నిన్ను నిన్నుగాప్రేమించుటకు..

అందరు అమ్మాయిల్లా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలనీ నాతో పంచేసుకోదు సుజిత. ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది. అది దాని వ్యక్తిత్వం...

Published : 10 Apr 2020 13:39 IST

ఆకునూరి మురళీకృష్ణ

‘అమ్మా... నువ్వూ నాన్నా ఎప్పుడూ పోట్లాడుకోలేదా?’ ఇంటర్‌నెట్‌ ఛాటింగ్‌లో సుజిత అడిగిన ప్రశ్న చూసి ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను. సుజిత మళ్ళీ తన భర్తతో పోట్లాడిందని అర్థమైంది నాకు ఆ మెసేజ్‌ చదవగానే. 

అందరు అమ్మాయిల్లా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలనీ నాతో పంచేసుకోదు సుజిత. ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది. అది దాని వ్యక్తిత్వం. కానీ ఈమధ్య దాని ధోరణినిబట్టి చూస్తుంటే తరచుగా తన భర్త కార్తీక్‌తో పోట్లాడుతోందని తెలుస్తోంది. 

చిన్నచిన్న విషయాల్లో పంతాలకిపోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్న ఈతరం యువత ధోరణి గుర్తొచ్చి బాధవేసింది. సుజిత కూడా అదే కోవలోకి చేరబోతోందా? ఖండాంతరాలలో ఉన్న కూతురి కాపురం గురించిన బెంగతో ఒక్క క్షణం నా మనసు బరువెక్కింది. మరుక్షణమే గుండెదిటవు చేసుకున్నాను. అదేమీ చిన్నపిల్ల కాదు.

‘ఎందుకు పోట్లాడుకోలేదు? చాలాసార్లు పోట్లాడుకున్నాం. ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నాం. అసలీ ప్రపంచంలో నేనిప్పటిదాకా ఎక్కువసార్లు పోట్లాడింది మీ నాన్నతోనే’ అని టైప్‌ చేశాను. సమస్యని గుర్తించగానే మనం చేయాల్సిన ప్రథమ చికిత్సలాంటి పని సాధ్యమైనంత వరకూ సమస్యని తేలికచేసి చూపటం. నేను అదే చేశాను.

నా సమాధానానికి సుజిత నవ్వుతోందన్నదానికి సూచనగా ఛాటింగ్‌ బాక్స్‌లో నాకు నవ్వుతున్న చిన్న కార్టూన్‌ బొమ్మ ముఖం మెసేజ్‌ పంపించింది. అది చూడగానే నా మనసు కొంత తేలికపడింది.

‘మరి మాకెప్పుడూ అలా కనిపించేవారు కాదు మీరిద్దరూ... ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీకు కితాబులివ్వడం నాకు తెలుసు’ అంది సుజిత.

‘బావుంది... పోట్లాడుకోవడమంటే అందరికీ తెలిసేలా పోట్లాడుకుంటామా? భార్యాభర్తల మధ్య పోట్లాటంటే ఫ్యాక్షన్‌ సినిమాలో యుద్ధంలా ఉండదు. మాటల స్థానంలో మౌనం... చిరునవ్వుల స్థానంలో చూపుల చురకత్తులు... ఒకరితో ఒకరు డైరెక్ట్‌గా మాట్లాడుకోగలిగిన విషయాలకి కూడా పిల్లల మీద ఆధారపడటాలు... ఇలా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో పోట్లాడటంకన్నా నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకి తెలియజేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది’.

మెసేజ్‌ టైప్‌ చేస్తున్నాను కానీ నాకు తెలుసు... ఈ కాలం మొగుడూ పెశ్ళాల పోట్లాటలు అంత సున్నితంగా ఉండవని. 

మా రోజుల్లో అయితే ఇంట్లో అత్త, మామలూ... ఇంటినిండా జనం... ఎప్పుడోతప్ప దొరకని ఏకాంతం... ఎప్పుడూ ఎరుగని స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు. ఇప్పుడలా కాదు కదా! కోరుకోగానే దొరికే ఏకాంతం... కావలసినంత స్వేచ్ఛ.. మనసులో ఉన్నదాన్ని కుండ బద్దలుకొట్టినట్లు ఎదుటివాళ్ళ ముఖంమీదే చెప్పేయగల ధైర్యంతో కూడిన మనస్తత్వం... అసలివన్నీ కలిసే ఈ కాలం పిల్లలని పాడుచేస్తున్నాయా అనిపిస్తోంది. అలాంటివాళ్ళని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా అన్నది అనుమానమే. కానీ ముందే అనుకున్నట్లుగా సమస్యని తేలిక చేయడం మాత్రమే నా ఉద్దేశం. అందుకే అదే మెసేజ్‌ని టైప్‌ చేసి ‘సెండ్‌’ అని ఉన్నచోట క్లిక్‌ చేశాను.

ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్‌ పూర్తిగా చదవకుండానే గోడక్కొట్టిన బంతిలా మరోప్రశ్న దూసుకువచ్చింది సుజిత దగ్గరనుంచి.

‘మరి మీరు ఆ పోట్లాటలనెలా పరిష్కరించుకునేవారు? నువ్వు రాజీపడిపోయేదానివా?’

ఈసారి సుజిత ప్రశ్నకి సమాధానం చెప్పటానికి నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదాలే గుర్తున్నాయికానీ వాటి పూర్వాపరాలూ అవెందుకు వచ్చాయో కారణాలు గుర్తుకులేవు. ఇంక వాటిని మేమెలా పరిష్కరించుకున్నామో అసలు గుర్తులేదు. ఒకసారి మా అత్తగారి తమ్ముడినేదో అన్నానని నాతో వారం రోజులు మాట్లాడలేదాయన. నేనన్నదానిలో తప్పేంలేదనీ ఆయనే గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకుంటున్నారనీ నా వాదన. నా మటుకు నేను నా తప్పేంలేదనుకోవడం వల్ల, ఆయన దిగివచ్చినా యుద్ధాన్ని మరో వారంరోజులు పొడిగించాను. ఆ విషయం బాగా గుర్తుంది నాకు. అది కూడా చివరికెలా పరిష్కారమైందో గుర్తులేదు.

అలాంటి తగాదాలన్నింటినీ చాలామటుకు మర్చిపోయేవాళ్ళం. లేదా మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావడంవల్ల దాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేసేవాళ్ళం. ఒక్కోసారి మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్ళం. తర్వాత నవ్వుకుని కలిసిపోయేవాళ్ళం. అదంతా గుర్తుకువచ్చి, నా ముఖంమీద చిరునవ్వులు విరిశాయి. నేను ఆ ఆలోచనల్లో ఉండగానే మెసేజ్‌ వచ్చింది సుజిత దగ్గరనుంచి.

‘చెప్పమ్మా, ఎలా పరిష్కరించుకునేదానివి వాటన్నిటినీ. రాజీ పడిపోయేదానివా?’ ఈసారి ఇంగ్లిషులో అడుగుతోంది. అంటే సీరియస్‌గా ఉందని అర్థమైంది నాకు. వెనువెంటనే ఆలస్యాన్ని భరించలేనట్లుగా ‘బజ్‌’ అన్న మెసేజ్‌తో నా మెసేజ్‌బాక్స్‌ని కుదిపింది స్క్రీన్‌ మీద. నవ్వుతున్న కార్టూన్‌బొమ్మ ముఖాన్ని ముందుగా పంపి తర్వాత మెసేజ్‌ టైప్‌ చేశాను.

‘చాలా తగాదాల్ని నేను మర్చిపోవడం ద్వారా...’

‘నీకు నవ్వెలా వస్తోంది? మర్చిపోవడమంటే రాజీపడిపోవడమే కదా? ఎందుకలా సర్దుకుపోవడం, రాజీపడిపోవడం? నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనేనా?’

ఈసారి సుజిత ప్రశ్నకి నాకు ఆశ్చర్యంవేసింది. నేను నిజంగానే అన్నింటికీ ఆయనమీద ఆధారపడి జీవిస్తున్నా ఈనాటివరకూ ఆ విషయం నాకెప్పుడూ స్ఫురణకి రాలేదు. నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు. ఆయనమీదే ఆధారపడి జీవిస్తున్నాను. నిజమే. కానీ కొన్ని విషయాల్లో నేను రాజీపడిపోయినా అందుకు కారణం నేను ఆయనమీద ఆధారపడి జీవించడం కాదు... ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని కచ్చితంగా చెప్పగలను. విచిత్రమేమిటంటే... మొగుడిమీద ఆధారపడి జీవించినా ‘ఆధారపడటం’ అన్నది ఆనాడు మమ్మల్ని బాధించలేదు. మొగుడి మీద ఆధారపడకపోయినా ‘ఆధారపడటం’ అన్న అంశం ఈతరం ఆడపిల్లల్ని బాధిస్తోంది. ‘మేము మీమీద ఆధారపడి లేము’ అన్న విషయం అనుక్షణం భర్తకి చెప్పాలని ప్రయత్నిస్తారు, దాన్ని భర్త గుర్తించకపోతే బాధ.

నాకు నవ్వొచ్చింది.

‘నిజమే, నువ్వన్నట్లుగా నేను రాజీపడ్డాననే అనుకో... కానీ ఆ రాజీపడటం అభద్రతా భావంతోకాదనీ మామధ్య బంధాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతోననీ ఎందుకు అనుకోకూడదు?’

వెంటనే బాణంలా వచ్చింది మెసేజ్‌ సుజిత దగ్గరనుంచి.

‘దాన్నే ఇంగ్లిషులో హిపోక్రసీ అంటారు మమ్మీ...’

అంత వేగంగా టైపు చేయడం ఎలా నేర్చుకుందో నాకిప్పటికీ ఆశ్చర్యమే! ఆ సమాధానం ముల్లులా గుచ్చుకుంది నా మనసులో. నేను తేరుకునేలోపులే మరో మెసేజ్‌ వచ్చింది.

‘నిరంతరం గొడవపడుతూ... ప్రతిసారీ రాజీపడుతూ విడిపోలేని బలహీనతవల్ల కలిసి ఉంటూ ‘బంధాన్ని నిలుపుకుంటున్నాం’ అని సంతోషపడటం హిపోక్రసీకాక మరేమిటమ్మా’.

ఈసారి దాని ధోరణికి నాకు కోపం వచ్చింది.

‘అయినా నిరంతరం కొట్టుకునే నేనూ మీ నాన్నా బాగానే ఉన్నాం. మధ్య నీకెందుకు బాధ’ అని మెసేజ్‌ ఇచ్చాను.

నేనలా అడిగేసరికి సుజిత సూటిగా విషయానికొచ్చేసింది.

‘ఈమధ్య నాకూ కార్తీక్‌కీ సరిగా పడటం లేదమ్మా. కానీ నీలా నేనీ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నాను. ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలూ కలవవు. ప్రతి చిన్న విషయంలోనూ మాకు అభిప్రాయభేదాలే! ఇలా ఎంతకాలం కలిసి ఉండగలం అనిపిస్తోంది. పెళ్ళి కనుక ఇంతలా ఆలోచించాల్సి వస్తోంది.. అదే ఏ బిజినెస్‌ పార్ట్‌నర్స్‌మో అయితే హాయిగా ఎప్పుడో విడిపోయేవాళ్ళం...’

చివరి వాక్యాలు చదివిన నాకు బుర్ర తిరిగిపోయింది. పెద్ద చదువులు చదివి, ఆకాశం అంత ఎత్తుకు ఎగిరి, విదేశాల్లో తిరుగుతూ చివరికి నా కూతురు నేర్చుకున్నదిదా అన్న బాధ.

స్త్రీ పురుషులిద్దరూ రెండు విభిన్న వర్గాలకి చెందినవారు. వాళ్ళ ఆలోచనలెప్పుడూ ఒకేలా ఉండవు. వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒక గూట్లో ఉండమని చెబుతుంది మన వివాహ వ్యవస్థ. మౌలికంగానే ఇద్దరూ ఆలోచించే పద్ధతులు వేరు కనుక వారిమధ్య అభిప్రాయభేదాలు రావడం సహజం.

కంప్యూటర్స్‌తోపాటూ సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేనిదంతా చెప్పాల్సిన అవసరంలేదని నాకు తెలుసు. అందుకే మరేం మాట్లాడకుండా కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక బ్లాంక్‌గా చూస్తూ కూర్చుండిపోయాను. ఈలోగా సుజిత దగ్గరనుంచే మరో మెసేజ్‌ వచ్చింది.

‘మీ రోజుల్లో అయితే మీకు సంసారం తప్ప వేరే ఆశలూ ఆశయాలూ ఏమీ ఉండేవికావు కనుక అలాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు. ఇప్పుడు తల్చుకుంటే ఆ పోట్లాటలన్నీ చిలిపి తగాదాల్లాగానూ తీపి జ్ఞాపకాల్లాగానూ అనిపించవచ్చు. కానీ నా విషయం వేరు మమ్మీ... సంసారమొక్కటే జీవితం కాదు నాకు. నాకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఉంది. కొన్ని ఆశయాలూ నా జీవితం ఎలా గడవాలో అన్న నిర్దిష్టమైన ఆలోచనలూ నాకున్నాయి. సంసారమూ ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు. అది నాకు సెకెండరీ మాత్రమే. నా జీవితం నాకిష్టమైన రీతిలో గడిచి, నేననుకున్న గోల్‌ని చేరుకోవాలంటే ఇలాంటి చికాకులన్నీ లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది. నాకే కాదు... 

కార్తీక్‌కి కూడా! అందుకే ఇలా జీవించడం విసుగొస్తోంది మమ్మీ...’

ఆవేశంలో చెప్పినా నిజమే చెప్పింది. 

దానికే కాదు... దానిలాంటి ఈతరం కెరీర్‌ ఓరియంటెడ్‌ పిల్లలందరికీ సంసారం అన్నది ప్రైమరీ కాదు, సెంకడరీ మాత్రమే. దాని మాటలు చూస్తుంటే ఆవేశంలో అదెలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయంవేసింది. అసలు నన్ను మెంటల్‌గా ప్రిపేర్‌ చేయడానికే ఇదంతా చెబుతోందా- అని అనుమానం వచ్చి మెదడంతా బ్లాంక్‌గా అయిపోయింది.

మేళతాశాలతో వేదమంత్రాల మధ్య మేము కార్తీక్‌కి కన్యాదానం చేసి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం గుర్తుకువచ్చింది. పసుపుబట్టల్లో ఉన్న దంపతులని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవెనలు గుర్తుకువచ్చాయి. ఒక్కసారిగా గుండెనెవరో చేత్తో పట్టుకుని పిండినట్టనిపించింది.

‘తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకు సుజీ. జీవితం అంటే గోల్సూ అచీవ్‌మెంట్సూ డబ్బు సంపాదించడం మాత్రమే కాదు’ 

తడబడుతున్న చేతులతో మెసేజ్‌ టైప్‌ చేసి పంపాను.

‘జీవితం అంటే నిరంతరం కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒకే కప్పుకింద కలిసి బతుకుతూ బయటివాళ్ళకి నవ్వుతూ కనబడటం కూడా కాదు కదమ్మా’ అంతే వేగంగా దాని దగ్గరనుంచి సమాధానం వచ్చింది.

‘నువ్వు గోరంతని కొండంతచేసి చూస్తున్నావు సుజీ. సంసారమన్నాక గొడవలు రావడం సహజం. అసలు అభిప్రాయభేదాలే రాని భార్యాభర్తలంటూ ఎవరూ ఉండరు’.

‘నువ్వీ మాటంటావని నాకు తెలుసు. 

తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచనా విధానం అది. దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకి భయం. ఒక్క క్షణం కూడా పడకుండా జీవితాంతం కలిసున్న మొగుడూ పెశ్ళాల్ని నేనూ చాలామందిని చూశాను. మన కుటుంబంలోనే! అంతెందుకు, నువ్వే అన్నావు... ఇప్పటికీ నాన్నతో నిరంతరం తగాదాపడతావని. అమ్మమ్మ నీకు చెప్పిన నీతుల్నే నాకూ చెబితే వినలేను. తార్కికంగా ఆలోచించి ఒక్క కారణం చెప్పు? జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే ఈ తగాదాలవల్ల సాధించేదేమిటి? అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసుండటంవల్ల ఒరిగేదేమిటి?’

దాని మాటలు చూస్తుంటే కార్తీక్‌కీ దానికీ ఏదో పెద్ద పోట్లాటే జరిగిందని అర్థమౌతోంది నాకు. కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యాభర్తల మధ్య చాలా చిన్నదే. ఆ విషయం సుజితకెలా చెప్పాలో అర్థంకావడంలేదు. ఈలోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ‘ఆఫ్‌లైన్లో’కి వెళ్ళిపోయింది. అన్యమనస్కంగానే కంప్యూటర్‌ ముందునుంచి లేచాను నేను.

అప్పుడు ఖండించాను కానీ ‘జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే’ అన్న సుజిత మాటలు తర్వాత నన్ను ఆలోచనల్లో పడేశాయి. నిజం చెప్పాలంటే ఆయనతో తగాదా పడినప్పుడల్లా దానంత కాకపోయినా ఆ రోజుల్లో నేనూ ఎంతోకొంత ఆవేశపడినదాన్నే. ‘ఈదేసిన గోదావరీ, దాటేసిన కష్టాలూ తియ్యగా ఉంటాయని’ ముళ్ళపూడి 

వెంకటరమణ గారు ఎక్కడో అన్నట్లుగా ఇప్పుడు తలుచుకుంటే ఆయనతోపడ్డ తగాదాలన్నీ తీయగా అనిపిస్తున్నాయా నాకు? నిజంగా చేతకానితనంతోనే ఇన్నాళ్ళూ నేనూ ఆయనా కలిసున్నామా? సుజిత చెప్పినట్లు ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా?

కాదు... కాదని నాకు చాలా గట్టిగా అనిపిస్తోంది. మరి సుజిత అడిగినట్లుగా ఆ తగాదాల వల్ల మేము సాధించినదేమిటి? సమాధానం తెలిసీ తెలియనట్లుగా ఉంది.

*   *    *

డైనింగ్‌ టేబిల్‌ మీద కూరగిన్నె మూత తీస్తూనే అన్నారాయన- ‘‘ఇవాళ కూడా క్యారెట్‌ కూరేనా? నీకీ క్యారెట్‌ కూర తప్ప ఇంకేం చేయడం నేర్పలేదా మీ అమ్మ?’’

‘‘మరేం ఫర్వాలేదు... క్యారెట్‌ ఒంటికి మంచిది. రోజూ తింటే బీపీ తగ్గుతుంది. 

చీటికీమాటికీ ఇలా అరవడం కూడా తగ్గుతుంది’’ మంచినీళ్ళు గ్లాసులో పోస్తూ రిటార్టిచ్చాను నవ్వుతూనే.

‘‘ఆరోగ్య సూత్రాలెందుకు చెబుతావు, క్యారెట్‌ నీకిష్టమని చెప్పొచ్చు కదా?’’ 

అన్నారాయన కయ్యానికి కాలుదువ్వుతూ.

నేను మాత్రమేమైనా తక్కువ తిన్నానా? ‘‘నన్ననడం ఎందుకు? మీకిష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా, వండి పడెయ్యడానికి నేనెలాగూ ఉన్నాను. అదిమాత్రం చెయ్యరు... బద్ధకం’’ అన్నాను.

‘‘తేవచ్చు, కానీ నువ్వు చాలా తెలివైనదానివి. నోటితో ‘నో’ అని చెప్పవు. నేను తెచ్చిన కూరలు నీకిష్టం లేకపోతే వారంరోజులు ఫ్రిజ్‌లో మురగబెట్టి ఎనిమిదో రోజున పాడైపోయాయని బయట పారేస్తావు. నీ సంగతి నాకు తెలియదా?’’ అన్నారాయన పోట్లాటని పెంచుతూ.

ఆయన మాటలకి నాకు కోపం రావడంలేదు. ఎందుకంటే, అదంతా ఆయన కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు. మళ్ళీ సాయంత్రం బాల్కనీలో కూర్చుని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ‘మధ్యాహ్నం చేసిన క్యారెట్‌ కూర బాగుందోయ్‌’ అంటూ ఏదో చెబుతారు. పిల్లలిద్దరూ చెరో దేశమూ వెళ్ళిపోయాక ఇంట్లో ఇద్దరమూ ఒంటరిగా ఉండటం చాలా బోర్‌ కొడుతోంది. అందుకే ఇలాంటిదేదో విషయాన్ని తీసుకుని నాతో వాదులాటకి దిగుతూ కాలక్షేపం చేస్తుంటారాయన. ఎప్పుడూ లేనిది రిటైరయ్యాక ప్రతి చిన్న విషయానికీ నన్ను విమర్శిస్తుంటే మొదట్లో నాకు కోపం వచ్చేది. కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావడం మానేసింది. ఆయనతో సమంగా నేనూ వాదిస్తున్నాను.

ఆయన మాటలు వింటూ నవ్వుకోబోతున్న నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్లుగా ఆగిపోయాను. మరుక్షణం నా ముఖం మతాబులా వెలిగిపోయింది. అవును... సుజిత అడిగిన ప్రశ్నకిపుడు నాకు సమాధానం దొరికింది!

‘‘మీరు పెట్టుకుని తింటూ ఉండండి, 

నేనిప్పుడే వస్తాను’’ అంటూ కంప్యూటర్‌ దగ్గరకి పరిగెత్తాను. సుజిత ఆన్‌లైన్లో లేదు. అయినా సరే మెసేజ్‌ టైప్‌ చేశాను.

‘సుజితా, ఈ కొట్లాటలవల్ల మీరు సాధించినదేమిటి అని అడిగావు కదా? ఆలోచించగా ఆలోచించగా నాకిప్పుడు తెలుస్తోంది... 

మిగతావారి సంగతి నాకు తెలియదు కానీ నామటుకు నాకు దాంపత్య జీవితంలో మామధ్య వచ్చిన ప్రతి చిన్న తగాదా మాకు ఒకరి మీద ఒకరికి మరింత అవగాహనని పెంచిందనిపిస్తోంది. అవన్నీ మేమిద్దరం ఒకరినొకరం అర్థంచేసుకోవడానికి మరింత దోహదం చేశాయనిపిస్తోంది. ఇప్పటికీ అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం. అందుకే ఇదంతా నాకు చేతకానితనంగా అనిపించడంలేదు. మీమధ్య వచ్చే తగాదాలని కూడా ఆ దృష్టితో చూస్తే నీకవన్నీ ‘చికాకుల్లా’ కనిపించవేమో... ఆలోచించు.

మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు. ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలూ ఆశయాలూ ఉండొచ్చు. కానీ సంసారం అంటే రెండు విడివిడి జీవితాలు ఎంతమాత్రం కాదు... రెండు జీవితాలు కలగలిసి ఒకటిగా పెనవేసుకుపోవడం. అది తెలుసుకోవాలి మీరిద్దరూ. ప్రేమించబడాలని ప్రతి మనిషికీ ఉంటుంది. మచ్చలేని ప్రేమని జీవితభాగస్వామి నుంచి ప్రతివారూ కోరుకుంటారు. కానీ అలా ప్రేమించబడాలంటే ముందు మనం ప్రేమించాలనీ అందుకు ఎదుటి మనిషిని అర్థంచేసుకోవాలనీ తెలుసుకోరు.

నేను చెప్పానని నువ్వు నీ నిర్ణయం మార్చుకోవని నాకు తెలుసు. కానీ జీవితంలోనైనా బిజినెస్‌లోనైనా ‘అర్థం చేసుకోవడం’ అన్నది చేతకానితనంకాదని నువ్వు తెలుసుకోవాలని చెబుతున్నాను’.

మెసేజ్‌ని సుజిత ఈ-మెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేసి తీరిగ్గా ఆయనతో దెబ్బలాడటానికి డైనింగ్‌ హాల్లోకి వచ్చాను.

నా మెసేజ్‌ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న భయం నాకు లేదు... దాని తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని