రవళి

‘‘సూరీ, ఫ్లైట్‌ గంట లేటట... నువ్వేం తొందరపడనక్కరలేదు. నిదానంగా బయలుదేరు’’ బాంబే నుంచి రవళి ఫోన్‌ చేసింది. తనని రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతున్న నేను, ఆ ఫోన్‌కాల్‌తో కాస్త నెమ్మదించాను.

Published : 08 Apr 2020 22:50 IST

- కె.కె.భాగ్యశ్రీ


‘‘సూరీ, ఫ్లైట్‌ గంట లేటట... నువ్వేం తొందరపడనక్కరలేదు. నిదానంగా బయలుదేరు’’ బాంబే నుంచి రవళి ఫోన్‌ చేసింది. 
తనని రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతున్న నేను, ఆ ఫోన్‌కాల్‌తో కాస్త నెమ్మదించాను. తాపీగా డ్రెస్‌ చేసుకుని డైనింగ్‌టేబుల్‌ దగ్గర కూర్చున్నాను. 
టిఫిన్‌ పెడుతూన్న అమ్మతో ‘‘అమ్మా, రవళి వస్తోంది కదా! తనకిష్టమైనవన్నీ చేసిపెట్టు. ముఖ్యంగా ఉల్లికాడల తియ్యపులుసు’’ గుర్తుచేశాను. 
‘‘పేద్ద... నీకొక్కర్తికే ఉంది ఇంతోటి కూతురూ... పొద్దున్నే సీతాలు చేత తెప్పించానులే’’ అమ్మ నవ్వింది మురిపెంగా. 
‘‘అవును, రవళి లాంటి బంగారుతల్లి నాకు మాత్రమే ఉంది’’ అన్నాను ఆర్ద్రత నిండిన స్వరంతో. 
అమ్మ నా తల నిమిరింది లాలనగా. ఆమె చేతిస్పర్శ ఏదో కొత్త ఉత్తేజాన్ని నింపింది నా శరీరంలో. ఒక్క స్పర్శ చాలు... అలసిపోయిన మన శరీరాలను సేదతీర్చడానికి. 
గబగబ టిఫిన్‌ తినేసి కారు తీశాను. 
దారిపొడుగునా రవళికి సంబంధించిన ఆలోచనలే. తను నా సునంద కూతురు. సునంద... నా ఆరోప్రాణం. 
ఆమె ఈ లోకంలోంచి నిష్క్రమిస్తూ నాకందించిన అపురూప బంధం రవళి. నా జీవితంలో స్తబ్దతను మటుమాయం చేసి, చైతన్యం నింపిన చిన్నారినేస్తం. 
నేను ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటరవుతున్నాను. అప్పుడే ఫ్లైట్‌ లాండ్‌ అవుతోంది. ఒక్కొక్కరుగా దిగివస్తున్న ప్రయాణికులను చూస్తూ, రవళి కోసం ఆతృతగా చూడసాగాను. 
వందమందిలో ఉన్నా తక్షణం గుర్తుపట్టగల ప్రత్యేకమైన అందం రవళిది. 
అచ్చం సునంద పోలికే. నా నిరీక్షణను భగ్నం చేస్తూ ఆఖరున కనిపించింది రవళి. 
అసలే పచ్చటి మనిషి... మరికాస్త రంగుతేలి నిండుగా కనిపిస్తోంది. 
‘‘హాయ్‌ సూరీ, ఏంటలా చిక్కిపోయావు. నామీద బెంగతో అన్నం సరిగ్గా తినడంలేదా?’’ పరిశీలనగా చూస్తూ నన్ను అల్లుకుపోయింది. 
‘‘నాకేం... బాగానే ఉన్నాగా, ఆంధ్రావనికి స్వాగతం’’ అంటూ నా చేతిలోని ఫ్లవర్‌ బొకే ఆమెకు అందించాను. 
‘‘థాంక్యూ సూరీ’’ నా బుగ్గమీద సున్నితంగా ముద్దుపెట్టింది రవళి. 
‘‘చదువు పూర్తయ్యిందిగా రవళీ... వాట్‌ నెక్ట్స్‌’’ కారు డ్రైవ్‌ చేస్తూనే అడిగాను. 
విశ్రాంతిగా వెనక్కి వాలుతూ ‘‘ఇంకా ఏం డిసైడ్‌ చేసుకోలేదు సూరీ’’ చెప్పింది రవళి అలసటగా కళ్ళు మూసుకుంటూ. 
రవళి ఇండియాలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి పైచదువులకి అమెరికా వెళ్ళింది. ఆప్తాల్మాలజీలో స్పెషలైజేషన్‌ చేసి తిరిగివచ్చింది. 
తప్పుకుంటే తనచేత ‘ఐ హాస్పిటల్‌’ పెట్టించి, బీదాబిక్కికి సేవచేయాలన్న తలంపుతో ఉన్నాను నేను. ఏమో, తన యాంబిషన్‌ ఏమిటో! అసలు రవళిని అమెరికా పంపడమే నాకిష్టంలేదు. కానీ పిల్లల అభివృద్ధికి పెద్దలు ఆటంకంగా మారకూడదని ఒప్పుకున్నాను. రెండేళ్ళు... తనని వదిలి ఎలా ఉన్నానో నాకే తెలియదు. 
ఆలోచనలమధ్యనే ఇల్లు చేరాము. 
‘‘నాన్నమ్మా, తాతయ్యా’’ అంటూ కారు దిగుతూనే అమ్మానాన్నలను చుట్టుకుపోయింది రవళి. 
జడివానలా ఆమె కురిపిస్తున్న ముద్దుల ధాటికి సతమతమయ్యారు వాళ్ళు. 
‘‘ఏమే భడవా, ఈ తాతయ్య అప్పుడే మూడుకాళ్ళ ముసలాడైపోయాడనుకున్నావా’’ రవళి తెచ్చిన చేతికర్ర వైపు గుర్రుగా చూస్తూ అడిగారు నాన్న. 
నిత్యం వ్యాయామం చేసే ఉక్కు శరీరం ఆయనది. ఎవరైనా తనకు వయసు మళ్ళిందని గుర్తుచేస్తే అస్సలు సహించలేరు. 
‘‘నీ మోకాళ్ళ ప్పులు ఎలా ఉన్నాయి నాన్నమ్మా’’ అమ్మని ప్రశ్నించింది రవళి. 
‘‘ఆ మాట ఎందుకడుగుతావులే తల్లీ... వచ్చే వయసా పోయే వయసా... అయినా మీ నాన్నకి తోడు నువ్వొక డాక్టర్‌వి వచ్చి చేరావు కదా! ఇక నాకేం భయం’’ మూలుగుతూనే, మురిపెంగా అంది అమ్మ. 
ఆమె అభీష్టం మేరకే రవళిని డాక్టర్‌ని చేశాను. నా సునంద మనోవాంఛననుసరించి నేను డాక్టర్నయ్యాను. 
‘‘పోనీ తల్లీ, మీ నాన్నమ్మ ముసలిదైపోతోంది... నీకింకో నాన్నమ్మని తెమ్మంటావేంటి?’’ హాస్యాలాడారు నాన్న. 
‘‘అయ్యో సంబడం. ముదిమికి ముచ్చట్లని అదొక్కటే తక్కువ... అక్కడికి మీరేదో బాలాకుమారుడైనట్లూ...’’ అమ్మ వెటకారంగా చేతులూపింది. 
వాళ్ళిద్దరి గిల్లికజ్జాలకి గలగల నవ్వుతూన్న రవళి స్వేచ్ఛగా ఉరికే జలతరంగిణిలా అనిపించింది. 
అదే నవ్వు... సునంద నవ్వు. ఎంత బాధలో ఉన్నా సేదతీర్చే నవ్వు. 
అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. 
‘‘ఏయ్‌ సూరీ, అమ్మ గుర్తొచ్చిందా’’ అడిగింది రవళి ఆప్యాయంగా. 
అవునన్నట్లుగా తలూపాను. నా వీపు నిమిరింది రవళి లాలనగా. 
‘‘రావే తల్లీ... స్నానంచేసి నాలుగు ముద్దలు తిందువుగాని. మీ నాన్న దగ్గరుండి మరీ నీకిష్టమైనవన్నీ చేయించాడు. ఇన్నాళ్ళూ దేశంకాని దేశంలో అడ్డమైన గడ్డీ తిని నాలుకమీద చెట్లు మొలిచుంటాయి’’ రవళిని లోపలికి తీసుకెళ్ళింది అమ్మ. 


*  *    *


రవళి వచ్చి నెలరోజులైంది. ఈ నెల్లాళ్ళలోనూ ఇంటి స్వరూపమే మారిపోయింది. ఆమెలేని ఇన్ని రోజులూ మూగవోయిన లోగిలి... నేడు కిలకిల నవ్వులతో, కేరింతలతో మారుమోగిపోతోంది. అమ్మానాన్నల ఆనందానికి అంతేలేదు. 
చైతన్యస్రవంతి లాంటి రవళి సాన్నిహిత్యాన్ని ఎంతో ఇష్టంగా అనుభవిస్తున్నారు వాళ్ళు. 
‘అమ్మ పేరుమీద హాస్పిటల్‌ పెట్టి, పేదవారికి సహాయపడాలనుంది సూరీ’ రవళి తన మనసులోమాట చెప్పినప్పుడు, నా ఆశయం, తన ఆంతర్యం ఒకటేనని మురిసిపోయాను. 
ఆమె కోరికమేరకు తగిన స్థలం కొని హాస్పిటల్‌ నిర్మాణం ప్రారంభించాను. 
రవళి పొంగిపోయింది. ‘‘మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలి సూరీ’’ అంది నన్ను పట్టుకు ఏడ్చేస్తూ. 
రవళివన్నీ సునంద భావాలే. ఆమె రక్తాన్ని పంచుకుపుట్టడం వలన జీన్స్‌ ద్వారా సంక్రమించిన సుగుణాలు కొన్నైతే, నా పెంపకంలో రంగరించి పోసిన ఆదర్శాలు మరికొన్ని. 
జాలి, దయ, మానవత ఇత్యాదులన్నీ కలిపి పోతపోసిన సువర్ణప్రతిమ రవళి. 
నేను వెలిగించిన దీపం మరికొందరికి వెలుగు పంచుతుందంటే అంతకన్నా ఆనందమేముంటుంది! 

*  *    *
 


‘‘రవళి ఈమధ్య అదోలా ఉంటోంది... గమనించావా?’’ ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చి అంది అమ్మ. 
‘‘ఏమోనమ్మా, నేను సరిగ్గా చూడలేదు’’ అన్నాను ఆశ్చర్యంగా. 
ఆసుపత్రి నిర్మాణంలో తలమునకలుగా ఉన్న నేను రవళిని నిర్లక్ష్యం చేస్తున్నానా..? 
ఈ భావన రాగానే వణికిపోయాను. 
నా బంగారుతల్లిని నిర్లక్ష్యం చేస్తానా! నెవర్‌. వెంటనే లేచి రవళి గదిలోకి వెశ్ళాను. 
తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిన నన్ను చూసి ‘‘సూరీ, ఇంకా పడుకోలేదా?’’ అడిగింది రవళి. 
అమ్మ చెప్పింది నిజమే. రవళిలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జ్యోతుల్లా కళకళలాడుతూ వెలిగే ఆ నయనాలు నిద్రలేమి వలన నిస్తేజంగా మారాయి. చెక్కిళ్ళు పీక్కుపోయి, ముఖం వాడిపోయింది. 


‘‘ఏంటి రవళీ, ఇలా అయిపోయావు? సారీరా కన్నా... పని ఒత్తిడిలోపడి నీ గురించి పట్టించుకోవడంలేదు’’ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాను. 
‘‘నో... నో... అదేంలేదు సూరీ... నేను బాగానే ఉన్నానే’’ నవ్వడానికి ప్రయత్నించింది రవళి. 
ఆమె నానుండి ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. 
‘‘రవళీ, నేను కేవలం మీ డాడీనే కాను... నీ బెస్ట్‌ఫ్రెండ్‌ని కూడా. నా దగ్గర రహస్యాలా’’ సూటిగా అడిగాను. 
అంతే, ‘సూరీ...’ అంటూ నా గుండెల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది రవళి. 
తల్లడిల్లిపోయింది నా హృదయం. 
అనునయంగా ఆమె వెన్ను రాస్తూ ‘‘ఏం నాన్నా, దేనికేడుస్తున్నావు?’’ అడిగాను బుజ్జగిస్తున్నట్లుగా. 
సమాధానంగా నా చేతిలో ఓ కవర్‌ పెట్టింది రవళి. విప్పి చదివిన నేను ఆశ్చర్యపోయాను. అందులోని సమాచారం చదివాక మతిపోయినట్లనిపించింది. కాసేపు మౌనం. 
‘‘ఏం చేయాలనుకుంటున్నావు?’’ నా గొంతు ఏదో అగాథాల్లోంచి వస్తున్నంత పీలగా వినిపించింది నాకే. 
‘‘తోచడంలేదు’’ ముక్తసరిగా అంది రవళి. 
‘‘నీ మంచిచెడ్డలు ఆలోచించుకునే వయసు నీకొచ్చింది. అందునా నువ్వొక డాక్టర్‌వి. ఏది మంచిదనిపిస్తే అది చేయి’’ క్లుప్తంగా చెప్పి గదిలోంచి బయటకు నడిచాను. 
ఆ విషయంలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనంటే ఆమెకిచ్చానుగానీ మనసు మాత్రం రగులుతున్న నిప్పులకొలిమిలా ఉంది. 
ఆ మనిషి... సునందకి అన్యాయం చేసి, కనీస మానవత్వం చూపని ఆ కరకుమనిషికి... రవళిని దిక్కులేనిదానిలా నడిరోడ్డు మీద వదిలేసిన ఆ పాపాత్ముడికి సహాయపడాలా! తలచుకుంటేనే రక్తం మరిగిపోతోంది. 
ఆ ఉత్తరం... రవళి బాబాయి రాశాడు. తన అన్నగారూ, రవళికి తండ్రీ అయిన మహానుభావుడికి రెండు కిడ్నీలూ చెడిపోయాయనీ అర్జంటుగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరగాల్సి ఉందనీ ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడకుండా ప్రయత్నించినా సరే, సరైన డోనర్‌ దొరకలేదనీ రవళి అతడి రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కాబట్టి ఆమె కిడ్నీ సూటవవచ్చునని డాక్టర్స్‌ చెప్పారనీ రవళి పెద్దమనసు చేసుకొని ఓసారి వచ్చి కన్నతండ్రిని చూసి, మ్యాచ్‌ అయితే కిడ్నీని డొనేట్‌ చేయాలనీ అభ్యర్థిస్తూ రాశాడు. 
అవును... రవళి నా కన్నకూతురు కాదు. నేను ప్రాణాధికంగా ఆరాధించిన సునంద కూతురు. 
మా ఊరి మునసబుగారి ముద్దుల కూతురు సునంద. మా ఇంటికి నాలుగిళ్ళ దూరంలోనే ఉండేది వాళ్ళిల్లు. చిన్నప్పటినుండి నేనూ సునందా జంటకవుల్లా కలిసే ఉండేవాళ్ళం. కలిసే బడికి వెళ్ళేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. 
తెల్లగా బూరెబుగ్గలు, చక్రాల్లాంటి కళ్ళు, చలాకీతనంతో సూదంటురాయిలా ఆకట్టుకునేది సునందరూపం. అనుక్షణం ఆమె వెంటే తోకలా తిరిగేవాడిని నేను. ఆమె మెప్పుకోసం తోటలంటా దొడ్లంటా తిరిగి చింతకాయలు, మామిడిపిందెలు తెంపుకొచ్చేవాడిని. 
చెట్టుమీద నుండి కిందపడి మోచేతులు, కాళ్ళు గీరుకుపోయినా వాటిని అందుకొనేటప్పుడు సునంద కళ్ళల్లో కనిపించే వింత మెరుపు చూడ్డంకోసం నా ప్రాణాలకైనా తెగించాలనిపించేది. 
ఆ తరవాత ఆయా తోటల సొంతదారులు నాన్నగారికి ఫిర్యాదు చేయడం, ఆయన నా వీపు విమానంమోత మోగించడం షరా మామూలే. 
ఎప్పుడైనా ఇంట్లో నా అల్లరి మితిమీరి, చెప్పినమాట వినకపోతే అమ్మ బెదిరించేది ‘ఇలా అయితే సునందని నీ ముఖం చూడొద్దని చెప్పేస్తాను’ అని. 
అంతే, అంత అల్లరీ అటకెక్కేది. 
మా ఇద్దరిమధ్యనా ఉండేది స్నేహమా... మరేదన్నానా..? తెలుసుకునే వయసు ఇంకా రాలేదుగానీ యవ్వనంలో సహజంగా తలెత్తే చిలిపి ఊహలేవో చుట్టుముట్టి, మనసులో మధురభావాలు అస్పష్టంగా కదలాడేవి. 
నన్ను డాక్టర్‌గా చూడాలనుందని సునంద అన్నదని, ఎంబీబిఎస్‌ చదవడానికి ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో చేరాను నేను. 
నేను రెండో ఏడాదిలో ఉండగా అనుకుంటాను... సునందకి పెళ్ళి జరిగిపోయింది హఠాత్తుగా. తేరుకోలేనంత దిగ్భ్రాంతికి గురయ్యాను నేను. 
అప్పుడప్పుడే నేను తెలుసుకుంటున్నాను... ఆమె మీద నాకున్నది ప్రేమభావమేనని. ఆ తియ్యని కబురు ఆమెతో చెప్పి, ఆమె ఆమోదం పొందాలని ఆశగా అనుకుంటున్న తరుణంలో ఇలా జరిగిందేమిటి? 
అయితే ప్రేమకు పరాకాష్ట త్యాగమేనని తలచి, ఎక్కడున్నా ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షించాను. 
నా గుండెకయిన గాయం తాలూకు ప్రభావం నా చదువుమీద పడకుండా జాగ్రత్తపడ్డాను. ఎందుకంటే, నన్ను డాక్టర్‌ కమ్మని ప్రోత్సహించింది సునందే కద! 
నేను హౌస్‌సర్జన్సీ పూర్తిచేసేసరికి సునంద ఓ బిడ్డకి తల్లైంది. 
ఓసారి ఏవో సెలవులకి మా ఊరు వెళ్ళినప్పుడు అశనిపాతం లాంటి వార్త ఎదురైంది. 
సునందకి ఎయిడ్స్‌... ఆమె శీలం మీద అనుమానంతో భర్త వదిలేశాడు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే... ఆమె కుటుంబసభ్యులు ‘ఎయిడ్స్‌’ అంటురోగమని భయపడి, ఆమెను ఊరికి దూరంగా, ఓ పాడుబడిన కొంపలో ఉంచారు. 
నేను తట్టుకోలేకపోయాను. ఎక్కడున్నాం మనం! ఎయిడ్స్‌ అంటురోగంకాదని ప్రసారసాధనాలూ ప్రభుత్వాలూ కూడా ఘోషిస్తూ ఉంటే, ఇంకా ఈ మూఢత్వం ఏమిటి? 
మహారాణిలా జీవితం గడిపిన సునంద పరిస్థితి ఇంత హీనమైపోయిందేమిటి..! వాళ్ళందరినీ ఎడ్యుకేట్‌ చేయడానికి ప్రయత్నించాను. కానీ అది వృథాప్రయాస అని తేలింది. 

‘‘ఎందుకొచ్చావు సూరీ, నా రోగం నీకూ అంటుకుంటుంది. వెంటనే వెళ్ళిపో...’’ అంది సునంద నన్ను చూడగానే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ. 
‘‘నేను డాక్టర్ని. ఇది అంటురోగం కాదు’’ మందలించాను మెత్తగా. 
‘‘నీమీదొట్టు సూరీ... నేను ఏ తప్పూ చేయలేదు’’ మరోసారి భోరుమంది సునంద. 
కూతురు పుట్టినప్పుడు రక్తస్రావం ఎక్కువవడంతో సునందకి ఎవరిదో రక్తం ఎక్కించారట. ఆ అపరిచితవ్యక్తి రక్తంలో ఉన్న హెచ్‌.ఐ.వి. ఆమెకు సంక్రమించింది. 
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండుప్రాణం. 
‘‘నిన్ను నాతో తీసుకెశ్తాను’’ అన్నాను దృఢనిశ్చయంతో. 
‘‘వద్దు సూరీ, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న నన్ను వెంట తీసుకెళ్ళి నువ్వేం సుఖపడతావు’’ అంది సునంద నావైపు జాలిగా చూస్తూ. 
‘‘నువ్వేం మాట్లాడొద్దు. ఒక డాక్టర్‌గా నిన్నీస్థితిలో ఇలా వదిలేయలేను’’ అన్నాను ధైర్యం చెప్పే ప్రయత్నంచేస్తూ. 
నా నిర్ణయం విన్న తరవాత ఇంట్లో పెద్ద తుపాన్‌ చెలరేగింది. అందరూ తలొకరకంగా వ్యాఖ్యానించారు. నా భవిష్యత్తు నాశనమైపోతుందని భయపెట్టారు. నేను దేనికీ వెరవలేదు. 
సునందనీ ఆమె కూతుర్నీ నాతో తీసుకెశ్ళాను. 
ఎన్ని మందులిచ్చినా ఎంతగా ధైర్యం నూరిపోసినా... సునందలోని మనోవ్యాధిని మాత్రం పోగొట్టలేకపోయాను. 
మరో ఏడాది తరవాత సునంద చనిపోయింది. 
‘‘పోతున్నాను సూరీ... నా కూతురికి నువ్వున్నావన్న తృప్తితో వెళ్ళిపోతున్నాను’’ పోయేముందు అంది సునంద, నాకు అప్పగింతలు పెడుతూ. 
గాజుగోళీల్లాంటి ఆమె కళ్ళల్లో నాపట్ల ప్రతిబింబిస్తున్న నమ్మకం చూసి చలించిపోయాను. 
అలా... చిన్నారి రవళి... నా జీవితానికి ఆశాదీపం అయ్యింది. పెళ్ళి చేసుకుంటే వచ్చినామె తనని నిర్లక్ష్యం చేస్తుందేమోనన్న భయంతో ఆమాటే తలపెట్టలేదు నేను. 
నామీద మమకారం చంపుకోలేక అమ్మానాన్నలిద్దరూ నా దగ్గరకే వచ్చేశారు. అమ్మేమో రవళికి తల్లిలేని లోటు తెలియకుండా అపురూపంగా పెంచితే, నాన్న ఆమెకు ఆలంబనై నిలిచారు. 
కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు సునంద మొగుడు. 
అలాంటివాడు... ఏ ముఖం పెట్టుకుని కిడ్నీ దానమివ్వమని అడుగుతున్నాడు! 
దీనికి రవళి ఎలా ప్రతిస్పందిస్తుంది!? 
పదేపదే నన్ను వేధిస్తున్నదీ ప్రశ్న. 

*   *     *


‘‘నిన్ను అనాథగా వదిలేసిన ఆ మనిషికోసం నీ కిడ్నీని దానం చేస్తావా?’’ రవళి నిర్ణయం విన్న నాకు మతిపోయింది. 
‘‘నువ్వే చెప్పావు కదా సూరీ... మమతానుబంధంకంటే మానవతాబంధం మిన్న అని. సాటిమనిషికి సాయపడటం తప్పెలా అవుతుంది’’ ఎదురు ప్రశ్నించింది రవళి. 
‘‘కానీ... భవిష్యత్తులో నీకేదైనా ప్రాబ్లం వస్తే... ఇంకా చిన్నపిల్లవి’’ రవళి దృష్టి మళ్ళించాలన్న వ్యర్థప్రయత్నం నాది. 
అపాత్రదానం చేయడం కూడా పెద్ద నేరమని నా భావన. 

‘‘ఒక్క కిడ్నీతో కూడా హాయిగా జీవించవచ్చు సూరీ... నువ్వన్నట్లుగా ఒకవేళ ప్రాబ్లమే వస్తే నాలాంటి దాత మరొకడు దొరక్కపోడు’’ నవ్వింది రవళి మెత్తగా. 
ఆమె ఆత్మవిశ్వాసానికి నివ్వెరపోయాను. రవళి వాదన నా నోటిని కట్టిపడేసింది. అమ్మా నాన్నలు కూడా నేను వాదించడం మూలాన జోక్యం చేసుకోలేదు. 
రెండురోజుల తరవాత రవళి, నేను ముంబై బయలుదేరి వెశ్ళాం. అక్కడి డాక్టర్స్‌ అన్ని పరీక్షలూ జరిపిన తరవాత, రవళి కిడ్నీ ఆమె తండ్రికి మ్యాచ్‌ అయ్యిందని తేలింది. 
అతగాడి ముఖం వెలిగిపోయింది. రవళికి పదేపదే కృతజ్ఞతలు చెప్పాడు. తనని నిర్లక్ష్యం చేసినా, అదేమీ మనసులో పెట్టుకోక తనకి జీవనదానం చేస్తున్నందుకు ఆమెని వేనోళ్ళ కొనియాడాడు. అన్నింటికీ ఆమె చిరునవ్వే సమాధానమైంది. 
ఆపరేషన్‌కి డేట్‌ ఫిక్స్‌ చేశారు. నాకెందుకో లోలోపల భయంగా ఉంది. ఎంత డాక్టర్నయినా రవళి విషయంలో మామూలు మనిషిగా మారిపోతాను. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటే ఎంత రిస్క్‌తో కూడినదో నాకు తెలుసు. 
ఆపరేషన్‌ మరునాడనగా, ముందురోజు సాయంత్రం రవళి తండ్రి హరిప్రసాద్‌ని కలవడానికి ఆయన రూమ్‌కి వెశ్ళాను. 
‘‘మొత్తానికి నీ కూతురు భలే మనిషిరా అన్నయ్యా! కిడ్నీ డొనేట్‌ చేసినట్లే చేసి పదిలక్షలకెసరు పెట్టింది’’ అంటున్నాడు రవళి బాబాయి. 
‘‘పోనీలేరా, నా కూతురికేగా ఇచ్చింది’’ ప్రాణభయం వలన ఏ మూలో దాగున్న పితృప్రేమ పెల్లుబికింది రవళి తండ్రిలో. 
విన్న నేను షాక్‌ అయ్యాను. కన్నతండ్రికి కిడ్నీ దానమిచ్చి డబ్బు తీసుకుందా రవళి! అంటే... ఆమె తన కిడ్నీని అమ్ముకుందన్నమాట. నా పెంపకంలో ఎంతో విలక్షణంగా వికసించిందనుకున్న ఆమె వ్యక్తిత్వంలో ఈ మచ్చేంటి? డబ్బుపై ఈ వ్యామోహమేమిటి? అసలు ఆమెకిప్పుడు లోటేం వచ్చింది! 
ఆపరేషన్‌కి రెండుగంటల ముందు ఆమె బాబాయి నాకందించిన చెక్‌ తీసుకుని ఆమె దగ్గరకు వెశ్ళాను. 
ముభావంగా దాన్ని ఆమెకందించాను. దాన్ని చూసి నవ్వింది రవళి. 
‘‘మానవతాబంధం అంటూ పెద్ద కబుర్లు దంచిన రవళి, ఇలా కిడ్నీని బేరం పెట్టిందేమిటా అని ఆశ్చర్యపోతున్నావా సూరీ’’ నా మనసు చదివినట్లుగా అడిగింది రవళి. 
ఉలిక్కిపడి ఆమెవైపు సందేహంగా చూశాను. 
‘‘బయటవాళ్ళకైనా ఆయన డబ్బివ్వడానికి రెడీ అయ్యాడు కదా’’ అంది నవ్వుతూ. 
‘‘అది వేరు. ఎంత కాదనుకున్నా ఆయన నీ తండ్రి’’ కాస్త కరుగ్గా అన్నాను. 
ఎందుకో రవళి అలా మాట్లాడ్డం నచ్చలేదు. 
‘‘కావచ్చు. కానీ... నాకూ ఆయనకీ నడుమ ఆ అనుబంధం లేదు’’ అంటూ ఆ చెక్‌ తిరిగి నా చేతుల్లో ఉంచుతూ ‘‘ఈ డబ్బు ఎయిడ్స్‌ పేషెంట్స్‌ సంక్షేమం కోసం వినియోగించు సూరీ... అమ్మకి సూరి దొరికినట్లు అందరికీ దొరకరు’’ రవళి కళ్ళల్లో అశ్రుబిందువులు నిండాయి. 
‘‘రవళీ...’’ ఆమెను తప్పుగా అర్థంచేసుకున్నందుకు సిగ్గిల్లాను. 
ఆమెను నేను పెంచిన విధానంలో ఎటువంటి లోపమూ లేదన్న గర్వం అంబరాన్ని అంటింది. 
ఇంతలో హరిప్రసాద్‌ని అక్కడికి తీసుకొచ్చాడు రవళి బాబాయి. 
కూతురి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ‘‘నిన్ను కాదనుకున్నా, నన్ను ఆదుకున్నావు. నీ నోటంట ‘నాన్నా’ అన్న పిలుపు వినాలని ఆశగా ఉందమ్మా’’ అన్నాడు గద్గదస్వరంతో. 
రవళి ఆయనకేసి సూటిగా చూస్తూ ‘‘అయాం సారీ మిస్టర్‌ హరిప్రసాద్‌, మా డాడీ పేరు సూరి... డాక్టర్‌ సురేంద్ర’’ అంది నిబ్బరంగా. 
హరిప్రసాద్‌ వదనం బాధతో నల్లబడగా, నా ముఖంలో వెన్నెల వెలుగునిండిన భావన కలిగిందా క్షణం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని