మొలక

‘‘ఏంటీ? మమ్మల్ని రమ్మని లెటర్‌ పంపారా మీ స్కూలు వాళ్ళు?’’ భయపడుతూ అడిగింది వైదేహి. ఏమీ చెప్పలేని అశక్తతతో ఆ కవరు తల్లి చేతిలోపెట్టి తల వంచుకున్నాడు మురారి.

Published : 10 Apr 2020 12:38 IST

 జి.యస్‌.లక్ష్మి

‘‘ఏంటీ? మమ్మల్ని రమ్మని లెటర్‌ పంపారా మీ స్కూలు వాళ్ళు?’’ భయపడుతూ అడిగింది వైదేహి. ఏమీ చెప్పలేని అశక్తతతో ఆ కవరు తల్లి చేతిలోపెట్టి తల వంచుకున్నాడు మురారి.

‘‘ఏవుందిరా ఇందులో? ఏం చేసేవ్‌?’’ 

గద్దించింది.

బిక్కచచ్చిపోయి కళ్లనీళ్ళు పెట్టుకున్నాడు మురారి. వైదేహి కరిగిపోయింది. ఆరో క్లాసు చదువుతున్న కొడుకుని దగ్గరికి తీసుకుని బుజ్జగించింది.

‘‘ఏం చేసేవు నాన్నా? నేనేమీ అననులే, చెప్పమ్మా...’’

‘‘నేనూ... నేనూ...’’ వెక్కిళ్లతో మాట రావట్లేదు మురారికి.

‘‘ఊ... నువ్వూ..?’’ రెట్టించింది.

‘‘కాపీ కొట్టానమ్మా’’ ఒక్కసారి మీదనున్న బరువు దిగిపోయినట్లు తేలికపడ్డాడు మురారి. తెల్లబోయింది వైదేహి.

‘‘కాపీ కొట్టావా? ఎందుకూ?’’ అర్థంకాలేదామెకు.

వైదేహి డిగ్రీలు చదివుండకపోవచ్చు కానీ మంచి సంస్కారంగల తల్లి. అబద్ధమాడకూడదు, 

దొంగతనం చెయ్యకూడదు, కాపీలు కొట్టకూడదు- ఇలాంటి నీతి సూత్రాలన్నీ వంటపట్టించుకున్న ఆవిడ, కొడుకుకి కూడా అవే నూరిపోసింది. డిగ్రీలు చదువుకోక పోవడంవల్ల ఆమె కొడుక్కి చదువులో సహకారం అందించలేకపోతోంది తప్పితే మంచి విలువలతో ఒక మంచి పౌరుడిలా తయారుచేస్తోంది కొడుకుని.

మురారి తండ్రి చలపతిది నెలకి ఇరవై అయిదు రోజులు టూర్లమీద తిరిగే ఉద్యోగం. ఇల్లు పట్టకుండా ఊరూరా తిరుగుతూ సంపాదించేది కుటుంబం కోసమే కదా! కుటుంబమంటే ఎంత? చలపతి, వైదేహి, మురారి... అంతే. అతనిమీద ఆధారపడి అతని తల్లిదండ్రులూ లేరు, పెట్టి పోషించవలసిన అక్కచెల్లెళ్లూ లేరు. అయినాసరే, చలపతి క్యాంపులు వెళ్లడానికే సుముఖత చూపిస్తాడు. ఎందుకంటే అందులోనే నాలుగు రూపాయలు మిగుల్తాయి. అతని ధ్యేయమల్లా కొడుకు మురారికి మంచి చదువు చెప్పించడం. అప్పుడు కొడుకు తనలాగా ఊరూరా తిరగక్కర్లేకుండా కాలుమీద కాలువేసుకుని కూర్చునిచేసే ఉద్యోగం చేసుకుంటాడు. ఇదీ చలపతి ఆశ. అందుకే ఫీజులవీ ఎక్కువయినాసరే మురారిని సిటీలో ఉన్న మంచి స్కూల్లో చేర్పించాడు. అదీకాక ట్యూషన్‌ కూడా పెట్టించాడు. తన ఖర్చులూ కుటుంబ ఖర్చులూ తగ్గించుకుని ఆశలన్నీ మురారి మీదే పెట్టుకున్నాడు.

మురారి కూడా తెలివితక్కువ పిల్లాడేం కాదు. రెండు మూడు ర్యాంకుల్లో ఉంటాడు. మొదటి ర్యాంకు ఎందుకు రాకూడదని చలపతి ఉక్రోషం. తన కొలీగ్‌ రాజారావు అస్తమానం పెద్ద గొప్పగా చెప్తుంటాడు. ‘మావాడు ఎప్పుడూ ఫస్టేనోయ్, అసలు సెకండు ర్యాంకు వస్తే వాడూ వాళ్ళమ్మా అల్లల్లాడిపోతారు. మళ్ళీ ఫస్టుకెళ్ళే వరకూ మా ఆవిడ వాణ్ణి నిద్రపోనీదనుకో’. అది విన్నప్పుడల్లా చలపతి చిన్నబోతాడు. చదువురాని అమ్మాయిని భార్యగా చేసుకుని చాలా పొరపాటు చేశాననుకుంటుంటాడు. ఆ పొరపాటు దిద్దుకుందామన్నట్టు అస్తమానం చదవమని మురారినీ గంటలతరబడి వాణ్ణి చదువుకునేందుకు కూర్చోబెట్టమని వైదేహినీ తినేస్తుంటాడు. మురారి చదువు తప్ప అతనికి మరో దృష్టి లేదు. ఈసారి రాజారావుతో తను గొప్పగా చెప్పుకోవాలి... తన కొడుకూ ఫస్టు వచ్చాడని. ఆ ఉద్దేశంతో ఈ యూనిట్‌ టెస్ట్‌లో ఫస్టు ర్యాంకు వచ్చి తీరాలని మురారికి గట్టిగా చెప్పాడు. వైదేహిని కూడా ‘ఈసారి నీ కొడుకు ఫస్టు రాకపోయాడో చూడు, నీకు నా చేతి చావే’ అని బెదిరించాడు.

కానీ సరిగ్గా పరీక్షలముందు మురారి జ్వరపడ్డాడు. క్లాసులు మిస్సవడంవల్లా నీరసంవల్లా ఇదివరకంత బాగా చదవలేకపోయినా, కష్టపడి రాత్రంతా కూర్చుని పోర్షనంతా ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు. పొద్దున్నే పరీక్ష భయంతో తిండికూడా సరిగ్గా తినలేకపోయాడు.

ఆ రోజు పరీక్షహాల్లో ఒకవైపు నీరసం, మరోవైపు భయం. అన్ని ప్రశ్నలకీ చక్కగానే జవాబులు రాశాడు. కానీ ఖాళీలు పూరించే భాగంలో ఒక్క ప్రశ్నకి మాత్రం ఎంత గుర్తుచేసుకుందామన్నా సమాధానం గుర్తురాలేదు. తన ముందు బెంచి వైపు చూశాడు. జయరాం చకచకా రాసేస్తున్నాడు. కంగారుపడ్డాడు మురారి. తనకు ఎప్పుడూ చదువులో పోటీ జయరామే. ఎప్పుడూ తన తర్వాతే ఉండేవాడు. ఇప్పుడు తనను దాటి ముందుకెళ్ళిపోతాడేమో! జాగ్రత్తగా ముందుకు వంగి చూశాడు. ఖాళీలు పూరిస్తున్నాడు జయరాం. అందులోదే ఒకటి గుర్తురాలేదు మురారికి. మరికాస్త వంగితే కనపడుతుంది. ఛీ... కాఫీ కొట్టడమా..? వెనక్కి తగ్గాడు.

‘వెధవా, వెధవాని... నీకోసం తిండీ తిప్పలూ లేకుండా ఇరవైనాలుగ్గంటలూ రోడ్లట్టుకు తిరుగుతున్నాన్రా. నీడపట్టున కూర్చుని, చదివి, పరీక్ష రాయరా అంటే నీకేమొచ్చిందిరా మాయరోగం?’ తండ్రి వేసే కేకలు గుర్తొచ్చాయి. కాస్త ముందుకు వంగాడు.

‘దొంగతనం చెయ్యరాదు’, ‘అబద్ధమాడరాదు’ వంటి సూక్తులు చెప్పిన అమ్మ ‘తప్పుకదూ!’ అంటున్నట్టు కనపడింది. వెంటనే వెనక్కి తగ్గాడు. ‘నోట్లో అక్షరంముక్క రానిదాన్ని చేసుకున్నాను చూడు, అందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఆ రాజారావు పెశ్ళాం చూడు...కొడుకునెంత బాగా చదివిస్తోందో. కన్నకొడుక్కి అక్షరంముక్క చెప్పలేని నీ బతుకెందుకు?’ తల్లి మీద అరుస్తున్న తండ్రి రాక్షసరూపం గుర్తొచ్చింది. వెంటనే ముందుకు వంగాడు. జయరాం రాసిన సమాధానం, మురారికి కావల్సినది స్పష్టంగా కనిపించింది. వెంటనే అది చూసి గబగబా తన పేపర్లో రాయబోయాడు.

అంతే, వెనకనుంచి మురారి భుజమ్మీద చెయ్యిపడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఎప్పట్నించి గమనిస్తోందో ఏమో క్లాస్‌ టీచర్‌ లలిత, మురారిని లేపి నుంచోబెట్టింది.

‘‘ఏంటి నువ్వు చేస్తున్నపని?’’

మురారికి నోరు తడారిపోయింది.

‘‘సారీ మిస్‌...’’ ఎలాగో గొంతు పెగుల్చుకున్నాడు.

లలితా టీచర్‌ లెసన్‌ ఎంత బాగా చెపుతుందో, క్రమశిక్షణ పాటించడంలోనూ అంత కఠినంగా ఉంటుంది. ఆవిడ దృష్టిలో మురారి బాగా చదివే బుద్ధిమంతుడైన పిల్లాడు. అలాంటివాడు దారితప్పి కాపీ కొడుతున్నాడు. ఇలాంటివాటిని మొదట్లోనే ఆపకపోతే తరవాత కష్టమౌతుంది.

మురారిని చూసి కళ్ళెర్రచేసింది. బెదిరిపోయాడు. ఆ స్కూల్లో పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు. వాళ్ళకి మంచీ చెడూ చెప్పి, మంచిమార్గాన నడిపించాలి తప్పితే, ఆ వయసులో పిల్లల్ని తిట్టినా కొట్టినా వాళ్ళు భయపడిపోయి ఏవైనా అఘాయిత్యాలు చేసే అవకాశముందని ఆ స్కూలు యాజమాన్యం- ఏ టీచరూ కూడా పిల్లల్ని తిట్టి కొట్టకూడదనే రూలు పెట్టారు.

అయినాసరే, టీచర్‌ కళ్ళెర్రజేసినందుకే మురారి వణికిపోయాడు. ‘‘కమ్‌ విత్‌ మి...’’ అంది టీచర్‌ ముందుకు నడుస్తూ.

‘‘సారీ మిస్‌... ఎక్స్‌క్యూజ్‌మీ మిస్‌...’’

వెనక్కితిరిగి చూడట్లేదు ఆవిడ. తిన్నగా హెడ్‌మాస్టర్‌ రూమువైపు నడిచింది. కళ్ళమ్మట పొంగుకొస్తున్న దుఃఖాన్ని చెయ్యెత్తి చొక్కా చేతితో తుడుచుకుంటూ, గొంతు దుఃఖంతో పూడుకుపోతుంటే లలితా టీచర్‌తో కలసి హెడ్‌మాస్టర్‌ గదిలో ఆయన ముందు నిలబడ్డాడు.

మురారి చదువుతున్న స్కూలు మంచి పేరున్న స్కూలు. పబ్లిక్‌ పరీక్షల్లో స్కూలుకి సెంట్‌ పర్సంట్‌ రిజల్ట్‌ తెప్పించడమే కాకుండా, అన్ని రంగాల్లోనూ విద్యార్థుల అభివృద్ధికి స్కూలు మేనేజ్‌మెంటు కృషిచేస్తుంది.

ఒక విద్యార్థి చదువులోనూ, ఆటల్లోనూ, మిగిలిన అన్ని రంగాల్లోనూ పైకి రావాలంటే అందుకు స్కూల్లో టీచర్లూ ఇంట్లో తల్లిదండ్రులూ కలసి ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందని వాళ్ళ విశ్వాసం. టీచర్లు, పేరెంట్సు మధ్య చక్కటి సయోధ్య ఏర్పడటానికి వాళ్ళు సాధారణంగా టీచర్, పేరెంట్స్‌ మీటింగులు పెడుతూనే ఉంటారు. అయినాసరే, కొంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకపడుతున్నారో తెలుసుకునేందుకు ఎడ్యుకేషన్, సైకాలజీల్లో పెద్దపెద్ద డిగ్రీలున్న వాళ్ళని పిల్చి, వాళ్ళ సలహాలని తీసుకుని పిల్లలను మంచి విద్యార్థులుగానే కాకుండా, ఈ సమాజంలోకి అడుగుపెట్టబోయే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నారు.

అటువంటి స్కూల్లో ఒక విద్యార్థి కాపీ కొడుతున్నాడంటే అది తేలికగా తీసేసే విషయం కాదు. అసలు ఆ పిల్లాడు కాపీ కొట్టవలసిన పరిస్థితేంటి? అదే అడిగాడు హెడ్‌మాస్టర్‌ టీచర్‌ని.

‘‘ఇతనికి మార్కులెలా వస్తూంటాయి?’’

‘‘బాగానే వస్తుంటాయి సర్‌... మొదటి మూడు ర్యాంకుల్లోనే ఉంటాడు’’.

‘‘ఎందుకు కాపీ కొట్టావ్‌?’’ నేరుగా మురారినే అడిగాడు. సమాధానం లేదు.

పనిష్మెంటు ఇవ్వడం పెద్ద కష్టంకాదు హెడ్‌మాస్టరుకి. కానీ చేసిన నేరానికి అసలు కారణమేమిటో తెలుసుకోవాలి. వీలైతే ఆ కారణాల మూలాల్లోకి వెశ్ళాలన్నది ఆయన అభిమతం. 

ఈ కుర్రాణ్ణి తను ప్రశ్నించడంకన్నా ఈ తప్పు ఎందుకు చేశాడో తెలుసుకునేందుకూ సలహాలివ్వడానికీ ప్రొఫెషనల్స్‌ అయిన సైకాలజిస్టుల్ని పిలిపిస్తేనే నయం. ఎవరు చేసేపని వారు చెయ్యాలి. ఈరోజు కాపీ కొట్టినందుకు ఇతనికి పనిష్మెంటు ఇచ్చి లాభంలేదు. ఇంత బాగా చదివే స్టూడెంటుకి అసలు కాపీ కొట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసుకుని, మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి.

ఆయన వెంటనే... అప్పుడప్పుడు స్కూలుకి వచ్చి పరీక్షలకి ఎలా ప్రిపేరవ్వాలో పిల్లలకి సైంటిఫిక్‌గా వివరించే ఇద్దరు సైకాలజిస్టులతో అపాయింట్‌మెంటు ఏర్పాటుచేశాడు. ఆ విషయమే లెటర్‌లో రాసి మురారి చేత వాళ్ళ పేరెంట్సుకి పంపించాడు.

మురారి చెప్పింది వినీ లెటర్‌ చూసీ కంగారుపడింది వైదేహి. ఆరోజు రాత్రి టూర్‌ నుంచి ఇంటికొచ్చిన చలపతికి భోజనం అయ్యాక విషయం చెప్పలేక చెప్పలేక భయపడుతూ చెప్పింది. విషయం వినగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు చలపతి.

‘‘ఏడీ, వాడేడీ? ఒరేయ్‌ ఎక్కడ చచ్చావురా? ఇలా తగలడరా... ఏం ఘనకార్యం చేసేవ్‌?’’

వంటగదిలో వైదేహి చీర కొంగు పట్టుకుని ఆవిడ వెనకాల దాక్కున మురారి బెదిరిపోయేడు. భయపడవద్దన్నట్టు రెండు చేతులూ వెనక్కి చాపి మురారిని పట్టుకుంది వైదేహి.

‘‘ఒసే దరిద్రం మొహందానా, నువ్వు ఎలాగూ చదువులేని మొద్దువే. వాణ్ణికూడా ఎందుకే పాడుచేస్తావ్‌? నీ గారంవల్లే కదా వాడిలా అయ్యాడు. ఇలా రారా వెధవా’’ గట్టిగా అరిచాడు.

‘‘ఒరే అమ్మకూచీ, అమ్మని వదిలి ఇలా వస్తావా లేకపోతే దానికీ రెండు తగిలించనా’’.

మురారికి లోపల్నించి దుఃఖం తన్నుకుని వస్తోంది. తను వెళ్ళకపోతే నాన్న అమ్మని కొడతాడేమో... నెమ్మదిగా వైదేహి ముందుకొచ్చి నిలబడ్డాడు. అతని భుజాల మీద చేతులేసి పట్టుకుంది వైదేహి. పిల్లాణ్ణి చలపతి ఎక్కడ కొట్టేస్తాడోనని ఆవిడ భయం.

‘‘రండి రాజావారూ రండి... చెప్పండి ఏం ఘనకార్యం చేసేరు?’’ వెటకారంగా అడిగాడు. మురారి భయంతో మాట్లాడలేకపోయాడు.

‘‘దిక్కుమాలిన వెధవా, ఇలా రారా...’’ గట్టిగా అరిచాడు.

‘‘వెళ్ళు, వెళ్ళి...ఆ ప్యాంటుకున్న బెల్టు తీసుకురా’’.

వైదేహికి అర్థమైపోయింది. ఆ బెల్టుతో మురారిని కొట్టడానికే దాన్ని తీసుకురమ్మన్నాడని.

‘‘ఏవండీ...’’ ఏదో చెప్పబోయింది నెమ్మదిగా.

ఉగ్రుడైపోయాడు చలపతి.

‘‘నువ్వు నోర్మూసుకుని లోపలికి తగలడు. నీవల్లే వాడెందుకూ పనికిరాకుండా పోయాడు. ఊ, చెప్పరా... ఏం చేసేవు స్కూల్లో? ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని?’’

మురారికి భయంతో నోటమ్మట మాటరాలేదు.

‘‘చెప్పు, ఎవరినైనా కొట్టేవా... ఏదైనా పగలకొట్టావా?’’ చేతి చుట్టూ బెల్టు చుట్టుకుంటూ అడిగాడు.

‘‘నేను... నేను...’’

‘‘ఊ... నువ్వు...’’

‘‘నేను పరీక్షలో కాపీ కొట్టాను...’’

తెల్లబోయాడు చలపతి.

‘‘కాపీ కొట్టావా...కాపీ కొడుతూ పట్టుబడ్డావా... ఓరి వెధవా... కాపీ కొట్టడం కూడా రానివాడివి రేప్పొద్దున్న ఎందుకు పనికొస్తావురా? ఇంతాచేసి కాపీ కొట్టినందుకు ఏదో మర్డరు చేసేసినట్టు ఆ స్కూలు వాళ్లు నన్ను రమ్మనడమా? నా పరువంతా తీసేశావు కదరా... రేప్పొద్దున్న నువ్వేదో మర్డరు చేసేసినట్టు వాళ్లంతా పంచాయితీ పెడతారా? ఇంతా చేసి కొట్టింది కాపీనా? ఏదీ, ఆ చెయ్యి పట్టు...’’

‘‘అమ్మా...’’

వంటింట్లో గోడకానుకుని కూలబడిన వైదేహి తల్లడిల్లింది. పన్నెండేళ్ళ పిల్లాడిని అందరూ కలిసి ఎంతగా బాధపెడుతున్నారో చూస్తుంటే ఆవిడకి గుండెల్లోంచి బాధ తన్నుకుని వచ్చింది. ఒకవైపు తప్పు పనులు చెయ్యకూడదని తను చెప్పిన నీతి సూత్రాలు, మరోవైపు ఇష్టంలేకుండా మనసుని చంపుకుని మార్కుల కోసం తప్పు పనిచేసి, చేసినందుకు పడిన బాధే కాకుండా, తప్పు చేసినందుకు పట్టుబడి, అందరిచేతా దోషిలా చూడబడుతూ మిగిలిన పిల్లలందరి ముందూ చిన్నబోవడమన్నది చిన్న విషయం కాదు. అవన్నీకాక, ఆ చేసిన తప్పు సరిగ్గా చెయ్యలేదని తండ్రి చేత దెబ్బలు. నాలుగువైపులా నాలుగురకాల మనస్తత్వాలున్న మనుషుల మధ్య నలిగిపోతున్న ఆ పిల్లాడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఎవరు చేరదీసి ఓదారుస్తారు..? వెంటనే లేచి ముందు గదిలోకి వెళ్ళి మురారిని చలపతి చేతుల్లోంచి తప్పించి అక్కున చేర్చుకుంది.

‘‘వచ్చావా ఆపద్బాంధవీ... నీవల్లే వాడిలా తయారయ్యాడు. ఇంకా బాగా వేమన పద్యాలూ సుమతీ శతకాలూ బట్టీపట్టించు. ఎందుకూ పనికిరాకుండా తయారవుతాడు. ఆఖరికి కాపీ కూడా సరిగ్గా కొట్టలేకపోయాడు. ఛీ... ఛీ...’’ చలపతి తిట్ల ప్రవాహం సాగుతూనే ఉంది. వైదేహి మురారిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది.

కావల్సినదానికన్నా ఎక్కువగా కష్టపడుతూ, దృష్టంతా కొడుకు చదువుమీదే పెట్టుకు బతుకుతున్న చలపతికి స్కూలువాళ్ళు పంపిన లెటర్‌ పిడుగుపాటులాగే తోచింది. ఏమీచెయ్యలేని అశక్తతా, అనుకున్నది చెయ్యలేకపోతున్నానన్న ఉడుకుమోత్తనం ఆ రాత్రంతా అతని నోటికి అడ్డూ ఆపూ లేకుండా చేశాయి. తల్లీ కొడుకూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రంతా గడిపారు.

మర్నాడు చలపతి, వైదేహి, మురారి సమయానికి ముందుగానే స్కూలుకి చేరుకున్నారు.

హెడ్‌మాస్టర్‌ సైకాలజిస్టు ముకుందాన్నీ, సైకియాట్రిస్టు శివరాంనీ పిలిపించాడు. మురారి కేసు వారితో చర్చించాడు. అసలు కాపీ కొట్టాడన్న అభియోగాన్ని ఇంత పెద్ద సమస్యగా చూడటం అవసరమా అని వాళ్ళని అడిగాడు. ముకుందం నవ్వాడు.

‘‘మీకు పెద్ద గీత, చిన్న గీతల కథ తెలుసు కదా! అలాగే ఇదీనూ. దొంగతనం, అవినీతి, మర్డర్లు, మానభంగాలు చాలా మామూలుగా జరిగిపోతున్న ఈ రోజుల్లో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద విచారణ అవసరమా అని మీకు అనిపించడం సహజమే. ప్రస్తుతం మనచుట్టూ ఉన్న సమాజం కుళ్ళిపోయి ఉంది. సమాజాన్ని మార్చాలంటే మనుషుల్లో మార్పు రావాలి. ఈతరం వారికింకేం చెపుతాం. కనీసం రాబోయే తరంవారైనా మంచి నైతిక విలువలతో పెరిగితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రస్తుతం ఈ అబ్బాయి కాపీ మాత్రమే కొట్టాడు. దాన్ని మనం చూసీ చూడనట్లు వదిలేస్తే రేప్పొద్దున్న ఇన్విజిలేటర్‌ ఎదురుగానే పుస్తకం ఎదురుగా పెట్టుకుని రాయొచ్చు. ఇప్పుడు టీవీల్లో, సినిమాల్లో ఏం చూపిస్తున్నారు? కాలేజీల్లో లెక్చరర్స్‌ని స్టూడెంట్స్‌ ఎంతో అసహ్యంగా హేళన చేసినట్లు తీయటంలా. తల్లినీ, తండ్రినీ పూచికపుల్లల్లా ఏరి పడేస్తున్నట్లు చూపిస్తున్నారు. అమ్మా, నాన్నా, గురువూ అంటే గౌరవంలేదు.

దానికితోడు తల్లిదండ్రుల్లో కూడా, ఉన్న ఒక్క కొడుకూ కూతురూ డాక్టరు, ఇంజినీరు అవాలన్న ఆశ ఆ పిల్లల బాల్యాన్ని తినేస్తోంది. హాయిగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా మంచి నైతిక విలువలతో పెరిగే అవకాశం లేకుండా ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల ఆశల్లోంచి, కాలేజీ పరిశ్రమల్లోంచి పౌరులుగా బయటకొస్తున్నారు. వాళ్ళకి సొంత ఆలోచన ఉండదు. సృజనాత్మకత ఉండదు. ఎంతసేపూ పోటీతత్వమే. తన వాళ్ళని తొక్కిపట్టయినా సరే, ఎదుటివాణ్ణి చంపైనాసరే గమ్యాన్ని చేరుకోవాలన్నదే నేటి వ్యాపార సూత్రమైపోయింది. కుటుంబం కూడా వ్యాపార కేంద్రంగా మారిపోతోంది. సమాజానికి పునాది అయిన కుటుంబానికే బీట పడుతుంటే మరి ముందు రాబోయే సమాజమెలా ఉంటుంది?’’

‘‘మరిప్పుడు మనమేం చెయ్యాలంటారు?’’ హెచ్‌.ఎం. అడిగారు.

‘‘ముందు ఆ అబ్బాయితో మాట్లాడితేగానీ ఏమీ చెప్పలేం. ఒకపని చేద్దాం. నేనూ, శివరాం ఆ అబ్బాయితో పక్కగదిలోకెళ్ళి మాట్లాడతాం. మిమ్మల్నీ వాళ్ళ అమ్మా నాన్ననీ చూసి అతను మనసు విప్పి మాట్లాడకపోవచ్చు. మేం స్నేహితుల్లా అతనితో కాస్త చనువుగా మాట్లాడి అసలు విషయం రాబడతాం’’ ముకుందం చెప్పాడు.

‘‘సరే అయితే, ఆ రూములో మైక్రోఫోను ఏర్పాటు చేయిస్తాను. నేనూ లలితా టీచర్, మురారి తల్లీ తండ్రీ ఇక్కడే ఆఫీసురూంలోనే కూర్చుంటాం. మీరు అతనితో మాట్లాడండి’’ అంటూ హెడ్‌మాస్టర్‌ ఆ ఏర్పాట్లవీ చేయించారు.

చలపతి, వైదేహి, క్లాస్‌ టీచర్, హెచ్‌.ఎమ్‌. ఆఫీసు రూములో కూర్చున్నారు. పక్కగదిలో మురారి, సైకాలజిస్టు ముకుందం, సైకియాట్రిస్టు శివరాం కూర్చున్నారు.

మురారిని పరిశీలనగా చూశారు వాళ్లిద్దరూ. వయసుకు సరిపడ ఎత్తూ లావుతో ఉన్నాడు. తల చక్కగా పాపిట తీసుకుని దువ్వుకున్నాడు. కాళ్లు రెండూ దగ్గరకు పెట్టుకుని, చేతులు రెండూ కట్టుకుని బుద్ధిగా కూర్చున్నాడు. కళ్ళల్లో తెలియని భయం కనపడుతోంది.

‘‘నీ పేరేంటోయ్‌?’’ చాలా మామూలుగా అడిగాడు ముకుందం.

‘‘మురారండి’’

‘‘నీకు క్లాసులో ఎంతమంది ఫ్రెండ్స్‌ ఉన్నారూ?’’

‘‘అందరూ ఫ్రెండ్సేనండి...’’

‘‘అంటే నీకు అందరూ నచ్చుతారా?’’

అర్థంకాలేదు మురారికి.

‘‘క్లాసులో అందరూ నీకు ఇష్టమేనా?’’ మరోలా అడిగాడు ముకుందం.

‘‘అంటే ఒకళ్లిద్దరంటే ఇష్టంలేదండీ.’’

‘‘ఏం, ఎందుకని?’’

‘‘వాళ్లు ఎక్కువగా సినిమా కబుర్లు చెప్పుకుంటారండి. అవి నాకు తెలీవు కదండీ. మళ్లీ పక్కవాళ్ళ మీద టీచర్‌కి చాడీలు చెప్తారండీ...’’

‘‘మరి వాళ్లతో ఎప్పుడైనా దెబ్బలాడేవా?’’

‘‘లేదండి’’

‘‘ఏం, ఎందుకు దెబ్బలాడలేదు?’’ శివరాం అడిగాడు.

మాట్లాడలేదు మురారి.

‘‘ఏం, వాళ్లు నిన్ను కొడతారనా?’’ మళ్లీ అడిగాడు శివరాం.

‘‘కాదండీ...’’

‘‘మరి?’’

‘‘మా అమ్మ చెప్పిందండీ, మన చుట్టూ ఎవరూ చెడ్డ మనుషులుండరు, అందరూ మంచివాళ్ళే అని’’.

‘‘మరి ఈ చెడ్డవాళ్ళమాట మీ అమ్మతో చెప్పలేదా?’’

‘‘చెప్పేనండి’’

‘‘ఏమన్నారు?’’

‘‘ప్రతిమనిషిలోను మంచి చెడ్డా రెండూ ఉంటాయి. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళల్లోని మంచి గుణం ఏదో గుర్తించి అది నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. చెడుంటే దానివైపు వెళ్లకూడదు అని చెప్పిందండి’’.

‘‘వాళ్లల్లో నువ్వు చూసిన మంచి గుణాలేంటి?’’

‘‘శివ బొమ్మలు బాగా వేస్తాడండి. వాడి దగ్గర బొమ్మలెలా వెయ్యాలో నేర్చుకున్నాకే నాకు బయాలజీ రికార్డుకి మంచి మార్కులొస్తున్నాయండి’’.

ముకుందం, శివరాం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. పన్నెండేళ్ల పిల్లవాడు, ఎంత చక్కటి విలువలు నేర్చుకుంటున్నాడు! నిజంగా మురారి తల్లికి చెయ్యెత్తి నమస్కరించవచ్చు అనుకున్నారు వాళ్ళిద్దరూ. నెమ్మదిగా పాయింటుకొచ్చారు. ‘‘జయరాం కూడా నీ ఫ్రెండేనా?’’

‘‘ఊ... చాలా మంచి ఫ్రెండండి’’.

‘‘ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? అదే నోట్సుల గురించీ దాని గురించీ...’’

‘‘లేదండి. నేనేదయినా రాయడం మిస్సయితే వాడిస్తాడు. వాడేదైనా మిస్సయితే నేనిస్తాను’’.

‘‘ర్యాంకులెలా వస్తుంటాయి మీ ఇద్దరికీ’’.

‘‘ఎక్కువ తేడాలుండవండి’’.

అంత పెద్ద సైకాలజిస్టులకే అర్థంకాలేదు. ఇంత సూటిగా స్పష్టంగా దృఢవిశ్వాసంతో సమాధానాలు చెప్తున్న ఈ అబ్బాయి కాపీ కొట్టడమేంటి? ఒకవేళ టీచరేమైనా పొరబాటు పడిందా? అదే సూటిగా అడిగారు.

‘‘నువ్వు జయరాం పేపర్లోంచి కాపీ చేశావా?’’

మాట్లాడలేదు మురారి. తల వంచుకున్నాడు.

‘‘నువ్వు జయరాం పేపరు చూసి కాపీ కొడుతున్నట్టు మీ టీచర్‌ చెప్పారు. అది అబద్ధమా?’’

చటుక్కున తలెత్తాడు మురారి. తల అడ్డంగా ఊపాడు.

‘‘అంటే...’’

‘‘లలితా టీచర్‌ అబద్ధం చెప్పరండి’’.

‘‘అంటే నీకు అన్నీ తెలిసే చేశావన్నమాట!’’

మళ్ళీ తలొంచుకున్నాడు.

‘‘కాపీ కొట్టడం తప్పని నీకు తెలుసు...అవునా?’’

అవునన్నట్టు తలూపాడు.

‘‘నువ్వు రాసినదానికే నువ్వు క్లాసులో మొదటి మూడు ర్యాంకుల్లో వచ్చే అవకాశం ఉంది. అవునా..?’’

మళ్ళీ తలూపాడు.

‘‘మరి కాపీ ఎందుకు కొట్టావ్‌?’’

‘‘ఫస్టుర్యాంకు కోసం’’ వెంటనే అన్నాడు.

‘‘ఫస్టు ర్యాంకే ఎందుకు? ఇదేమీ హాఫియర్లీనో యాన్యువలో కాదు కదా! యూనిట్‌ టెస్టులు. ఫస్ట్‌ ర్యాంక్‌ కోసం అంత పట్టు ఎందుకు?’’

మళ్ళీ తలొంచుకున్నాడు మురారి.

‘‘చెప్పు... ఫస్టు ర్యాంకే ఎందుకు?’’ 

రెట్టించాడు శివరాం.

నెమ్మదిగా గొంతు విప్పాడు మురారి.

‘‘నాకు ఫస్టుర్యాంకు రాకపోతే మా నాన్న మా అమ్మని కొడతాడండి. అందుకు...’’ తడబడింది మురారి గొంతు. చప్పున కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేశాయి. అదిమిపట్టిన దుఃఖం గొంతువరకూ వచ్చి మాటని అడ్డుకుంది. తెల్లబోయారు అడిగిన ఇద్దరూ. పక్క రూములో కూర్చుని వింటున్న వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు.

మంచి నైతిక విలువలతో పెరుగుతున్న పన్నెండేళ్ళ కుర్రవాడు, జీర్ణించుకున్న ఆ విలువల్ని అట్టడుగుకి నొక్కిపెట్టి, అస్సలు ఇష్టం లేనిపని ‘కాపీ కొట్టడం’ అనేదాన్ని కేవలం తన తల్లి, తండ్రి చేతిలో దెబ్బలు తినకుండా ఉండాలని చేసి, పట్టుబడి, దోషిగా అందరిచేతా ప్రశ్నంచబడుతూ, విపరీతమైన మానసికక్షోభ అనుభవించడం చూస్తుంటే అంత పెద్ద మానసిక విశ్లేషకులిద్దరికీ కంటనీరు తిరిగింది. అదే కనక తల్లి ఆదరణ కూడా లేని పిల్లవాడయితే అటువంటి పరిస్థితికి ఏ అఘాయిత్యమో చేసుకునే ప్రమాదం కూడా ఉందని వారికనిపించింది.

పక్క రూములో ఉన్న వైదేహీ వెక్కిళ్ళు వినపడకుండా పమిట చెంగు నోటికి అడ్డుపెట్టుకుంది. కొడుకు పడిన మానసిక క్షోభ అర్థమై, చలపతిలోని తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. విషయం తెలిసిన హెచ్‌.ఎమ్‌., క్లాస్‌టీచర్‌ అసలు రోగమేమిటో తెలుసుకుని తెల్లబోయారు. వెళ్తూవెళ్తూ సైకాలజిస్టు ముకుందం, సైకియాట్రిస్టు శివరాం కూడా మురారికి ఏ కౌన్సిలింగూ అవసరంలేదనీ అసలు దాని అవసరం మురారి తండ్రి అయిన చలపతికుందనీ, అతనిని కౌన్సిలింగుకి రికమెండు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని