వెలి

ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఉరేసుకున్నట్లు నిర్మానుష్యంగా ఉంది. ముసలీ ముతకా చిన్నా పెద్దా పిల్లా పీచూ... అందరూ వరదముంపుకు భయపడి ఊరిడిచి పునరావాస కేంద్రానికి తరలిపోయినట్లు వీథులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి.  

Updated : 02 Jul 2021 17:00 IST

- డా||జడా సుబ్బారావు

కథావిజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి (రూ.5 వేలు) పొందిన కథ

ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఉరేసుకున్నట్లు నిర్మానుష్యంగా ఉంది. ముసలీ ముతకా చిన్నా పెద్దా పిల్లా పీచూ... అందరూ వరదముంపుకు భయపడి ఊరిడిచి పునరావాస కేంద్రానికి తరలిపోయినట్లు వీథులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. పెద్ద పెద్ద అరుగులతో, చుట్టూ ప్రహరీతో దర్జాగా కనిపిస్తున్న రామాలయం ఊరికి అభయమిస్తున్నట్లుగా ఉంది. ఏళ్ల కిందట నాటి వేపచెట్టు రామాలయానికి గొడుగు పడుతున్నట్లుగా ఉంది.

వైరాగ్యమూ, వేదాంతమూ కలిసినట్లుగా రాలుతున్న ఆకుల చప్పుడు కొత్తగా అనిపిస్తోంది. ఎవరి చేతిలోంచో జారిపడి కుంకుమ ఒలికినట్లుగా ఆకాశమంతా ఎర్రబారింది. అలసిపోయిన సూర్యుడు భార్యాబిడ్డలతో గడపడానికి పడమటి కొండలవైపు వేగంగా సాగిపోతున్నాడు. అరెకరం మెట్టభూమిలో ఉన్న మామిడితోటలోని చెట్లకింద ఎక్కడతోస్తే అక్కడ కూర్చుని ఉన్నారు ఊరి జనమంతా.

‘‘శెవం దెగ్గెర నుంచున్నట్టు ఎవడికాడు మాట్టాడకుండా కూచుంటే ఎట్టా? అవతల చీకటి పడుతుందిగా’’ చొక్కా జేబులో నుంచి పొగాకును రెండు చేతులతోనూ చుట్టుకుంటూ అన్నాడు గోవిందు తాత. డెబ్బై సంవత్సరాలు దాటిన తాతంటే ఊరందరికీ గౌరవం. పెద్దమనుషుల్లో ఒకడు కాకపోయినా పెద్దరికానికి విలువనిచ్చి ఆయన అనుభవంతో కూడిన ఆలోచనకు విలువ ఇస్తారు. తలంతా ముగ్గు బుట్టైనా ఒత్తుగా ఉంటుంది. కనుబొమల్లోనుంచీ, చెవుల్లోనుంచీ బయటికి వచ్చే తెల్లవెంట్రుకలు గోడను చీల్చుకుని వచ్చే మర్రివేరుల్లా కనిపిస్తుంటాయి. ముతకపంచె, రెండు జేబులున్న తెల్లని చొక్కా వేసుకుని తలపాగా చుట్టుకుని కూర్చున్నాడు.

గోవిందు తాత మాటతో ఊరివారిలో కదలిక వచ్చింది. అప్పటి వరకూ శిలాప్రతిమల్లా నుంచున్న జనాలంతా కొద్దికొద్దిగా ఊపిరి తీసుకుంటూ తమ అసహనాన్ని, అసహాయతనూ నిట్టూర్పుల రూపంలో బయటికి వదులుతున్నారు. చంకలోని పిల్లలు చేతిలో నుంచి నీళ్లలోకి దూకే చేపపిల్లలా ఏ క్షణమైనా కిందకి దూకేటట్టుగా ఉన్నారు. పిల్ల తాడిచెట్టును బిగించిన మర్రిచెట్టు ఊడల్లా తల్లుల చేతులు ఆ పిల్లలు దూకకుండా బంధించి ఆపుతున్నాయి.                                          
‘‘అదే ఆలోచిత్తన్నా. ఎటుచూసినా మనతో తిరిగినోల్లే, మనతో పెరిగినోల్లే! చూత్తా చూత్తా ఏం చెప్తే ఎట్టా ఉంటుందోనని ఆలోచిత్తన్నా’’ అన్నాడు ఇద్దరు పెద్దమనుషుల్లో ఒకడైన గవర్రాజు. నిర్ణయం తీసుకోవడం కోసం తటపటాయించినా, ఆలస్యం చేసినా సరైన నిర్ణయం తీసుకుంటాడని అతనంటే ఊరందరికీ ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తుంటాడు.
మరో పెద్ద గవర్రాజు వంక చూశాడు.
తనకేమీ పట్టనట్టు ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తూ తోచిన దిక్కుకు చూడసాగాడు గవర్రాజు.
‘‘నిప్పు మన ఆకలి తీర్సిందని జేబులో ఏసుకుంటామా? నీల్లు మన దాహం తీర్సాయని ముక్కు మూసుకుని అందులో మునుగుతామా? యాపారం యాపారమే! యెవ్వారం యెవ్వారమే! రెంటికీ ముడెట్టకూడదు’’ అటో ఇటో తేల్చేయాలన్నట్లుగా ఉన్నాయి వీరబాబు మాటలు. పొలం పని నుంచి వచ్చాక అన్నం తినకుండా అటు నుంచి అటే పంచాయితీ తీర్పుకి వచ్చేశాడు వీరబాబు. నెరిసిన తల, గుబురు మీసాల్లో నుంచి అక్కడక్కడా తెల్లవెంట్రుకలు తొంగి చూస్తున్నాయి. కుండబద్దలు కొట్టినట్లు మాట్టాడ్డం, ఉన్నది ఉన్నట్లుగా ముఖాన ఉమ్మేసినట్లుగా చెప్పడం ఊరి వారిలో కొందరికి నచ్చకపోయినా, వ్యవహారాన్ని తొందరగా తేల్చేస్తాడనే బిరుదును భుజాన కండువాలా మోస్తుంటాడు. 
పెద్దలిద్దరి వైపూ చూస్తూ తలొంచుకుని చేతికందిన గడ్డిపరకను చేతిలోకి తీసుకుని నేలమీద తోచినట్లుగా రాయసాగాడు రాజయ్య. యాభై ఏళ్ల వయసు దాటినా అలా కనిపించడు. అరక దున్నడం, మెరక సరిచేయడం, అదును చూసి పొలంలో విత్తనాలు నాటి పంటను పండించడమే కాకుండా, వ్యవసాయ పనులు సాగనప్పుడు కూలి పనులకు కూడా వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్యకు మనసంతా దిగులుగా ఉంది. గుంపులు గుంపులుగా తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాల్లా ఆలోచనల బరువుతో అతని దేహం తల్లకిందులుగా ఊగుతోంది. కలో గంజో తాగి బతుకీడ్చుతున్న తనకోసం ఊరివారందరూ అక్కడ చేరడం బాధగానే ఉంది.
‘‘పెళ్లికొచ్చినట్టు అట్టా సిగ్గుపడితే ఎట్టా? అయ్యిద్దనో కాదనో, రేపనో మాపనో ఏదో ఒకటి చెప్పకుండా కూచుంటే ఎట్టా? యారా రాజిగా! అట్టా బెల్లంకొట్టిన రాయిలా కూచుంటావేరా? పంచాయితీకి ఏదో ఒకటి చెప్పాలిగా’’ అన్నాడు గోవిందు తాత పొగను గుప్పున వదులుతూ.
రాజయ్య ఇబ్బందిగా కదిలాడు. ఆ ఇబ్బందిలో ఏం చెప్పాలో అర్థంకాని అయోమయం ఉంది. ఎలా మొదలు పెట్టాలో తెలియని అమాయకత్వం ఉంది. గవర్రాజు వంక బేలగా చూశాడు రాజయ్య.
‘‘పెపంచమంతా కోడై కూత్తంది. పేపర్లన్నీ పతీరోజూ రాత్తానే ఉన్నాయి. ఇంకా ఆడు చేప్పేదేంది? మనం ఇనేదేంది?’’ అన్నాడు గవర్రాజు.
వీరబాబు కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. గవర్రాజు వంక గుర్రుగా చూస్తూ ‘‘అయిపోయిన పెల్లికి కుక్కలడావిడి అన్నట్టు, అంతా తెలిత్తే ఇంక పంచాయితీ ఎందుకంటా?’’ అన్నాడు.
ఇద్దరి మధ్యా ఏదో జరగబోతుందని ఊహించాడు గోవిందు తాత. పైకి లేచి ‘‘ఒరేయ్‌. అంతా తెలుసు కదా అని వూరుకుంటే ఎట్టా? పంచాయితీ మరేద పెకారం వచ్చినోల్లందరికీ ఇసయం చెప్పాలిగా. తెలుసు కదా అని ఎవడికాడు వూరుకుంటే పంచాయితీ ముందుకెట్టా కదులుద్ది?’’ అన్నాడు.
పెద్ద మనుషులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని స్థిమితపడ్డారు.
ఏదో ఒకటి తేలితే ఇంటికెళ్లి నాలుగ్గింజలు ఉడకేసుకోవచ్చని హైరానా పడుతున్నారు ఆడవాళ్లంతా. కాటికి కాళ్లు చాపుకున్నోళ్లని మమ్మల్నెందుకు పిలవడం అని ముసలోళ్లూ, మీరు చెప్పేది మాకేమి అర్థం అవుతుందని చిన్న పిల్లలు ఎవరి పనుల్లో వాళ్లున్నారు.
గవర్రాజు గొంతు సవరించుకున్నాడు.
‘‘అందరూ ఇనండి. మన రాజయ్య కొడుకు సుబాశ్‌ పట్నంలో ఉంటున్నాడని మనందరికీ తెలుసు. చదువుకోడానికి ఎల్లి ఇప్లవమనీ, అన్యాయమనీ మాటలాడి అందరి దుస్టిలో శత్రువుగా మారాడు. ఆడుంటున్న గదిని సోదా చేత్తే ఏవో కాగితాలు, సీడీలూ దొరికాయని మనమంతా పేపర్లో కూడా చదువుతానే ఉన్నాం. ఆడెక్కడోడని ఆరా తీత్తే మనూరోడని తెలిసింది. పోలీసులు ఇక్కడికి కూడా వచ్చి ఆడి గురించి ఇవరాలు రాసుకుని ఎల్లారు. ఈ సంగతులన్నీ అందరికీ తెలిసినవే అయినా పంచాయితీ దర్మం పెకారం ఇసయం చెప్పాలని చెప్తున్నాను’’ ఆగాడు గవర్రాజు. 
పిల్లలు కదులుతున్న చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆసక్తిగానూ, ఉత్కంఠగానూ తర్వాత ఏం చెప్తాడోనని అందరూ ఎదురుచూడసాగారు.
‘‘కనక వూరందరి సేమం కోసం రాజయ్య కుటుంబాన్ని ఆరునెలల పాటు ఎలేస్తున్నాం. పోలీసు కేసులైనా మరేదైనా ఆడి తిప్పలు ఆడు పడాల్సిందే! ఆడింటికి ఎవరూ ఎల్లకూడదు. పెల్లైనా, చావైనా ఆ ఇంటిగుమ్మం తొక్కకూడదు. ఇది పంచాయితీ తీర్పు కనక ఎవరు దీన్ని కాదన్నా వారికి కూడా ఇదే తీరుపు వర్తిత్తుంది’’ తన పని అయిందన్నట్లుగా గుండెల నిండుగా గాలి పీల్చుకుని తన కుర్చీలో కూర్చున్నాడు గవర్రాజు.
అందరిలోనూ కలకలం మొదలైంది. పల్లెటూళ్లో గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొన్ని పోట్లాటలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. కొన్ని మాత్రం ఎటూ తేలకుండా పంచాయితీకి చేరతాయి. పంచాయితీలో విచారణ చేసి తప్పు వేయడమో, సమస్య తీవ్రతను బట్టి వెలేయడమో చేస్తుంటారు. మనిషిని మనిషే దూరం పెడితే బతుకెంత నరకంగా ఉంటుందో వెలేయబడిన వారికి అనుభవంలోకి వస్తుంటుంది. చుట్టూ ఊరంతా ఉన్నా ఏదో నైరాశ్యం, వైరాగ్యం, మానసిక సంక్షోభం వారిని చుట్టుముడుతుంటుంది. మాట్లాడేవారు లేక, సహాయం చేసేవాళ్లు కానరాక కొడిగట్టిన దీపాల్లా మిణుకుమిణుకుమంటూ బతకాల్సి రావడం ఎంత దుర్భరమో తెలిసొస్తుంది. గతంలో కొన్ని కుటుంబాలను చూసిన అనుభవం అక్కడున్న అందరి కళ్లల్లోనూ ప్రతిఫలించసాగింది.
కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
తర్వాత అందరి కళ్లూ రాజయ్య వైపు మళ్లాయి.
కళ్లనీళ్లు కళ్లల్లోనే కుక్కుకుని చుక్క కూడా కిందకి రాలకుండా కూర్చుని నేలతల్లి వైపు చూడసాగాడు.
కాసేపు గడిచాక పైకి లేచి చేతులు దులుపుకుని అందర్నీ చూసి పెద్ద మనుషుల వైపు తిరిగి ‘‘అయ్యా, ఈ ఊరు నా తాత వూరు, నా తండ్రి ఊరు. నిక్కర్లేసుకున్నప్పటి నుంచీ ఈ ఊరితోనూ, ఇక్కడి వారితోనూ సమ్మందాలున్నాయి. నా ఇంట్లో పెల్లి జరిగితే అంతా నా ఎనకాల నుంచున్నారు. నా ఇంట్లో పాడి లేత్తే నాతోపాటు కొమ్ము కాశారు. కానీ ఇయ్యాల మాత్రం ఈ ఊరు నీది కాదు, ఎలేశాం అంటే ఎట్టాగయ్యా? పుట్టిన గడ్డనొదిలి ఏ పరాయి గడ్డమీద తలదాసుకోమంటారు?’’ రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు.
గాలి స్తంభించిపోయింది.
మసక చీకటిగా ఉన్నా అందరి కళ్లూ జలపాతమవుతున్న తీరు స్పష్టంగా తెలుస్తోంది. ఆడవాళ్లు ఉబికి వస్తున్న కన్నీటి సాగరానికి చీరకొంగుతో ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మగవాళ్లు పై పంచతో కళ్లొత్తుకుంటూ బాధను దిగమింగుతున్నారు.
‘‘చూడరా రాజిగా! ఊరంటే ఒక్కడి పెయోజనం కోసం పనిచేసేది కాదురా. అందరి కోసం ఉమ్మడిగా పనిచేసే జీవన ఇదానం. తప్పు జరిగినప్పుడు దానికి శిచ్చ పడాల్సిందే. అప్పుడే తప్పులు జరక్కుండా ఉంటాయి, దాన్ని చూసి ఏరేవాల్లు తప్పులు చేయడానికి జెంకుతారు’’ అన్నాడు గవర్రాజు.
రాజయ్య ఏమీ మాట్లాడలేదు. కాసేపయ్యాక ‘‘పిల్లల్ని కంటాంగానీ ఆల్ల రాతల్ని కనలేముగా బాబూ. సదువుకుంటానంటే ఎక్కడికో పంపించాను గానీ ఆడిట్టా చేసి ఊరికి చెడ్డపేరు తెత్తాడనుకోలేదు. అసలాడు ఇప్పుడెక్కడున్నాడో తెలియదు, బతికున్నాడో లేదో ఇవరం లేదు. ఆడి కోసం నా ఇంటి ఆడది కూడూనీల్లూ మానేసి అదేపనిగా ఏడుత్తానే ఉంది. ఇట్టాంటప్పుడు ఊరు నా కట్టంలో నన్నాదుకోకుండా ఈ ఊరి నుంచి ఎలేత్తే గోరు సుట్టుమీద రోకటిపోటులా ఉండదా బాబూ...’’ అన్నాడు రాజయ్య.
రాజయ్య మాటలకి తోకతొక్కిన పాములా లేచిన వీరబాబు ‘‘ఏరా రాజిగా! తప్పుచేసినోడికి, తప్పించు కోవాలనుకున్నోడికి దారులెక్కువుంటాయిరా! ఆ దారులన్నీ పట్టుక్కూచుంటే కుక్కతోక పట్టుకుని గోదారీదినట్టుంటుంది గానీ యవ్వారం తేలదు. ఈ ఊరి యవ్వారం తెలిసినోడిగా నువ్వా మాట అనకూడదు’’ అన్నాడు.
వీరబాబు కోపం చూసి అక్కడ నుంచున్న వాళ్లందరిలోనూ వణుకు పుట్టింది.
సాయంకాలం చల్లగా వీస్తున్న గాలి అక్కడివారి ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో చేరి వెచ్చగా మారిపోయింది. ఏం చెప్తే ఎటుపోయి ఎటు వస్తుందోనని ఎవరికి వాళ్లు మౌనంగా ఉన్నారు.
‘‘రాజయ్య బాబాయి ఏం తప్పు చేశాడని వెలేస్తున్నారు. తప్పు వేస్తే వాళ్ల అబ్బాయికి వెయ్యాలి గానీ జరిగినదాంట్లో ఏ సంబంధమూ లేని రాజయ్యని వెలేయడం మంచిది కాదు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి పోలీసుల దాకా వెళ్లిందంటే తీర్పిచ్చిన వాళ్లు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇదివరకటిలా లేవు ఇప్పటి రోజులు. పల్లెల్లో చిన్నగా దగ్గినా ప్రపంచమంతా పాకిపోతుంది’’ పైకిలేచి పెద్దలవైపు వేలు చూపిస్తూ మాట్లాడుతున్న అరుణ్‌ వైపు ఊరంతా ఆశ్చర్యంగా చూశారు.
తమ పెద్దరికాన్ని, ఇన్నేళ్ల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న అరుణ్‌ వైపు గుర్రుగా చూశారు పెద్దమనుషులిద్దరూ.
‘‘చూడండి. ఈ ఊరన్నా, మీరన్నా నాకు చాలా గౌరవం. నేనేదో డిగ్రీ చదివానని, మీకంటే గొప్పవాడిననే భావంతో మాట్లాడ్డం లేదు. సామూహికంగా బతకాల్సిన ఊళ్లన్నీ ‘వెలి’ పేరుతో మనుషుల్ని దూరం చేసుకోవడం ఆటవిక పద్ధతి. చెట్టువేరు మన వాకిట్లోనే ఉంటుంది. కానీ కొమ్మలెక్కడెక్కడికో విస్తరిస్తాయి. ఎదుగుతున్న పిల్లలు కూడా అంతే! ఎదిగే క్రమంలో ఎన్నో విషయాల్ని నేర్చుకుంటారు. వాళ్లకు నచ్చని భావాల పట్ల సంఘర్షణ ఉంటుంది. వేటిపట్ల వాళ్లు ఆకర్షితులవుతారో తెలియదు. చిన్నవాడిని, నా మాట వినండి. ఒకడు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మనిషి లక్షణం. అంతేగానీ ఇలా వెలేసి దూరంపెట్టటం మంచిది కాదు’’
అరుణ్‌ తల్లి విమలమ్మ అతని రెక్క పుచ్చుకుని కింద కూర్చోబెడుతూ ‘చిన్నపిల్లోడు తెలియక మాట్లాడాడు, ఈ తప్పు కాయండి’ అన్నట్లుగా పెద్దలిద్దరి వైపు చూసింది. 
ఎవరికి వాళ్లు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ మధ్యమధ్యలో అరుణ్‌ వైపు, గవర్రాజు వైపు చూడసాగారు. పెద్ద మనుషులిద్దరూ ‘ఏం చేద్దాం’ అన్నట్లుగా కళ్లతోనే పలకరించుకోసాగారు.
గోవిందు తాతలో కదలిక వచ్చింది. కూర్చున్నవాడు ఒక్కసారిగా పైకిలేచి ‘‘ఒరే అరునూ! నువ్వు చెప్పిన పెకారం ఆలోసించినా పక్కవాడి ఇంటిమీదకి ఎల్లిన కొమ్మను నరకాల్సిందే కదరా! లేదంటే రోజూ తగువులు తప్పవు. పంచాయితీ కూడా అదే కదా చెప్పింది’’ అన్నాడు.
తమకు వత్తాసుగా మాట్లాడిన గోవిందుతాత పట్ల కృతజ్ఞతగా చూశారు పెద్దలిద్దరూ.
‘‘కొమ్మ కొట్టమనే నేనూ చెప్తున్నది. మూలాన్ని నాశనం చేయొద్దు’’ అన్నాడు అరుణ్‌.
‘‘అంటే?’’ అన్నట్లుగా అంతా అరుణ్‌ వైపు చూశారు.
‘‘మూలం రాజయ్య బాబాయి, కొమ్మ వాళ్లబ్బాయి. నిజానిజాలు మనకు తెలియదు. ఒకవేళ సుభాష్‌ ఏదైనా తప్పు చేస్తే పోలీసులున్నారు. అదీ కాదంటే కోర్టులున్నాయి. శిక్ష వెయ్యాలో, ఉరితియ్యాలో విచారణ జరుపుతారు. నిర్ణయం తీసుకుంటారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనిషిని మనిషి, ఊరును ఇంకో ఊరూ, రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం, దేశాన్ని మరో దేశం వెలేసుకుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు? ఊరంటే సామూహిక శక్తి. దానిని మనమే మన చేతుల్తో నాశనం చేసుకుంటున్నాం. వెలేయడం అనే సాంఘిక దురాచారం ద్వారా మీరు రాజయ్యని ఊరికి దూరం చేసి మానసికంగా హింసించి ఒక కుటుంబాన్ని అన్యాయంగా బలి తీసుకున్నవాళ్లు అవుతారు’’ ఆగాడు అరుణ్‌. 
ఒక్కసారిగా పడిన ట్యూబులైట్‌ కాంతిని తట్టుకోలేక అక్కడున్నవారంతా కళ్లకు చేతుల్ని అడ్డం పెట్టుకోసాగారు. కళ్ల ముందు ఇనుప ముక్కను పెట్టినట్లుగా మసకమసగ్గా ఉన్న కళ్లు తేటపడి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ తమలో తామే నవ్వుకోసాగారు.
‘‘అయితే వెలొద్దంటావు?’’ అడిగారు కులపెద్దలిద్దరూ.
‘‘అవును’’ స్థిరంగా సమాధానమిచ్చాడు అరుణ్‌.
‘‘బట్టమీద పాల మరక పడితే తుడవొచ్చుగానీ, పసుపు మరక తుడవలేమురా. సుబాశ్‌ బతుకు మీద నచ్చలైటనో మరోటనో ముద్దర పడింది. అట్టాకాకుండా రేపాడు ఏ తప్పూ లేదని బయటపడి వూర్లోకొచ్చినా ఇక్కడున్న పిల్లకాయల్ని చెడగొట్టడని నమ్మకం లేదుగా’’ అన్నాడు గవర్రాజు.
‘‘చెడగొట్టడమంటే?’’ సూటిగా గవర్రాజు వంక చూస్తూ అడిగాడు అరుణ్‌.
‘‘ఆడు చదివిన చదువంతా ఇక్కడి పిల్లలకు నేరిపిత్తాడుగా’’
‘‘నేర్పితే మంచిదే కదా! మంచీ చెడూ తెలుసుకుంటారు’’
‘‘మంచీ చెడూ తెలుసుకుంటే పర్లేదురా. చావుకి ఎదురెల్తేనే పెమాదం’’
‘‘మంచి తాత్కాలికంగా మరణానికి దారితీసినా ఆఖరుగా అదే గెలుస్తుంది’’
‘‘కూటికీ గుడ్డకీ అక్కరకు రానప్పుడు సిద్ధాంతాల్ని పట్టుకుని వేలాడి మన ఆశారాన్ని మనమే కూలదోసుకోటం మూర్కత్వం అవుతుంది. కట్టుబాట్లు లేకుండా ఎవరిట్టం వచ్చినట్టు ఆల్లు తిరిగితే వూల్లన్నీ శ్మెశానంలాగా అయిపోవా? తరాలన్నీ దారీతెన్నూ తెలీకుండా చెడిపోవా?’’
‘‘అందుకే చెప్తున్నాను. తరాలు సంతోషంగా ఉండాలంటే చదువు అవసరం. దానిద్వారా కలిగే చైతన్యం అవసరం. అలాకాకుండా పశువుల్ని కాయడానికి, పేడకళ్లు ఎత్తడానికి తరాలను వాడితే కూటికీ గుడ్డకీ కూడా పనికిరాకుండా పోతారు. అలాగని సుభాష్‌ దారిలో నడవమని నేను చెప్పను. మంచీ చెడూ తెలుసుకోమని మాత్రమే చెప్తున్నాను. మనం వెలేయాల్సింది ఇలాంటి ఆచారాల్నే గానీ మనుషుల్ని కాదు’’ ఆగి పెద్దలవైపు చూశాడు అరుణ్‌.
అయోమయంగా తల ఊపుతూ మౌనంగా ఉన్న గవర్రాజును చూసిన వీరబాబు కోపంగా ‘‘కులపెద్దలకు ఎదురుపడి ఇంత సేపూ మాట్టాడనివ్వడమే తప్పు. అట్టాంటిది... కోర్టుల్లో ముద్దాయిల్ని అడిగినట్టుగా ఇట్టా అడుగుతున్న నీ కుటుంబాన్ని కూడా ఇట్టాగే వెలేయాల్సి ఉంటుంది’’ అన్నాడు.
గవర్రాజు ఒక్కసారిగా ‘ఆగ’మన్నట్లుగా వీరబాబు చేతిమీద చేయేశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న వీరబాబుని వారిస్తూ 
‘‘అరున్‌ చెప్పింది నిజమే! ఆశారమని ఒకర్ని ఒకరు ఎలేసుకుంటా పోతే ఊళ్లల్లో ఇంకెవరు మిగులుతారు? మనుశుల్ని కట్టడిగా ఉంచడానికే ఈ ఆశారాలు గానీ దూరం చేసుకోటానికి కాదు. మనింట్లో ఒక మడిసి చచ్చిపోతేనే శానాకాలం ఏడుత్తాం. అట్టాంటిది మనలో ఒకడు ‘ఎలి’ పేరుతో చావలేక బతకలేక దూరంగా వుంటే బాధగానే వుంటుంది’’.
‘‘అబ్బా కొడుకులిద్దరూ ఒక మాటనుకుని వచ్చినట్టున్నారు’’ అన్నట్లుగా వీరబాబు గవర్రాజు వంక చూశాడు.
విమలమ్మ గుండెల నిండా గాలి పీల్చుకుని కొడుకు నుదుటున ముద్దు పెట్టుకుంది.
చిన్నప్పటి నుంచీ చెట్టాపట్టాలేసుకుని కలిసి తిరిగిన ప్రాణస్నేహితుడు సుభాష్‌ అరుణ్‌ మనసులో మెదిలాడు.
తండ్రి వంక కృతజ్ఞతగా చూస్తూ రాజయ్య భుజాల మీద చేతులేసి నడిపించుకుంటూ ముందుకు సాగాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని