిందామెకు.
ఆమె తన ఆలోచనల్లో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకిలేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది. ఆమెకేసి చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది. అంతే! సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిశ్చయానికొచ్చిందామె. బ్యాగ్‌ తీసి అరవై రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది. తరవాత 
ఆ వృద్ధుడి వైపు తిరిగి, ‘‘పెద్దయ్యా! మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి, మీ కూతురి లాంటిదాన్ని మీకు బస్సుకు డబ్బిస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇంకెవ్వరినీ మీరు డబ్బులడగక్కరలేదు’’ అంది.
జరిగిన విషయమంతా ప్రశాంత్‌కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు. కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని, తర్వాత ‘సారీ’ చెప్పటం ప్రశాంత్‌ అలవాటు. ఎదుటివాళ్ళు చెప్పేది సాంతం వినకుండా ఏదో ఒకటి అంటాడు. ఈరోజు కూడా అదే జరిగింది. అక్కడే అయితే అత్తయ్య, మామయ్య 
వింటారని తను తర్వాత చెప్తానంది. కానీ ప్రశాంత్‌ తొందరపడటంతో విషయం 
పెద్దవాళ్ళకు తెలిసింది.
రేపు ఉదయంతో ఈ టాపిక్‌ కట్‌ చెయ్యాలి. లేదంటే ప్రశాంత్‌ తనను పూటపూటా సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన.
మరుసటిరోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను రెండున్నర రూపాయలు ఇమ్మని చెప్పింది. కల్పన గోంగూర అమ్మే నరసమ్మకు మూడు రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కలో తగ్గిస్తానని చెప్పి వెళ్ళింది.
అక్కడే కూర్చొని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్‌ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు. ‘‘నీ కోడలుకేమమ్మా, ఎంతైనా దానం చేస్తుంది. అరవై రూపాయలు ఇచ్చిన దానికి అర్ధరూపాయో లెక్కా’’ అంటూ. కల్పన 
సీరియస్‌గా చూడటంతో ఆపేశాడు.
ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి 
గొడవేమిటని. కల్పన జరిగిన విషయమంతా వివరించింది.
అప్పుడు జానకమ్మ ‘‘అది కాదే అమ్మాయీ, వాడు అన్నాడని కాదు కానీ ఎవరైనా అరవై రూపాయలు ఇస్తారంటే? అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో ఎవరికి తెలుసు? ఏదో ఐదో, పదో ఇస్తే సరిపోయేది’’ అంది.
‘‘అలా ఇస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా? తనకేం తోస్తే అది చెయ్యడమే అలవాటు కదా!’’ వ్యంగ్యంగా అన్నాడు 
ప్రశాంత్‌.
అప్పటివరకూ మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్‌వైపు తిరిగి అంది, ‘‘చూడండి, నేను బాగా ఆలోచించే ఇచ్చాను. వాళ్ళకు నిజంగానే బస్సు టిక్కెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ళ ఊరు చేరడానికి ఉపయోగపడతాయి. వాళ్ళు అబద్ధమే చెప్పి ఉంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు నాలుగు కిలోల బియ్యం కొనుక్కోడానికీ ఒక వారంరోజులు గడపడానికీ సరిపోతాయి. అంతేకదా. 
ఈ రెంటిలో ఏది జరిగినా నాకు సంతోషమే. ఎందుకంటే అలాంటి వృద్ధుల ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు. అయినా ప్రశాంత్‌, అరవై రూపాయలు అంటూ అంత గింజుకుంటున్నావే... అదే నేను ఆరొందల రూపాయలుపెట్టి చీర కొనుక్కొని ఉంటే నువ్వేమైనా అంటావా నన్ను? అనవు. ఎందుకంటే, నీ భార్య నీ హోదాకు తగ్గట్టు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండటం నీకిష్టం. కానీ 
నేను మనసున్న మనిషిగా బతకదలచుకున్నాను. నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా 
నేనిలాగే ఉంటాను’’.
సీరియస్‌గా జావాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు, ప్రశాంత్‌ మరి మాట్లాడలేదు. 
పడకకుర్చీలో పడుకొని పేపర్‌ చదువుతూ 
ఈ ఘర్షణంతా వింటున్న వెంకట్రామయ్యగారు దీర్ఘాలోచనలో పడ్డారు.
ఆ సాయంత్రం ఎప్పటిలానే సిటీబస్‌ దిగిన కల్పన బస్టాపులో స్కూటర్‌ పట్టుకొని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది.
కంగారుగా తనవైపు వస్తున్న కోడలిని చూసి నవ్వుతూ, ‘‘కంగారు పడకమ్మా! ఏమీ లేదు. నిన్ను పికప్‌ చేసుకోవడానికే వచ్చాను’’ అంటూ ఆమెను స్కూటర్‌పై ఇంటికి తీసుకొచ్చారు.
అనుకోకుండా ఆరోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్‌ మామా కోడళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘అదేంటి నాన్నగారు? రిటైర్‌ అయ్యాక నేను స్కూటర్‌ బయటకు తియ్యను అని షెడ్లో పెట్టేశారు కదా! మళ్ళీ ఈరోజు బయటకు తీశారెందుకు?’’ అని అడుగుతున్న కొడుకుతో ‘‘అరవై ఏళ్ళ వయస్సులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం శ్రమ పడగలనులే’’ అన్నారు నవ్వుతూ వెంకట్రామయ్యగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని