చీకట్లో అద్దం

ఉదయం మొబైల్‌ రింగవుతుంటే కామేశ్వరికి మెలకువ వచ్చింది. చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు. ఈ వేళపుడు చేసిందెవరనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది.

Updated : 03 Jul 2021 17:40 IST

కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

ఉదయం మొబైల్‌ రింగవుతుంటే కామేశ్వరికి మెలకువ వచ్చింది. చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు. ఈ వేళపుడు చేసిందెవరనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది.

‘‘అమ్మా! నాన్నని అడిగావా?’’ అటు ఆమె కూతురు వసుధ మాట్లాడుతోంది.

కామేశ్వరికి సమాధానం తోచక తటపటాయిస్తూ ఊరుకుంది.
‘‘ఏంటి మాట్లాడవు. నాన్న ఏమన్నారు?’’ కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తనింకా భర్తని అడగలేదు. కామేశ్వరి ఏం చెబుతుంది. వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్‌ చేస్తోంది. అడిగితే భర్త కాదనడు.
భార్గవ మీద ఆ నమ్మకం ఉంది. కానీ అభిమానం అడ్డువస్తోంది.
‘‘నాన్నగారు బిజీగా ఉన్నారు. వీలు చూసుకొని అడుగుతాను’’
‘‘ఈలోగా తాతయ్యకేమైనా అయితే’’ వసుధ భయపడుతూ అంది. కామేశ్వరికీ అదే బెంగ. కానీ తను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నానని కూతురుకి చెప్పలేకపోతోంది.
‘‘పోయిన నెలే కదా చూసొచ్చాను. ఆయనకేం కాదులే’’ నిర్లిప్తంగా అన్న కామేశ్వరి కళ్లలో చెమ్మచేరింది.

‘‘నీ ధోరణి చిత్రంగా ఉంది. ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అన్నీ తెలిసి ఎలా ఊరుకున్నావు. అడిగితే నాన్న కాదనరు. వెళ్లి తాతయ్యని తీసుకురా’’ వసుధ శాసించినట్లు అంది.
కూతురు అన్నది వాస్తవమేనని కామేశ్వరికి తెలుసు. కానీ తండ్రి విషయాన్ని భార్గవని అడగలేకపోతోంది. అత్తగారి పట్ల తను చూపిన నిరాదరణ వల్ల భర్త దగ్గర చనువు, అధికారాన్ని కోల్పోయానని వసుధకి చెప్పలేకపోతోంది.
వసుధకి పెళ్లై వెళ్లిపోయాక భార్యభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఇంట్లో మరోమనిషికి ఇబ్బంది లేదు. అందుకే భార్గవ కాదనడని నమ్మకమూ ఉంది.
‘‘అమ్మా! ఏమైంది నీకు? నేను చెబుతోంది విన్నట్టులేదు’’ కామేశ్వరి మౌనంతో వసుధ విసుగ్గా అంది.
‘‘సరే కంగారు పడకు. ఏదో ఒకటి చేద్దాంలే. ఉంటాను’’ వసుధకి మరో మాటకు తావివ్వకుండా కామేశ్వరి కాల్‌ కట్‌ చేసింది.
కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది. తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు. తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు.
కామేశ్వరి తండ్రిది ఏడుపదులు దాటిన వయసు. తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం, వైద్య సదుపాయం లేని ఊరు. ఇరుగుపొరుగు సహాయపడుతుంటారు. వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు.
ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకు కారణం. కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది. వీలు చూసుకుని వెళ్లి చూసొస్తోంది. వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతోంది. ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవడం ఆమె స్వయంకృతం. అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యతారాహిత్యం.
కామేశ్వరి ఉదయం కూతురితో మాట్లాడాక భర్తను అడగాలనుకుంది. కానీ అతడు భార్య లేవకముందే తయారై బయటికి వెళ్లిపోయాడు. భార్గవ వారం రోజులుగా తెల్లవారుతూనే వెళ్లిపోతున్నాడు. తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు.
ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాడు. ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో కామేశ్వరికి అర్థం కావడంలేదు. అడిగే అవకాశమూ దొరకలేదు.
తల్లి చనిపోయినప్పట్నుంచీ భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలుస్తోంది. చెప్పుకోలేని స్పర్థలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరితనాన్ని కోల్పోతున్నామనుకుంది. లేకపోతే భార్గవ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు?
మరోవైపు తండ్రిపట్ల నిస్సహాయత. దీనికంతటికీ కారణం తనే అనుకుంది. దానికీరోజు పశ్చాత్తాప్పడితే సరిపోతుందా? సమస్యలు సమసిపోయి మానసికాందోళన సద్దుమణుగుతుందా? ఏం చెయ్యాలి? ఏది పరిష్కారం? కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మథనంలో పడింది. భార్గవ కోసం ఎదురుచూస్తూ గతాన్ని గుర్తుచేసుకుంది.
* * *
భార్గవ తండ్రి పదేళ్ల కిందట చనిపోయాడు. ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. అందుకు కామేశ్వరి అంగీకరించలేదు. అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది. చేరదీస్తే పరిచర్యలు, ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయనుకుంది. బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి.
అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురుకి ఇచ్చిందన్న అసూయ, కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది. అత్తగారు చేసింది సంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది. కానీ, స్వార్థ బుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది. పైగా నెలనెలా వస్తున్న పింఛన్‌ని కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతని ఆడపడుచు మీదకి నెట్టేసింది.
తల్లిని చేరదీయాలన్న భార్గవ ఆలోచనని కామేశ్వరి పడనీయలేదు. భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు. తల్లి మీద ప్రేమ ఉన్నా కామేశ్వరి దురుసుతనం భరించడం కష్టమని తెలుసు. పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చినా అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానమూ ఉంది. చెల్లెలి దగ్గరే తల్లికి సదుపాయం సుఖం ఉంటుందని ఊరుకున్నాడు. అలా సంసారంలో సర్దుకుపోయాడు.
ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్లాడు. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు. వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు. దీనికంతటికీ కారణమైన భార్యపై మనసులో త్యణీకారభావం తొంగిచూసింది. ఆ కోపంలో భార్యకు బుద్ధి చెబితేగాని మానసిక క్షోభ చల్లారదనుకున్నాడు.
కామేశ్వరి భర్త మొహంలోని మార్పుని పసిగట్టింది. మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసువెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది. ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది.
‘‘భార్గవా! ఎన్నాళ్లో బతకనురా. చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలనుంది. తీసుకెళ్లవూ’’ చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ చలించిపోయాడు. బయటపడని దుఃఖం మనసులో సుడిగుండమైంది.
కామేశ్వరి ఉలిక్కిపడి అంతలోనే తేరుకుంది.
‘‘కదల్లేని స్థితిలో ఉండి ఎలా రాగలరు? దూరప్రయాణం చేయలేరు’’ అని కలగజేసుకుంది.
కోడలి దురుసు స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది.
‘‘కూతురింట్లో కాలంచేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదు’’
అత్తగారి మాట పట్టించుకోనట్లు కామేశ్వరి ముఖం చిట్లించింది.
తన గురించి తపిస్తున్న తల్లి ఎదుట భార్గవ దోషిలా నిలబడ్డాడు.
‘‘అలాగే అమ్మా! వీలుచూసుకొని వచ్చి ఓ వారంలో తీసుకువెళ్తాను’’ కొడుకు మాటకు తల్లి కళ్లల్లో ఆశ మెరిసింది.
‘‘వస్తావు కదూ. అంతవరకైనా బతకాలనుంది’’ తల్లి చూపులకు భార్గవ కళ్లల్లో నీళ్లు నిలవలేదు.
ఇంటికి తిరిగొచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్లిపోయింది. 
భార్య ఆంతర్యం భార్గవకి అర్థమయింది.
కామేశ్వరి వారం తరువాత తిరిగొచ్చింది. ఆ రోజే అతడి తల్లి చనిపోయింది.
* * *
కామేశ్వరి నిద్రలో తుళ్లిపడి లేచింది. గుండెల్లో గుబులు వెన్నులో వణుకు భయంతో ఆమె శరీరం కంపిస్తోంది. చూపులు చలిస్తూ పక్కకు చూసింది. పడక మీద భార్గవ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భర్త పక్కన ఉండటంతో స్థిమిత పడింది. కాసేపటికి కలగన్న విషయం లీలగా స్ఫురణకి వచ్చింది. చిత్రమైన కల. గుండెల్లో ఉద్విగ్నత రేపి భయం కలిగించిన కల. ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగు దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది. కళ్లలోకి దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెలకువ వచ్చేసింది.
కలలోని రూపం జాడలు బెడ్‌లైట్‌ నీలం కాంతిలో కదలాడుతున్నట్లు తోచింది. కామేశ్వరికి జడుపు పుట్టింది. భయం పెరిగి నోరు తడారిపోయింది. మంచినీళ్ల కోసం చూసింది. పక్కన సైడ్‌ టేబుల్‌ మీద బాటిల్‌ లేదు. రాత్రి పెట్టడం మరచిపోయినందుకు అసహనంతో నిందించుకుంది. హాల్లో ఉన్న ఫ్రిజ్‌ దగ్గరికు వెళ్లడానికి ధైర్యం చాలడంలేదు. దాహంతో ప్రాణం పోయేటట్టుంది. తప్పదని కామేశ్వరి భర్తను లేపింది.
‘‘ఏవండీ’’ విడీవీడని ఆమె గొంతు వణికింది.
భార్గవలో ఉలుకూపలుకూ లేదు.
‘‘మిమ్మల్నే. లేవండీ’’ భుజంమీద గట్టిగా తట్టి లేపింది.
భార్గవ ఉలికిపాటుగా కళ్లువిప్పాడు. భార్యను చూసి గతుక్కుమన్నాడు. మొహం ఎర్రగా కందిపోయి, నుదుటన పట్టిన చెమటకు కుంకుమ జారి, కురులు చెదరి, బెదురు చూపులతో ఉన్న కామేశ్వరి జడుపు పుట్టించింది.
‘‘ఏమైంది’’ భార్గవ గాబరాపడుతూ అదాటుగా లేచి కూర్చున్నాడు.
‘‘దాహం’’ అంటూ కామేశ్వరి గుటకలు మింగింది. భార్గవ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకలొచ్చి భయపడుతోందనుకున్నాడు.
‘‘తెస్తానుండు’’ అని మంచి నీళ్ల కోసం వెళ్లబోతుంటే కామేశ్వరి వారించింది.
‘‘వెళ్లొద్దు. నాకు భయంగా ఉంది’’ బెదిరిపోతూ అంది.
‘‘ఎందుకలా కలవరపడుతున్నావు. లైటు వేస్తానుండు’’ భార్గవ తలగడ పక్కనున్న స్విచ్‌ వేశాడు. గదిలో వెలుతురు పడగానే కామేశ్వరి భయం తగ్గినట్లనిపించింది. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. వెళ్లి మంచినీళ్లు తెచ్చాడు. కామేశ్వరికి దాహం తీరి గుండెదడ తగ్గింది.
‘‘పీడకలొచ్చిందా... అంతలా భయపడ్డావు’’ కాసేపాగి భార్గవ అడిగాడు.
‘‘అది కలా? కాదేమో’’ కామేశ్వరి తలచుకుంటూ అయోమయంగా చూసింది.
‘‘మరి..?’’ భార్గవ విస్మయంగా అన్నాడు.
‘‘ఏమో. ఆత్మలుంటాయా’’ కామేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది.
భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ.
‘‘మనసులో సంఘర్షణతో లేనివి ఊహించుకుంటున్నావు’’
కామేశ్వరి కనురెప్పలు విప్పార్చి భర్త మొహంలోకి గుచ్చి చూసింది.
‘‘కాదు. తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట’’
భార్గవకి తల్లి గుర్తుకొచ్చింది. చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది. అది జరగలేదు. కారణం కామేశ్వరి. భార్య తన తప్పు తెలుసుకుందనుకున్నాడు భార్గవ. అందుకే చనిపోయిన అత్తగారిని తలచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడిందనుకున్నాడు.
‘‘అదంతా నీ భ్రమ. భయంలోంచి పుట్టిన భ్రాంతి’’
భర్త మాటకు కామేశ్వరి కాదన్నట్లు చూసింది.
‘‘మీకు నమ్మకం లేకపోవచ్చు. కానీ నిజం. అచ్చం అత్తగారిలా ఉంది. దేదీప్యమైన వెలుగు నుంచి పుట్టి నా పక్కనే కూర్చుంది. అది ఆత్మే. నన్నేదో అడుగుతుంటే భయంతో మెలకువ వచ్చేసింది’’ కామేశ్వరి కళ్లలో భయం మళ్లా చేరింది.
‘‘సరే అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి’’
భార్గవ ప్రశ్నకు కామేశ్వరి దగ్గర సమాధానం లేదు. తెల్లబోయి చూసింది.
‘‘మనకి బుద్ధి కొరవడినప్పుడు తప్పులను కాలమే వేలెత్తి చూపుతుంది. అప్పుడు చింతనలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయమూ పడుతుంది. ఆ భయమే ఆత్మ అన్న నీ భ్రాంతి’’ భార్గవ ప్రశాంతంగా వివరించాడు. అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది.
‘‘వివేకంతో ఆలోచించు. అమ్మ మన మంచిని కోరుకుంటుంది. తప్పలు క్షమించి ఆశీర్వదిస్తుంది’’ భార్గవ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు.
రామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది.
ఉదయం భార్గవ మొబైల్‌ రింగవుతుంటే భార్యాభర్తలిద్దరికీ మెలకువ వచ్చింది. అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకొనుంది. భార్గవ పక్కనే ఉన్న ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు.
‘‘ఏరా వసూతల్లీ. ఇంత ఉదయాన్నే చేశావు’’ 
ఫోన్‌ చేసింది కూతురని కామేశ్వరికి అర్థమైంది.
‘‘క్షేమంగా ఉన్నారు. త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లే అన్నారు’’
‘‘నీ తొందర హాస్పిటల్‌ వారికుండదు. పదకొండు గంటలకు డిశ్ఛార్జ్‌ చేస్తానన్నారు’’
వసుధ ఏమడుగుతోందో, భార్గవ ఏం చెబుతున్నాడో ఊహకి అందక కామేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది.
‘‘ఏదీ... నీ కాల్‌తోనే ఇద్దరమూ లేచాం’’
‘‘తప్పకుండా... అమ్మతో మాట్లాడతావా?’’
‘‘సరే తాతయ్య ఇంటికి వచ్చాక’’ భార్గవ కాల్‌ కట్‌ చేశాడు.
కామేశ్వరికి గందరగోళంగా ఉంది. భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లు లీలగా తోచింది.
తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగ భరితమైంది. భావోద్వేగంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. కామేశ్వరి ఆత్రుతగా భార్గవ వైపు చూసింది.
‘‘నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే. మీ నాన్న క్షేమంగా ఉన్నారు. అదే మన అమ్మాయితో చెప్పాను’’
‘‘ఎలా..’’ కామేశ్వరి సంభ్రమాశ్చర్యాలకు లోనయింది.
‘‘వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాను. ఈ రోజు నీ కోసం ఎదురు చూస్తుంటారు’’ భార్గవ ఆత్మీయంగా అన్నాడు.
భర్త ఔదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏం అనడానికీ మాటలు రాక నీళ్లు నిండిన కళ్లతో భార్గవని చూస్తూండిపోయింది.
‘‘ఇంకా అ కన్నీరెందుకు. త్వరగా తయారైతే వెళ్లి మీ నాన్నగారిని తీసుకొద్దాం’’ భార్గవ తొందరచేశాడు. కామేశ్వరి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది.
చీకటి గదిలోని అద్దం... వివేకం లేని మనసూ ఒక్కటే. అద్దానికి వెలుగు... మనసుకి వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి. భార్గవ, వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు