ప్రేరణ

సందీప్‌ మణిపాల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌. చిత్ర కూడా పెళ్ళికి ముందే కంప్యూటర్‌ కోర్సులు చేసి ఉండటంతో ఖాళీగా ఉంటే బోరుగా...

Published : 10 Apr 2020 15:00 IST

 శ్రీమతి పి. వి. శేషారత్నం

ఎటుచూసినా పచ్చని చెట్లు... పారే నీళ్ళు... పచ్చని వాతావరణంతో కళకళలాడే మణిపాల్‌ అందం ఎంతో నచ్చింది ప్రేరణకి. దానికితోడు రోజంతా దాదాపుగా ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటోంది. ఏమున్నా లేకపోయినా ప్రతివాళ్ళ చేతిలోను గొడుగే. హైదరాబాద్‌ ఎండలకి అల్లార్చుకుపోయిన ఆమె ప్రాణానికి ఆ చల్లదనం ఎంతో తెరిపిగా ఉంది.

సందీప్‌ మణిపాల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌. చిత్ర కూడా పెళ్ళికి ముందే కంప్యూటర్‌ కోర్సులు చేసి ఉండటంతో ఖాళీగా ఉంటే బోరుగా ఉంటుందని ఆ ఊళ్లోనే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో గులాబీల పానుపులాంటి జీవితం. కోరినదల్లా సమకూరుస్తూ కంపెనీలు ఇచ్చే కోరినంత స్వేచ్ఛ, వడ్డించిన విస్తరి లాంటి వాళ్ళ జీవితం... చూసి తృప్తిగా నిట్టూర్చింది ప్రేరణ. వీకెండ్‌ కూడా కావడంతో తమ్ముడు సందీప్, మరదలు చిత్ర ఇద్దరూ దగ్గరుండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలూ చూపించారు. పరవళ్ళు తొక్కుతున్న నేత్రావతీ నది నేత్రానందాన్ని కలిగించింది ప్రేరణకి.

‘‘ఇక్కడ నుండి ఉడిపికి పావుగంటే ప్రయాణం. సిటీబస్సులో వెళ్ళి వచ్చేయొచ్చు’’ అన్నాడు సందీప్‌ అక్క ప్రేరణతో.

ప్రేరణకి చిన్నప్పట్నుంచీ కృష్ణుడంటే మహాప్రీతి. ఉడిపిలో కృష్ణుడిని దగ్గర నుండి చూసేందుకు లేదు. చుట్టూ ఉన్న కిటికీల ద్వారానే చూడాలనేది అక్కడి ఆచారం. విగ్రహం కూడా ముఖద్వారానికి ఎదురుగా కాకుండా వెనక్కితిరిగి ఉంటుంది. పూర్వం ఎప్పుడో అక్కడకి ఓ భక్తుడు దర్శనం చేసుకునేందుకు వస్తే తక్కువ కులంవాడని చెప్పి అతడిని పెద్దలు గుడిలోకి అనుమతించకపోయేసరికి అతడు గుడి బయట వెనుకభాగంలో కూర్చుని గానం చేశాడట. ఆ మధురగానం వింటూ ముగ్ధుడైన స్వామి విగ్రహం వెనక్కి తిరిగిందని అక్కడి పూజారి వివరించాడు. మగవాళ్ళనైతే చొక్కాలతో లోపలికి రానివ్వడంలేదు. కృష్ణ దర్శనం అవ్వాలంటే చొక్కా విప్పాల్సిందే.

సందీప్‌కి చిన్నప్పట్నుంచీ ఇంట్లో కూడా ఎవరి ఎదురుగా చొక్కా విప్పే అలవాటు లేకపోవడం... అక్కగారికి ఎదురుచెప్పే సాహసం లేకపోవడంతో చొక్కా విప్పి లోపలికి వచ్చేందుకు పడుతున్న సందీప్‌ అవస్థ చూసి, చిత్ర గలగలా నవ్వడమే కాదు... మహా రొమాంటిక్‌ లుక్‌నిచ్చే అతని మగసిరిని చూసి అప్రయత్నంగానే ఆమె గుండె ఝల్లుమంది కూడా.

పెళ్ళయి ఆరు నెలలవుతున్నా తామిద్దరూ ఒకరినొకరు తీరిగ్గా చూసుకున్నదెప్పుడని? ఎంతసేపూ ఉద్యోగాలతోనే సరిపోతోంది. ఒక్కోసారి రోజుల తరబడి సందీప్‌కి టూర్లు... భర్తతో కలిసి ఉండటమే అపురూపం.

చిత్ర ముఖాన్ని తదేకంగా చూస్తుండిపోయింది ప్రేరణ. అసలే పచ్చని రంగు... నవ్వుతుంటే లేత ఎరుపుకి తిరిగిన ముఖం... గులాబీ పెదవులు... వర్షపు తడికి నుదుట అక్కడక్కడా అతుక్కున్న ఉంగరాల జుట్టు... ఎంతో అందంగా అనిపించి సుతారంగా మరదలి చెంపలు పుణికింది.

‘‘నువ్వు చాలా అదృష్టవంతుడివిరా సందీప్‌’’.

‘‘అక్కా, ముందు దేవుడిని చూడు. ఆయన ఇంకా సౌందర్యవంతుడు’’ అక్కయ్య భావం అర్థమై నవ్వాడు సందీప్‌.

‘‘చాల్లేరా. ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ భగవంతుడున్నట్టే. సరే, పదండి పదండి. ఉడిపి వచ్చినవాళ్ళు కృష్ణ పరమాత్మ పెట్టే భోజనం చెయ్యకుండా వెళ్ళకూడదట.. మన అమ్మమ్మ అంటూ ఉండేది’’.

అక్కడ పంక్తి భోజనాలకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. 

‘‘అయినా ఇక్కడికి వచ్చి ఆర్నెల్లయింది. మీరివన్నీ చూసినట్టు లేదేమిటిరా? అయినా నా మతిమండా... కొత్తగా పెళ్ళయిన దంపతులు... మీరూ మీ బావలాగా ప్రేమయాత్రలు కోరుకుంటారుగానీ ఇవెందుకు? అయినా చిత్రా, నా పుణ్యమా అని కృష్ణుడిని దర్శనం చేసుకున్నావు. ఏడాది తిరక్కుండా నాకో బాలకృష్ణుడి లాంటి మేనల్లుడిని ఇవ్వాలి సుమా’’ ముప్పయ్యేళ్ళ ప్రేరణ ముదిపేరక్కలా మాట్లాడుతోంది.

‘‘అమ్మో, అప్పుడే పిల్లలా?’’ అప్రయత్నంగా అనేసింది చిత్ర. ఇద్దరి కెరీర్లకీ అడ్డని తాము ఫ్యామిలీప్లానింగ్‌ అమలుచేస్తున్నట్లు వదినగారికి తెలియదు మరి.

‘‘ఇదిగో అమ్మాయ్, అలాంటివేమీ కుదరదు. మా ఇళ్ళల్లో ఏడాది తిరక్కుండా బిడ్డని కనాల్సిందే’’.

‘‘కానీ అక్కా, మరి నీకు ఏడాది తిరిగేసరికి కవలలు కదే...’’

‘‘చాల్లే నోరు మూసుకోరా. పద... లైను పెద్దదవుతోంది’’.

ప్రేరణ సందీప్‌కి పెదనాన్న కూతురే అయినా అతనికి అక్కచెల్లెళ్ళు లేకపోవడంతో ప్రేరణ దగ్గర చనువెక్కువ. పైగా వయసులో కూడా నాలుగైదేళ్ళే తేడా. ఒక్కచోటే పెరగడంతో ప్రేరణకి సందీప్‌ అంటే సొంత తమ్ముళ్ళకంటే మమకారం ఎక్కువ.

శృంగేరిలో కూడా మొత్తం వానే. శారదామాతనూ అక్కడున్న శివాలయాన్నీ చూసేసరికి పూర్తిగా తడిసి ముద్దయ్యారు అందరూ. వేరే బట్టలు తెచ్చుకోకపోవడం... చలిగాలి బాగా ఉండటంతో తడిసిన బట్టలతో చిత్ర వణికిపోతోంది. పోనీ ఆవేళ్టికి అక్కడే ఉండిపోదామంటే మర్నాడు సోమవారం.. ఇద్దరికీ డ్యూటీలున్నాయి. ప్రేరణకి వాళ్ళిద్దర్నీ చూస్తే జాలేసింది. కొత్త దంపతులకు దొరికిన సెలవుల్ని వాళ్ళకిష్టం వచ్చినట్టు ఎంజాయ్‌ చెయ్యనివ్వకుండా తను తీర్థయాత్రకొచ్చినట్టు తిప్పింది.

ఆ మాటంటే సందీప్‌ నవ్వాడు. ‘‘అసలు బావని వదిలి నువ్వు మా ఇంటికి రావడమే అపురూపం. నీకు ఇవన్నీ చూపించకపోతే ఎలాగక్కా?’’

‘‘అవును వదినా, అన్నయ్యగారు కూడా వచ్చి ఉంటే...’’

‘‘నువ్వేంటి, మీ అన్నయ్యగారి తరఫున వకాల్తా పుచ్చుకున్నదానిలా... అయినా నేను లేకపోతే అక్కడ గడవదా? వాళ్ళని చూడకుండా నేను ఉండలేననుకున్నావా?’’

‘‘అదేంటి అలా అంటున్నావు. కొంపదీసి బావతో పోట్లాడిగాని వచ్చావా ఏంటి?’’

‘‘ఇక్కడికి రావడానికి పోట్లాడాలేంటి? దగ్గరుండి మీ పెళ్ళి చేసినదాన్ని. మీ మంచీ చెడ్డా చూడొద్దూ నేను. ఎప్పుడో పిల్లల పరీక్షలు అవీ అయి... అంటే... అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?’’

‘‘అర్థమైపోయిందక్కా, బావ ఇప్పుడు వెళ్లొద్దన్నాడు అవునా?’’ ప్రేరణ మాట్లాడలేదుగానీ ముసిముసిగా నవ్వుకుంది.

బస్సు పరిగెడుతోంటే మరింత చలిగా ఉంది. చిత్రని ఏదో వంకబెట్టి సందీప్‌ పక్కకితోసి తను వేరే పెద్దావిడ పక్కన కూర్చుంది ప్రేరణ.

ప్రేరణకి భర్త విశ్వం గుర్తొచ్చాడు. అతనికిలాంటి వాతావరణమంటే మహా మక్కువ. తమ హనీమూన్‌లో కూడా కావాలని అడవులన్నీ తిప్పి, బట్టలన్నీ తడిసిపోయి తను గువ్వపిట్టలా వణికిపోతూంటే వెచ్చగా కౌగిలిలో పొదువుకుని, చెవిలో చిలిపిగా గుసగుసలాడుతూ కవ్వించేవాడు. పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా తనని వదిలితే ఒట్టు. ఇద్దరు పిల్లల తల్లయినా ఇంకా పెళ్ళినాటి ప్రేరణలానే ఉన్నావంటాడు విశ్వం. తన ఆలోచనల్ని ఎవరూ చదవడంలేదుగదాని చుట్టూచూసి గతంలోంచి వర్తమానంలోకి వచ్చి ఓరగా తమ్ముడు మరదలికేసి చూసింది ప్రేరణ.

వాళ్ళిద్దరూ చెరోదిక్కూ చూస్తున్నారుగానీ తను ఊహించిన థ్రిల్‌ ఏమీ వాళ్ళ ముఖాల్లో కనిపించకపోయేసరికి ఆలోచనలోపడింది ప్రేరణ.

కొత్తగా పెళ్ళయిన జంట. రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఎంత హుషారుగా ఉండాలి. అసలు ఓ బంధువులింట్లో పెళ్ళిలో కుందనపుబొమ్మలా ఉన్న చిత్రను చూసి మురిసిపోయి చిన్నాన్నను ఒప్పించి తనే దగ్గరుండి వాళ్ళ పెళ్ళి చేసింది.

అందుకే సందీప్‌ కొత్త సంసారం ఎలా ఉందో చూడాలని... ఇప్పుడు కాదన్నా, భర్తతో కావాలని పోట్లాడి రెక్కలు కట్టుకుని మరీ వచ్చింది ప్రేరణ మణిపాల్‌కి. చూడాల్సినవన్నీ చూసి దారిలో హోటల్‌లో డిన్నర్‌ కానిచ్చి ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రయిపోయింది.

*     *     *

పొద్దుట ప్రేరణ లేచేసరికి సందీప్‌ ఆఫీసుకెళ్ళిపోయాడు. తనకి రాత్రి డ్యూటీ అని చెప్పింది చిత్ర.

చిత్రని వంట చెయ్యనివ్వలేదు ప్రేరణ. తనకి కావల్సినవన్నీ అందించమని సాయం మాత్రం తీసుకుంది. తీరా చూస్తే ఇంట్లో వంటదినుసులేమీ ఎక్కువగా కనిపించలేదు.

చిత్ర సిగ్గుపడుతూ చెప్పింది- ‘‘పగలు నేనొక్కతెనేకదా వదినా తినేది. అందుకే ఏదో ఒకటి హోటల్‌ నుంచి తెప్పించేసుకుంటాను. రాత్రి నేను బయలుదేరే టైముకి సందీప్‌ వస్తారు. కానీ భోంచేసే వస్తారు. మాకు ఆఫీసులోనే అన్నీ దొరుకుతాయి కదా, అందుకే అక్కడే తినేస్తాం’’ ప్రేరణకి ఏదో అర్థమయీ అవనట్టు అనిపించింది.

మొగుడూ పెశ్ళాలిద్దరూ వంటింట్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ చిలిపి జోకులేసుకుంటూ పనిచేస్తుంటే... ఆ సాన్నిహిత్యం... అందులోని థ్రిల్‌ వీళ్ళిద్దరికీ అనుభవంలో లేదన్నమాట. అదే విశ్వం అయితేనా? 

ఇంట్లో ఉన్నంతసేపూ నిమిషనిమిషానికీ ఏదో వంకతో వంటింట్లోకి వచ్చి తనను తాకుతూ సడెన్‌గా గాలిలోకి గిర్రున తిప్పుతూ అల్లరిపెట్టందే వదిలిపెట్టడు.

అయినా వీళ్ళిద్దరివీ ఇవేం టైమింగులు బాబూ... ఒకరు ఉద్యోగానికి వెళ్ళేందుకు మెట్లు దిగుతోంటే మరొకరు ఇంట్లోకి వచ్చేందుకు మెట్లెక్కుతున్నారు. ఎవరికిష్టమైన తిండి వాళ్ళు ఎక్కడో ఒకచోట తిని, కేవలం విశ్రాంతి తీసుకునేందుకు మాత్రం ఇంటికొస్తున్నారు.

ఇలాంటి వాతావరణంలో కుటుంబాలు ఎంతవరకు నిలుస్తాయి? అసలు వాళ్ళ బంధం బలపడేందుకు ఇద్దరూ కలిసి భోజనం చేయడంగానీ వినోదాన్ని పంచుకోవడంగానీ ఎక్కడున్నాయి? కొత్తగా పెళ్ళయిన జంటలోని పారవశ్యంగానీ మెరుపుగానీ వాళ్ళలో ఏ కోశానా కనిపించడం లేదు. పైకి గులాబీ జీవనంలా ఉన్నా తమ వెన్నంటి ఉన్న ఈ కంటకాలను గుర్తించగలుగుతున్నారా వీళ్ళు?

ప్రేరణకు విశ్వం గుర్తొచ్చాడు.. తనెక్కడ కష్టబడిపోతుందోనని ఇంట్లో ఉన్నంతసేపూ తన వెనకే తిరుగుతూ జోకులేస్తూ వచ్చినా రాకపోయినా ప్రతిపనీ అందుకుంటూ... ఎంత కష్టపడుతుంటాడు! పైగా దానిని తను ‘కష్టం’ అంటే అసలు ఒప్పుకోడు. ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ అంటూ ఓ పాతపాట దీర్ఘం తీస్తాడు.

పాపం తనిలా వచ్చేసింది. పిల్లలతో ఏం అవస్థపడుతున్నాడో ఏంటో? సందీప్, చిత్రల గురించి ఆరోజు రాత్రి భర్తతో చాలాసేపే మాట్లాడింది ప్రేరణ. తను తిరిగి ఎప్పుడొస్తుందో కూడా చెప్పింది... ఓ పాట హమ్మింగ్‌ చేస్తూ.. 

*     *     *

మర్నాడు డ్యూటీ నుంచి వచ్చిన చిత్ర నిద్ర అలసట తీరాక... వదినా మరదళ్ళు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుని తిన్నారు.

‘‘వదినా, అబ్బ ఎన్నాళ్ళకు కడుపునిండా తింటున్నానో...’’ మనస్ఫూర్తిగా అంది చిత్ర.

రోజూ ఆఫీసులోనే ఫ్రీగా సప్లైచేసే పిజ్జాలూ బర్గర్లూ ఐస్‌క్రీములూ తిని విసుగెత్తిపోతోంది. వ్యాయామంలేక శరీరం బరువెక్కిపోతోంది కూడా. అయినా తప్పదు మరి.

‘‘పిచ్చిపిల్లా, బయటి భోజనం చూడ్డానికి ఎంత సొంపుగా ఉన్నా మనసుకు తృప్తికరమైన ఆరోగ్యకరమైన భోజనం కూడా అవసరం’’ అంది ప్రేరణ. మనసు, భోజనం అన్న పదాలను కావాలనే ఒత్తి పలుకుతూ.

చిత్రకి అర్థమైంది. కానీ తనేం చెయ్యగలదు? మామూలు ఉద్యోగుల్లా జీవించేందుకు తమ ఉద్యోగాలు అవకాశమివ్వవు. రెప్పవెయ్యకుండా మానిటర్‌ చూస్తూ, అసౌకర్యంగా ఉన్నా అలాగే గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. మెడ, మణికట్టు పట్టేస్తుంటాయి.

‘‘పోనీ నాతో నాలుగురోజులు హైదరాబాద్‌ రాకూడదూ?’’

‘మరి సందీప్‌కెలాగ?’ అనలేదు చిత్ర. ఆమె పుట్టింటివాళ్ళదీ హైదరాబాదే. అందుకే హుషారుగా ఒప్పేసుకుంది. సందీప్‌ కూడా అడ్డుచెప్పలేదు... చిత్ర విసుగెత్తిపోతోందని.

కానీ తెల్లారేసరికి విశ్వం సూట్‌కేసుతో తయారయ్యేసరికి ప్రేరణ ఆశ్చర్యపోవడమేకాదు, కంగారుపడింది కూడా ఏమయిందోనని.

‘‘పిల్లలేరీ?’’

‘‘నా జేబులో ఉన్నారు తీసుకో. లేకపోతే... అంతదూరం నుంచి నీకోసం వచ్చాను. 

పతిదేవుడిని కాస్త ఎలా ఉన్నారని అడగడం లేదు. అసలు... నిన్నూ...’’ అంటూ ప్రేరణ తలమీద మొట్టేందుకు ముందుకు వస్తుంటే చిత్ర అక్కడ నుంచి పారిపోయింది సిగ్గుతో.

‘‘నేను అనుకుంటూనే ఉన్నాను.. ఇవాళ కాకి అరిచింది చుట్టాలొస్తారని’’ భోజనాలవేళ అంది చిత్ర.

‘‘ఆ రోజులు పోయాయమ్మోయ్‌. కాకికంటే ఎక్కువగా అరుస్తూ నేనే వచ్చాను, మా ఆవిడను తీసుకుపోవడానికి’’.

‘‘అన్నయ్యా, పిల్లలేరీ? వాళ్ళను తీసుకొస్తే బాగుండేది’’.

‘‘సెలవులిచ్చేశారు కదమ్మా. ఇల్లు పీకి పందిరేస్తుంటే వాళ్ళమ్మమ్మ, తాతయ్యల దగ్గర దిగబెట్టాను. వాళ్ళకక్కడ అలవాటే. నాకే ఈ విరహం అలవాటులేనిది. మీ వదినగారికేంలే... అసలు ఇన్ని రోజులు నన్ను విడిచి...’’ దిగులుగా అన్నాడు విశ్వం.

‘‘ఇదిగో చాలుచాలుగానీ ఇటు రండి’’ భర్త ఇంకేం మాట్లాడేస్తాడోనన్న కంగారుతో పిలిచింది ప్రేరణ.

‘‘వస్తున్నా... ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నా. ఇదిగో చెల్లాయ్, మీ వదిన ఎందుకో పిలుస్తోంది. బహుశా బాకీ తీర్చడానికనుకుంటాను’’.

‘‘బాకీయా?’’ తెల్లబోయింది చిత్ర.

‘‘సందీప్‌కీ నీకూ బాకీలుండవా ఏంటి?’’

‘‘అయ్యయ్యో, ఈ మనిషికి బొత్తిగా సిగ్గులేకుండా పోయిందమ్మా’’ విసుక్కుంది ప్రేరణ.

‘‘ఏమిటోయ్‌ పిలిచావు. ‘వెన్నెలలోనే వేడి ఉన్నదీ... విరహములోనే హాయి ఉన్నదీ’ అని ఫోన్లో నన్ను కవ్విస్తావా? రాత్రవనీ... నీ పని చెప్తాను. ఇప్పటికిమాత్రం ఇదిగో నీ బాకీ... మరి నా బాకీ ఎప్పుడు?’’ వెనకనుండి అంటున్న భర్తను బలవంతంగా తప్పించుకుని బయటికి వచ్చిన ప్రేరణ చెక్కిళ్ళు ఎర్రగా కందిపోవడం చిత్ర ఓరకంటితో గమనించి ఆలోచనలోపడింది.

ఆ రోజు చిత్రని వంటింట్లోకి రానీకుండా భార్యాభర్తలిద్దరూ చకచకా వంట చేసేశారు. రాత్రి డ్యూటీ నుంచి అలసటగా వచ్చిన సందీప్‌ బావని చూడగానే ఎగిరి గంతేశాడు.

‘‘అందుకేనా, వంటింట్లోంచి కమ్మని వాసనలు గుప్పుమంటున్నాయి. చిత్రా, మా బావ వంట ఎంత బాగా చేస్తాడో తెలుసా? ఇంతకీ బావా, ఇది కలా నిజమా?’’ అని గిచ్చి చూసుకున్నాడు.

‘‘కల ఇవాళ నిజమౌతుందిలే నాకు. మీ అక్కయ్య నన్ను విరహంలో పడేసి తనేమో హాయిగా మీతో యాత్రలు చేస్తోంది’’.

సందీప్‌ చెవికి మరేం వినబడటం మానేశాయి. అతడు చిత్రకేసి చూశాడు. 

ఆమె తల వంచుకుని ఉంది.

తామిద్దరికీ విరహమేం తెలుసు.. ఉరుకులు పరుగులు తప్ప. అసలు ఓ అలగడానికైనా తీరిక ఉంటేనా?

మర్నాడు శనాదివారాలు కావడంతో అందరికీ ఆటవిడుపే. ఉడిపి దగ్గర బస్సెక్కి, అరేబియన్‌ సముద్రం బీచ్‌కి వెళ్ళి అరగంటయినా గడవకముందే పెద్ద గాలీ వానా... బస్సు దగ్గరికి పరిగెత్తేలోగానే అంతా తడిసి ముద్దయ్యారు. విశ్వం, సందీప్‌ తనివితీరా వానలో తడుస్తూ ఎంజాయ్‌ చేశారు. 

ఆడాళ్ళిద్దరూ ఉహూహూ అంటూ వణికిపోతూంటే వెక్కిరించాడు విశ్వం.

‘‘ఇదెక్కడి ముసలమ్మలు దొరికారయ్యా సందీప్‌. మన ఒంటి వేడికి ఎంత తడి అయినా క్షణంలో ఆరిపోవాల్సిందే’’.

బస్సులో చలిగాలి హోరెత్తిపోతుండేసరికి నెమ్మదిగా ప్రేరణను తెలివిగా తన పక్కసీట్లోకి లాక్కున్నాడు విశ్వం. వెనక సీట్లో చిత్ర, సందీప్‌ చెరో ముసలమ్మ పక్కన సర్దుకోవాల్సివచ్చింది. పరిసరాలను లెక్కచెయ్యడంలేదు విశ్వం. కానీ ప్రేరణకే ఒళ్ళు చచ్చిపోయినట్టయి సిగ్గుతో ముడుచుకుపోయింది. కానీ భర్త ఒంటి వెచ్చదనం గుండెల్లోంచి తన్నుకొచ్చే చలిని ఆపినందుకు ఆనందంగానే ఉంది. ఉడిపిలో బస్సు దిగుతూ చిత్రకేసి చూసింది ప్రేరణ. సందీప్‌ వేసుకున్న కోటు, బస్సులో ఎప్పుడు మారిందో ఆమె ఒంటిమీద ఉంది.

‘ఊహూ’ అంది ప్రేరణ చిలిపిగా... కన్ను గిలుకుతూ... చిత్ర ముఖంలో నునుసిగ్గు.

*     *     *

మర్నాడు బాగా పొద్దెక్కాకగానీ లేవలేకపోయారు సందీప్, చిత్ర.

‘‘సారీ వదినా, జ్వరం వచ్చినట్టయి...’’ కాఫీ కలుపుతున్న ప్రేరణతో అంది చిత్ర గిల్టీగా ఫీలవుతూ.

ప్రేరణ ముసిముసి నవ్వులు నవ్వుతూనే ‘‘ఏం జ్వరం మరదలా? కొంపదీసి ప్రేమజ్వరం కాదు కదా. ఇంతకీ నాతో హైదరాబాద్‌ వస్తున్నావా లేదా?’’

‘‘వదినా నేనో నిర్ణయం తీసుకున్నాను’’.

‘‘ఏంటీ నాతో రాకూడదనా?’’

‘‘కాదు. ఈ ఉద్యోగం మానెయ్యాలని. ప్రాణానికి సుఖం, సంతోషం లేకపోయాక ఎందుకొచ్చిన డబ్బు... కాలక్షేపం కోసం దొరికితే ఏ డే కాలేజీలోనో లెక్చరర్‌గా చేరతాను. లేదా ఏ సోషల్‌వర్కో చేస్తాను. లేదా...’’

‘‘మంచి గృహిణిలా... నాలా... భర్త పాదసేవ చేసుకుంటూ తరిస్తావా?’’

‘‘ఛ, అదేంమాట వదినా... అన్నయ్యగారు నిన్నూ పిల్లల్నీ కూడా ఎంత ప్రాణంగా చూసుకుంటారో రెండ్రోజుల్లో అర్థంచేసుకున్నాను. ఇన్నాళ్ళూ నేను ఇంత చదువుకున్నాను... ఎందుకు ఉద్యోగం చెయ్యకూడదూ అనుకున్నాను. కానీ అన్నగారినీ నిన్నూ చూశాక నేనేం పోగొట్టుకుంటున్నానో అర్థమవుతోంది. నేను... ఈ ఉద్యోగంలో... పిల్లల్ని కన్నా మాకు అడ్డేనని... ఫ్యామిలీప్లానింగ్‌ అమలుచేస్తూ... ఒక ఆనందమన్నది లేకుండా... జీతం కోసమే బతుకుతూ... ఛీఛీ...’’
‘‘సర్లే సర్లే, అయితే నాకో బుల్లి కృష్ణుడు గ్యారంటీయేగా...’’

‘‘ఫో వదినా!’’

‘‘నువ్వుండమన్నా మేమింక ఉండలేంలే చెల్లెమ్మా. మేమొచ్చిన పని కూడా అయిపోయింది. మాకూ కొంపాగోడూ ఉన్నాయి. పదవోయ్‌ నా బంగారం... మంగుళూరు నుంచి హైదరాబాద్‌కి నేను వచ్చేటప్పుడే ఫ్లయిట్‌ టికెట్స్‌ బుక్‌ చేశాను. ఇప్పుడు ఇక్కడ్నుంచి మంగుళూరు వెశ్ళాలంటే.. ఈ వర్షంలో రెండు గంటలు... మన ఫ్లయిట్‌ పదిన్నరకి’’ తొందరపెట్టేశాడు విశ్వం.

లేచి కళ్ళు నులుముకుంటూ తనూ వంటింట్లోకి వచ్చి అన్నాడు సందీప్‌ ‘‘నీకు అన్నింటికీ తొందరెక్కువే బావా’’.

‘‘నాకంటే మీ అక్కయ్యకే ఎక్కువ సుమా. అయినా తొందర నా గురించి కాదు బామ్మరిదీ... నీ గురించే. ఇవాళ మీకు హాలీడే... జాలీడే... మేం కూడా త్వరగా మా గూటికి చేరుకుని మా మేడమీద ఆరుబయట వెన్నెల్లో పక్కలేసుకుని... నడు ప్రేరణా’’.

ఫ్లయిట్‌ ఎక్కాక భర్తకి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది ప్రేరణ.

‘‘ఇదేంటోయ్, నిన్న మీ మరదలి దగ్గర చాలా సిగ్గుపడ్డావుగా’’ కొంటెగా నవ్వాడు విశ్వం.

‘‘అబ్బ... నిన్న బస్సులో మీరు చేసిన అల్లరి వాళ్ళిద్దరూ చూశారేమోనని నేనే సిగ్గుతో చచ్చిపోతేనూ’’.

‘‘చూడాలనే కదోయ్, అల్లరి చేశాను. గడగడలాడిస్తున్న చలిలో... తడిసిన బట్టల్లో వాళ్ళిద్దరూ ఒకచోటికి చేరకుండా ఆపడానికి బస్సులో వాళ్ళిద్దరి పక్కకి చెరో ముసలి ప్రాణాన్ని అతికించడానికి ఎంత కష్టపడ్డానని. దెబ్బకి ఇంటికెళ్ళేసరికి ఇద్దరూ ఎంత వేడెక్కిపోయారో చూశావా? పొద్దెక్కేదాకా కళ్ళు తెరవలేదు. అయినా ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ!’’

‘‘నేనా?’’

‘‘కాదా? మన ప్రణయజీవితానికి ప్రేరణవు నువ్వే ప్రేరణా! విరహం తర్వాత సంసారం మరింత రంజుగా ఉంటుందనేగా నువ్వు నన్ను అర్ధాంతరంగా అక్కడ వదిలేసి ఇలా వచ్చేశావు. అంతేనా? రెండు వీకెండ్సూ నీ మాటలతో మీ వాళ్ళకి మనుసుల్లో వాళ్ళు కోల్పోతున్నదేంటో ప్రేరణ కలిగిస్తూ... వాళ్ళిద్దరికీ విరహం కల్పించావు. నా బావమరిది సంసారం గురించి నేను కూడా కాస్తయినా చెయ్యకపోతే ఎలా? అదీగాక ఇంకో కారణమూ ఉందిలే. బహుశా నిన్న మధ్యాహ్నం నిన్ను నేను బెడ్‌రూంలోకి లాక్కుపోయి ‘వెన్నెలలోనే వేడి ఉన్నదీ.. విరహములోనే హాయి ఉన్నదీ’ అని యాక్టింగ్‌ చేస్తూ పాడటం మీ మరదలు విని మనల్ని ఏదో సీనులో ఊహించుకుని ఉండాలి. అయినాగానీ నా స్వీట్‌ లవ్, ఎంత విరహమయితే మాత్రం నిన్న రాత్రి ఈ బక్కప్రాణిని ఎముకలు విరిగేలా కౌగిలించుకుంటావా... పైగా ఊపిరి సలపనీకుండా ముద్దులూ.. లలలా...’’

ప్రేరణ గిచ్చిన గిచ్చుకి విశ్వం అరిచిన అరుపుకు... ఫ్లయిట్‌లో ముందు సీట్లలోని పడుచు, ముసలి జంటలు వెనక్కి తిరిగిచూసి ముసిముసిగా నవ్వుకున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని