తోడు
‘‘రా అన్నయ్యా లోపలికిరా’’ అంటూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది. బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెశ్ళాను....
కోటమర్తి రాధాహిమబిందు
నేను వెళ్ళేసరికి పార్వతి తిరగలిలో బియ్యంపోస్తూ ఏదో కూనిరాగం తీస్తూ విసురుతోంది. కాసేపు అలాగే చూస్తూండిపోయాను.
‘‘పార్వతీ’’
తలెత్తి చూసిన పార్వతి కళ్ళలో సంభ్రమం. ‘‘అన్నయ్యా’’ ఒక్క ఉదుటున లేచి చిన్నపిల్లలా పరిగెత్తుకొచ్చి నన్ను హత్తుకుపోయింది.
‘‘ఎలా ఉన్నావు తల్లీ?’’
‘‘నాకేమైందన్నయ్యా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అది చెప్పు’’.
‘‘ఇదిగో ఇలా...’’
‘‘రా అన్నయ్యా లోపలికిరా’’ అంటూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది. బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెశ్ళాను.
‘‘కూర్చో అన్నయ్యా’’ అంటూ సోఫా చూపించి ఫ్యాను వేసింది. మంచినీళ్ళ గ్లాసు, కాఫీకప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది. చాలారోజుల తర్వాత అమృతంలాంటి
కాఫీ తాగాను.
‘‘ఎలా ఉన్నావు అన్నయ్యా?’’
నా కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
‘‘ఇంకా బాధపడుతున్నావా? రాని మనిషికోసం ఎంతకాలం ఎదురుచూసి ఏం లాభం?’’
‘‘నిజమేలేమ్మా, ఏదో ఊరెళ్ళలేదు గదా, ఇవ్వాళో,üరేపో వస్తుందని ఆశపడటానికి - నన్ను ఒంటరిని చేసి పోయింది’’ నాకు తెలియకుండానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకుని వచ్చింది. కాస్త బిగ్గరగానే ఏడ్చాను.
‘‘అన్నయ్యా’’ పార్వతి వచ్చి నా భుజంమీద చేయివేసి నా తల నిమురుతూ ఓదార్చింది.
‘‘ఈ ఆరునెలల్లో ఎంత చిక్కిపోయావ్... ఎన్నిసార్లు రమ్మన్నా రావాయె. నువ్వు అన్నయ్యవు, నేను చెల్లెల్ని. నా దగ్గర నీకు మొహమాటమా. కష్టకాలంలో ఒకరికొకరం దగ్గరగా ఉంటే కాస్త ఓదార్పుగా ఉంటుందిగదా. ఎలాగూ వచ్చావు. ఓ నెలరోజులైనా ఉండిపో. అసలు నువ్వు నా దగ్గరే ఉండిపో’’.
పేలవంగా నవ్వాను.
కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు... అందరినీ చూసుకోవాలి. ఒక్కక్షణం తీరిక ఉండదు. ఈ సమయంలో అది కాస్త ఖాళీగా ఉంటుందని తెలుసు కాబట్టే ఆ ప్రకారం బస్ ఎక్కి సరిగ్గా ఈ సమయంలో దిగాను.
నేను వచ్చింది కేవలం దానితో మాట్లాడుకోవటానికి అంతే. ఏంటో... మనసంతా శూన్యం. ఎలాంటి ఆలోచనలూ చేయలేని స్తబ్ధత... చుట్టూ ఎంతో ప్రపంచం ఉన్నా నాకెవ్వరూ లేరన్న వైరాగ్యం.
‘‘అన్నయ్యా’’
‘‘ఊఁ... ఆఁ... చెప్పమ్మా... ఏమిటీ
విశేషాలు? మధ్యాహ్నం కూడా పనిపెట్టుకున్నావా... విశ్రాంతి తీసుకోవచ్చుగా?’’
‘‘విశ్వానికి బియ్యంరవ్వ ఉప్మా అంటే ఇష్టం. పొద్దున బియ్యం కడిగి ఆరబోశాను. అవునూ... భోంచేశావా?’’
‘‘తొమ్మిదిగంటలకే టిఫిన్ తిని బస్ ఎక్కాను. మధ్యలో బస్ ఫెయిల్ అయింది. ఓ గంటపట్టింది అది బాగయ్యేసరికి. ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని హోటల్లో తినేశాను. వేళకు టాబ్లెట్స్ పడాలిగా’’.
‘‘నాలుగు పకోడీలు వేస్తాను’’ అంటూ లేవబోతున్న పార్వతి చేయిపట్టి ఆపాను.
‘‘అలాంటివి ఏమీ వద్దమ్మా. నీతో మాట్లాడాలని వచ్చాను కూర్చో’’.
విశ్వం, రజని ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే రాత్రి ఎనిమిది గంటలకు వస్తారు. కార్తీక్, సింధు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం, మొదటి సంవత్సరం చదువుతున్నారు. మహానగరంలో సిటీబస్సుల ప్రయాణాలు... ఉదయం ఉత్సాహంగా బయల్దేరినవాళ్ళు రాత్రికి ముఖాలు వేలాడేసుకుని వస్తారు. పార్వతి అందరికీ సాంత్వన కలిగించి అక్కున చేర్చుకునే దేవతలా సేవలు చేస్తుంది. అప్పుడది బిజీ బిజీ.
అయినా వాళ్ళందరి ఎదురుగా ఏం మాట్లాడుకుంటాం. అందుకే ఈ సమయంలో ఒక్క నిమిషం కూడా వృథాచేయటం నాకిష్టంలేదు.
‘‘అన్నయ్యా, ఎంతసేపు... అయిదు నిమిషాలు. అసలే నువ్వు ఆకలికి ఉండలేవు. తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాం’’ ఆత్మీయంగా అంటూ చేయి విడిపించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి.
* * *
నా భార్య వసంత చనిపోయి ఆరునెలలు అవుతోంది. మాది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఒకరిని విడిచి ఒకరం ఉన్నది ఏనాడూలేదు. చిన్నచిన్న వేడుకలనుండి పెళ్ళిళ్ళూ గృహప్రవేశాల వరకూ అన్నింటికీ కలిసే వెళ్ళేవాళ్ళం. చాలామంది భార్యాభర్తల్లా ఎన్నడూ ఒకమాట అనుకున్నది లేదు. ఎడముఖం పెడముఖంగా ఉన్నదిలేదు. ముఖ్యంగా చులకనగా మాట్లాడుకోవటం, గొడవలు పెట్టుకోవటం, వాదించుకోవటం మేం ఎరుగం. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నమాటకు సరిపోయే చాలా కొద్దిమందిలో మాదీ ఒక జంట అన్న ఓ గొప్ప ఫీలింగ్.
నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది. మంచి మాటకారి. ముఖంలో నవ్వు చెరగదు. అదే మా ఇంటికి లక్ష్మీకళ అన్పించేది. టీవీ సీరియళ్ళ గురించీ పాలిటిక్స్ గురించీ రోజూ చాలాసేపు
మాట్లాడుకునేవాళ్ళం. ఆ రాత్రీ అలాగే మాట్లాడుకున్నాం. తెల్లవారుతూనే విగతజీవిలా కన్పించింది నా వసంత.
ఇలా ఎందుకు జరిగింది? అంతుపట్టని ప్రశ్న. నాకైనా బీపీ, మోకాళ్ళ నొప్పులూ ఉన్నాయికానీ తనకి ఏ చిన్న అనారోగ్యమూ లేదు. అలాంటి ఆరోగ్యవంతురాల్ని అప్పుడే దేవుడు తీసుకుపోవటం ఏంటి? నా జీవితం ఇలా ఎందుకు నాశనం చేశాడు. తర్వాత తెలిసింది... హార్ట్‌ఎటాక్ అని. పక్కన ఉన్న నాకు తెలియకుండానే ప్రాణం పోయింది.
నేను పిచ్చివాడిలా అయిపోయాను.
ఢిల్లీ నుంచి పెద్దబ్బాయి, ముంబై నుంచి చిన్నబ్బాయి భార్యా పిల్లలతో వచ్చారు. ఇంకా బంధువులూ స్నేహితులూ దగ్గరివాళ్ళూ చుట్టుపక్కలవాళ్ళూ అంతా వచ్చారు.
నేను ఎవరితోనూ మాట్లాడలేదు.
మరికాసేపటి తర్వాత ‘నా వసంత ఈ కాస్త కూడా కన్పించదు’ అనుకుంటూ బెంగగా, బేలగా ఆమెనే చూస్తూ కూర్చున్నాను. అంతే.
‘అదృష్టం... సుమంగళిగా పోయింది.
ఎవరికి వస్తుంది ఇంత మంచి చావు.
సోమవారం చావు బోలెడు వరహాలు పోసినా రాదు. ఎంత మంచి తిథి’ ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు.
‘ఎంత అదృష్టవంతురాలు... స్వర్గానికే పోతుంది’.
విరక్తిగా నవ్వుకున్నాను నేను.
చనిపోయిన నా వసంతకు స్వర్గప్రాప్తి... బతికి ఉన్న నాకు నరకప్రాప్తి. అవునుమరి, ఈ క్షణం నుంచి నా జీవితం నరకం.
పార్వతికి నా గురించి భయంపట్టుకుంది నేనేమైపోతానో అని. కార్యక్రమాలు అన్నీ ముగిశాయి. పార్వతి భయపడినట్లు నేనేమీ కాలేదు. మనసు చితికిపోయి ఉన్నా చితిలో కాలి బూడిదైనా నా భార్య నాకు శాశ్వతంగా దూరమైనా నేను జీవించటం కోసం భోజనం చేస్తూనే ఉన్నా. నిద్రపోతూనే ఉన్నా.
పిల్లలు రమ్మన్నారు. పార్వతి రమ్మంది. రానన్నాను. అంతా వెళ్ళిపోయారు. వసంత జ్ఞాపకాలతో కుంగిపోయాను. పిల్లలనుంచీ పార్వతినుంచీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మధ్యలో పార్వతి మూడుసార్లు, పిల్లలు మూడుసార్లు వచ్చి వెశ్ళారు. నన్ను పదేపదే రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. వెశ్ళాలని లేదు.
గుమ్మందాటి బయటకు వెళ్తే ఎవరో ఒకరు పలకరిస్తున్నారు కానీ ఎంతసేపని బయటే ఉండగలను? ఇంటికి రావాల్సిందే. ఇల్లంతా వసంత లేని శూన్యం. ఆ శూన్యంలో నేను ఇమడలేని అసహాయత. అలవాటులేని పనులు, తోడులేని వేదన, వందల జ్ఞాపకాలు, వేల అనుభూతులు... నాకీ దుస్థితి ఏంటా అని నేను పొందుతున్న వైరాగ్యంమీద - కోపం, కసి.
నెలలు గడుస్తున్నా ఇదే పరిస్థితి. కాలం నా మనసుకైన గాయాన్ని కొంచెమైనా మాన్పలేదు. ఉన్నట్టుండి ఓరోజు నాకు కావాల్సింది ఏంటో నాకర్థం అయింది. అందుకే పార్వతి దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాను.
* * *
‘‘అన్నయ్యా, ఇదిగో’’.
ఉలిక్కిపడి ప్లేటు అందుకున్నాను.
ఇద్దరం పకోడీలు తిని మరోసారి కాఫీ తాగాం.
‘‘రోజంతా ఎలా గడుపుతున్నావన్నయ్యా?’’
‘‘ఏముందమ్మా, మీ వదిన ఉన్నప్పుడు దేవుడికి ఓ అగరుబత్తీ వెలిగించి దండం పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు మీ వదిన చేసిన పూజని నేను చేస్తున్నాను. అదో గంట. తర్వాత పేపరు చూడటం, బజారుకి వెళ్ళిరావటం, టీవీ చూడటం... మొబైలు, లాప్‌టాప్‌తో కాసేపు టైంపాస్... సాయంత్రం గుడికి వెళ్ళటం... మళ్ళీ టీవీ... ఏదో గడుస్తోంది కాలం. మోడువారిన వృక్షంలా ప్రాణంలేని శిల్పంలా... ఇలా బతుకుతున్నాను. పార్వతీ, ఒక విషయం అడుగుతాను చెబుతావా? ఇలా అడిగానని మరోలా అనుకోకు’’.
‘‘అయ్యో, అస్సలు అనుకోను.
అడుగన్నయ్యా’’.
‘‘నేనూ వసంతా ఎలా ప్రేమగా గడిపామో... నువ్వూ బావగారూ అలాగే గడిపారు. బావగారు పోయిన తర్వాత నువ్వెంత బాధపడ్డావో, వేదన చెందావో నాకు తెల్సు. బావగారు చనిపోయి ఇప్పటికి అయిదు సంవత్సరాలు. నీ మనసు ఎలా ఉంది? ఏం ఆలోచించింది?’’
‘‘ఒకరికొకరం జీవితాంతం అనుకుంటాం కానీ నిజానికి చనిపోయేనాటివరకే తోడు. పెళ్ళి పేరుతో ఒక్కటిగా అయినా చనిపోయే విషయంలో ఎవరిదారి వారిదే కదా. జీవితాంతం అని అనుకుంటే పోయినవాళ్ళవరకు సరే... మరి ఉన్నవాళ్ళకు? వీళ్ళకు జీవితం అనంతంగా, రోజుకు నలభై ఎనిమిదిగంటల్లా అన్పిస్తుంది. నాకూ అలాగే అన్పించింది. నా జీవితం ఎలా గడుస్తుందీ నేను ఎలా బతకాలీ అనుకున్నాను. తర్వాత్తర్వాత ఇదిగో ఇలా అలవాటుపడ్డాను’’.
‘‘ఇప్పటికి మీ వదిన పోయి ఆరునెలలు అయింది. మరో నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పటి నీలా నేను ఉండగలనా?’’ నా గొంతు బొంగురుపోగా చెంపలమీద జారిన కన్నీటిని వేగంగా తుడుచుకున్నాను.
‘‘అయ్యో అన్నయ్యా... ఊరుకో. ఏం చేస్తాం చెప్పు. ఇలాంటి జీవితం కచ్చితంగా దుర్భరమే. కానీ తప్పదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంకేవేవో వ్యాపకాలు సృష్టించుకుంటూ బతకటం నేర్చుకోవాలి. అందులోనే కొద్దో గొప్పో ఆనందాన్ని వెతుక్కోవాలి’’.
‘‘ఆనందమా!’’
‘‘అప్పటి ఆనందం అయితే ఉండదు. ఇక దొరకదు కూడా. మనకు ఎంతో నచ్చిన ఒక వస్తువు పోయిందంటే వెతుక్కుంటాం, లేదంటే మళ్ళీ కొనుక్కుంటాం. కానీ ఈ స్థితి అలాంటిది కాదు. మనం ఏమీ చేయలేని నిస్సహాయులం. అందుకే మనసు మళ్ళించుకోవాలి. అంతే’’.
‘‘నేను నీలా పిల్లల దగ్గర ఉండలేను. వసంతతో గడిపిన ఆ ఇల్లు వదిలి ఎక్కడో బతకలేను. ఒంటరిగా ఉన్నానని వృద్ధాశ్రమం వైపు మొగ్గు చూపలేను. నేను చాలా అశాంతిగా రోజుల్ని గడుపుతున్నాను పార్వతీ. మగవాళ్ళు శారీరకంగా బలవంతులు, ఆడవాళ్ళు బలహీనులు అంటుంటారు. మానసికంగా ఆడవాళ్ళు బలవంతులు, మగవాళ్ళు బలహీనులా! గుళ్ళల్లో, ఇళ్ళల్లో, బయటా నేను చాలామందిని చూశాను. భర్త చనిపోయిన భార్యకంటే భార్య చనిపోయిన భర్తలో మానసిక శూన్యం ఎక్కువగా కనిపించింది నాకు. ఎందుకిలా? తోడు అన్నది ఇద్దరికీ ఒకటే కదా. బంధం అన్నది ఇద్దరికీ బలమైనదే కదా’’.
‘‘నిజమే, కానీ మేం ఇలా పనుల్లో పడిపోతాం. పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్తే వెశ్తాం. మీరు అలాకాదు. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో తప్పించి భార్యమీద ఆధారపడి బతుకులు వెళ్ళదీసిన భర్తలే ఎక్కువ. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నమాట చాలా కరెక్ట్ అన్నయ్యా. అలసి ఇంటికి వచ్చేసరికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేస్తుంది ఇల్లాలు. ఇంట్లో దేవతామూర్తిలా తిరుగుతూ అన్నీ సవ్యంగా జరిగేలా చూస్తుంది. ముఖ్యంగా భర్తకోసం ఎంతో తపనపడుతుంది. ఏం కావాలో జాగ్రత్తగా చూస్తుంది. భర్త చూడడనికాదు కానీ బయటకు అంతగా కన్పించడు. అతను నిజంగా బయటపడేది ఇదిగో ఈ మానసిక శూన్యంలోనే.. ఈ ఒంటరితనంలోనే. మామూలుగా ఇల్లంతా మీ మాటమీద నడుస్తుంది. మీరు ఏది అన్నా, ఆమోదముద్ర వేయటం వరకే ఆమె వంతు... మీకు అలా అలవాటు. అందుకే పిల్లలకు లోబడి ఉండాలంటే మీరు ఉండలేరు. మీ కొడుకులూ మీ కోడళ్ళే అయినా చనువుగా ఉండలేరు. అంతెందుకు, కోడలు గదిలో ఉందంటే అత్తగారు చనువుగా లోపలికి వెళ్ళగలదు. అదే మామగారు ఎంత అవసరం అయినా గుమ్మం దగ్గరే ఆగిపోతారు, తటపటాయిస్తారు. ఆ తేడా ప్రతి విషయంలో ఉంటుంది. మన పద్ధతులూ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండటం మనకు మార్చుకోలేని అలవాటు.
నువ్వు అడిగావు ‘విశ్రాంతి తీసుకోపోయావా’ అని. నేను ఈ పనిచేయనంత మాత్రాన వాళ్ళేమీ అనరు. ఇది నేను కల్పించుకున్న పని. టైమ్ గడవటానికే అనుకో. అదే నువ్వు టైమ్‌ని ఇలాంటి పనులకు కేటాయించుకోలేవు. టీవీ ఎంతసేపు చూస్తావు... దాంతో ఆలోచనల్లోకి జారిపోతావు. అందుకే అన్నయ్యా, ముఖ్యంగా ఏదో ఒక వ్యాపకం కావాలి’’.
‘‘జాబ్ చేయమంటావా... నాలో ఓపికలేదు. అయినా పెన్షను వస్తుంది. నా ఒక్కడికి ఎక్కువ అది’’.
‘‘ఇంకేదైనా’’
‘‘అదే ఏం చేయను? ఎలా గడపను?’’ మళ్ళీ నా కళ్ళనిండా నీళ్ళు.
పార్వతి ఏం మాట్లాడలేకపోయింది. ‘పార్వతీ’ అంటూ నా మనసులోమాట
చెబుదామనుకుంటున్న సమయంలోనే కార్తీక్, సింధు వచ్చారు. నా మనసు నీరసించిపోయింది. నన్ను పలకరించి, ‘ఎవరో వచ్చి క్లాసులు బంద్ చేయించారు. కాలేజీ ఒక్కపూటే నడిచింది’ అని పార్వతితో చెబుతుంటే నాకు వినాలన్పించలేదు.
* * *
పార్వతి వడ్డిస్తుంటే మాట్లాడుకుంటూ అంతా భోంచేశాం. కార్తీక్ ఏదో జోక్ చెబితే అంతా నవ్వారు. నేను చిరునవ్వు నవ్వాను. ఇలాంటివి నా మనసుకు దగ్గరగా చేరలేకపోతున్నాయి. పార్వతి గదిలోకి వచ్చి బెడ్‌మీద వాలిపోయాను. వసంత ఉన్నప్పుడు ఇలా వస్తే నేనూ బావగారూ ఈ బెడ్‌మీద చేరేవాళ్ళం. వసంతా పార్వతీ మాతో మాట్లాడినంతసేపు మాట్లాడి హాల్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. ఆ విషయం గుర్తుకొస్తుంటే చప్పున టాబ్లెట్స్ వేసుకోవాలన్నది గుర్తొచ్చింది. మెల్లగా లేచి గది గుమ్మం దాటబోయి ఆగాను. ఇంకా అంతా డైనింగ్‌టేబుల్ దగ్గరే మాట్లాడుకుంటున్నారు.
‘‘విశ్వం.. నేను మామయ్యతో వెళ్తున్నానురా’’.
అంతా నిశ్శబ్దం.
‘‘అవున్రా, నేను మామయ్యతో వెశ్దామనుకుంటున్నాను. మామయ్య గురించి నాకు బెంగగా ఉంది. చూశారుగా ఎలా ఎముకలగూడులా అయిపోయాడో. చిన్నప్పుడు ఇద్దరం ప్రాణంగా పెరిగాం. ఇంతకాలం అలాగే ఉంటూ వచ్చాం. కష్టంవస్తే అమ్మా నాన్నకి చెప్పుకుంటాం. మాకు వాళ్ళు లేరు. ఎప్పటినుంచో ఒకరికొకరం అమ్మా నాన్నగా అయ్యాం. ఇప్పుడు నా అన్నయ్య కష్టంలో ఉన్నాడు. అండగా ఉండాల్సిన బాధ్యత నాది’’.
‘‘ఎన్ని రోజులుంటావమ్మా?’’
‘‘ఇప్పుడే చెప్పలేనురా. మామయ్య శారీరకంగా మానసికంగా కోలుకోవాలి. రుచికరమైన భోజనం వండిపెడతాను. మామయ్య ఇష్టపడితే ఏవైనా ప్రదేశాలు తిరిగివస్తాం. మామయ్య మనసుకు దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా కోరిక’’.
‘‘అమ్మా, ఇలా అంటున్నానని అనుకోకు. ప్లీజ్... నువ్వు లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మామయ్యని మనతోనే...’’.
‘‘మామయ్య ఇక్కడ ఉండడు. అలా ఉండేవాడైతే కొడుకుల దగ్గరకే వెళ్ళలేడా?’’
‘‘వెళ్ళమని నువ్వు చెప్పు. మురళీ బావ దగ్గరికో వాసు దగ్గరికో వెళ్లొచ్చు కదా’’.
‘‘అలాకాదులేరా... నువ్వేమో ఏదో రూల్ ప్రకారం మాట్లాడుతున్నావు. నేను మామయ్య మనసు తెలిసి, ఆయన క్షేమం, సంతోషం కోరి మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మీకు ఇబ్బంది, అసౌకర్యం కలిగేమాట నిజమే. దానికి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించండి. నాలుగురోజులు కష్టంగా అన్పించినా తర్వాత అలవాటుపడిపోతారు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మనిషి తోడు లేకుండా నేను అలవాటుపడిపోలేదా. నేను బట్టలు సర్దుకుంటాను. రేపే మా ప్రయాణం. రేపెలాగూ ఆదివారం. మీరూ కాస్త ప్లాన్ చేసుకోవచ్చు. ఏంట్రా కార్తీక్, అలా బిత్తరపోయి చూస్తున్నావు? సింధూ... నేను లేనని బెంగపడొద్దు. శని, ఆదివారాల్లో మీరు అక్కడికి రండి. విశ్వం... నువ్వూ కోడల్ని తీసుకునిరా’’ అంటూ పార్వతి రాబోతుంటే గబగబా లోపలికి నడిచి బెడ్‌మీద వాలి అటుతిరిగి పడుకుండిపోయాను.
‘‘అన్నయ్యా, నిద్రపోయావా?’’ అంటూ పార్వతి పలకరించింది. నేను మౌనంగా ఉండిపోయాను. ‘ప్చ్... ఎలా అయిపోయావ్ అన్నయ్యా’ అంటూ పార్వతి నా తల నిమిరేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు.
బలవంతంగా ఏడుపు ఆపుకుంటూ బిగదీసుకుని పడుకున్నాను. పార్వతి వెళ్ళి తన పక్కమీద పడుకుంది.
‘పార్వతీ... నేను అడగాలనుకున్నమాట... నా మనసులోని మాట నువ్వే గ్రహించి, నీ వాళ్ళకు చెప్పి ఒప్పించి, నా జీవితానికి ఇంత ఊరట కల్గిస్తావనుకోలేదు. నీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పను’ నా హృదయం ఆక్రోశించింది.
చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తుంటే ప్రశాంతత నిండిన మనసు జోకొడుతుంటే నిద్ర ముంచుకొచ్చింది. ఏ టాబ్లెటూ వేసుకోవాలన్పించలేదు. పార్వతి కొన్నాళ్ళు నాకు తోడుగా ఉంటుందనుకుంటే... రేపు పార్వతితో నా ప్రయాణం అనుకుంటుంటే... బోలెడంత నిశ్చింతగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
UPI fraud: యూపీఐ, బ్యాంకింగ్ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?
-
Telangana Ministers: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ప్రమాణస్వీకారం
-
Vivo Inida: వివో కేసులో ఈడీ దూకుడు.. తొలి ఛార్జీషీటు దాఖలు
-
Revanth Reddy: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gaddam Prasad Kumar: తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్