పొదరిల్లు

నేను సినిమా చూసి చాలా సంవత్సరాలయింది. కానీ ఈమధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం. ఆ సినిమా పేరు ‘పొదరిల్లు’. సినిమా చూడటానికి బాగానే...

Published : 08 Apr 2020 22:49 IST

-గుడిపాటి కనకదుర్గ

నేను సినిమా చూసి చాలా సంవత్సరాలయింది. కానీ ఈమధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం. ఆ సినిమా పేరు ‘పొదరిల్లు’. సినిమా చూడటానికి బాగానే ఉంది. కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది. అమ్మాయి అరుణ కూడా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి చేసిందెందుకో అర్థమైంది. అసలే సమస్య ఎలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి. ‘పొదరిల్లు’ సినిమా కథ టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే కథే. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళకేం కావాలో తనే నిర్ణయించి వాళ్ళచేతే ‘బావుంది’ అని అనిపించే తండ్రి కథ.

కొడుకు చొక్కాల రంగుల సెలక్షన్‌ దగ్గర్నించీ తండ్రిదే నిర్ణయం. ఆ తండ్రికి ఎదురుచెప్పలేని కొడుకు. చిన్నప్పటినుంచీ తండ్రిమాట వింటూ ప్రతిదానికీ అవునని తలాడిస్తూ ఇరవైనాలుగేళ్ళు గడిపేస్తాడు. తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది. పెళ్ళి జరిగేలోపు అనుకోకుండా ఒకమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి స్వేచ్ఛగా మాట్లాడే తీరూ కట్టడిలేని ప్రవర్తనా ఇతన్ని బాగా ఆకర్షిస్తుంది. కానీ తండ్రినెలా ఒప్పించాలి? ఇష్టంలేని పెళ్ళి ఎలా తప్పించుకోవాలి? అదో గడ్డు సమస్య. ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని ఒక వారంరోజులు ఇంటికి తీసుకువస్తాడు. అందరినీ పరిచయం చేస్తాడు. ఆ ఇంట్లో తండ్రి మాటకి ఎదురులేదు అని గ్రహిస్తుందామ్మాయి. ఏం మాట్లాడితే ఏం తప్పో అని భయపడిపోతుంది. స్వేచ్ఛలేనిచోట ఉండలేక రెండుమూడు రోజుల్లోనే వెళ్ళిపోతుంది. ఆ పిల్ల వెళ్ళిపోయాక ఆ లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్ళికూతురు వద్దని ధైర్యంగా చెబుతాడు. తండ్రి అంతా విని కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. స్థూలంగా ఇదీ కథ.

నిజానికి తండ్రివైపు ఆలోచిస్తే అటు కూడా ఏ తప్పూలేదు. పిల్లలకి ఏమీ తెలీదనీ అమాయకులనీ అనుకుంటాడు. మంచీ చెడూ చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ప్రతి కుటుంబంలో సహజం. కానీ ఈ సినిమా చూసి ఇంటికొచ్చాక ప్రతి తండ్రీ ‘నేనెలా ప్రవర్తించాను?’ అని ప్రశ్న వేసుకోవటం కూడా సహజమే.

* * *

నా కూతురి పేరు అరుణ. అరుణ పసివయసులోనే నా భార్య చనిపోయింది. అప్పటినుంచీ అరుణకి తల్లినీ తండ్రినీ నేనే. చిన్నప్పటినుంచీ ముద్దుగా పెంచుకుని కొంచెం గారాబం చేశానేమోనని నా అనుమానం. కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు. నేను ఏది చెప్పినా కాదనేది కాదు. కాదన్నా నేను మంచిచెడ్డలు చెప్పి, నా ఇష్టప్రకారమే అరుణని పెంచానేమో అనిపిస్తోంది. డాక్టర్‌ కావాలంటూ కోచింగ్‌ తీసుకుని ఎంసెట్‌ రాసింది. తీరా మంచి ర్యాంకు రాలేదు. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని రాస్తానని పట్టుబట్టింది. నేను వద్దంటే వద్దన్నాను. సంవత్సరం వృథా అవటం మంచిదికాదని నచ్చచెప్పి బియస్సీలో చేర్పించి, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కూడా చేయించాను. కెమిస్ట్రీ లెక్చరర్‌గా చేస్తోంది. రెండోసారి ఎంట్రన్స్‌ రాస్తే డాక్టర్‌ని అయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది. నేను మళ్ళీ కాసేపు ఏదో చెబుతూ ఉంటాను. కానీ ఈ సినిమా చూసి వచ్చాక అరుణ విషయంలో ఏమైనా పొరపాటు చేశానా, నా ఇష్టాలని తనమీద రుద్దానా అన్న మథన ప్రారంభమైంది. అమ్మాయిలో ఏదో మార్పొచ్చిందనిపించినా ‘ఏం లేదులే’ అని సమాధానపరుచుకున్నాను.

అంతా బాగానే ఉందనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది. నేను అరుణకి పెళ్ళిసంబంధాలు చూడటం మొదలుపెట్టాను. తను పెద్దగా ఉత్సాహం చూపించలేదు సరికదా, నాలుగురోజుల తర్వాత ఓ బాంబులాంటి వార్త పేల్చింది. తన కొలీగ్‌ రావుని ప్రేమించానంది. వినగానే నాకు చాలా కోపమొచ్చింది. నా కళ్ళకి అరుణ ఎప్పుడూ పసిపిల్లలా కనపడుతుంది. ప్రేమించానని చెబుతుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ రావు వివరాలేమిటో అడిగాను. అతను మేథ్స్‌ లెక్చరర్‌. తండ్రి లేడు. నలుగురు చెల్లెళ్ళు. తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఇక్కడే ఉంటున్న అక్కగారు. వీళ్ళంతా కలిసే ఉంటారు. ఈ వివరాలు వింటుంటే నాకు మతిపోయినట్లయింది. ‘అంతమందితో ఎలా ఉంటావమ్మా, నీకు మంచి సంబంధం చేస్తాను’ అంటూ నచ్చజెప్పబోతే, అరుణ దానికి మరో భాష్యం చెప్పింది. ‘నాన్నా, చిన్నప్పటినుంచీ ఒంటరిగా పెరిగాను. అమ్మ, అక్క, చెల్లెళ్ళు, అన్న... ఈ ప్రేమలు తెలీవు. నువ్వుతప్పితే నాకు ఎవరూ తెలీదు. చుట్టాలు కూడా పెద్దగా లేరు. నాకు నలుగురు ఉన్న ఇంట్లోకి వెళ్ళాలని ఉంది’ అంటూ ధైర్యంగా చెబుతుంటే, నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు. ఇవాళే అనుకోకుండా ‘పొదరిల్లు’ సినిమా చూసొచ్చానేమో, ఎంత తండ్రి హోదాలో ఉన్నా నా కూతుర్ని శాసించలేకపోయాను. ఇష్టంలేని పెళ్ళిచేస్తే ఏ ఆత్మహత్యా ప్రయత్నమో చేస్తే అని ఓ క్షణం భయం కలిగింది. అలా అని గభాలున అరుణ ఇష్టప్రకారం చెయ్యటానికి కూడా మనస్కరించలేదు.

ఎటూ తేలని ఆలోచనలతో నేనిలా సతమతమవుతుంటే... ఓరోజు సాయంత్రం అరుణ సడెన్‌గా రావుని ఇంటికి తీసుకొచ్చింది. రావు చూడటానికి బావున్నాడు. తెల్లగా పొడుగ్గా ఫుల్‌హేండ్స్‌ షర్టుతో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు. ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు. అతను ఉన్నంతసేపూ అరుణ కళ్ళల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాను. ప్రతిదానికీ అతన్ని సపోర్టు చేస్తూ మాట్లాడటం, పరుగున వెళ్ళి కాఫీ పట్టుకురావటం, వూరికూరికే సిగ్గుపడటం... నా దృష్టి దాటిపోలేదు. రావు వెళ్ళిపోయాక మా అమ్మాయి నా అభిప్రాయంకోసం ఎదురుచూస్తూ కుర్చీలో కూర్చుంది. పేరుకి టీవీ చూస్తోందికానీ మనసు దానిమీద లేదు. ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తోంది.

‘‘అబ్బాయి చాలా బాగున్నాడమ్మా’’ అన్నాను ఉపోద్ఘాతంగా.

‘‘చాలా మంచివాడు కూడా’’ అంది వెంటనే.

నేను నవ్వాను. ‘‘నిజమే తల్లీ, కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా’’.

‘‘నాకు అతనే ముఖ్యం నాన్నా. నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోను’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది.

రెండురోజులు ఆలోచించి రావు ఇంటికివెళ్ళి ఇల్లు చూసి ఇంట్లోవాళ్ళతో మాట్లాడివచ్చాను. అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు. ఎలాంటి ఆడంబరాలూ లేవు. ఇల్లు మధ్యతరగతి సంసారులుండే పాత డాబా ఇల్లు. నా కూతురు చిన్నప్పటినుంచీ ఏదీ అడగలేదు. కోరినట్లు చేస్తే?? ఏమో ఇంతమందిలో ఏం సుఖపడుతుంది? ‘ఎందుకు చేసుకున్నానా’ అని బాధపడితే?? కానీ ఇష్టంలేని పెళ్ళి చేయడమూ సరికాదు. ప్రేమ విఫలమైందని జీవితమంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవటం కూడా కష్టమే కదా. అనేకరకాలుగా ఆలోచించాను వారంరోజులపాటు. నాకు అగ్నిపరీక్ష ఎదురైనట్లే అనిపించింది. సినిమా ప్రభావం కూడా పనిచేస్తోందేమో తెలీదు.

ఆఖరికి మనసు గట్టిచేసుకుని అరుణ పెళ్ళి రావుతో జరిపించేశాను. మంచో చెడో తన కోరిక తీర్చాను. జీవితంలో జీవితభాగస్వామిని ఎన్నుకోవటమే పెద్ద మలుపు. అది నా కూతురు మనసుకి నచ్చినట్లే చేశాను.

అరుణ పెళ్ళి చేశాక నేను నిశ్చింతగా తీర్థయాత్రకి ప్రయాణం కట్టాను. నా భార్య పోయాక, నేను ఏ తీర్థయాత్రా చేయలేదు, ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు. అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్దచెయ్యటమే ఓ తపస్సులా చేశాను. ఇప్పుడు అరుణ లేని ఇల్లు బావురుమంటోంది. ఒక్కడినే ఉండటం కష్టమనిపించి తీరిగ్గా కొన్ని నెలలపాటు తిరిగి ఉత్తరదేశయాత్రా దక్షిణదేశయాత్రా పూర్తిచేసుకుని ఇల్లు చేరాను. అప్పుడప్పుడూ అరుణతో మాట్లాడేవాణ్ణి- ఫోనులో. కానీ పెళ్లైన కొత్తజంట కదా అని నేనెక్కువ డిస్టర్బ్‌ చేయలేదు. మెల్లిగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్ళతో కాలక్షేపం చేయవచ్చు, వాళ్ళ ఆటపాటలలో మునిగితేలవచ్చని నా ఆలోచన.

* * *

నేను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది. అదీకాక నేనొచ్చేసరికి అరుణ వూళ్ళొలేదు. భార్యాభర్తలు మద్రాసు వెళ్ళారు. రావు తల్లికి ఒంట్లో బాగాలేదట. నేను వచ్చిన వారానికి వచ్చింది అరుణ. రావు కుశలప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ అంతే. అవసరమైనంతే మాట్లాడతాడు.

అరుణను దగ్గరికి తీసుకుని తల నిమిరాను. దుఃఖం ఆగలేదు. నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకనుభవపూర్వకంగా అర్థమైంది. అరుణ కూడా ఉన్నట్లుండి ఏడవటం మొదలుపెట్టింది. పాపం చిన్నపిల్ల...నన్నెప్పుడూ వదిలిపెట్టిలేదు... బెంగపడినట్లుంది.

‘‘ఏమ్మా ఎలా ఉన్నావు? అత్తారిల్లు ఎలా ఉంది? హనీమూన్‌కు ఎక్కడికెళ్ళారు?’’

ఎటో చూపులు తిప్పుకుంది అరుణ. ‘‘బానే ఉంది నాన్నా, ఎక్కడికీ వెళ్ళలేదు’’.

‘‘హనీమూన్‌కు వెళ్ళలేదా? నువ్వు చాలా సరదాపడ్డావు కదా!’’ ఆశ్చర్యంగా అడిగాను.

అరుణ విసుగ్గా చూసింది. ‘‘అసలు ఎక్కడికీ వెళ్ళలేం నాన్నా. ఎప్పుడూ ఇంట్లోనే పడిఉండాలి. ‘ఎదిగిన చెల్లెళ్ళముందు మనం హనీమూనంటూ వెడితే ఏం బావుంటుంది. అసలు నా చెల్లెళ్ళ పెళ్ళి చేసిన తరవాత నేను చేసుకుందామనుకున్నాను. వాళ్ళముందు షికార్లు కొడితే బావుండదు’ అంటారు. వాళ్ళందరి ముందూ నామీద ప్రేమ చూపించటం ఇష్టం ఉండదు. నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏదో రెండు ప్రేమ కబుర్లు చెబుతారు అంతే’’.

అరుణ మాటల్లో చాలా కోపం కనపడింది నాకు.

‘‘అంతేకాదు, టిక్కెట్లకి నువ్వే డబ్బిచ్చినా, పైఖర్చులు అంతకి రెట్టింపవుతాయని నాకు క్లాసు తీసుకున్నారు. లేచింది మొదలూ పొదుపే. ఇల్లెలా ఉంటుందో తెలుసా నాన్నా... కూరగాయల సంత కూడా అంతకన్నా బావుంటుందేమో. ఆ అయిదుగురు చెల్లెళ్ళూ గోలగోలగా టీవీ చూస్తుంటారు. పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళెవరూ తల్లికి వంటలో సహాయం చెయ్యరు. పైగా ఆవిడ పిలిస్తే ‘ఒదినా అమ్మ పిలుస్తోంది వెళ్ళు’ అని నన్ను పురమాయిస్తారు. ఆ ఇంట్లో అసలు ప్రైవసీ అనేదేలేదు. గదిలో ఆయనతో మాట్లాడుతుంటే ‘అన్నయ్యా’ అంటూ ఎవరో ఒకరు వస్తారు. మొగుడితో గొడవపడి ఒకావిడ ఇక్కడే ఉంటోందిగా... మేం ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక్కక్షణం కూడా సహించలేదు. జీతం వచ్చిన దగ్గర్నుంచీ కాలేజీ ఫీజులు కట్టటం, చెల్లెళ్ళ పెళ్ళికి నిలవచెయ్యటం ఇదే నా భర్తకి సరిపోతూ ఉంటుంది. అక్కడ బాత్‌రూం నువ్వెప్పుడైనా చూశావా నాన్నా... తలుపుకి గడియ వూడిపోయి గచ్చంతా జారిపోతూ ఎంత డర్టీగా ఉంటుందో. చాకలి ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో. రాకపోతే బట్టలు నేనే ఉతకాలి. నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికారుకో కూడా వెళ్ళలేను. తోకలాగా ఎవరో ఒకరు వస్తారు. ఈయన అతి ప్రేమగా అందర్నీ కేకేస్తాడు. పూలు కొనుక్కోవాలని ఉంటుంది. రోజూ పది మూరలయినా కొనాలి. అంత జనాభాలో బతకటం చాలా కష్టం నాన్నా’’.

నా మనసు చివుక్కుమంది. ఏరికోరి చేసుకుంది మరి. ‘‘వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నట్లు నీకు తెలుసుకదమ్మా, కాస్త రాజీపడాలి’’.

‘‘రాజీపడాలి... ఎంతవరకూ నాన్నా? అక్కడ నాకు గుర్తింపే లేదు. ఎక్కడినుంచో వచ్చిన కొత్త కోడలని అసలే లేదు. నన్నేం సింహాసనం మీద కూర్చోపెట్టక్కర్లేదు. కానీ ‘తిన్నావా, ఉన్నావా’ అని కూడా లేదు. లేచింది మొదలు వంటలు, టిఫిన్లు, బాక్సులు కట్టుకోటాలు ఇవే. ఎప్పుడైనా షికారుకైనా తీసికెళ్ళచ్చు. అది కూడా లేదు. మనిద్దరమే తిరిగితే ఏం బావుంటుంది అంటారు. పెళ్ళి దేనికి ఇక? ఇల్లు చూస్తే కూర్చోటానికీ లేదు, నుంచోటానికీ లేదు. పుస్తకాలూ పేపర్లూ బట్టలూ... కిటికీల నిండా కొబ్బరినూనె మరకలూ... కంపుకొట్టే దుప్పట్లూ... మురికి దువ్వెనలూ... ఛీ! నాకక్కడ ఏం బాగాలేదు నాన్నా’’ అంటూ ఏడవటం మొదలుపెట్టింది.

నాకు పరిస్థితి అర్థమైంది. ఇక్కడ ఒక్కతే పెరిగి అరుణకి చేసేపని లేకుండాపోయింది. అక్కడ నలుగురిలోకీ వెళ్ళాలని తపనపడింది. కానీ, నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజగిజలాడిపోతోంది.

‘‘వూరుకో తల్లీ... చెల్లెళ్ళమీదా తల్లిమీదా ప్రేమ సహజం కదా. అందులో తండ్రి కూడా లేడు మరి...’’

‘‘నేను కూడా మనిషినే కదా నాన్నా. మట్టిముద్దని కాదు కదా. నాకూ కోరికలూ ముచ్చట్లూ ఉంటాయి కదా. వెధవది ఓ సినిమాకి వెళ్ళాలన్నా అందరం బయలుదేరాలి. వాళ్ళు పొరపాటున రానని చెప్పినా ఈయన వూరుకోరు వచ్చేదాకా. ఆ ఇల్లూ ఆ జనాభా చూస్తుంటేనే చిరాకుపుడుతోంది. ఎప్పుడెప్పుడు ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తోంది’’.

‘‘పోన్లేమ్మా... మరో పెద్ద ఇల్లు తీసుకోమందాం. దానికి అద్దె నేను కడతాను. సరేనా?’’ అన్నాను సమాధానపరిచే ధోరణిలో.

‘‘ఉహుఁ... వీలుకాదు నాన్నా. ఆ పాత కొంపే అచ్చొచ్చిందట. తరతరాలుగా ఉంటున్నారట. వాళ్ళ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అక్కడుండగానే జరగాలట. అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాదేట. వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది’’.

‘‘పోనీ అందరూ ఇక్కడికే రావచ్చు. ఈ ఇల్లెంత పెద్దది- నువ్వెళ్ళిపోయాక ఇంత ఇంట్లో నేనొక్కడినే ఉండలేకుండా ఉన్నానమ్మా. నీకు అలవాటైన చోటుకూడా’’.

‘‘అలా కూడా ఆ మహానుభావుడికి ఇష్టంలేదు మరి. ఇక్కడుంటే ‘ఇల్లరికం’ అంటారట. అసలు నామాటే పట్టించుకోరు నాన్నా’’.

* * *

మా అమ్మాయి చెప్పిన కథనుబట్టి అల్లుడు మంచివాడేనని నాకర్థమైంది. కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు. అందుకే అక్కడ ఇమడలేకపోతోంది. ఆరోజు సినిమా చూసొచ్చి, పిల్లల ఇష్టాయిష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది. నేను కూడా అరుణని నా ఇష్టప్రకారమే పెంచి, నా ఇష్టాలే తనమీద రుద్దుతున్నట్లు భయపడ్డాను. పెళ్ళి విషయంలో మరీ భయపడ్డాను- ఆ పొదరిల్లు సినిమాలో మాదిరి.

‘‘నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమేకదమ్మా... నేను కష్టసుఖాలు విడమరిచి చెప్పి వద్దన్నాను కూడా’’.

నా కూతురు నావైపు తీవ్రంగా చూసింది. ‘‘ఇష్టపడ్డాను... ఇష్టపడ్డంత మాత్రాన చేసేస్తావా? మంచిచెడ్డలు తెలుసుకోనక్కర్లేదా? చిన్నప్పటినుంచీ ఎన్నో అడిగాను. ఎక్కడెక్కడికో వెళతానన్నాను. అన్నీ కొన్నావా? అన్నిచోట్లకీ వెళ్ళనిచ్చావా? మంచీ చెడూ చెప్పావు... కష్టాలు తెలియజేశావు. కానీ ‘పెళ్ళి’ అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు. అది నా ఇష్టానికి వదిలేశావు- తండ్రిగా అదేనా నీ బాధ్యత? నాకు ప్రేమంటే తెలీదు. వయసు ప్రభావంవల్ల వచ్చే ఆకర్షణ అని ఎందుకు చెప్పలేదు? ఆనాడే నా రెండు చెంపలూ వాయించి ఉంటే ఇంతదూరం వచ్చేదికాదు కదా. నీకు జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి. నాది చిన్నతనం... ‘మైండ్‌ మెచ్యూరిటీ’ లేదు. మరి నువ్వు... నువ్వూ నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు. పైగా తప్పంతా నాదే అంటున్నావు. పెళ్ళంటే బొమ్మలాట కాదు. కొత్త చీరలు, నగలు కొనుక్కోవటం కాదు- నచ్చకపోతే మార్చుకోవటానికి. జీవితమంతా అనుభవించాలని నీకు తెలీదా? అమ్మే కనుక ఉంటే ఇలా చేసేదా? రెండు తిట్టి నచ్చజెప్పేది. మంచీ చెడూ విడమరచి చెప్పేది. నువ్వు నాకేం చెప్పావు?’’ అరుణ ఏడవటం మొదలుపెట్టింది. వెక్కివెక్కి గుండెల్లో దుఃఖం తీరేటట్లుగా ఏడ్చింది.

అరుణ అలా నిలదీస్తుంటే, పెద్దపెట్టున అరుస్తుంటే తెల్లబోయాను.

తల్లిదండ్రులు ఎలా చేసినా ‘అలా ఎందుకు చేశావు? ఇలా చెయ్యాల్సింది’ అని అడిగే పిల్లల తరం ఇది. వాళ్ళ కత్తికి రెండువైపులా పదునే. తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో అది తప్పే. నా కూతురు కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇవే తరాల అంతరాలు. తప్పదు. అన్నీ భరించాలి. అయితే నాకు ఒక్కటే సంతోషం. అరుణ భర్త దుర్మార్గుడు కాదు. స్వశక్తిమీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆరాటపడే మంచివాడు. అందుకే నాకు కొంచెం నిశ్చింతగా అనిపించింది. అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండటమే మంచిదనుకుని, ఉక్రోషంగా తను అంటున్న మాటలను సాలోచనగా వింటూ కూర్చున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని