యజ్ఞబలి

ఓట్లు వేసే రోజు దగ్గర పడ్తున్నకొద్దీ ఎలక్షన్ల ప్రచారం లొల్లి జోరందుకుంటున్నది. రెండు పక్షాలవాళ్లూ ఎత్తుల మీద ఎత్తులేస్తున్నారు. సుధాకర్‌రెడ్డి పోయిన రెండు

Published : 10 Apr 2020 13:19 IST

ముదిగంటి సుజాతారెడ్డి

ట్లు వేసే రోజు దగ్గర పడ్తున్నకొద్దీ ఎలక్షన్ల ప్రచారం లొల్లి జోరందుకుంటున్నది. రెండు పక్షాలవాళ్లూ ఎత్తుల మీద ఎత్తులేస్తున్నారు. సుధాకర్‌రెడ్డి పోయిన రెండు ఎలక్షన్లల్ల గెల్చినట్లుగనే గెలుస్తనని, తనకేం ఢోకా లేదని మహా ధీమాగ వున్నడు. కాని మెలమెల్లగ ఎదుటి పక్షంలోని శివారెడ్డి పొలుసులు ఒక్కొక్కటి ఊడిపోతుంటె చూసి పరేషాన్‌ల పడుతున్నడు. శివారెడ్డిని తక్కువ అంచనా వేసినందుకు తనను తాను తిట్టుకుంటున్నడు. ఇప్పుడతన్ని తల్చుకుంటేనే సుధాకర్‌రెడ్డి గుండె కుమ్ముల పెట్టిన మొగరం గడ్డ లెక్క తుకతుక ఉడుకుతున్నది. శివారెడ్డి తన ముందల తన చేతికింద పెరిగిన పొల్లగాడు. రెండు ఎలక్షన్లల్ల చేతులు పిసుక్కుంటు తన ముందల నిలబడనీకె జడుసుకుంటు పనిచేసిండు. అసొంటోనికి ఏదో అడిగిండు గద, పాపం పోనీ అని తన వడ్లగిర్నీని ‘నడిపించుకొని బతుకుపోరా’ అని ఇచ్చిండు. నాలుగేండ్లల్ల రెండు వడ్లగిర్నీలను సొంతంగ పెట్టుకున్నడు. మస్తు సంపాయించిండు. ఇప్పుడు తనకే పోటీగ ఎలక్షన్ల నిలబడ్డడు. ఎంతగనం బలిసింది వీనికి... సుధాకర్‌రెడ్డి ఆలోచించుకుంట హాలులో అటు యిటు తిర్గుతున్నడు. అతని బామ్మర్ది క్రిష్ణారెడ్డి అప్పుడే హాల్లోకి ఆగమాగంగ వచ్చిండు.

‘‘బావా! ఇట్టయితే మన పని అయినట్లే!’’ అన్నడు. సుధాకర్‌రెడ్డి తిర్గుడు ఆపి బామ్మర్ది వైపు చూసిండు. ‘‘బావా! మీరు చేతులు కట్టుక కూసుంటె మన పని అయిపోతది. శివారెడ్డి గెల్చి అసెంబ్లీల కూసుంటడు. మీరు ఇంట్ల కూసుంటరు. పార్టీ ఇచ్చిన పైసల మట్టుకే ఖర్చుపెట్టి మీరు ఊకుంటె వాడేమో పైసలు ఇష్టమొచ్చినట్లుగ గుప్పిస్తున్నడు. పైసలదేముంది ఇయ్యాల పోతె రేపు ఎమ్‌ఎల్‌ఏ అయినంక సంపాయిస్తననుకుంట ఎగజల్లుతున్నడు. జనం వాని పైసలు తిని వాని పాటే పాడ్తున్నరు. వాని భజనే చేస్తున్నరు. ఏదయిన చెయ్యిండ్రి బావా! లేకపోతే వ్యవహారం మన చేతుల్నుంచి బిసికిపోయేటట్లున్నది. చేతులు కాలినంక ఆకులు పట్టుకుందమంటె అయ్యే పని గాదు’’ క్రిష్ణారెడ్డి మాటలు సుధాకర్‌రెడ్డికి చురక ముట్టించినయి. గుండెల్లో మంట లేపినయి.

పోయిన రెండు ఎలక్షన్లల్ల క్రిష్ణారెడ్డి బావ కింద కార్యకర్తగ పనిచేసిండు. అతనేగాక కొమురయ్య, జంగారెడ్డి, పాపిరెడ్డి, సోమయ్య, యాదగిరి... అతని కోసం పానాలయిన ఇచ్చే పానాలైనా తీసే కార్యకర్తలందరూ కట్ట కట్టుకొని వచ్చి అక్కడ్నె నిలబడ్డరు.

సుధాకర్‌రెడ్డి రజాకార్ల జమానల ఊరి చుట్టూ వున్న సర్కారు బంజరు భూములను తహసీల్దారుకు అంతో ఇంతో ముట్టజెప్పి తన పేర చేయించుకున్నడు. వందల ఎకరాలు సొంతం చేసుకున్న ఆ భూముల నుంచే వ్యవసాయానికి పనికిరాని పలుగురాళ్లు నిండిన భూమిని ఇరవై ఎకరాలు వినోబా భావేకు దానంచేసి ఆ ఇలాకాల్నే ఆయనంత దానకర్ణుడు లేడని పేరు సంపాదించుకున్నడు. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ బంజరు భూముల నుంచే గులకరాళ్లు రాతిగుండ్లు నిండిన ఇరవై ఎకరాల భూమిని భూమిలేని దళితులకు దానం చేసి పట్టాచేసి పెద్ద ధమాకాతోటే కొత్తగా పెట్టిన పార్టీల చేరిండు. ఎలక్షన్ల ఎమ్‌ఎల్‌ఏగ పార్టీ టికెట్టు సంపాయించిండు. మొదటి ఎలక్షన్ల కాన్నుంచి రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎదురులేకుంట గెలుస్తున్న గారెల భూపతిని భారీ మెజారిటీ ఓట్లతోటి సునాయాసంగ ఓడించిండు. పార్టీ పెద్దల మెప్పును పొందిండు. ఎలక్షన్ల ఆ కొత్త పార్టీయే భారీ మెజారిటీ సీట్లను సంపాదించింది. గారెల భూపతి అసొంటి నాయకున్ని, ఎవరూ రాయదుర్గం నుంచి అతన్ని కదిలించలేరనుకున్నాన్ని ఓడించినందుకు సుధాకర్‌రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందనే అనుకున్నరు అందరు. కానీ కులాల మతాల ప్రాంతాలవారీగా మంత్రి పదవులను పంచేసరికి సుధాకర్‌రెడ్డి వంతు రాలేకపోయిందని ముఖ్యమంత్రి చింత జతాయించిండు. మంత్రి పదవి లేకుంటేంది, ఏమైన చైర్మన్‌ పదవి జూస్తాంలే అన్నడు. కానీ సుధాకర్‌రెడ్డికి ఏ పదవీ రాలేదు.

ఐదేండ్లు తిరగనే తిరిగినయి. మల్లి ఎలక్షన్లు వచ్చినయి. సుధాకర్‌రెడ్డి ఈపారి గూడ భూపతిని చిత్తుగ ఓడించిండు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అధికారంలో ఎదురులేక వుంటున్న ఏకైక పార్టీ ఎమ్‌ఎల్‌ఏ భూపతి! ఆ పార్టీ నుంచి విశ్రాంతి తీసుకుంటనన్నడు. ఆ ఓటమితో అస్త్రసన్యాసం చేసి రాజకీయాల నుంచే తొలగిపోతున్ననని ప్రకటించిండు. దాంతోటి సుధాకర్‌రెడ్డికి ఆపారి మంత్రి పదవి తప్పదని అందరు అనుకున్నరు. కాని పార్టీ అధిష్ఠానం ఏమనుకుందో ఏమో ఈపారి కూడా అతనికి మంత్రి పదవినియ్యలేదు. తనకు మంత్రి పదవి ఎందుకు రాలేదో అతని మెదడుకు అంతుపట్టలేదు. అయినా నిమ్మలంగనే ఊర్కున్నడు. కాని లోలోపల మంటలు రాజేసిండు. నాయకున్ని చూసి అతని పక్షంలో పనిజేసిన కార్యకర్తలకు కోపం నసాళమంటింది. అసొంటివాళ్ళను ఉసికొల్పటం అతనికి కష్టమేమి కాదు. అతని చిన్నబోయిన ముఖమే వాళ్ళల్లో ఆవేశాన్ని నింపింది. ఇక చూస్కో, ఆవేశాన్ని ఆపుకోలేక దొర్కిన బస్సులను కాల్చేసిండ్రు. నడుస్తున్న బస్సుల మీద రాళ్లు రువ్విండ్రు. రోడ్ల బీభత్సం సృష్టించిండ్రు. దుకాణాలను, బడులను మూయించేసిండ్రు. రైళ్లను ఎక్కడికక్కడే ఆపేసిండ్రు. దొరికిన కార్లకు, మోటారు సైకిళ్ళకు నిప్పు పెట్టిండ్రు. అయినా ముఖ్యమంత్రి ఉల్కలేదు. పార్టీ అధిష్ఠానం పల్కలేదు. దాంతో సుధాకర్‌రెడ్డి అలిగిండు. పోయి అసెంబ్లీల తన పార్టీ ఎమ్‌ఎల్‌ఏలకు దూరంగ కూసుండు. ఇదంత ముందల ముందల ఎంత నుక్సాన్‌ తేనుందో పార్టీ ఊహించలేదు. అంతే! పోయినసారి వచ్చినంత మెజార్టీ పార్టీకి రాలేదు. పార్టీ మెజార్టీకి అటు ఇటు ఊగిసలాడుతున్న గవర్నరు చేసేదేంలేక ఇచ్చిన అనుమతితో ప్రభుత్వం ఏర్పడింది. ఏ గాలివాన వచ్చినా కూలిపోయే గుడిసె లెక్కనే వుంది, ప్రభుత్వ పరిస్థితి. ఆ గాలివాన సుధాకర్‌రెడ్డి కావచ్చుననే సంగతి పార్టీ అధినేతలు ఊహించలేక పోయిండ్రు!

అసెంబ్లీల సుధాకర్‌రెడ్డి మొదట తన పార్టీ పనితీరు మీద విసుర్లు విసిరిండు. మెల్లెగ ఆ విసుర్లు గంభీరమైన ఆరోపణల కిందికి దిగినయి. ఆ పార్టీ బీద రైతులకు, రైతు కూలీలకు ఏమి చేస్తలేదని అన్నడు. వేలకొద్ది ఎకరాల బంజరు భూములను భూమిలేని పేదలకు పంచటంలో విఫలమైందన్నడు. మైనారిటీలకు ఏం చేయటంలేదని ఆవేశంగ అసెంబ్లీల మాట్లాడిండు. తెల్లారి ఈ ప్రభుత్వం పార్టీ బీదల అభివృద్ధి నిరోధమైందని చెప్పి ఈ పార్టీతోటి తెగదెంపులు చేసుకుంటున్ననని ప్రకటించిండు. ఆ మర్నాడు ప్రతిపక్షం పార్టీ నాయకునితో డిన్నరు చేస్తున్నట్టుగ ఇద్దరు పకపక నవ్వుకుంటు చేతులు కలుపుకొంటున్నట్లుగ అన్ని పత్రికల్లో ఫొటోలు పడ్డయి. టీవీ వార్తల్ల కన్పించిండ్రు. అంతే మళ్లీ అసెంబ్లీ సెషన్ల ఏం జరగనట్లుగనే సుధాకర్‌రెడ్డి పార్టీ సీట్లనే కూర్చున్నడు. కాని అతని పథకం ప్రకారం అదే రోజు ప్రతిపక్షం అధికార పార్టీకి మెజారిటీ లేదని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. సుధాకర్‌రెడ్డి మాటలకు పడిపోయి పైసలకు అమ్ముడుపోయిన అధికార పార్టీలోని మరో నలుగురు ఎమ్‌ఎల్‌ఏలు తటస్థంగ వుండేసరికి అవిశ్వాస తీర్మానం గెల్చింది. సుధాకర్‌రెడ్డి వ్యూహం ఫలించింది. ఎలక్షన్లయి ఏడాది కానే కాలేదు. అయినా చేసేదేమీ లేక గవర్నరు అసెంబ్లీని రద్దుచేసి మల్ల ఎలక్షన్లు పెట్టాలన్నడు. అందుకే ఈ అసెంబ్లీ ఎలక్షన్లు!

ప్రతి నియోజకవర్గంలో పోటీ గట్టిగనే వుంది. ఇక తమ అధికారానికి ఎసరుపెట్టిన సుధాకర్‌రెడ్డిని ఎట్లనన్న చేసి ఓడించాల్నెని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మస్తుగ డబ్బు కుమ్మరిస్తడనే ఆ పార్టీ శివారెడ్డిని సుధాకర్‌రెడ్డికి పోటీగ నిలబెట్టింది. గత రెండు ఎలక్షన్లల్ల సునాయాసంగ గెల్చిన సుధాకర్‌రెడ్డి తనకు శివారెడ్డి గట్టి పోటీ అనుకోలేదు. అందుకని అల్కగనే గెలస్తనని ధీమాతోటి ఉన్నడు. కాని ఇప్పుడు బామ్మర్ది మాటలు విన్నంక కుంభకర్ణుడు నిద్రల నుంచి లేచినట్లు అయిండు. కార్యకర్తలందరి వైపు చూసిండు. ఈ కార్యకర్తలందరి మీద బామ్మర్ది క్రిష్ణారెడ్డి నిఘా పెట్టి మంచిగనే ప్రచారం చేస్తుండు. ఇగ సుధాకర్‌రెడ్డి పెద్దకొడుకు రాఘవరెడ్డి ఎలక్షన్ల ప్రచారంల ఎప్పటిలెక్కనే తిండి తిప్పలు మర్చిపోయి నియోజకవర్గంలోని ఊరూరు తీర్గుతనే వున్నడు. రాఘవరెడ్డి కొద్దిగ ఆవేశపరుడు. ఇంకా తండ్రి తీరుగ నిమ్మలంగ ఆలోచించుడు నేర్చుకోలేదు. రాజకీయాల నాడిని పట్టుకోలేదు. కాని ఎన్నడో తన తర్వాత రాజకీయాల్లో వారసుడు అతడే అని సుధాకర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే చిన్నకొడుకు పట్నంల సి.ఏ.గ మంచిగ సంపాయిస్తున్నడు. కూతురు పెండ్లయింది. అల్లుడు డాక్టరు. పట్నంల పెద్ద దవాఖానల సర్జన్‌గ బాగా సంపాయిస్తున్నడు. బిడ్డకు, అల్లునికి రాజకీయాల అఆలు తెల్వదు. పెద్దకొడుకు తండ్రితోటి తిరుగుతుంటే అతని భార్య ఇద్దరు కొడుకులను చదివించుకుంట పట్నంలనే వుంటున్నది.

సుధాకర్‌రెడ్డి బామ్మర్ది మాటలు విని పరేషానయిండు. పోయిన రెండు ఎలక్షన్ల లెక్కనే ఖర్చు పెడ్తనే వున్నడు. అయిన బామ్మర్ది అట్లన్నడంటె ప్రతిపక్షంలోని శివారెడ్డి బాగనే పైసలు గుప్పుతున్నడని అనుకోవాలె! సుధాకర్‌రెడ్డి తలతిప్పి కార్యకర్తల వైపు చూసిండు. వాళ్ళంతా చాల నమ్మకస్తులు. తనంటె తల కోసిస్తరు. తనూ వాళ్లను ఈ ఐదారేండ్ల సంది ఏదో ఒకటిచ్చి సంతోషపెడ్తనే వున్నడు. వాళ్ల కష్టసుఖాలను కనిపెట్టుకుంటనే వున్నడు. ఈపారి తను గెలిస్తే మంత్రి పదవి రావటం పక్కా! దాంతోటి వాళ్ల దశ మార్తుందని వాళ్లకూ ఎర్కనే! ఎట్టనన్న తను గెలువాల్ననే వాళ్లు పట్టుదలతో తండ్లాడ్తున్నరు. ఇక కొడుకు రాఘవరెడ్డి రాత్రనక పగలనక ఎండల్ల ఉడుకపోతల ఊర్లు తిరుక్కుంట ప్రచారం చేస్తున్నడు- ఆలోచనల్ల మునిగిపోయిన సుధాకర్‌రెడ్డికి ‘‘బావా!’’ అన్న బామ్మర్ది పిలుపు మశ్లా వినిపించింది. వెంటనే కండ్లు విశాలమైనయి. జూలు దులిపిండు. వేటకు బయలెల్లే సింహం లెక్క అయిండు.

‘‘రేపే ఒక సభ పెట్టుండ్రి. ఎంత ఖర్సయిన ఫర్వలేదు. లారీలతోటి జనాన్ని తోలుక రండ్రి. ఆ సభ జూసి శివారెడ్డి గుండెలదిరిపోవాలె!’’ అన్నడు.

సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిండ్రు. రోజు కూలీ ఇస్తం బిర్యానీ పొట్లాల్నిస్తం. లారీల తోల్కపోయి యిడుస్తమన్నంక జనం రాకుంట ఎట్లుంటరు? సభలో అందరికన్న ఆఖర్న సుధాకర్‌రెడ్డి మాట్లాడిండు. ఆవేశంగ గట్టిగ మాట్లాడిండు. రాయదుర్గంకు మార్కెట్‌ను తెప్పిస్తనన్నడు. పంట రాంగనే రైతులకు మంచి ధరలు పలికేటట్లు చేస్తనన్నడు. పెట్టుబడులు పెట్టి కష్టపడ్డ రైతులు నష్టంపాలు కావొద్దన్నడు. ఇరవైనాలుగ్గంటలు కరెంటు వుండేటట్లు చేస్తనన్నడు. రైతులకు విత్తనాలు, ఎరువులు మేలు రకం దొరికేటట్లు చూస్తనన్నడు. బ్యాంకు అప్పులు అందరికి ఇప్పిస్తనన్నడు. వృత్తిపనుల వాళ్లకు న్యాయం జేస్తనన్నడు. ఏడాది పొడుగునా అందరికీ కూలీనాలీ దొరికేటట్లు పనులు, పథకాలు ప్రభుత్వం నుంచి తెస్తనన్నడు. భూమిలేని పేద రైతులకు, కూలీలకు ప్రభుత్వం భూములను పంచేటట్లు చేస్తనన్నడు. ‘‘...అయితే మీరంతా ఒక్కటి గుర్తు పెట్టుకోండ్రి. జొన్నకంకి గుర్తుకే ఓటు వేయండ్రి’’ అని రెండు చేతులూ పైకెత్తి నమస్కరించి కూర్చున్నడు.

సుధాకర్‌రెడ్డి వరాలన్నీ విని జనం సంతోషంతోటి చప్పట్లు కొట్టిండ్రు. ‘సుధాకర్‌రెడ్డికి జై!’ అన్న కార్యకర్తల అరుపులకు జనం జేకొట్టి పులకించి పోయిండ్రు. సభ బాగ జరిగిందని ప్రతిపక్షంలో కలకలం చెలరేగిందని కార్యకర్తలు ఖుషీ అయిండ్రు. రాఘవరెడ్డి మొదలుకొని కార్యకర్తలందరు ఆ రాత్రి మంచిగ నిద్రపోయిండ్రు. కాని వాళ్ల ఖుషీ ఎక్కువసేపు నిలువలేదు. తెల్లవారంగనే యాదగిరి ఊర్లె నుంచి ఉరుక్కుంటు వచ్చిండు.

‘‘అన్నా, అన్నా...’’ ఒగిరించుకుంట నిలబడ్డడు. సుధాకర్‌రెడ్డి కనుబొమలు ముడివేసిండు. రాఘవరెడ్డి ఆత్రంగ బయటికి వచ్చిండు.

‘‘ఏమైంది యాదగిరి?’’ అని అడిగిండు.

‘‘అన్నా, శివారెడ్డి భార్య పొద్దున్నె ఇంటింటికి పోయి నొష్ట బొట్టు పెట్టి ఆడోళ్లకు చీరెలు పంచుతుందన్న! అక్కా చెల్లె వదిన మరదలా అమ్మ అవ్వ అని పిల్చుకుంట శివారెడ్డికే ఆంబోతు గుర్తుకే ఓటు వెయ్యమని చెప్తుందన్న!’’ అని యాదగిరి చిన్నబోయి, ఏడ్చేదే తక్కువగ నిలబడ్డడు. ఇంతల జంగారెడ్డి ఇంకా కార్యకర్తలందరు అక్కడ చేరిండ్రు. క్రిష్ణారెడ్డి ఇంట్లనే వున్నడు. బయటికి వచ్చి నిలబడ్డడు.

సుధాకర్‌రెడ్డి ఈ కీలుకేం వాత పెట్టాల్నా అని ఆలోచిస్తున్నడు. పెద్దపెద్ద అంగలేసుకుంట హాలులో తిరగబట్టిండు. కొంచెంసేపటికి టక్కున ఆగిండు. ‘‘విన్నవా క్రిష్ణారెడ్డి, ప్రతిపక్షం వాళ్లేం జేస్తున్నరో!’’ అన్నడు.

‘‘అంత తెల్సింది. మనం వరాలతోటి ఊర్కుంటె పని గాదు’’ అన్నడు క్రిష్ణారెడ్డి ఆవేశంగ.

‘‘ఐతే ఏదో ఓటి చెయ్యుండి. నేను వద్దంటున్నన!’’ అని కుర్చీల కూలబడ్డడు సుధాకర్‌రెడ్డి. రాఘవరెడ్డి వైపు చూసిండు నువ్వేమంటవన్నట్లుగ.

‘‘సరే! ఇయ్యాల్నుంచే మనం మగోళ్లకు కల్లు, సారా తాగించే ప్రోగ్రాం పెట్టుకుందం. ఆడోళ్లకు చీర రైక బట్టలు పంచుదాం. అట్లనే పనుల కోసం పట్నం వలస పోయినవాళ్లను బస్సు, రైళ్ల కిరాయలిచ్చి ఓట్ల రోజు ఊరికి వచ్చేటట్లు చేద్దాం. ఆ ఓట్లన్నీ మనకే పడ్తయి. దానికోసం పైసలతోటి కార్యకర్తలను పట్నం పంపుదాం’’ అన్నడు రాఘవరెడ్డి.

‘‘అందరు ఒక్కచోట చేరకుండ్రి. తలో దిక్కుపోయి ఆ పనులేందో చేయండ్రి. ఇగ ఎక్కువ టైమ్‌ లేదు. ఒక్కరోజే వుంది. రేపు అద్దరాత్రి మట్టుకు అన్ని పనులైపోవాలె’’ అన్నడు సుధాకర్‌రెడ్డి. రాఘవరెడ్డితోపాటు కార్యకర్తలందరు దబదబ తలోదిక్కు వెళ్లిపోయిండ్రు. ఆ రోజంతా అదే కార్యక్రమంల మునిగిపోయిండ్రు. అర్ధరాత్రి దాటినంక ఇండ్లు చేరుకున్నరు. మళ్ల పొద్దన్నె ఇదే కార్యక్రమం మిగిలిన ఊర్లల్ల కొనసాగించాలె అనుకుండ్రు. మర్నాడు అర్ధరాత్రి వరకే గడువు. ఏ ప్రచారం చేసిన ఆ అర్ధరాత్రి దనుకనే!

‘‘తాగిన లంజకొడుకెవడైన మరచిపోకుంట తప్పక మనకే ఓటేస్తడు! తాగిన విశ్వాసమసొంటిది!’’ అన్నడు సారా ప్యాకెట్లు పంచి వచ్చిన కొమురయ్య.

‘‘ఆఁ... రేపు పొద్దుగాల్నె రండ్రి. మళ్ల కార్యక్రమంల దిగాలె!’’ అని హెచ్చరించిండు రాఘవరెడ్డి చిరునవ్వుతో. అప్పుడే అర్ధరాత్రి దాటింది. ‘ఇంక ఇరవై నాలుగ్గంటలన్న లేవు ప్రచారానికి. రేపు అర్ధరాత్రికి అంత ముగుస్తది’ అనుకొని పక్కల పడిపోయిండు రాఘవరెడ్డి. అతనికి అలసిపోయి నిద్ర ముంచుకొస్తున్నది.

కుక్కలు మొరుగుడు ఆగిపోయిందో లేదో కోళ్లు కూసిన చప్పుళ్లు వినిపించినయి. ఎవరో గేటు దగ్గర ‘‘బావా, బావా!’’ అని, ‘‘అన్నా, అన్నా!’’ అని లాశిగ అరుస్తున్నట్లు వినిపించింది. సుధాకర్‌రెడ్డి లేచి ఆదరబాదరగ హాలులోకి ఉరికిండు. అంతల్నే రాఘవరెడ్డి, క్రిష్ణారెడ్డి అక్కడ చేరిండ్రు. గేటు పాటకులు తీయంగనే జంగారెడ్డి తోటి కార్యకర్తలందరు జమయిండ్రు.

‘‘ఏంది? ఏమైంది?’’ ఆత్రంగ అడిగిండు సుధాకర్‌రెడ్డి. ఒక్కరూ నోరు విప్పలేదు.

‘‘ఏమైంది, చెప్పుండ్రి’’ రాఘవరెడ్డి గద్దించిండు. క్రిష్ణారెడ్డి అయోమయంగ కార్యకర్తల వైపు చూసిండు. ‘నాకు ఎర్కలేంది వీళ్లకేం ఎర్కయిందబ్బ’ అనుకున్నడు.

‘‘మనం అనుకోంది అయిందన్న’’ అన్నడు జంగారెడ్డి.

‘‘అదేందో జల్ది చెప్పు’’ అరిచిండు సుధాకర్‌రెడ్డి.

‘‘శివారెడ్డి సినిమావోళ్లను పిలిపించి ఈ రోజు అద్దరాత్రిదాక ఆట పాటల ప్రోగ్రాం పెట్టించిండంట అన్నా. సినిమావోళ్లంటె జనానికి ఎంత పిచ్చి వుంటదో అందరికీ ఎర్కే. సినిమావోళ్లను చూసి జనం ఊగిపోతరు. ఇగ వాళ్లేం జెప్తరో గదే జేస్తరు’’ అన్నడు జంగారెడ్డి నేలవైపు చూపులేసి. అక్కడ చేరిన కార్యకర్తలందరి మొఖాలు తెల్లబోయి వున్నయి.

‘‘వడ్ల గిర్నీల మీద సంపాయించిన నల్లధనమంతా గులగులమంటున్నది  వీనికి. దాన్నంత గుప్పుతున్నడు’’ కోపావేశంతో సుధాకర్‌రెడ్డి కండ్లు ఎర్రగయినయి. ‘తీన్‌ పత్త ఆటల ఒక్కొక్క పత్త తీసినట్లుగ చేస్తున్నడు శివారెడ్డి. వాని ఆట కట్టించాలె’ మనసులోనే అనుకున్నడు.

‘‘అన్నా, వీనికెన్ని గుండెలు! నిన్ను ఓడించేటందుకు ఎన్ని ఆటలాడ్తున్నడు. ఈ ఒక్క రోజుల మనమూ ఏదన్న చేసి చూపించాలె, వీని మూతి మీద తన్నినట్లుగ’’ అన్నడు పాపిరెడ్డి.

‘‘అన్నా, ఒక్క రోజెక్కడుందింక. కొన్ని గంటలే మిగిలినయి ప్రచారానికి. ఎట్లనన్న జేసి ఏమైన జెయ్యాలన్న’’ పాపిరెడ్డి అంత చల్లగ లేడు జంగారెడ్డి, ఆవేశంతో ఊగిపోతున్నడు.

బోనుల సింహంలెక్క తిర్గుతున్న సుధాకర్‌రెడ్డి టక్కున ఆగిపోయిండు. అతని కండ్లు రక్తపూరితమైనయి. ఎర్ర గుల్మాలలు పూసినట్లున్నయి. ఆ ప్రశాంతత వెన్క పెద్ద తుపాను వచ్చే జాడలున్నయని ఎవరకీ ఎర్క కాలేదు.

‘‘సరే! ఏదైతే అదయింది. మీరు ఇయ్యాల గూడ ఆ సారాకల్లు జనానికి తాపిచ్చే కడమ కార్యక్రమం సాగించుండ్రి’’ శాంతంగ అన్నడు సుధాకర్‌రెడ్డి.

తండ్రి మాటలు వినంగనే ‘‘పదండ్రి పొద్దుగాల్నే పోదాం’’ అని రాఘవరెడ్డి కార్యకర్తల దిక్కు తిరిగి, వాళ్లు ఏయే ఊర్లకు పోవాల్నో చెప్పిండు. కార్యకర్తలను తరుముతున్న కొడుకువైపు పరీక్షగ చూసిండు సుధాకర్‌రెడ్డి. రాఘవరెడ్డి లోపలికి పోయి క్షణంల తయారై బయటికి వచ్చిండు. కార్యకర్తలందరూ అతని వెనుకెంబటే కదిలిండ్రు. ఇదంతా నిశ్శబ్దంగ చూస్తున్న సుధాకర్‌రెడ్డి తలలో ఏమో ఆలోచనలు నడుస్తున్నయి. ఆ ఆలోచనల ఒత్తిడితో తన మెదడులో రక్తనాశాలు చిట్లిపోతయేమోననిపించిందతనికి. తలనొప్పిగ బరువుగ వుంది. పార్టీ అధిష్ఠానం తన గెలుపు ఖాయమని ఒక దిక్కు లెక్కలేసుకుంటున్నది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లున్నది. ఇప్పుడీ ఎలక్షన్ల గెల్వకపోతె తన మంత్రి పదవి మీది ఆశకు బొంద పెట్టవల్సిందే! అస్సలు తన రాజకీయ జీవితమే ఖతమైతదేమో. అటు యిటు అంగలేస్తున్న సుధాకర్‌రెడ్డి టక్కున ఆగిండు. అతని మొఖం నల్లబడింది. వెళ్లిపోతున్న కార్యకర్తల దిక్కు చూసిండు.

‘‘జంగారెడ్డి!’’ అని అరిచిండు. జంగారెడ్డి గుంపులో నుంచి వెనకకు తిరిగి వచ్చిండు. తనతోటి రమ్మన్నట్లుగ కండ్లతోనే సైగజేసి పక్కనున్న అర్రలోపటికి పోయిండు.

అర్రల ఇంకెవరూ లేరు. జంగారెడ్డి ఒక్కడే సుధాకర్‌రెడ్డి ముందల నిలబడ్డడు. సుధాకర్‌రెడ్డి మొఖం నల్లగ, కండ్లు ఎర్రగ క్రూరంగ కన్పించినయి జంగారెడ్డికి. చానా సేపటి దనుక సుధాకర్‌రెడ్డి జంగారెడ్డితో మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు సుధాకర్‌రెడ్డి నోట్లె నుంచి వచ్చిన మాటలు స్పష్టంగా లేవు. తను విన్నది నిజమేన?- అని జంగారెడ్డి మొఖంల ఒక్క బొట్టు రక్తం లేకుంటయింది. రాయి లెక్క నిలబడ్డడు కొంచెంసేపు. మెల్లెగ జరజర సుధాకర్‌రెడ్డి మాటలు అతని మెదడులకు దిగినయి. వెంటనే అతని మొఖం నల్లగయింది. గంభీరంగ బయటికి వచ్చిండు. మస్తు వేదన అతని మొఖంల కన్పించింది. సుధాకర్‌రెడ్డి అన్నది నిజమేన! నమ్మలేకున్నయి ఆ మాటలు అనుకుంట- తప్పదనుకొని నిట్టూర్చి జంగారెడ్డి దబదబ ఉర్కుకుంటపోయి రాఘవరెడ్డి వెనుక నడిచే కార్యకర్తలను అందుకున్నడు.

క్రిష్ణారెడ్డి కార్యకర్తలతో పోలేదు. ఎప్పటిలెక్క బావకు సాయంగ ఇంట్లనే వున్నడు. రాఘవరెడ్డి కార్యకర్తలతోటి వెళ్లిపోయిం తర్వాత క్రిష్ణారెడ్డి సుధాకర్‌రెడ్డి దగ్గరికి వచ్చిండు. బావ మొఖంమీద విషాద ఛాయలు చూసి ఆగిపోయిండు.

‘‘ఏంది? ఏం చేయదలుచుకున్నవ్‌ బావా?’’ అన్నడు.

‘‘ఏంలేదు. నువ్వు పట్నం పోయి కోడల్ని, పిల్లల్ని తీస్కరాపో!’’

వాళ్లనెందుకు తీస్కరమ్మంటున్నడో క్రిష్ణారెడ్డికి అంతబట్టలేదు.

‘‘గీ లొల్లిల వాళ్లెందుకు?’’ అన్నడు మొఖమంత చిట్లించి.

‘‘కోడలు ఓటు వేస్తది గద! ఒక్క ఓటుకు కూడా ఒకొక్క పారి విలువ వుంటది. పోయి తీస్కరాపో! అట్లనే మనుమల మీదికి మనస్సు గుంజుతున్నది. జల్ది జీపుల పోయి తీస్కరా పో!’’ అని గెదిమినట్లుగ మాట్లాడిండు సుధాకర్‌రెడ్డి. కట్టె లెక్క నిలబడ్డ క్రిష్ణారెడ్డి మెల్లెగ ఇంట్లకు కదిలిండు. పట్నం పోతున్న సంగతి అక్కకు చెప్తనని.

ఇంకా దీపాలు వెలిగే వేళ కానేలేదు. పొద్దు గుంకినా సూర్యుని వెలుతురు మసకపడలేదు. అడవికి పోయిన పసులు ఇండ్లకు రానేలేదు. పిడుగులాంటి వార్త నియోజకవర్గమంతా దావానలం లెక్క చుట్టుకున్నది. పాపిరెడ్డి ఎవరో గెదుముతున్న తీరుగ ఉరుక్కుంటు చెమటలు కక్కుకుంట సుధాకరరెడ్డి తానికి వచ్చిండు.

‘‘అన్నా... అన్నా... ఏం జరిగిందో విన్నవా!’’ అని గొడ్డు లెక్క అరుస్తూ ఏడ్చిండు.

సుధాకర్‌రెడ్డి ఏమైందని ఆడుగలేదు. అతని మొఖం కాలుతున్న అగ్గి మాదిరున్నది. ఇంతల జంగారెడ్డి, కొమురయ్యలు అరుచుకుంట వచ్చిండ్రు అక్కడికి. అప్పుడు సుధాకర్‌రెడ్డి నోరు విప్పి ‘‘ఏమైంది?’’ అని గంభీరంగ అడిగిండు. అతని గొంతు పూడుకుపోయి వుంది. జంగారెడ్డి కండ్లల్ల నీళ్లు నిండి వున్నయి. ‘‘మన రాఘవను... పట్టపగలే గొడ్డండ్లతో నరికి చంపిండ్రు అన్నా. గిదంత శివారెడ్డి మనుషుల పనే ఎవలో కాదు. నాకెరికే, అందరికీ ఎరికే! అప్పుడే పోలీసులు శివారెడ్డి మనుషుల కోసం దేవులాడుతుండ్రు’’ పాపిరెడ్డి ఒకదిక్కు కోపంతో మరో దిక్కు ఏడుస్కుంట చెప్పిండు. ఇక కొమురయ్య చిన్నపిల్లగాని తీరుగ వెక్కివెక్కి ఏడుస్తుండు.

సుధాకర్‌రెడ్డి కండ్లు చింత నిప్పులోలె వున్నయి. ఇంటి లోపల్నుంచి పెద్దగ ఆడోళ్ల ఏడ్పులు విన్పించినయి. అప్పుడే క్రిష్ణారెడ్డి పట్నం నుంచి వచ్చిండు. కోడలు జీపు దిగి కొంగుతో మొఖం కప్పుకొని లోపలికి పోయింది. ఇద్దరు మనుమలు జోడు కోడె దూడల్లెక్క ఉన్నరు. వాళ్లు చక్కగ పోయి తాతను చుట్టుకున్నరు. ఇగ అప్పుడు సుధాకర్‌రెడ్డి దుఃఖమాగలేదు. మర్యాద కట్టలు తెంచుకొని బయట పడింది. ఎన్నడూ దేనికి కదలకుండ ఉండే సుధాకర్‌రెడ్డి బావురుమని పెద్దగ ఏడ్చిండు. అది చూసి అక్కడ చేరిన కార్యకర్తలు, ఊరి జనం ఏడ్వబట్టిండ్రు.

రాఘవరెడ్డి హత్యను శివారెడ్డి చేయించండన్న వార్త నియోజకవర్గమంతటా క్షణంలో పాకిపోయింది. ‘‘పాపం! సుధాకర్‌రెడ్డి చెట్టంత కొడుకును పోగొట్టుకున్నడు. ఎలక్షన్లంటే గిట్ల మనుషులను నరుక్కునుడేన? ఇంత మటుకు మనకాడ ఇటువంటి పని కాలేదు. శివారెడ్డి మనుషులు ఎంత పని చేసిండ్రు! ఎంత తెగించిండ్రు!’’ అని కన్నీళ్లు కార్చనివాళ్లే లేరు.

నియోజకవర్గమంతట అర్ధరాత్రికి ముందే ప్రచారమంతా ఎక్కడక్కడ ఆగిపోయి శ్మశాన నిశ్శబ్దం నిండిపోయింది. సినిమావోళ్ళ కార్యక్రమం రద్దయింది. శివారెడ్డి లోలోపల్నే ఉడికిపోతున్నడు. పండ్లు పటపట కొరుకుతున్నడు. ప్రచారంల సుధాకర్‌రెడ్డిదే పైచేయి అయినందుకు మండిపడ్తున్నడు. కాని రాఘవరెడ్డి హత్యానేరం ఉత్తపుణ్యానికి తన కార్యకర్తల మీద పడ్తున్నది. పోలీసుల అనుమానం వెంటనే తన కార్యకర్తల మీద పడ్డది. అప్పుడే నలుగుర్ని ప్రశ్నించాలంటూ పోలీసులు స్టేషన్‌కు పట్టుకు పోయిండ్రు. ఈ హత్యను ఒప్పుకున్నదాక వాళ్లను దంచుతరు. బొక్కలను సున్నం చేస్తరు. కొంచెం చల్లబడ్డంకనే పైసలు గుప్పి వాళ్ళను విడిపించాలె. అంతదనుక ఏం చేసేటట్లు లేదు. శివారెడ్డి శివం పూనినోని లెక్క ఊగిపోయిండు.

పోస్టుమార్టం అయినంక రాఘవరెడ్డి శవాన్ని ఓ అర్ధరాత్రికి ఇంటికి తెచ్చిండ్రు. హాలులో అతని శవాన్ని ప్రజల దర్శనార్థం పెట్టిండ్రు. పూల దండల మధ్య అతని మొఖం ప్రశాంతంగ ఉంది. తలవైపు సుధాకర్‌రెడ్డి పార్టీ గుర్తు జొన్నకంకి బొమ్మను పెద్దది పెట్టిండ్రు. ‘జొన్నకంకి గుర్తుకే మీ ఓటు’ అన్న అక్షరాలు తాటికాయలంత కన్పించేటట్లు రాసిండ్రు. దానిమీద పార్టీ జెండాను వేలాడగట్టిండ్రు. రాఘవరెడ్డి తల్లీ, భార్యా ఇద్దరు కొడుకులూ శవం పక్కనే చేరి ఏడుస్తున్నరు. నియోజకవర్గంలోని జనమంతా రాఘవరెడ్డిని ఆఖరిసారిగ దర్శించుకోవాలని కదిలిండ్రు. గుంపులు గుంపులుగ చేరిన జనాన్ని బంగ్ల బయట కార్యకర్తలు ఒక లైన్‌లో లోపలికి పంపుతున్నరు. ఊరంతా బస్సులు, లారీలు, జీపులు, కార్లు, మోటార్‌ సైకిళ్ళతో కిటకిటలాడిపోయింది. పత్రికా విలేకరులు, టీవీ ఛానల్‌ వాళ్ళు వాళ్ళ కెమెరాలతో అటు ఇటు ఉరుకుతున్నరు. మరుసటి రోజంతా రేడియోలో ఇవే వార్తలు. ఇగ టీవీ చానళ్ళలో రాఘవరెడ్డి శవాన్ని రోజంతా దగ్గరగా చూపిస్తూ వార్తలను, హత్యా కథనాన్ని విన్పించారు. చిన్నలు పెద్దలు అందరూ అది చూసి ఆ రోజు తిండి తినలేక పోయిండ్రు. ఇంట్లనే శవమున్నట్లుగ అనిపించి ఆడవాళ్లు వంటలు చేయనే లేదు. ఆ రోజు సాయంత్రం పార్టీ అధినేతలందరూ చేరుకున్నంకనే రాఘవరెడ్డికి అంత్యక్రియల కార్యక్రమం మొదలైంది. శవాన్ని లారీలో అందరికి కనపడేటట్లుగా పెట్టి అతని తల వెనుక జొన్నకంకి బొమ్మతో పూలదండలతో అలకరించి ఊరేగింపుగ తీసుక పోయిండ్రు. ఆయన పెద్ద కొడుకు నిప్పు ముట్టించిండు. నిప్పు జ్వాలలు పైకి లేవంగానే జనం ఉద్రేకపూరితమై పోయిండ్రు. వాళ్ల దుఃఖం పొంగిపొర్లింది. ‘రాఘవరెడ్డికి జై! రాఘవరెడ్డి అమర్‌ రహే! జొన్నకంకి గుర్తుకే మన ఓటు! సుధాకర్‌ రెడ్డికి జై!’ అంటూ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లినయి. చీకటి పడ్తున్నది. మెలెమెల్లెగ జనం అతి కష్టంగ అక్కడ్నుంచి కదిలిండ్రు. సుధాకర్‌రెడ్డి కుటుంబంతో కార్యకర్తలతో ఇల్లు చేరుకున్నాడు. ఆయన బంగ్లాల అడుగుపెట్టంగనే గంభీరంగ హాలు పక్కనున్న అర్రలకు పోయిండు. అతని వెనుకెంబటే జంగారెడ్డి నిశ్శబ్దంగ అర్రలకు పోయిండు. తలుపులు మూసుకున్నాయి. జంగారెడ్డిని చూసి సుధాకర్‌రెడ్డి కండ్లల్ల నీళ్లు ఉబికినయి.

‘‘నా కొడుక్కు ఏమన్న కష్టమైంద? ఏమన్న అన్నడ నా కొడుకు’’ పూడుకుపోయిన గొంతుతో గొణిగిండు.

జంగారెడ్డి కండ్ల పొంటి ఎడతెగకుంట కన్నీళ్లు కారుతున్నాయి. కన్నీటి ధారలను ఆపుకోలేకుంట వున్నడతను. ‘‘ఏమనలేదన్న! అంత హఠాత్తుగనే జరిగిపోయింది. మనుషులు నమ్మకమైనోళ్లు. మాట పైకి పొక్కదు. ఏం బాధ లేకుంటనే ఒక్క గొడ్డలి పెట్టుకే హతమై పోయిండు. కన్నురెప్ప వేసేటంతల్నె అంత అయిపోయిందన్న! నరికిన మనుషులు పారిపోయిండ్రు. రాఘవరెడ్డి తలకాయ రక్తం తోటి పక్కకు ఒరిగిపోయింది!’’ వెక్కివెక్కి ఏడ్చిండు జంగారెడ్డి. సుధాకర్‌రెడ్డి కండ్లు నీళ్లతో నిండి చెరువులయినయి. కాని మత్తడి దాటి నీళ్లు పొంగలేదు. అతని మనస్సులో తండ్రి కాటికి నిప్పు అంటించే పెద్ద మనుమడు మెదిలిండు. ‘రాజకీయాల్లో వాడే నాకు వారసుడు!’ అనుకొని నిట్టూర్చిండు సుధాకర్‌రెడ్డి. ఆ ఆలోచనతో అతని మనస్సు చందనం పూసినట్లయింది.

తెల్లారింది. ఓట్లు వేసే కార్యక్రమం యథావిధిగా మొదలైంది. నిశ్శబ్దంగా నీరవంగా జరిగిపోయింది. నియోజకవర్గంలో ఏ అల్లర్లు జరగలేదు. ఏ లొల్లి లేకుంట ఓట్లు వేయటం అయిపోయింది. సుధాకర్‌రెడ్డి తన మనుమలను తొడలమీద కూర్చుండబెట్టుకొని అర్రల నుంచి బయటికి రాలేదు. కార్యకర్తలూ అక్కడే తచ్చాడుకుంట ఉండిపోయిండ్రు. శివారెడ్డి తన కార్యకర్తలతోటి ఇంట్లనే ఉన్నడు. ఉలుకు పలుకు లేకుండ నిరుత్సాహంగా నిల్చున్న కార్యకర్తల వైపు నిరాశగా చూసిండు శివారెడ్డి. ‘ఈ హత్య నేనే చేయించిన్నని ప్రజలు నమ్ముతుండ్రు’ అంటూ శివారెడ్డి నిస్సహాయంగా పండ్లు పటపట కొరికిండు.

‘‘ఇంత నాటకం చేసినంక గెలుపు సుధాకర్‌రెడ్డికి కాకుంట ఎట్ల పోతది! అండ్ల అనుమానమే లేదు’’ అన్నాడు శివారెడ్డి. అతని మొఖం కాటు వేస్తే రక్తం లేకుంట వుంది.

శివారెడ్డి అన్నట్లుగానే సుధాకర్‌రెడ్డి గెల్చిండు. పార్టీ పరువు నిలబెట్టిండు. ఆ పార్టీయే మెజారిటీ సాధించింది. ప్రభుత్వం వాళ్లదే ఏర్పడింది. సుధాకర్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని