కొల్లేటి సూర్యం

సూర్యం కనపడ్డం లేదు. పొద్దున్నే ఊరంతా గుప్పుమంది. ఎనభై సంవత్సరాల వృద్ధుడు, సూర్యం అనే సూర్యనారాయణకి పిచ్చి పట్టిందని ఈమధ్య అందరూ అనుకుంటున్నారు.  అది మామూలు పిచ్చి అయితే సరే. ..

Updated : 02 Jul 2021 16:48 IST

- ప్రసాదమూర్తి
కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

సూర్యం కనపడ్డం లేదు. పొద్దున్నే ఊరంతా గుప్పుమంది. ఎనభై సంవత్సరాల వృద్ధుడు, సూర్యం అనే సూర్యనారాయణకి పిచ్చి పట్టిందని ఈమధ్య అందరూ అనుకుంటున్నారు.  అది మామూలు పిచ్చి అయితే సరే. కానీ ఈ పిచ్చి కొంచెం విచిత్రంగానే ఉంది. కొందరికి వేళాకోళంగా.. కొందరికి చిరాగ్గా.. కొందరికి కోపంగానూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఏభై సంవత్సరాల కిందట కొల్లేటిలో చేసిన వ్యవసాయం గురించే అందరితోనూ మాట్లాడుతుంటాడు. చెప్పిందే చెప్పడం.. అవే మాటలు తిప్పి తిప్పి మాట్లాడ్డం.. అవే సందర్భాలు.. అవే సంఘటనలు తిప్పి తిప్పి వర్ణించడం.. వినీ వినీ జనం విసుగెత్తిపోయారు. గతంలో కూడా ఒకసారి సూర్యం  తప్పిపోతే అందరూ తలా ఒక దిక్కుకూ వెళ్లి వెదికారు. పొలాల గట్లమ్మటా దారి పట్టి కొల్లేరు వైపు వెళుతున్న సూర్యాన్ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి అందరికీ తల ప్రాణం తోకకొచ్చింది. ఇప్పుడు అటే వెళ్లి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. సూర్యం భార్య కాంతమ్మ కొడుక్కి తెల్లారు జామున మూడు గంటలకి ఫోన్‌ చేసింది. కొడుకు ప్రసాద్‌ హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన కారులో బయలుదేరాడు. తల్లి మాటలే గుర్తుకొస్తున్నాయి.      

‘‘ఈ మద్దె మీ నాన్న మన లోకంలో ఉంటాలేదురా. ఎంతసేపూ ఆ కొల్లేరు మాటలే మాటాడతాడు. యాబయ్యేళ్ల నాడు ఆయన యెవసాయం చేసినప్పడు ఎలా మాటాడేవోడో అలాగే ఇప్పుడూ మాటాడుతున్నాడు. మాటాడితే చాలు కొల్లేరెల్లాలి కొల్లేరెల్లాలనడం.. ఆ రైతును పిలు.. ఈ రైతును పిలు అని కేకలెయ్యటం.. ఇదే గొడవ. తలుపు సందులో బాణా కర్ర ఏది అని అడుగుతాడు. చెరువులో నానబెట్టిన ఇత్తనాల బస్తాలు దొడ్లోకి తీసుకొచ్చేరా అంటాడు. ఇలాగ ఒకటి కాదురా. నన్ను సంపుకు తింటన్నాడురా నాయనా. హైద్రాబాద్‌ పోదావంటే ఇంత యెవసాయం వదులుకోని ఎక్కడికెల్తావే అని కొట్టడానికి మీద మీదకొస్తాడు. ఏం చెయ్యాల్రా..!’’  అమ్మ ఏడ్చింది.  

విషయం అర్థమైంది ప్రసాద్‌కి. తాను మాత్రం ఏం చేస్తాడు. తనతో పాటు రమ్మంటే రారు కదా. ఒకసారి తండ్రిని డాక్టర్‌కి చూపించాడు. ‘మీరు కొల్లేరు రావాలి. మా పొలాలు చూడాలి’  అంటూ డాక్టర్నే విసిగించాడు సూర్యం. ‘అప్పుడప్పుడూ కాస్త కొల్లేరు వైపు తీసుకువెళ్లి చూపించి రండి’ అని డాక్టర్‌ సలహా. తండ్రి కచ్చితంగా కొల్లేరు వైపే వెళ్లి ఉంటాడని అనుకున్నాడు. నాన్నతో కలిసి ఎప్పుడో ఏభై ఏళ్ల కిందట వ్యవసాయం చేసిన వాళ్లలో ఇప్పుడున్న ముగ్గురు రైతులకి కబురు పెట్టమని అమ్మతో చెప్పాడు. తాను ఊరికి చేరుకోగానే వాళ్లని కూడా తీసుకుని కొల్లేరు వెళతానని అన్నాడు. 
కారుని వీలైనంత వేగంగా నడుపుతున్నాడు. మనసంతా కొల్లేటి ఆలోచనలే. ఎందుకు నాన్న కొల్లేరు కొల్లేరని  పట్టుపడుతున్నాడో అర్థం కాదు. బహుశా ఇప్పుడు నాన్న ఏ చెట్టునో ఏ పుట్టనో రకరకాల పక్షుల పేర్లు ఆనవాళ్లు చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏవేవో పేర్లు పెట్టి రైతుల్ని పిలుస్తూ ఉండుంటాడు. గట్లు కట్టారా.. నీళ్లు తోడారా.. నాగళ్లు సిద్ధం చేశారా.. ఊళ్లోంచి ఎడ్లొచ్చాయా.. ఇలా ఏవేవో అరుస్తూ ఉండుంటాడు. ఆయనకి సమాధానం  చెప్పడానికి ఎవరూ ఉండరు. అదాయనకు సంబంధం లేదు. ఇంతకు ముందు ఇలాగే చేశాడని ఊళ్లోవాళ్లు కొందరు తనకు చెప్పారు. సుమారు ఉదయం ఏడు గంటల సమయానికే ప్రసాద్‌ విజయవాడ దాటాడు. కారు చాలా వేగంగా నడుపుతున్నాడు. 
మరోవైపు కొల్లేరు సమీపంలో ఒక నల్ల తుమ్మ చెట్టు దగ్గర సూర్యం ఆగి పెద్దగా మాట్లాడుతున్నాడు. ‘‘మా పొలం మాకిచ్చేయండి బాబయ్యా. మేం యెవసాయం చేసుకోవాలి. పేదోళ్లం బాబూ. బక్కోళ్లం అయ్యాగారూ. యెవసాయం లేకపోతే మేమంటే ఎవడికీ లెక్కే లేదయ్యా’’ తుమ్మ చెట్టును పట్టుకుని ఊపుతూ అడుగుతున్నాడు సూర్యం. తన పొలాన్ని తనలాంటి బడుగు జీవుల పొలాలన్నీ గుంజేసుకుని చెరువులు తవ్వేసిన రాజుగారిని అడుగుతున్నాడు సూర్యం. అయితే అక్కడ రాజుగారూ లేరు. ఆయన ప్రేతాత్మా లేదు. అంతా సూర్యం పిచ్చి. తనకు పిచ్చి లేదని.. తనది న్యాయ పోరాటమని సూర్యం వాదన. 
కారు నడుపుతున్న ప్రసాద్‌ తండ్రి గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన పొలాలు లాక్కున్న పెద్ద మనిషి ఎప్పుడో పైలోకానికి వెళ్లిపోయాడు. కానీ ఆయనతో మొదలైన యజ్ఞం కొల్లేరును నామరూపాల్లేకుండా చేస్తోంది. అదెలా సాధ్యం? ఒక వ్యక్తి వల్ల ప్రపంచంలో అతి పెద్ద సరస్సుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కొల్లేరు అంతరించిపోతుందా? ప్రసాద్‌కి నమ్మకం లేదు. ఇలా ఏవేవో అనుకుంటూ వుండగానే ఊళ్లోకి ప్రవేశించాడు. అప్పటికే తండ్రితో పాటు ఎప్పుడో కొల్లేటి వ్యవసాయం చేసిన ముగ్గురు రైతులు వెంకటేశులు, సన్యాసిరావు, దావీదు ఎదురు చూస్తున్నారు. సూర్యానికంటే ఆ ముగ్గురూ వయసులో చిన్నవాళ్లే. కానీ, ఆయన కంటే ముసలితనం మీదేసుకుని చాలా కుంగిపోయి ఉన్నారు. వాళ్లు ఇప్పటి రైతులు కాదు. ఏభై ఏళ్ల కిందట సూర్యంతో కొల్లేరులో కమతం సాగించినప్పటి రైతులు. 
‘‘ఏరా పెసాదూ బాగున్నావా? అని ముగ్గురూ ఒకేసారి పలకరించారు. కొల్లేరు కొల్లేరని చంపేత్తన్నాడ్రా బాబా మీ నాన. అటే ఎల్లుంటాడు. తొరగానే వచ్చేవు. పద పద’’ అంటూ ముగ్గురూ కారెక్కారు. అమ్మకి మొహం చూపించి ధైర్యం చెప్పి ప్రసాద్‌ కారు కొల్లేరు వైపు పోనిచ్చాడు. 
పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేటిని ఆనుకున్న ఊరు ప్రసాద్‌ వాళ్లది. ఆ ఊరి వైపు పొలాలన్నీ చేపల చెరువులూ రొయ్యల చెరువులూ అయిపోయి చాలా ఏళ్లయ్యింది. ప్రసాద్‌ వాళ్ల నాన్న మాత్రం ఏభై ఏళ్ల కిందట కొల్లేటిలో చేసిన వ్యవసాయం గురించే చెప్తాడు. ఊరికి పది పన్నెండు మైళ్ల దూరంలో ఉన్న కొల్లేరు వచ్చి దాళ్వా వ్యవసాయం చేసేవారు సూర్యం వాళ్లు. 
లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉండేది కొల్లేరు. శీతాకాలం దూరదూర దేశాల నుంచి ఎగురుకుంటూ వచ్చి అక్కడ లక్షల సంఖ్యలో రంగురంగుల పక్షులు విడిది చేసేవి. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య సుమారు రెండు లక్షల ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు వానాకాలం వరదనీటిని కడుపులో దాచుకుని శీతాకాలం తర్వాత నీరెండాకా, పై ప్రాంతంలోని కొన్ని వందల ఎకరాల్లో చుట్టుపక్కల గ్రామాల రైతుల వ్యవసాయానికి ఆధార క్షేత్రంగా నిలిచేది. 
ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, గ్రామాల్లో భూములు లేని పేదజనం అక్కడ వ్యవసాయానికి వచ్చేవారు. అందరూ కలిసి కమతాల కింద ఏర్పడి భూమి సాగు చేసుకునేవారు. అలా సూర్యం కొల్లేటి వ్యవసాయానికి అలవాటుపడ్డాడు. ఊళ్లో ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సూర్యం, బక్క జనాన్ని పోగుజేసి కొల్లేటి కమతాలను చేయడానికి నడుం కట్టాడు. సూర్యం చేసే కమతంలో కనీసం వందెకరాలు పైగా పొలం ఉండేది. అందరూ కలిసి కష్టపడేవారు. దానికి పెట్టుబడి కోసం నిరుపేద జనం పుస్తెల తాళ్లతో సహా తాకట్టు పెట్టేవారు. సూర్యం తన పట్టా పొలాన్ని తాకట్టుపెట్టి, బ్యాంకు రుణాలు తెచ్చి అంతా కమతానికి ధారపోసేవాడు. 
అయితే పంట చేతికొచ్చే దాకా ఆ సాగు ఒక లాటరీగానే మిగిలేది. చేతికి పంట అందే సమయానికి అకాల వర్షాలొచ్చి పనలు పనలుగా కుప్పలు కుప్పలుగా పంట కళ్లముందే కొట్టుకుపోయేది. నీరసించిన సాటి కమతం రైతులను హుషారు చేసేవాడు సూర్యం. ‘‘ఏటెల్లకాలం వర్షాలు వరదలూ వస్తాయేంట్రా. కొల్లేటి పెద్దింట్లమ్మ ఉండగా మనకేంట్రా. ఎనక్కి తగ్గేది లేదు నడండ్రా’’ అని రైతుల్ని ప్రోత్సహించేవాడు. 
తండ్రి మీద గౌరవమేగాని ఆయన చేసిన వ్యవసాయం మీద ఎప్పుడూ సదభిప్రాయం ప్రసాద్‌కి లేదు. సూర్యానికి ఏ దురలవాటూ లేదు. వ్యవసాయమే నీ దురలవాటు అని అప్పుడప్పుడూ తండ్రితో వాదించేవాడు ప్రసాద్‌. ‘‘హాయిగా అందరూ ఊళ్లో పొలాలు చేసుకుని బాగుపడితే నువ్వు మాత్రం ఒరే అప్పిగా పుల్లిగా అనుకుంటా కొల్లేరు పరుగులు తీశావు. అందుకే మన కొంప కొల్లేరయింది’’ ఇలా వీలు దొరికినప్పుడల్లా చెట్టంత తండ్రిని పట్టుకుని దులిపేసేవాడు. ఒక్కడే కొడుకు కావడం వల్ల ఉక్రోషం తన్నుకొచ్చినా సూర్యం ఏమీ అనేవాడు కాదు. కొల్లేరు తన తండ్రిని ఎందుకంత మోహంగా తనలోకి లాగేసుకుందో ప్రసాద్‌కి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. 
చిన్నప్పుడు తన చదువు, పెద్దయ్యాక ఉద్యోగం, ఇప్పుడు తనకో సంసారం, పిల్లలూ. తండ్రి గురించి తీరుబడిగా పరిశోధన చేసే సమయమే తనకెక్కడ దొరికింది. అప్పుడప్పుడూ గూగుల్‌ సెర్చిలోకి వెళ్లి కొల్లేరు గురించి చదివే వాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుల్లో ఇదొకటని.. వేలాది గ్రామాల తాగు నీటికి ఇదే గొప్ప వాటర్‌ ఫిల్టర్‌ అని.. వాతావరణ సమతుల్యతకు ఇది చాలా కీలకమని... ఆ ప్రాంత వాసులకు ఆ సరసు ఒక గొప్ప వరమని.. వలస పక్షులకు ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద పర్యాటక కేంద్రమని.. చాలా చాలా చదివాడు. 
కారు కొల్లేరు చేరుకుంది. సూర్యం తుమ్మ చెట్టు మొదట్లో అలాగే కూర్చుని ఉన్నాడు. ప్రసాద్‌ ఊపిరి పీల్చుకున్నాడు. 
‘‘నాన్నా..!’’
‘‘సూర్యం మావా..!’’
‘‘సూర్యం బావా..!’’
‘‘సూర్యం గారో..!’’ 
ప్రసాద్‌, సన్యాసి రావు, వెంకటేశులు, దావీదు ఒక్కసారిగా పిలుస్తూ సూర్యం దగ్గరికి పరుగెత్తుకు వెళ్లారు. సూర్యం వాళ్లని చూడకుండా పొలం ఇప్పించమని కనపడని రాజుగారిని వేడుకుంటున్నాడు.
అందరూ కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. 
‘‘మన పొలం ఏదిరా?’’ దావీదుని చూస్తూ సూర్యం అడిగాడు. అదిగోనండే ఆ చెరువులోనే మన పొలం ఉంది దావీదు సూర్యాన్ని చెయ్యి పట్టుకుని చెరువు వైపు నడిపించాడు. అది మూడొందల ఎకరాలకు పైగా ఉంటుంది. అదే ఒక మినీ కొల్లేరు సరసులా ఉంది. కాకుంటే తుప్పలూ పొదలూ లేవు. అదో నీటి వల. అక్కడికి పక్షులు రావు. 
సూర్యం ఏమీ గుర్తు లేనట్టే గందరగోళంగా చూస్తున్నాడు. కొల్లేటిలో ఉన్న తన పదెకరాల పట్టా పొలంతో సహా ఒక మూడొందల ఎకరాల్లో ఒకే చెరువు తవ్వించేశాడు ఒక మహానుభావుడు. చుట్టు పక్కల లంక గ్రామాల్లో వడ్డీ కులస్థులైన పల్లీలు చేపల చెరువులు చేసుకుంటున్న విషయం, వారు మంచి ఆదాయాన్ని పొందుతున్న పరిణామం ఆ పల్లీల వరకే ఆగలేదు. వారి చేపల చెరువుల మీద బలిసిన ఆసాముల కన్నుపడింది. పల్లీల జీవనాధారమైన చిన్న చిన్న చెరువుల్ని పెద్దపెద్ద లీజులిచ్చి పెద్దపెద్ద భూస్వాములు ఆక్రమించుకున్నారు. అవి అతి పెద్ద చెరువులుగా రూపొందాయి. వాటిలో అతిపెద్ద చేపలు కొలువుదీరాయి. కొల్లేటి చేప కలకత్తా దాకా ఐస్‌ పెట్టెల్లో ప్రయాణం కట్టింది. మరి చేప ద్వారా అందిన డబ్బు రుచి మరిగిన వ్యాపారులు ఊరుకుంటారా? మిగిలిన కొల్లేరు మీద కూడా తమ వ్యాపార వలలు విసిరారు. అప్పుడే ఓ బడా రాజకీయవేత్త అయిన రాజుగారొకరు కొల్లేరు సరసు మీద విహంగ వీక్షణం సాగించాడు. దానధర్మాల్లో పేరున్న గొప్ప వ్యక్తి ఆయన. ఎన్ని ధర్మాలు చేసినా ఏం లాభంలే అనుకున్నాడో ఏమో హుటాహుటిన కొల్లేటి సరసులో పాగా వేశాడు. బీదా బిక్కీ వ్యవసాయం చేసుకునే పొలాల మీద అతిపెద్ద వల విసిరాడు. కొన్ని రాత్రులు కొన్ని పగళ్లు కొల్లేటి గుండెల్లో బుల్‌ డోజర్లు.. ప్రొక్లెయినర్లు యథేచ్ఛగా స్వైరవిహారం సాగించి సరసును తల్లకిందులు చేశాయి. ‘ఇదేం గోరం మహాపెబో’ అని పేద రైతులు ఆ పెద్దాయన పాదాల మీద పడితే ‘మీ దస్తావేజులు పట్రండ్రా, మీకు న్యాయం చేస్తాను’ అన్నాడు. అందరూ నమ్మకంగా తీసుకెళ్లారు. అప్పుడా రాజుగారు అందరితో ‘‘చెరువులూ మీ కోసమే. చేపలూ మీ కోసమే’’ అన్నాడు. అందరూ నమ్మారు.
ఎకరానికో అయిదొందలు చొప్పున, కొంచెం నసిగిన వాడికి వెయ్యి రూపాయల చొప్పున విసిరేసి, వారితో సంతకాలు పెట్టించుకున్నాడు. అదిగో అలా ఆ ధర్మప్రభువు చూపిన అపారమైన దయాగుణం కారణంగా వందలాది శ్రామిక కులాల రైతులు కొల్లేరు భూముల మీద పెత్తనం కోల్పోయారు. వారిలో కొంచెం పెద్ద రైతు సూర్యం. కాని సూర్యం మాత్రం అందరిలా వదల్లేదు. చాలా సంవత్సరాలు న్యాయ పోరాటం చేశాడు. అయినా ఒక మధ్య తరగతి రైతు, కుటుంబ అవసరాలను పణంగా పెట్టి న్యాయం కోసం ఎంత కాలం పోరాడగలడు? పదీపదిహేనేళ్లు కోర్టుల చుట్టూ తిరగడానికి ఉన్న పొలం కూడా అమ్మేసుకొని చివరికి ఆ ప్రజాసేవకుడిగా ఎనలేని కీర్తి గడించిన రాజుగారికి లొంగిపోవలసి వచ్చింది. ఎకరానికో నాలుగు వేలు విదిలించి, అదే సర్కారు రేటు అని బుకాయించి, పైగా పెద్దవాళ్ల జోలికి పోకూడదని సూర్యానికి బుద్ధి కూడా చెప్పి ఘనకీర్తిమంతుడైన ఆ రాజుగారు మరింత కీర్తిని మూటగట్టుకున్నారు. 
కొల్లేటిలో పొలం ఎలాగూ పోయింది. దాని పేరుజెప్పి ఊళ్లో పొలానికీ రెక్కలొచ్చాయి. మిగిలిన వారంతా రాజుగారు తవ్వించిన చెరువుల్లో బెమ్మాండంగా చేపలు పట్టి అమ్ముకోవచ్చని బెమ్మాండంగా ఊరేగి చివరికి ఆ చెరువుల గట్ల మీద కాలు మోపడానికి హక్కులు కూడా లేకుండా కూలీలుగా మారి ఏదో బతుకులీడ్చేస్తున్నారు. సూర్యం మాత్రం కూలీగా మారలేక, ఉన్న ఊరు వదల్లేక, కొడుకు ఉద్యోగం చేస్తూ పంపించే డబ్బుతో కాలక్షేపం చేస్తున్నాడు. అయినా కొల్లేరు మీద మమకారాన్ని చంపుకోలేదు. వ్యవసాయం మీద ప్రేమనీ వదులుకోలేదు. ఆ జ్ఞాపకాలే ఆయన జవమూ జీవంగా మారిపోయాయి. 
‘‘ఇదిగో ఈ చెరువులోనే మన పొలాలున్నాయి మావా. రాజు గారిని కోర్టుల చుట్టూ తిప్పించావు ఈ పొలం గురించే కదా. గుర్తు తెచ్చుకో సూర్యం మావా’’ అన్నాడు సన్యాసిరావు. ఏదో గుర్తుకొస్తున్నట్టు తల గోక్కున్నాడు సూర్యం. 
‘‘అవును కదా. ఒరే మీరొచ్చేదాకా ఆ రాజుగారితోనే మాటాడతన్నారా!’’ 
‘‘అదేంటి సూర్యం బావా! ఆయనెప్పుడో పోయాడుగా’’ అర్థం కానట్టు వెంకటేశులు నోరు తెరిచాడు.
‘‘ఆయన పోతే భూమెక్కడకు పాతాదిరా. అదుంటే ఆయన కూడా ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు’’ సూర్యం మాటలతో అందరూ మొహ మొహాలు చూసుకున్నారు. అంతలోనే సూర్యం మాట తిప్పుకుని, ‘‘అన్ని కోట్లు సంపాదించేడు మా రాజు ఒక సెంటు బూవైనా కూడా తీసుకుపోయాడా. మనల్ని ఏడిపించాడు’’ సూర్యం మాటకి మాట కలుపుతూ దావీదు ‘‘సెంటు బూవి కాదుగదా ఒక చేపపిల్లని కూడా తీసుకెల్లలేదండి’’ ఇలా దావీదు అనేసరికి సూర్యం మన లోకంలోకి వస్తున్నాడన్న సంతోషంతో సన్యాసిరావూ కొంచెం హుషారుగా ‘‘అయితే ఏవైందిలే మావా. నువ్వాయన్ని బాగానే కోర్టుల చుట్టూ లగెత్తించేవుగా!’’ దాంతో ‘‘అవున్రా’’ అంటూ సూర్యం పకాలుమని నవ్వేశాడు. అందరూ హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు.
అప్పుడా నలుగురూ కొల్లేటి వ్యవసాయం నాటి సంగతులు గర్తు తెచ్చుకోవడం మొదలెట్టారు. అదంతా ఒక గొప్ప ఆటలా సాగింది. వారిని చూస్తూ భలే వినోదించాడు ప్రసాద్‌.
‘‘రేయ్‌ వెంకటేశులా! ఏదీ బాణా కర్ర పట్టుకుని ఒకసారి ఇసర్రా’’ అన్నాడు సూర్యం. 
‘‘ఊరుకో బావా కర్రెక్కడుంది. అయినా కర్ర ఇసిరితే పోయి ఆ చెరువులో పడద్ది. ఏం లాబం జెప్పు? కర్రని చేపలు తినేత్తాయి. మనల్ని రాజుగారి దెయ్యం తినేద్ది’’ వెంకటేశులు అలా అనేసరికి సూర్యం, సన్యాసి, దావీదు పగలబడి నవ్వారు. వాళ్లా కొల్లేరులో మొదటిసారి వ్యవసాయానికి నడుం కట్టినప్పుడు ఎవరి పేరు మీదా పొలాలేమీ లేవు. ఒక పొడవాటి కర్ర తీసుకుని బలంగా ఎవరు ఎంత దూరం విసిరితే ఆ మేరకు పొలం వారిదే. వెంకటేశులు కర్ర విసిరినప్పుడు పెట్టుకున్న గోచీ ఊడిపోయింది. దాని సంగతి పట్టించుకోకుండా పరుగు పెట్టి కర్ర విసిరాడు. గోచీ పోయినా కర్ర వదల్లేదని అప్పట్లో అందరూ చెప్పుకుని నవ్వుకునేవారు. వెంకటేశులు కాస్త సిగ్గుపడ్డాడు.
‘‘ఏరా ఏంటా సిగ్గు. చేసిన యెదవ పనులేమన్నా గుర్తుకొస్తన్నాయా ఏంటి?’’ సూర్యం ఇలా వెంకటేశుల్ని అడుగుతూ దావీదుని చూశాడు. దావీదు కూడా తలొంచుకున్నాడు. 
‘‘ఏంటి మావా నువ్వింకా ఆ గ్నాపకాల్లోనే ఉన్నావ్‌. మాక్కూడా అయ్యన్నీ గుర్తుకు తెత్తావా ఏంటి?’’ సన్యాసి రావు సూర్యంతో ఇలా అన్నాడేకానీ అతనికి కూడా వెంకటేశులూ దావీదు ఎందుకు సిగ్గుపడ్డారో తెలుసు. కొల్లేరు వ్యవసాయం అంటే అదో సమష్టి జీవన సౌందర్యం. ఊళ్లోనుంచి తెప్పించిన కూలీలతో పాటు రైతులందరూ పనిచేసే వారు. అంతా కలిసి గట్లు వేసేవారు. అంతా కలిసి నీరు తోడేవారు. దుక్కి దున్నేవారు. నారు పోసేవారు. కలుపు తీసేవారు. నాట్లు వేసేవారు. కోతలు కోసి, కుప్పలు వేసి, కుప్పలు నూర్చి, పంటలు బళ్లకెక్కించే దాకా అందరూ అన్ని పనులూ చేసేవారు. అలా సామూహికంగా కొల్లేరు సాగు చేయడానికి రోజుల తరబడి కొల్లేరులోనే మకాం పెట్టేవారు. పంట చేతికొచ్చే సమయంలో అయితే వారాల కొద్దీ అక్కడే ఉండిపోయేవారు. అలాంటప్పుడు అందరి పక్కలూ ఒకచోటే. అందరి వంటలూ ఒక చోటే. అందరి సరసాలూ అందరి విరసాలూ సంతోషాలూ విందులూ విలాసాలూ అన్నీ ఒక చోటే. ఎవరి మధ్యా ఎలాంటి దాపరికాలూ ఉండేవి కావు. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా అందరినీ చుట్టుముట్టినట్టున్నాయి. ఒక్కసారిగా తబ్బిబ్బవుతున్నారు. ఆ రోజుల్లో వారంతా కలిసి సాగించిన వ్యవసాయం సంగతులన్నీ చెప్పుకుంటూ ఒకటే నవ్వుకుంటున్నారు. 
ప్రసాద్‌కి కొంచెం కొంచెం అర్థవుతోంది. తండ్రి ఎందుకు మాటిమాటికీ కొల్లేరు కొల్లేరు అంటుంటాడో బోధపడుతోంది. అన్నిటికంటే తండ్రిలో ఇంత ఉత్సాహం ఈ మధ్య కాలంలో చూడలేదు. అప్పట్లో సూర్యానికి ముప్పయ్యేళ్ల వయసుంటుంది. మిగిలిన వారైతే ఇరవై పాతికేళ్ల వయసులో ఉంటారు. అంతా మాంచి బిగువులో ఉన్న కాలమది. దావీదు, వెంకటేశులు అప్పుడే కొత్తగా పెళ్లయిన కుర్రాళ్లు. అలా అక్కడ సంవత్సరాల తరబడి కలిసిమెలసి వుండటం వల్ల వెంకటేశులు భార్యకి దావీదుతోను, దావీదు భార్యకి వెంకటేశులుతోను చనువు ఏర్పడింది. అది వెంకటేశులుకీ దావీదుకీ మధ్య మంటబెట్టింది. అప్పుడప్పుడూ అనుమానం పొగ బహిరంగంగానే బయటపడుతూ ఉంటుంది. పంచాయితీ సూర్యం దగ్గరికెళ్లింది. ఆరా తీస్తే వెంకటేశులు దావీదు మీదా, దావీదు వెంకటేశులు మీదా నేరారోపణలు చేసుకున్నారు. తప్పు చేసిందెవరో తేల్చడానికి సూర్యానికి అంతు చిక్కలేదు. ‘అది నాకొద్దు’ అంటే ‘అది నాకొద్దు’ అని దావీదు, వెంకటేశులు ఇద్దరూ పట్టుబట్టారు. 
‘‘అసలు మీరేంటి మమ్మల్ని వొద్దనేది. మీరే మాకొద్దు పొండెహే’’ అని ఇద్దరాడాళ్లూ గోచీలు బిగించారు. ఆడదాన్ని అనుభవించడానికైనా అనుమానించడానికైనా తనకే చెల్లిందని మగవాడి అహంభావం. ఆ రోజు ఆడవాళ్లిద్దరూ మగవాళ్లిద్దరినీ తరిమి తరిమి కొట్టారు. 
‘‘నన్ననుమానించడానికి నువ్వెవడివిరా’’ అని, ‘‘నన్నొక్కపాలైనా అడక్కుండానే పంచాయితీ పెడతావా’’ అని, ఇద్దరాడోళ్లూ రచ్చ రచ్చ చేశారు. దావీదు, వెంకటేశులు సిగ్గుతో చితికిపోయి సూర్యం కాళ్ల మీద పడిపోయారు. ‘కొల్లేటి ఆడదాని పౌరుషం ఇదిరా’ అని సూర్యం ఇద్దరినీ చీవాట్లు పెట్టి పంపించాడు. కొల్లేటి పెద్దింట్లమ్మ కూడా సంతోషంతో నవ్వుకుంది. ఆ ముచ్చట గుర్తుచేసుకున్నారందరూ. ఒకటే నవ్వులు. విషయం తెలుసుకుని ప్రసాద్‌ కూడా పడిపడి నవ్వాడు. 
ఒకసారి అందరూ పొలం దిబ్బమీద ఆదమరిచి నిద్రపోతున్నారు. వర్షం లంకించుకుంది. పంటంతా పన మీద ఉంది. తెల్లారితే ధాన్యం కొట్టి బస్తాలకెక్కించి ఊళ్లోకి తీసుకుపోవాలి. చాలా కలలు కంటూ నిద్రపోయారు. అప్పుడప్పుడూ అకాల వర్షం వారి కష్టాన్ని అతలాకుతలం చేసేస్తుంది. తెల్లారి చూస్తే కళ్ల ముందే వారి రెక్కల కష్టం నీటి మీద తేలి ఎటో కొట్టుకుపోతోంది. దిబ్బ చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి వారు మాత్రం కట్టుబట్టలతో కుండా మండతో మిగిలారు. అలాంటప్పుడు అందరినీ ఓదార్చేది సూర్యమే. నీరు తీశాక బురదలో చిక్కుకుపోయిన వరి మొక్కల్ని తీసి ఎండలో ఆరబెట్టుకుని వాటిని కొట్టి వచ్చినకాడికి అమ్ముకునే వారు. ఆ సంఘటన జరిగిన రోజు అందరూ తిండి కూడా మానేసి దిగాలుగా ఉంటే సూర్యమే వంటకు ఉపక్రమించాడు. సరుకులేమీ లేవు. పెద్ద కుండలో బియ్యం పెట్టి, ఎండుమిరపతో పచ్చిపులుసు చేశాడు. రెండు రోజుల వరకూ నీరు తగ్గలేదు. నాలుగు పూటలూ పచ్చిపులుసే పరమాన్నం. పంట మాట దేవుడెరుగు బతికి బయటపడితే చాలు. పెద్దింట్లమ్మకు ఏటపోతునేసుకుంటామని అంతా మొక్కుకున్నారు. 
‘‘సూర్యంగారో మీ పచ్చి పులుసు గొంతుకలో ఇంకా పొలమారతందండే’’ దావీదు అంటే 
‘‘ఏరా పెద్దింట్లమ్మ తీర్థానికి మనం అందరం ఒకసారి ఏటపోతులు రెండు బలిచ్చేం. అప్పుడేం జరిగిందో గుర్తుందేంట్రా..’’ సూర్యం అనేసరికి 
‘‘ఎందుకు గుర్తు లేదండే, అప్పుడు మీకు అమ్మోరు పోసింది. నెలరోజుల్దాకా ఇడలేదు. ఊళ్లోకి ఒక్కరంటే ఒక్కరం కూడా ఎల్లేదు. మిమ్మల్లే కనిపెట్టుకుని ఉన్నాం’’ దావీదుకేదో గుర్తుకొచ్చింది. 
‘‘అవున్రా దావీదు. ఎంత మంది ఎన్ని సేవలు చేసేర్రా..’’ సూర్యం కళ్లు తుడుచుకున్నాడు.
‘‘మీరు మాత్తరం తక్కువేంటండే.. మాకెవరికి ఏం బాదొచ్చినా మీ కంటి మీద కునుకుండేదా’’ 
దావీదు మాటలకి హుషారొచ్చినట్టుంది సూర్యానికి. ‘‘ఒరే మనం యెవసాయం వదిలేసేం. అందుకే ఎవరికెవరూ కనపడకుండా పోయేరు యెదవల్లారా. రేపు రైతుల్నందరినీ మనింటికి తీసుకురండి. మళ్లీ కమతం మొదలెడదాం’’ ఇలా సూర్యం అంటుంటే కథ తిరిగి మొదటికొచ్చిందని అందరూ నోళ్లు వెళ్లబెట్టారు. ఏదో కొల్లేరుకొచ్చాడు కదా, పాత జ్ఞాపకాలతో ఈ లోకంలోకి వస్తాడని ప్రసాద్‌తో పాటు అందరూ అనుకున్నారు.
‘‘ఏంట్రా అలా తెల్ల మొహాలేసుకు చూత్తన్నారు.. పదండి చాలా పన్లున్నాయి’’ 
‘‘ఏంటి నాన్నా! ఇప్పుడు వ్యవసాయమా? నీకేమైనా పిచ్చా? ఇది మనది కాదు. ఇంటికి వెళ్లిపోదాం నడు’’ ప్రసాద్‌ ఇలా అనేసరికి సూర్యం కళ్లు ఎర్రబడ్డాయి. 
‘‘అవున్రా! నాకు పిచ్చే. యెవసాయం పిచ్చి. యెవసాయముంటే మణుసులుంటారు. మణుసులుంటే అందరూ కలిసుంటారు. కలిసుంటేనే బతుకు. ఇప్పుడు మణుసులెక్కడున్నార్రా’’ సూర్యం ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. 
‘‘సరే నాన్నా! మళ్లీ రేపొద్దాం. చీకటిపడుతోంది. ఇంటికి వెళదాం’’ అని బలవంతంగా సూర్యాన్ని కారెక్కించాడు ప్రసాద్‌. మిగిలిన ముగ్గురూ మౌనంగా సూర్యాన్ని చూస్తూ కారులో కూర్చున్నారు. 
అలా రెండ్రోజులు వారినందరినీ కొల్లేరు తీసుకొచ్చాడు ప్రసాద్‌. రోజూ ఇంటికి రానని సూర్యం మారాం చేయడం, ఎలాగో బతిమాలి ఆయన్ని తీసుకెళ్లడం ఆ నలుగురి పనీ. తండ్రికి చాలా చాలా చెప్పాలని ప్రసాద్‌ ప్రయత్నించాడు. నెట్‌లో చదివిన కొల్లేరును తండ్రి కళ్లల్లో చూసేవాడు. ఏ పరిణామాలనూ ఎవరూ ఆపలేం అని, మనుషుల ప్రయేయం లేకుండా ఏర్పడిన కొల్లేరు, మనుషుల ప్రమేయంతోనే అంతరిస్తోంది. అక్కడికి వలస వచ్చే పక్షుల్ని నాన్న కన్నుల్లోనే చూశాడు. తండ్రి కన్నుల్లో తరిగిపోతున్న కొల్లేటి నీడల్ని చూశాడు. సమూహాలు సమూహాలుగా కొల్లేరులో మనుషులు సాగించిన సామూహిక జీవన సౌందర్యాన్ని చూశాడు. తండ్రిని ఏదో ఓదార్చాలని మాటల్ని మూటగట్టుకుని ఆయన ముందు ఒలకబోశాడు. 
‘‘మనం నిమిత్త మాత్రులం నాన్నా. ఆ రాజు కాకుంటే మరో దొరగారు ఎవరో ఈ విధ్వంసానికి నాందీ పలికేవాడే. కొల్లేటి రైతులు కూడా వలస పక్షుల్లాంటి వాళ్లే. అనువుగా ఉన్నప్పుడు ఆ పక్షులు ఇక్కడ గూడు కట్టుకున్నాయి. అనువు కాదని అనుకున్నప్పుడు ఎటో ఎగిరిపోయాయి. మనమూ అంతే. నువ్వు వలస రైతువు నాన్నా. వలస రైతువు. ఇది రైతుకు కాలం కాదని నీకు మాత్రం తెలీదా? అయినా నువ్వు వ్యవసాయం ఎక్కడ మానేశావు చెప్పు. నీలో నువ్వు, నీ జ్ఞాపకాలలో నువ్వు చేస్తున్నది వ్యవసాయమే కదా..’’ ఇలా అంటున్న కొడుకు మాటల్ని వింటూ మూగవాడిలా చూస్తూ ఉండిపోయాడు సూర్యం. తండ్రిని బాగానే సముదాయించానని అనుకున్నాడు ప్రసాద్‌. 
మూడో రోజు సూర్యం కొల్లేరు వెళ్లినప్పుడు అక్కడ నుంచి ఇంటికి రానని చాలా మంకుపట్టు పట్టాడు. నలుగురూ నాలుగు చేతులు వేసి గుంజినా గింజుకున్నాడే కాని, కారెక్కలేదు. అక్కడే ఒకచోట కూలబడిపోయాడు. ఎంతసేపటికీ కదల్లేదు. ఇక ఎప్పటికీ కదలడని వారికి అర్థమైంది. 
‘‘ఏ లోకంలో ఉన్నా ఆయన యెవసాయమే చేత్తాడు. రైతంటే మా సూర్యం మావే’’ సన్యాసిరావు కండువాతో కళ్లు తడుచుకుంటూ అన్నాడు. అవునంటే అవునని వెంకటేశులు, దావీదు సూర్యాన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చారు. ప్రసాద్‌ చిన్నపిల్లాడిలా ఇంటికెళదాం లే నాన్నా అంటూ చాలా సేపు విలపించాడు. లాభం లేకపోయింది. సూర్యం ఊళ్లోకి చేరాడు శవంలా. కొల్లేరులో తండ్రి జ్ఞాపకార్థం సమాధి కట్టాలని ప్రసాద్‌ అనుకున్నాడు. వీలు కాలేదు. ఎన్నో ఎకరాల్లో అక్కడ వ్యవసాయం చేసిన సూర్యానికి ఆరడుగుల స్థలం కూడా ఇప్పుడు లేదు. తన యవ్వనాన్ని కొల్లేటి మట్టికి ధారపోసిన నాన్న చివరి ఊపిరి ఆ మట్టిలోనే కలిపాడని ప్రసాద్‌ అనుకున్నాడు. ఒంటరి తల్లిని తన కూడా నగరానికి తీసుకుపోయాడు. 
నాన్న గుర్తుకొచ్చినప్పడు కొల్లేరు గుర్తుకొచ్చినప్పడు అప్పుడప్పుడూ ఇలా అనుకుంటాడు... ఈ భూఖండంలో పర్యావరణ సమతుల్యానికి సింహాసనంలాంటి ఒక ప్రాంతాన్ని కేవలం ఒక వ్యక్తి ధ్వంసం చేయగలడా? అతనికి అంత శక్తి ఉంటుందా? లేదు. ఎన్నో పరిణామాల కొస రూపంగా అలాంటి వారు వస్తారు. చేయగలిగింది చేసి పోతారు. ఒకరు కాకుంటే మరొకరు. ఇది విధ్వంస యుగం. మళ్లీ అదే మనిషి రూపంలో ఇంకెవరో వస్తారు. సరసుల్ని సృష్టిస్తారు. పక్షుల్ని పిలుస్తారు. రైతుల్ని పిలుస్తారు. ఇదిగో ఈ సరసు మీది.. ఈ భూమి మీది ఇక్కడ మీ రెక్కల్ని నాటండి, మనుషులు పిల్లల్లా ఆడుకుంటారు అని ఆకాశం కింద పరచి ఆహ్వాన పత్రాన్ని రాస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని