గెలుపు

ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వరకూ ఫ్లైట్లో వచ్చి, అక్కడ గౌతమి ఎక్స్‌ప్రెస్‌ పట్టుకున్నాను. అరగంట ఆలస్యంగా ట్రైన్‌ రాజమండ్రి స్టేషన్‌ చేరుకుంది...

Published : 10 Apr 2020 14:01 IST

కారంపూడి వెంకట రామదాస్‌

రైలు గోదావరి బ్రిడ్జి మీదకి రావడంతో ఆ శబ్దానికి నాకు తెలివొచ్చింది. ‘డడక్‌...డక్‌... డడక్‌...డక్‌...’మంటూ లయబద్ధంగా శబ్దం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదుల్తోంది. సైడ్‌ లోయర్‌ బెర్త్‌ కావడంతో కిటికీగుండా బయటకి చూశాను. సరిగ్గా అప్పుడే తెలవారుతోంది. గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తోంది. చల్లని గాలులు నా శరీరాన్ని తాకి హాయిని గొలిపాయి. పక్షుల కిలకిలరావాలు గోదావరి తల్లికి సుప్రభాతాన్ని పాడుతున్నాయి. జీవనోపాధి కోసం వలలతో జాలరులు అక్కడక్కడా పడవలు నడుపుతూ ప్రకృతి అందంలో భాగం పంచుకున్నారు. చాలా రోజుల తరవాత ఇంత సుందరమైన శుభోదయాన్ని తిలకించడం నా మనసుని ఎంతో ఆహ్లాదపరిచింది.

ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వరకూ ఫ్లైట్లో వచ్చి, అక్కడ గౌతమి ఎక్స్‌ప్రెస్‌ పట్టుకున్నాను. అరగంట ఆలస్యంగా ట్రైన్‌ రాజమండ్రి స్టేషన్‌ చేరుకుంది. సొంత గడ్డమీద కాలిడటంతో నా గుండెలు ఉప్పొంగాయి. చేత్తో సూట్‌కేసు, భుజాన ఎయిర్‌బ్యాగు మోస్తూ స్టేషన్‌ నుంచి బయటపడ్డాను. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న హోటల్‌ నుండి ‘ఈ గాలీ... ఈనేలా... ఈ ఊరూ... సెలయేరూ...’ అంటూ సీతారామశాస్త్రి అద్భుతగీతం వినిపించడం నన్ను మరింత పరవశింపచేసింది. ఏదో తెలీని అనుభూతి.. తల్లి ఒడిలో చేరిన బిడ్డలా..!

చాలా రోజులైంది రాజమండ్రొచ్చి. గత మూడేళ్ళుగా ఢిల్లీలో ఉద్యోగరీత్యా సొంతూరికి దూరంగా ఉన్నాను. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఓల్వోలో సి.ఇ.ఒ. హోదా కావడంతో సెలవన్నది లేకుండా బాధ్యతాయుతంగా అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఇప్పుడైనా సూర్యం బలవంతం చేస్తే ఇక తప్పని పరిస్థితిలో రాజమండ్రొచ్చాను. సందర్భమేమిటంటే సూర్యం చెల్లెలు సీత పెళ్ళి. మాది రాజమండ్రి పక్కనే అనపర్తి. చదువుసంధ్యలక్కడే జరిగాయి. 

ఎనిమిదవ తరగతిలో సూర్యంతో పరిచయమైంది. సూర్యందీ అదే ఊరు. రాఘవాచారి మా మాస్టారు. నేనీ స్థితిలో ఉన్నానంటే ఆయన చలవే! నాకు ఎంతో మేలు చేసిన మహానుభావుడాయన. ఇద్దరం మాస్టారి దగ్గర ట్యూషన్‌కెళ్ళేవాళ్ళం. మా స్నేహం బలపడిందక్కడే. మాస్టారి మాటే ఇద్దరికీ వేదం. స్కూల్‌ ఫైనల్‌ పాసై, కాలేజీకొచ్చినా ఆయన దగ్గరే ట్యూషన్‌కెళ్ళేవాళ్ళం. ఇద్దరిమధ్యా అన్నింటా పోటీ. ఆటపాటల్లో చదువులో అన్నింట్లో చాలా సీరియస్‌గా సాగేది మా పోటీ. తొమ్మిదో క్లాసులో అనుకుంటా... సూర్యంతో వందమీటర్ల పరుగుపందెంలో ఓడిపోయాను. ఆరోజు చాలా బాధపడ్డాను. ఆ వెంటనే వచ్చిన పరీక్షల్లో సూర్యంకంటే ఎక్కువ మార్కులు సాధించాకగానీ ఆ బాధ తీరలేదు. అప్పుడేకాదు, ఎప్పుడు ఏ విషయంలో సూర్యం నామీద గెలుపు సాధించినా వెంటనే నేను మళ్ళీ సూర్యంపై విజయం సాధిస్తేగానీ నా మనసు స్థిమితపడేదికాదు. నా ఈ మానసికస్థితికి కారణం... బహుశా సూర్యం ఆర్థికంగా నాకంటే ఓ మెట్టు పైనుండటం కావచ్చు. ఇప్పుడు ఈ ప్రయాణం పెట్టుకోవడానికి కారణం కూడా నా హోదా సూర్యానికి తెలియజేయాలని అంతరాంతరాల్లో ఉన్న కోరికే. నేను ఎంసెట్‌ రాసి మెకానికల్‌ ఇంజినీరింగులో చేరితే సూర్యం విచిత్రంగా బీకాంలో చేరి తరవాత ఎం.బి.ఎ. ఎంచుకుని పి.ఒ. ఎగ్జామ్స్‌ ద్వారా బ్యాంకు ఆఫీసరయ్యాడు.

ఎంత త్వరగా ఇల్లు చేరుకుని నా వాళ్ళని చూడాలా అని మనసు ఒకవైపు ఆరాటపడుతోంది. అప్రయత్నంగా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. ‘రాకరాక ఎలాగో ఊరొస్తున్నావు కాబట్టి పనిలోపని నీకు పెళ్ళి సంబంధాలు కొన్ని చూసి ఉంచా. నువ్వు ఊఁ అంటే... ఖాయం చేసుకోవచ్చు’.

స్టేషన్‌ నుండి తిన్నగా బస్టాండుకు ఆటో మాట్లాడుకున్నాను. ఆటో పావుగంటలో బస్టాండు చేరుకుంది. ఆటోకి డబ్బులిచ్చి చుట్టూ కలియచూశాను. పెద్దగా మార్పులేదు. 

కాకపోతే బస్సు సర్వీసులు ఎక్కువయ్యాయి. జనాభా పెరిగింది. పెద్దగా వెయిట్‌ చెయ్యకుండానే అనపర్తి బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నాను. మరో అరగంటకి బస్సు కదిలింది. రాజమండ్రి ఊర్లో కూడా మార్పులొచ్చాయి. చిన్నచిన్న కమర్షియల్‌ కాంప్లెక్సులూ అక్కడక్కడా అపార్టుమెంట్లూ.

బస్సు ఊరి పొలిమేరలు దాటింది. కిటికీగుండా పరిసరాల్ని తన్మయత్వంతో గమనిస్తున్నాను. కనుచూపుమేరలో పచ్చటి వరిచేలు... నేలతల్లి హరిత వస్త్రం కప్పుకున్నట్టుగా ఉంది. మధ్యమధ్యలో కొబ్బరిచెట్లూ మరోవైపు గోదావరి కాలువ. టీవీఎస్‌ మోపెడ్‌పై తళతళ మెరిసే గుండ్రటి ఇత్తడి బిందెల్తో వెళ్తున్న పాలవాళ్ళనీ సైకిలు కిరువైపులా కొబ్బరిబోండాల గెలలతో బోండాలమ్ముతున్న చిరువ్యాపారులనీ బస్సు దాటుకుంటూ పోతూంటే టోటల్‌గా ఉభయగోదావరి జిల్లాల సంస్కృతి కళ్ళముందు సాక్షాత్కరించింది. ఎన్నాళ్ళైంది ఈ అందాలని చూసి! అద్భుతం... ఈ ప్రకృతి సౌందర్యం!

మరో పావుగంటకల్లా బస్సు ఊరు చేరుకుంది. బస్సు దిగి సూట్‌కేసు, బ్యాగుతో నడుచుకుంటూనే ఇల్లు చేరాను.

గుమ్మంలోనే ఎదురుచూస్తూ అమ్మ!

‘‘వచ్చావా శేషూ, రా... ఇంత చిక్కిపోయావేంట్రా? ఏం ఉద్యోగాలో ఏంటో.. వేళపట్టున తిండి తింటున్నట్టు లేదు’’.

నేను చిక్కినమాట వాస్తవం కాకపోయినా తల్లి కంటికి దూరమైన బిడ్డ ఎప్పుడూ చిక్కినట్టే కనబడటం సహజం. అందుకే నవ్వుకున్నాను.

‘‘అదేంలేదమ్మా, నేను ఎప్పటిలాగే ఉన్నాను. ఒళ్ళు చెయ్యలేదు... తీయలేదు’’ నవ్వుతూ అన్నాను.

‘‘ఏంరా, ఎలా ఉన్నావు... ఉద్యోగం ఎలా ఉంది?’’ అడిగారు నాన్న.

‘‘బాగున్నా నాన్నా. ఉద్యోగం బాగుంది. కాకపోతే కాస్త టెన్షన్‌ తప్పదు’’.

‘‘మా రోజుల్లో ఉద్యోగాలని ఆనందిస్తూ చేసేవాళ్ళం. ఏంటో ఇప్పుడు ఎవర్నిచూసినా టెన్షన్‌తో చేస్తున్నారు’’.

‘‘అదే నాన్నా, మార్పు..!’’

‘‘సరే, స్నానం చేసిరా. టిఫిన్‌ తిందువుగాని’’ మధ్యలో కల్పించుకుని అంది అమ్మ.

సరేనని లేచి దొడ్లోకెశ్ళా. బంతిపూలూ చేమంతి పూలతో తోటంతా చాలా అందంగా ఉంది. మరువం వెదజల్లే సువాసన తన్మయత్వాన్ని కలిగించింది. బీర, చిక్కుడుపాదులు పిందెలు తొడుగుతున్నాయి. కొబ్బరిచెట్లు కాయల గెలలని మోయలేక మోస్తున్నట్టుగా ఉన్నాయి. వేపచెట్టు వేదాన్ని వల్లిస్తున్నట్టుగా గాలికి ఇటుఅటు ఊగుతూ శబ్దం చేస్తోంది. కొన్ని నిమిషాలు ఆ వాతావరణానికి మైమరచిపోయాను. స్నానం ముగించుకొచ్చి తిన్నగా దేవుడి గదిలో అడుగుపెట్టాను. చిన్నసైజు కోవెలలా ఉంటుంది మా దేవుడిగది. ఎన్నో దేవుళ్ళ ప్రతిమలూ చిత్రపటాలూ అగరొత్తుల సువాసనలూ... ప్రశాంతమైన మనసుతో కొన్ని నిమిషాలు దేవుడికి దండం పెట్టుకుని బయటకొచ్చాను.

అమ్మ టిఫిన్‌తో సిద్ధంగా ఉంది. పెసరట్టు చేసింది. నాకిష్టమైన టిఫిన్‌. తింటుంటే- ‘‘ఒరే, రెండు మూడు సంబంధాలు చూశాను. ఫొటోలు చూసి చెప్పు’’ మాటలు కదుపుతూ అంది అమ్మ.

‘‘ఇప్పుడే నాకు పెళ్ళికేం తొందరమ్మా’’.

‘‘ఈ ముక్క మూడేళ్ళుగా వింటూనే ఉన్నానుగానీ ఈసారి నేను తెచ్చిన సంబంధాలు చూసి, నచ్చిన పిల్లని ఖాయం చేసుకోవలసిందే’’ దృఢంగా ఉన్నాయి అమ్మ మాటలు.

‘‘అవున్రా, నువ్వెప్పుడొస్తావా... ఎప్పుడు పిల్లని చూసి ఓకే అంటావా అని చూస్తోందిరా మీ అమ్మ. ఇక వాయిదా వెయ్యకు’’ అన్నారు నాన్న కూడా.

‘‘సరే చూద్దాంలే’’ అనక తప్పలేదు- వారిని నిరుత్సాహపరచలేక.

‘‘అలాగన్నావు బాగుందిరా’’ సంతోషంగా అంది అమ్మ.

టిఫిన్‌ పూర్తిచేసి లేచి నా బ్యాగు తెరిచాను. అందులోనుండి అమ్మకి పట్టుచీరా నాన్నకి పట్టుపంచా తీసి ఇచ్చాను. వారి సంతోషానికి అవధుల్లేవు.

‘‘చాలా బాగుందిరా ఈ రంగు. ఏవండీ చూడండి, నా కొడుకు నాకోసం ఎంత మంచి చీర తెచ్చాడో? ఉండండీ పక్కింటావిడకి చూపించొస్తా’’ అంటూ అమ్మ పరుగులాంటి నడకతో పొరుగింటికి వెళ్ళడం నాకేకాదు నాన్నకి కూడా నవ్వు తెప్పించింది.

*  *   *

సూర్యం ఇల్లు మా వీధికి కాస్త దూరమే. ఫోనులో మాటలు తప్ప ప్రత్యక్షంగా చూసి సంవత్సరాలే గడిచింది. వాడిని ఎంత తొందరగా చూస్తానా అని మనసు ఆరాటపడుతోంది. వాడితో ఎన్నో మాట్లాడాలి. చిన్ననాటి సంగతులు... అల్లరి పనులు... ఆ రోజుల్లో ఇద్దరిమధ్యా నెలకొన్న పోటీ... ఇవన్నీ మళ్ళీమళ్ళీ గుర్తుకొస్తున్నాయి. వీటన్నిటినీ వాడితో కూర్చుని తీరిగ్గా నెమరువేసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత నా హోదా వాడిముందు ఎంత తొందరగా ప్రదర్శించాలా అని అంతరంగంలో ఆరాటం!

సూర్యం ఇల్లు చేరి తలుపు కొట్టినప్పుడు నా గుండె చిన్నగా కొట్టుకోవడం నాకే వింతగా అనిపించింది. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా సూర్యం చెల్లెలు సీత! నన్ను చూసి గుర్తుపట్టడంతో ‘రండి’ అంటూ సిగ్గుతో తలవంచుకుని లోనికి వడివడిగా వెళ్ళిపోవడం చూసి నాలో నేను నవ్వుకోకుండా ఉండలేకపోయాను. ‘ఇలా పెళ్ళి కుదురుతుందో లేదో ఆడపిల్లకి ఎంత సిగ్గూ’ అనుకున్నాను మనసులో.

‘‘రారా శేషు... రా..!’’ అంటూ ఆనందంగా ఆహ్వానించాడు సూర్యం లోపల్నుండి బయటకొస్తూ. ఇద్దరం డ్రాయింగ్‌రూం సోఫాలో కూలబడ్డాం.

‘‘ఎలా ఉన్నావు, ఇదేనా రావడం?’’ అన్నాడు సూర్యం.

‘‘అవున్రా, ఉదయమే వచ్చా’’.

ఇంతలో సూర్యం తల్లిదండ్రులు అక్కడికొచ్చి ‘‘నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందయ్యా’’ అంటూ పలకరించి వెశ్ళారు.

‘‘ఇప్పుడు చెప్పరా, ఎలా ఉంది నీ ఉద్యోగం?’’ అన్నాడు సూర్యం.

ఈ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్న నేను అప్పుడు మొదలుపెట్టాను.

‘‘నీలా బ్యాంక్‌ ఆఫీసరైతే బాగుండేదిరా... బరువు బాధ్యతలుండవు. కానీ ఓల్వో లాంటి పెద్ద కంపెనీకి సి.ఇ.ఒ.ని కదా! రెస్పాన్సిబిలిటీ జాబ్‌... హోదా, పలుకుబడితోపాటు శాలరీ కూడా ఎక్కువే అనుకో...’’

నా మాటలకి సూర్యం చిన్నగా నవ్వుకున్నాడు.

‘‘నీలో ఏ మార్పూ లేదురా’’ అన్నాడు సూర్యం.

ఈ మాటలు ఎందుకన్నాడో నాకర్థంకాకపోలేదు. ఇద్దరిమధ్యా ఎప్పుడూ పోటీనే! కొన్ని సందర్భాల్లో సూర్యం నాపై గెలిచినా, చివరికి సూర్యంకంటే ఉచ్ఛస్థితిలో స్థిరపడి, అంతిమ విజయం నాదేనని ఇందాకటి నా మాటల్లో చెప్పకనే చెప్పాను. అందుకే సూర్యం నాలో ఏ మార్పూ లేదన్నాడని గ్రహించాను.

‘‘పెళ్ళి పనులు ఎంతవరకొచ్చాయి?’’ 

అడిగాను మాటమారుస్తూ.

‘‘అన్నీ జరుగుతున్నాయిరా, ఫంక్షన్‌హాలు బుక్‌ చేశాం. నగలు కూడా కొన్ని చేయించాం. ఇక బట్టలకి ఇవాళో రేపో రాజమండ్రి వెశ్దామనుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చావు కాబట్టి మాతోపాటు రావలసిందే, ఏం..?’’

‘‘అరె, నేనెందుకురా... మీకే బంధువర్గం చాలా ఉంటే!’’

‘‘ఏంట్రా అలా అంటావు. ఇంతకీ సీత పెళ్ళికేనా నువ్వు వచ్చింది?’’ సూటిగా అడిగాడు సూర్యం.

‘‘అదేంట్రా, అంత మాటన్నావు? సరే, వస్తాన్లేరా...’’

‘‘అదికాదురా, ఆడవాళ్ళతో బట్టల షాపింగ్‌ అంటే మగాళ్ళపని సరి. అందుకే పక్కన తోడుగా నువ్వుంటే నా బాధలో భాగం పంచుకుంటావనీ’’ నవ్వుతూ అన్నాడు సూర్యం.

‘‘ఓరి, అందుకా’’ అన్నాను నేను, సూర్యం జోక్‌కు నవ్వుతూ.

‘‘అన్నట్టు, మన రాఘవాచారి మాస్టారు ఎలా ఉన్నారు? ఆయన్ని తలవని రోజంటూ లేదురా. ఆయనలాంటి మాస్టార్లు చాలా అరుదు’’.

‘‘బాగానే ఉన్నార్రా. ఈమధ్యే రిటైరయ్యారు. వచ్చిన డబ్బుతో కూతురి పెళ్ళి కానిచ్చారు. నిరాడంబరంగా జీవితం గడుపుతున్నారు. నేను అప్పుడప్పుడూ వెళ్ళి కలుస్తుంటా’’.

‘‘ఆయన మొదటినుంచీ నిరాడంబరుడే కదా. నలుగురికీ సహాయపడుతూ అందరికీ తలలోనాల్కలా ఉండేవారు’’ ఆయన మంచితనం గుర్తుతెచ్చుకుంటూ అన్నాను.

‘‘నేను మాస్టారింటికి వెళ్తున్నా. నువ్వూ రాకూడదూ?’’ అడిగాను సూర్యాన్ని.

‘‘ఇప్పుడా? పంతులుగారు ఏదో పనుండి రమ్మన్నారు. అక్కడికి ఇంకో గంటలో వెశ్ళాలి. ఈరోజుకి నువ్వెళ్ళురా. రేపు ఇద్దరం కలిసి వెశ్దాం’’.

ఆ తరవాత ఇద్దరిమధ్యా ఎన్నో సంగతులు.. చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటి నెమరువేసుకుంటూ హాయిగా నవ్వుకున్నాం. మాటల్లో టైం ఇట్టే గడిచిపోయింది. వెళ్లొస్తానని లేచాను.

*     *      *

మాస్టారింటిముందు ముద్దమందారం ముద్దులొలుకుతోంది. చుట్టూ కంచె, చిన్న కర్ర గేటు, ఇరవై అడుగుల లోపలికి పెంకుటిల్లూ... గేటునీ ఇంటినీ కలుపుతూ సిమెంటు దారి... ఇరువైపులా రకరకాల పూలమొక్కలు- మల్లె, కనకాంబరం, చామంతి, మధ్యమధ్యలో మరువం కుండీలూ నందివర్ధనం చెట్టూ జాజిపాదూ అదనపు ఆకర్షణ. మొక్కలపట్ల మాస్టారి ఇష్టంలో ఏ మార్పూ లేదు. చిన్నతనంనుండి చూస్తూనే ఉన్నాను... విద్యార్థులపట్ల ఎంత శ్రద్ధో మొక్కలమీదా అంతే శ్రద్ధ!

గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టిన నేను, ఆ చప్పుడికి మాస్టారు బయటకు రావడం గమనించాను.

‘‘ఎవరూ..?’’ అంటూ కళ్ళద్దాలు సర్దుకుని నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నించారు మాస్టారు.

‘‘నేను మాస్టారూ, శేషుని’’ అంటూ వంగుని మాస్టారి కాళ్ళకి దండం పెట్టాను. అప్పుడు గుర్తుపట్టారు మాస్టారు.

‘‘ఒరె శేషువట్రా, లే... లే...’’ అంటూ నన్ను దీవిస్తూ లేవనెత్తారు.

‘‘రా, వచ్చి కూర్చో’’ అంటూ ఓ కర్ర కుర్చీ చూపారు.

ఇద్దరం అక్కడున్న చెరో కుర్చీలో కూర్చున్నాం.

‘‘ఇప్పుడు చెప్పరా, ఎప్పుడు రావడం? ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఊఁ... పెద్ద ఉద్యోగం చేస్తున్నావట?’’

‘‘బాగున్నాను. ఈరోజే రావడం. మన సూర్యం చెల్లెలు సీత పెళ్ళంటే వచ్చా. 

మీ ఆశీర్వాదంతో ఓల్వో కంపెనీకి సి.ఇ.ఒ.గా ఉన్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది?’’

‘‘బాగానే ఉన్నాన్రా. రిటైరయ్యా. 

కాలక్షేపానికి పిల్లలకి ట్యూషన్స్‌ చెప్తూ ఇలా రోజులు గడిపేస్తున్నా’’.

‘‘మాస్టారూ, ఇది మీకోసం... చిన్న గిఫ్ట్‌’’ అంటూ జేబులో నుండి పార్కర్‌ పెన్‌సెట్‌ తీసి ఇచ్చాను.

‘‘ఇంత ఖరీదైన పెన్ను నేనేం చేసుకొనేదిరా?’’ అంటూ తీసుకోకపోతే నేనెక్కడ నొచ్చుకుంటానోనని మొహమాటపడుతూనే తీసుకున్నారు మాస్టారు.

‘‘మాస్టారూ, మీరు చేసిన ఉపకారం ముందు ఈ బహుమతులేపాటి? మీ మూలంగానే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. ఆరోజు మీరే కనుక పెద్ద మనసుతో ఆదుకోకపోతే, నేనీ రోజు ఇంజినీరు కాగలిగేవాడినా? సమయానికి ఆరోజు మీరు ఎంసెట్‌ ఎగ్జామ్స్‌కి ఫీజు కట్టడమేగాక, నన్ను మంచి కోచింగ్‌ సెంటర్లో జాయిన్‌చేసి, ఆ ఖర్చు మీరే భరించారు. మీ రుణం ఎప్పటికీ తీరేదికాదు మాస్టారూ’’ చాలా ఎమోషనల్‌గా అన్నాను.

‘‘ఊర్కోరా, ఇప్పుడవన్నీ ఎందుకు? నీలో టాలెంటుంది... కష్టపడి చదివి పైకొచ్చావు’’.

‘‘ఇలా అనడం మీ పెద్ద మనసుకి నిదర్శనం. కానీ సూర్యమే... బాగా చదివేవాడు. ఎందుకో సామాన్యమైన ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు’’ అప్రయత్నంగా అన్నాను. ఈ ముక్క చెప్పడంలో నా ముఖ్యోద్దేశం చివరికి సూర్యం మీద గెలుపు నాదేనని మాస్టారికి తెలియజేయటం.

ఈ మాటలకి మాస్టారు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆ తరవాత చాలా మాటలు మామధ్య దొర్లాయి. మళ్ళీ కలుస్తానని చెప్పి మాస్టారివద్ద సెలవు తీసుకున్నాను.

*       *         *

ఆ రోజు ఉదయం అమ్మ పిడుగులాంటి వార్త తెచ్చింది.

సీత పెళ్ళి క్యాన్సిలైందట..!

అమెరికా సంబంధమనిచెప్పి ఏరికోరి కుదుర్చుకుంటే, ఆ పెళ్ళికొడుకుది సరైన ఉద్యోగం కాదని ఆలస్యంగా తెలిసింది. దాంతో సంబంధం రద్దు చేసుకోవాలని నిశ్చయించుకున్నారట.

వెంటనే సూర్యానికి ఫోన్‌ చేశాను. 

బాధపడుతూ నిజమేనని నిర్ధారించాడు. 

‘‘ఐ యామ్‌ సారీ’’ అంటూ ఎక్కువ మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేశాను.

ఇలా జరిగిందేంటీ... ఇప్పుడేం చెయ్యటం..? ఆలోచనలోపడ్డాను. బాగా ఆలోచిస్తే నాకు ఓ పరిష్కారమార్గం తట్టింది. ఆశ్చర్యంగా ఈ సమస్యకి పరిష్కారం దొరికిందన్న ఆనందంకంటే... మరేదో... ఏదో... ఆనందం నన్నాక్రమించడం నాకే వింతగా తోచింది. నా ఆలోచనను ఆచరణలోపెట్టే పనిని మాస్టారితో మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాను.

*       *         *

‘‘ఏమిటి నువ్వంటున్నది?’’ ఆశ్చర్యంగా అన్నారు మాస్టారు.

‘‘అవును మాస్టారూ, ఇదే నా స్థిర నిర్ణయం’’ అన్నాను సీరియస్‌గానే.

‘‘సీతని నువ్వు పెళ్ళి చేసుకోవడంలో తప్పులేదు. కానీ...’’

మాస్టారు నా నిర్ణయాన్ని హర్షిస్తారనుకున్న నేను, ఈ సమాధానానికి కాస్త నిరాశపడ్డాను. నన్ను నిశితంగా పరిశీలిస్తున్నారు మాస్టారు. ఎదుటివారి మనోభావాల్ని ఇట్టే చదవగలిగే నేర్పరి. బహుశా అదే పనిలో ఉన్నట్టున్నారు. దాంతో నేను ఇబ్బందిపడ్డాను.

‘‘మనస్ఫూర్తిగా నీ బాల్యమిత్రుణ్ణి ఆదుకోవాలనే ఉద్దేశంకంటే, సూర్యంపై సంపూర్ణ విజయం నీదే కావాలన్న ఆరాటంతో సీత ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇలా ప్రపోజ్‌ చెయ్యడం, 

నీ అహం ప్రోద్బలంతోనైతే కాదుగా..?’’ 

అనుమానంగా అన్నారు మాస్టారు.

మాస్టారి మాటల్ని ఎందుకో ఖండించలేకపోయాను. బహుశా నా మనసులో ఉన్నదదేనేమో!

నా మౌనం మాస్టార్ని ఆందోళనపరచడం స్పష్టంగా గమనించాను.

‘‘నేనూహించిందే నిజమైతే నీకో నిజం చెప్పకతప్పదు’’ అన్నారు మాస్టారు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.

ఈ మాటలకి నేను మాస్టారి వైపు ఆశ్చర్యంగా చూశాను.

‘‘అవున్రా, విను...’’

*       *         *

‘‘శేషు మానసికంగా ఎంత కృంగిపోతున్నాడో చూశారా మాస్టారూ?’’ అన్నాడు సూర్యం.

‘‘అవున్రా, నేనూ గమనించా. మంచి విద్యార్థి. ఇంజినీరవ్వాలన్న వాడి కృతనిశ్చయానికి పెద్ద ఎదురుదెబ్బే! 

అనూహ్యంగా శేషువాళ్ళు వ్యాపారంలో దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది’’ బాధపడుతూ అన్నారు రాఘవాచారి.

‘‘మాస్టారూ, ఈ సొమ్ముంచండి’’.

‘‘ఏమిట్రా, ఇప్పుడీ డబ్బు దేనికి?’’ 

ఆశ్చర్యపోతూ అన్నారు రాఘవాచారి.

‘‘మాస్టారూ, శేషు ఆశయం నెరవేరాలి. కోరుకున్నది లభించకపోతే తేలిగ్గా తీసుకునే మనస్తత్వంకాదు వాడిది. ఈరోజు వాళ్ళ పరిస్థితి బాగోకపోవచ్చు. కానీ త్వరలోనే కోలుకోవచ్చు. ప్రస్తుతానికి శేషు ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుని ఎగ్జామ్‌ రాయాలి. అందుకు ఎవరైనా ఆదుకోవాలి. ఈ సహాయం మీరే చేస్తున్నట్టుగా ఈ డబ్బుని వాడికి అందించండి. ఈ సహాయం నేను చేస్తానంటే శేషు ఒప్పుకోడు. దేన్నైనా తట్టుకోగలడేమోగానీ నామీద ఓటమి తట్టుకోలేని తత్వం వాడిది. ఈ కారణంతో తన భవిష్యత్తుని నాశనం చేసుకునేందుకైనా సిద్ధపడతాడు’’.

‘‘ఇంత డబ్బు నీకెక్కడిదిరా?’’

‘‘ఇది నా ఫీజు మాస్టారూ!’’ ఈ మాటంటున్నప్పుడు సూర్యం గొంతు మూగబోవడం స్పష్టంగా గమనించారు రాఘవాచారి.

‘‘బాగుందిరా, మరి నీ చదువో?’’

‘‘ఆశయాలైతే లేకపోలేదుగానీ కోరుకున్నదే దొరకాలన్న పట్టుదలైతే లేదు. నాకు ఎంసెట్‌ అయినా, ఎంబీఏ అయినా ఒకటే. మనిషి తలచుకుంటే ఏ ఫీల్డులోనైనా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించొచ్చు. ఇక మా వాళ్ళను నేనెలాగో మేనేజ్‌ చేస్తాలెండి. కాకపోతే ఒక్క విషయం.. ఈ నిజం మనమధ్యే ఉండిపోవాలి’’ అన్నాడు సూర్యం స్థిరంగా.

‘‘ఎదిగిపోయావురా... చాలాచాలా ఎదిగిపోయావు’’ చెమర్చిన కళ్ళతో అన్నారు రాఘవాచారి సూర్యాన్ని హృదయానికి హత్తుకుంటూ.

*       *         *

‘‘ఇదీ జరిగింది శేషూ. నువ్వీరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ముమ్మాటికీ సూర్యమే! సూర్యం ఎప్పుడో నీమీద శాశ్వత విజయం సాధించాడు. ఈ నిజం నీకు చెప్పకపోతే సూర్యానికే కాదు, సీతకీ అన్యాయం చేసిన వాడినౌతాను’’ అన్నారు మాస్టారు ఉద్వేగంతో. 

నిశ్చేష్టుణ్ణై ఉండిపోయాను. మనసూ గొంతూ అన్నీ మూగబోయాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా ఎవరో నేలపైకి నెట్టేసినట్టుంది నా పరిస్థితి. నాలోని అహం, అతిశయం లాంటి వికృత స్వభావాలు మెల్లగా కరిగిపోయాయి. ఏం చేసినా సూర్యం రుణం తీర్చుకోలేనని స్పష్టంగా అర్థమైంది.

‘‘మాస్టారూ, సీతతోపాటు వారి పెద్దలక్కూడా సమ్మతమైతే, నేను ఆమెని మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధం’’ కల్మషంలేని ప్రతిపాదన ఈసారి మాస్టారి ముందుంచాను. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని