ఎదురు గాలి

ఈదురు గాలి వీస్తుంది. మంచు తెరలు తెరలుగా పల్లెను కప్పేస్తూ, ‘‘నువ్వు వెంటనే వెళ్లిపో. లేకపోతే నిన్ను కూడా కప్పేసి చలిలో ముంచేస్తా’’ అని సూర్యుడ్ని బెదిరించిందేమో సూరీడు భయపడి కొండల్లోకి జారుకొని రెండు గంటలు పైనే..

Published : 02 Jul 2021 17:16 IST

- శేషచంద్ర (ఎం.ఆంజనేయులు)  
కథావిజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి (రూ.5 వేలు) పొందిన కథ

ఈదురు గాలి వీస్తుంది. మంచు తెరలు తెరలుగా పల్లెను కప్పేస్తూ, ‘‘నువ్వు వెంటనే వెళ్లిపో. లేకపోతే నిన్ను కూడా కప్పేసి చలిలో ముంచేస్తా’’ అని సూర్యుడ్ని బెదిరించిందేమో సూరీడు భయపడి కొండల్లోకి జారుకొని రెండు గంటలు పైనే అయ్యింది. పల్లె పడకేసేందుకు సిద్ధమవుతోంది. హరిజన వాడలో ఒకటి రెండు లైట్లు మేమింకా బతికున్నామన్నట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి. ఎర్రోడు గుడిసె ముందున్న గొడ్ల వసారాలో ఎనుములు అటూ ఇటు తిరుగుతూ కుడుతున్న దోమల్ని తోకల్తో తోలుకుంటూ ఆగి ఆగి మోరెత్తి అరుస్తున్నాయి. 

‘‘వస్తాండానే మీకు యాడలేని అకలి. బైట షికారు పోయినట్లు పోతారు గాని ఆడ తిని రావచ్చు గందా’’ అంటూ మూలనున్న పచ్చిగడ్డి మోపు విప్పి పాలిచ్చే రెండు ఎనుములకు వేశాడు. తర్వాత పక్కన కట్టేసిన వట్టిపోయిన మరో ఎనుము ముందు కట్ట ఎండు గడ్డి వేశాడు. అది గాట్లో వేసిన ఎండుగడ్డిని చూసి తల అటూ ఇటూ ఊపి ఎర్రోడి వైపు చూసి మోరెత్తి అరిచింది, అన్యాయం కదూ అన్నట్లు. దాని అరుపుకు, చూపుకు జాలేసిందేమో ‘‘ఓర్నీ, నీకప్పుడే పచ్చిగడ్డేసినట్టు తెలిసినాదా’’ అంటూ, మోపులో మిగిలిన పచ్చిగడ్డి దానికేశాడు. అది తృప్తిగా ఎర్రోణ్ని చూస్తూ తోకతో పాటు తలూపింది కృతజ్ఞతగా. ‘‘తప్పైనాదే. నీకూ ఇగ ఇంత పచ్చగడ్డి ఏస్తాలే. ఓబులికి సెప్తా....’’ అది వాడి మాటలు పట్టించుకోకుండా పచ్చిగడ్డిని ఆత్రంగా తినడం మొదలు పెట్టింది. 

మామూలుగా వాడి పెళ్లామే ఎనుములకు గడ్డి వేస్తుంది. తను అందుబాటులో లేనప్పుడే తనకా డ్యూటీ పడుతుంది. వాటికి గడ్డి వేసి బైటికి వచ్చి చూశాడు. మైదుకూరు బామ్మర్ది ఇంటికి పోయిన కొడుకు ఓబులేసు, భార్య వస్తున్నారేమోనని. కనుచూపు మేరలో చీకటి పరుచుకొని ఉంది. వస్తున్న జాడ కనపడలేదు మోటరు బైక్‌ శబ్దం వినపడుతుందేమోనని చెవులు రిక్కించి విన్నాడు. ఇళ్లముందున్న గుంతల్లో కప్పల అరుపులు, చీకి కంపలో సంగీతం ఆలపిస్తున్న కీచురాళ్ల శబ్దం తప్ప బండి శబ్దం వినపడలేదు. ‘‘చీకటి పడినాది. రోడ్డు బాగలేదు బండ్లో సీకట్లో రావాలంటే ఇబ్బందిగా ఉంటాది ఇంగా ఏం సేస్తుండారు పొద్దుగలగా రావచ్చుకందా. అన్నకాడికి పోతే దానికి ఆణ్నించి రాను బుద్ధి పుట్టదు’’ అని భార్య మీద విసుక్కొన్నాడు.
 బామ్మర్ది గుర్తుకొచ్చేసరికి ఎంకట్రెడ్డి మదిలో మెదిలాడు. ‘ఎదవ నా కొడుకు ఎంత నమ్మక ద్రోహం సేసిండు. నమ్మినోన్ని నట్టేట ముంచేసిండు’ అనుకొంటూ గూట్లో పెట్టిన బీడీ కట్ట అగ్గి పెట్టె తీసుకొని, కట్టలోంచి బీడీ తీసి దాని చివర కొరికి తుపుక్కున ఊసి, బీడీ నోట్లో పెట్టుకొని వెలిగించబోతుండగా ఇంటి ముందు ఎవరో వస్తున్న  అలికిడి అయ్యింది. బీడి వెలిగించుకోవడం ఆపి ఎవరా అని చూశాడు. మసక వెల్తుర్లో వచ్చిన వాడ్ని చూడగానే వళ్లు ఝల్లుమంది. ‘ఈ టయింలో ఈడు నాకాడికి ఎందుకొచ్చిండబ్బా’ అనుకొంటూ నోట్లోని బీడిని బైటికి తీసి చేతిలో పట్టుకొని నలుపుతూ ‘ఏం యానాది, ఈ టయింలో యాడికి పోతాండావ్‌? ఇట్టా మా వాడకు వచ్చినావేంది’’ అడిగాడు. 
‘‘యాడికో పోతాంటే నీ కాడికి ఎందుకొస్తా. నీకాడికే వచ్చినా. నిన్ను రెడ్డోరు ఎంకట్రెడ్డి అర్జంటుగా తోలుకరాపో మనిపంపిడు’’
అదిరి పడ్డాడు ఎర్రోడు.  ‘ఎప్పుడూ లేంది ఎంకట్రెడ్డికి నాతో పనేం పడిందబ్బా అదీ ఈ టయింలో’ అనుకొంటూ  ‘‘నాతో రెడ్డోరికి పనేముండాదబ్బా’’ అడిగాడు. భయంతో మాటకూడా స్పష్టంగా రాలేదు .
‘‘ఏమో నాకేంటి తెలుస్తాది. పోయి పిలుసకరాపోరా యానాది అనిండు. వొచ్చినా. పోదాంరా’’
‘బామ్మర్ది ప్రభాకర్‌కు అన్నాయం జరిగినాక తను, తన కొడుకు ఆడకి పోవడం మానేసినామే. ఇప్పుడు ఎందుకు పిలవనంపిండు. ప్రకాష్‌ అప్పడప్పుడు రెడ్డోర్ని తిట్తుంటాడు. ఎక్కడన్నా నోరు జారిండా. ఎవరన్నా అది సెప్పిండ్రా. కొంపదీసి ప్రకాష్‌, ఓబులేసు ఆడమేన్నా ఉండారా. ఏదన్నా పంచాయితీ జరగుతుండాదా’ మనసు కీడు శంకిస్తుండగా.. ‘‘ఆడ మా ఓబులేసుగాని, ప్రకాష్‌గాని ఉండారా?’’ అడిగాడు భయం భయంగా .
‘‘లేర్రా. రెడ్డోరు ఒకరే ఉండారు’’
వెంటనే కదలాలనిపించలేదు. ‘‘నువు పా యానాది. నేను వొస్తా. ఇంటికాడ ఎవరూ లేరు. పిల్లోడు, అది మైదుకూరుకి పోయిండ్రు. వస్తాంటారు వోళ్లు వచ్చినాక వొస్తా’’ అన్నాడు.
‘‘ఇంటికాడ ఎవరూ లేకపోతే ఏమైనాది నీ మేడలో ఉండే ముల్లె ఎవరు ఎత్తకపోరురా. రెడ్డోరు తొరగా పిలుసక రమ్మనిండు. నేకపోతే సీకట్లో నీ కొంపకాడికి నేనెందుకొస్తా’’ ఆ సమయంలో తనింటికి పంపిన రెడ్డి మీద కోపం ఎర్రోడి మీద చూపించాడు యానాది. 
ఎర్రోడికి కదలక తప్పలేదు. నోటి దగ్గర పెట్టుకొన్న బీడీ కూడా తాగాలనిపించలేదు. ఎర్రోడి చేతిలో బీడీ చూసి ‘‘ఓ బీడి ఇట్టాయి’’ అని తీసుకొన్నాడు యానాది. అన్యమనస్కంగానే బీడీ యానాదికి అందించాడు. తను పోక ముందే భార్య పిల్లోడు వస్తే బాగుండు అనుకొంటునే ఇంటికి బీగం వేసి తాళం చెవి చూరులో పెట్టి ‘‘పద’’ అన్నాడు.
***
 అటూ ఇటూ చీకికంప అడవిలాగా దట్టంగా పెరిగిపోయింది. అందులోంచి పాములేమన్నా రోడ్డు మీద అడ్డంగా వస్తాయేమోనని చేతిలో కట్టెను శబ్దం చేస్తూ, గుడ్లగూబ కళ్లేసుకొని ముందు యానాది నడుస్తుంటే వెనకలా యాంత్రికంగా నడుస్తున్నాడు ఎర్రోడు. వాడి మనసులో ఒకటే ప్రశ్న ఎందుకు రమ్మన్నాడు రెడ్డోరు. ‘ఉన్నపళంగా పిలుచుక రమ్మన్నాడంటే ఏదో నెత్తి మీదికి వచ్చేదే అయి ఉంటాది. రెడ్డోరి పొలం పక్కన ఒక రెండెకరాలు గవర్నమెంటోళ్లు ఇచ్చిన డికెటి కయ్య ఉండాది. దాని మీద ఏమన్నా కన్ను పడినాదా? అది ఇచ్చేయమంటాడా. వళ్లుగుల్ల చేసుకొని దాన్ని సాగుకు లాయకు చేసుకొన్నా అదిమ్మంటే ఏం సేయాలి? ఇయ్యలేనని సెప్పే దయిర్నం లేదు. రెడ్డోరి గురించి నేను ఎక్కడా ఏమీ వాగలా. పిల్లగాళ్లు కాని ఎక్కడన్నా ఏదన్నా కూసిండ్రా. అది ఎవరన్నా రెడ్డోరికి మోసిండ్రా. లేక వోళ్లతో ఏమన్నా పనిపడిందా. అట్టాగైతే వోల్లను పిలవనంపుకోకుండా నన్నెందుకు పిలుస్తాండాడు’ బుర్ర ఎంత బద్దలు కొట్టుకొన్నా ఎందుకు పిలుస్తున్నాడో తేల్చుకోలేక పోతూ ‘‘ఆడ ఏమన్నా జరిగినాదా? నా పస్తావన ఏమన్నా వచ్చినాదా?’’ అని అడిగాడు మరోసారి యానాదిని. 
‘‘ఎందుకట్టా పిరికిగొడ్డులా బెయపడిపోతవు. ఏమీ జరగలా. ఎంకట్రెడ్డి ఒక్కడే ఉండినాడు. ఏందో ఫోన్లో సానా సేపు మాట్లాడి అది అయిపోయినాక నన్ను పిలిసి ఎర్రోడ్ని పిలసుకొని రా పోరా అని పంపిండ్రు. నువ్వేం  భయపడమాక. నీతో ఏదో పని పడి ఉంటాది అంతే’’
‘‘భయం లేకుండా ఎట్టా ఉంటాదిరా. రెడ్డోరి పిల్లోడితో ఆడుకొన్న కష్టమే. ఆడుకోకపోయినా కష్టమే. నీకు తెలియందేముండాది. వోళ్లకు ఎంత దూరముంటే అంత మంచిది’’ 
‘‘మీ బామర్ది ప్రభాకర్‌ ఎట్టా ఉండాడు...’’
అదోలా అయిపోయాడు ఎర్రోడు. ప్రభాకర్‌ మీదకి ఆలోచన మళ్లింది. 
ప్రభాకర్‌ బాగా బలంగా దిట్టంగా ఉండేవాడు. ఎంకట్రెడ్డి దగ్గరికి పనికి పోయేవాడు. చదువుకున్నోడు కాబట్టి ఏదన్నా కాగితాలు లెక్కలు గట్రా ప్రభాకరే చూసేవాడు. దాంతో ప్రతిదానికి బైటూరికి పోయేటప్పుడు తన వెంట పిల్చుకపోయేవాడు ఎంకట్రెడ్డి, అసిస్టెంటు మాదిరిగా. అలా పిల్చుక పోతుండటంతో ప్రభాకర్‌కి ఎంకట్రెడ్డి మీద అభిమానం పెరిగింది. ఎంకట్రెడ్డి ఏమి చెప్పినా గుడ్డిగా చేసేంత అభిమానం. వెనకా ముందూ చూచేవాడు కాదు. ఎంకట్రెడ్డి చేసే అన్యాయాలు కూడా వాడికి న్యాయంగా కనపడేవి. ఎంకట్రెడ్డంటే పడి చచ్చేవాడు ప్రభాకర్‌. ఇంట్లో పెళ్లాం పిల్లల్ని పట్టించుకొనే వాడు కాదు. ఎప్పుడూ ఎంకట్రెడ్డి వెంటే. అతని వెంట తిరుగుతుంటే ఏనుగునెక్కినంత సంతోషం. ఎంకట్రెడ్డి వాణ్ని అంత బాగా చూసుకునేవాడు. ఎప్పుడూ తనవెంటే కారులో తిప్పేవాడు. తను తినేది తినిపించేవాడు. ఎంకట్రెడ్డి తన మీద చూపించే అభిమానానికి పొంగిపోయేవాడు ప్రభాకర్‌. వాణ్ని చూసి చాలా మంది హరిజనవాడలో అసూయపడేవాళ్లు. నక్క తోక తొక్కిండు అందుకే ఎంకట్రెడ్డి ఆణ్ని బాగా సూసుకొంటుండాడు అనుకొనేవాళ్లు. 
ప్రభాకర్‌ని అలా దగ్గరికి తీయడానికి కారణం మరొకటి ఉంది. పక్కూరు పక్కీర్‌ రెడ్డికి, ఎంకట్రెడ్డికి మధ్య వైరం వాళ్ల తాతల కాలం నుంచి ఉంది. తరాలు మారేకొద్దీ తగ్గక పోగా అది ఎక్కువవుతూ పోయింది. ఎప్పుడూ ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్త పడేవాళ్లు. ఒకసారి అనుకోకుండా జిల్లా నాయకుడు రావడంతో ఆ మీటింగుకు ఇద్దరూ హాజరయ్యారు. అక్కడ ఒక విషయంలో మాటామాటా పెరిగింది. అనుచరులు కలబడ్డారు. అనుచరుల్తో పాటు ఎంకట్రెడ్డి, పక్కీర్‌ రెడ్డి కూడా కలబడ్డారు. ఎంకట్రెడ్డి కన్నా పక్కీర్‌ రెడ్డి బలవంతుడు కావడంతో ఎంకట్రెడ్డిని కింద పడేసి పిడిగుద్దులు గుద్దబోతుంటే ప్రభాకర్‌ అడ్డు పడటమే కాకుండా పక్కీర్‌ రెడ్డిని కాలర్‌ పట్టుకొని పక్కకీడ్చి  నాలుగైదు దెబ్బలు వేశాడు. పక్కిర్‌ రెడ్డి దెబ్బతిన్న పులిలా అనుచరుల్ని కత్తులు తీసుకురమ్మని రంకెలేశాడు. సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉండకపోయి ఉంటే ప్రభాకర్‌ కథ ఆరోజే ముగిసిపోయి ఉండేది. అంత కోప్పడిపోయాడు పక్కిర్‌ రెడ్డి ప్రభాకర్‌ మీద. 
పోలీసులు అందర్నీ చెదరగొట్టడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. తన మీద దెబ్బ పడకుండా కాపాడిన ప్రభాకర్‌ మీద అప్పట్నుండే అభిమానం పెరిగింది ఎంకట్రెడ్డికి. కానీ, దెబ్బతిన్న పక్కీర్‌ రెడ్డి అవమాన భారంతో రగిలిపోయాడు. కోపం ఎంకట్రెడ్డి మీద కన్నా ప్రభాకర్‌ మీద ఎక్కువైంది. తనూరే అయి ఉంటే ప్రభాకర్‌ తల ఎప్పుడో లేచిపోయేదే. పక్కూరోడు కావడం, వాడికి ఎంకట్రెడ్డి సపోర్టు ఉండటంతో ఏమీ చేయలేక పోయాడు.  రాజకీయంలో చిరకాల మిత్రులు చిరకాల శత్రువులు ఉండరన్నది నిజం చేస్తూ తాతల కాలం నుంచి వస్తున్న వైరాన్ని తుంచేసి చేతులు కలిపేలా చేసింది హైకమాండ్‌ రాజకీయం. దాంతో పక్కీర్‌ రెడ్డి, ఎంకట్రెడ్డి ఒక్కటయ్యారు.
ఎర్రోడు పలక్కపోయేసరికి ‘‘ఈడ్నే కదూ, దారికాసి ప్రభాకర్‌ని సంపాలని సూసింది పక్కీర్‌ రెడ్డి మడుసులు’’ అన్నాడు. ప్రభాకర్‌ ఆలోచన్లతో నడుస్తున్న ఎర్రోడు వాస్తవంలోకి వచ్చి యానాది చెప్పిన ఆ స్థలం చూడగానే రోమాలు నిక్కబొడుచుకొన్నాయి. ఆ రోజు దృశ్యం కళ్లముందు కనపడింది. రక్తంతో స్నానం చేసినట్లుగా తెల్లటి చొక్కా ఎరుపు రంగుతో తడిసి ముద్దకాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రభాకరు అక్కడే పడి ఉన్నట్లన్పించింది ఎర్రోడికి. ప్రభాకర్‌ చావు కేకలు విని ఏదో గలభా జరుగుతుందని కత్తులు కటార్లు తీసుకొని వాడల్లోంచి పరుగున వస్తున్న ఎర్రోణ్ని, వాడి వెంట వస్తున్న జనాలను చూసి పారిపోయారో లేక చనిపోయాడనుకొన్నారోగానీ, ప్రభాకర్‌ని వదిలేసి పోయారు పక్కిర్‌ రెడ్డి మనుషులు . 
‘‘తనంటే పడిసచ్చే ప్రభాకర్‌ గాడి మీద పక్కీర్‌ రెడ్డి అట్టా దాడి సేసేదానికి ఒప్పుకోను ఎంకట్రెడ్డికి ఎట్టా మనసైందో’’ అన్నాడు యానాది, ఆ సంఘటన గుర్తుకు రావడంతో.
‘‘పెద్దోళ్ల బుద్దులు అంతేరా. మనల్ని కుక్కలకన్నా హీనంగా సూస్తరు. తనమీద దెబ్బ పడనీయకుండా కాపాడాడన్న ఇస్వాసం కన్నా పక్కీర్‌ రెడ్డితో సావాసం ఎక్కువైనాది. కులం ఒక్కటైనాది. తక్కువ కులపోడు సేదైండు. తన పైన సేయి సేసుకొనిండన్న కోపంతో రగిలిపోతున్న పక్కీర్‌ రెడ్డిని ప్రభాకర్‌ని సమించెయ్‌ అని చెప్పలేకపోయిండు. తన కులపోడు కాదుదా. ప్రభాకర్‌కి భూమ్మీద నూకలుండబట్టి బతికి బైటపడిండు. ప్రభాకర్‌ బాగై వచ్చినాక నేరుగా ఎంకట్రెడ్డి ఇంటికాడికే పోయి ‘‘పక్కీర్‌ రెడ్డి మీద వోడి మడుసులమీద కేసన్నా ఎట్టాల, లేకుంటే వోల్లల్లో ఒకన్నన్నా సంపాల’’ అని నిలదీసేసరికి, ఎంకట్రెడ్డి ఇరగబడి నవ్వుతా ‘ఏందిరా నిన్ను కొట్టిందానికి వోల్లల్లో ఒకడ్ని సంపాల్నా, నువ్వేమన్నా మా అబ్బ సుట్టానివా, అమ్మ సుట్టానివా. నువ్వు పక్కీర్‌ రెడ్డిని కొట్టినందుకు వోడు నీ పైన దాడి సేయించిండు. సరికి సరి. ఇక నీ జోలికి రాడు. వదిలేయ్‌’ అన్నాడంట ఎంకట్రెడ్డి. కడుపు మండి నువ్వు మడిసివేనా అనుకొంటూ ఊరొదిలిపోయిండు ప్రభాకర్‌. మల్లా వోడి ఊసెత్తలా ఎంకట్రెడ్డి’’  
మిట్ట ఎక్కేసరికి రైతులుండే పల్లె మంచుతెరల్లో మునిగిపోయి అక్కడక్కడా వెలుగుతున్న లైట్ల వెల్తుర్లో మసగ్గా కనపడింది. అందులో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఎంకట్రెడ్డి ఇల్లు చూసే సరికి గుండె లయ తప్పడం మొదలు పెట్టింది ఎర్రోడికి.. 
***
వాకిలి బీగం వేసి ఉండటంతో యాడికి పోయిండు ఈ టయింలో అనుకొన్నారు ఓబులేసు అతని అమ్మ. బీడీ అగ్గిపెట్టె కోసరం ఏమైనా పోయిండా అనుకొనేదానికి గూట్లో బీడీ కట్ట కనపడింది. బైటికి పోయేటప్పుడు తీసుకపోయే బీడీ కట్ట అక్కడే ఉండటంతో అంత తొందరగా యాడికి పోయాడో అర్థం కాలేదు వాళ్లకు. పల్లెలోకి ఏమైనా పోయినాడేమో అనుకొంటూ అక్కడికి పోయేందుకు సిద్ధమవుతుంటే నోట్లో బీడీ దీవిటీలా గుప్పు గుప్పుమనిపిస్తూ కిందా మీదా పడుతూ ఎర్రోడు రావడం కనిపించింది. దగ్గరికి రాగానే మందు వాసన గుప్పుమంది. చెప్పకుండా పోయి తమను కలవరపడేలా చేసింది చాలక ఫుల్లుగా తాగి ఉండటం చూసి అమ్మా కొడుకులిద్దరికీ కోపం నషాళానికి అంటింది.
‘‘యాడికి సచ్చినవు. నీ కోసరం భయపడి సస్తాండాం. మందుకావాల్సింటే సీకటి పడకముందే తెచ్చుకోని తాగి సావచ్చుగందా. యాడన్నా కింద పడినా, పురుగూపుట్రా కరిసినా మనకాడ సూపిచ్చుకోను లచ్చలేమన్నా ఉండాయా’’ వాళ్ల అరుపులకు మరో సారైతే ఎర్రోడు రెచ్చిపోయేవాడే. కాని ఏ మాత్రం కోప్పడకుండా, ‘‘ఎంకట్రెడ్డి పిలవనంపింటే పోయినాలేరా. ఆడ మందు పోసిండు ఎంకట్రెడ్డి’’
‘‘ఎంకట్రెడ్డా’’ అన్నారిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో, భయంతో.
‘‘ఆఁ. ఎంకట్రెడ్డే. యానాది వొచ్చి రెడ్డోరు పిలుస్తాడంటనే ఎందుకో ఏమో, ఏం పితలాటకం పెడ్తడోనని భయపడ్తానే యానాది ఎంట పోయినా. నన్ను సూసి ‘రా ఎంకటి’ అని పేరుతో పిలిసిండు. అరుగు మీద కూకోమనిండు. నేనేమీ మాటడకముందే ప్రభాకర్‌ పస్తావన తెచ్చి ‘అట్టా వోడికి జరగాల్సింది కాదు. అదేదో అట్టా జరిగిపోయినాది. వాడు పక్కీర్‌ రెడ్డి మీద సేయిసేసుకొన్నడని అవమానంతో అట్టా నాల్గేట్లు పీకుతానంటే నేను సరే అన్నా. కానీ, వోడ్ని అట్టా సచ్చేలా కొట్తారనుకోలే. పక్కీరు గాడి మాటలు విని నేను మీ వోడికి అన్నాయం సేసినానేమో అనిపిస్తాండాది’ అంటూ సానా బాధ పడిండు. వొద్దొంటున్నా ఆయన తాగే పట్నం సరుకు నాకు పోసి ఇచ్చిండు. నంచుకోను ముక్కలు పెట్టిండు. మంచిగా విస్తరేసి అరుగు మీదనే అన్నం పెట్టించిండు. నేనాడ ఉన్నంత సేపు ప్రభాకర్‌ గాడికి జరిగిన అన్నాయం గురించి సెప్తునే ఉన్నిండు’’
‘‘ఆయనకున్నట్టుండి మామ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చినాదంటే ఏదో పన్నాగం పన్నినట్టుండాడు’’ అన్నాడు ఓబులేసు. 
‘‘నేనూ అట్నే అనుకొన్నా.  మెల్లగా మనసులోని మాట బైట పెట్టిండు ఎంకట్రెడ్డి. ‘ప్రభాకర్‌ గాడు ఉన్నింటే వోడ్నే సర్పంచ్‌గా నిలబెట్టేటోన్ని. వోడు దూరమైండు. రమ్మంటే రావడంలా. వోడికి సేసిన అన్నాయం బూడాలంటే నిన్ను  సర్పంచుగా సేయడమొక్కటే దారి అనిపిస్తాండాది నాకు. అందుకే నిన్ను నిలబడమని సెప్పేదానికే పిలవనంపినా....’ ్డ ఎర్రోడి మాటలు పూర్తి కాకముందే... ‘‘ఏందీ! సర్పంచుగానా!’’ నమ్మలేనట్లు చూశారు అమ్మా కొడుకులిద్దరూ.
‘ఆఁ నాకూ ఆచ్చర్యమేసినాది ఎంకట్రెడ్డి మాటలకు. నన్ను గెలిపించుకొంటనన్నడు. అప్పుడన్నా ప్రభాకర్‌ నాకాడికి వొస్తాడేమో సూడాలా అన్నడు. ‘అరే ఎంకటి, నువు గెలుస్తావనుకో, అయినా సుళువుగా గెలవాలంటే మీ వాడలో కొన్ని ఓట్లన్న నీకు పడేటట్టు సూసుకోవాలా. పైసలుకు ఎనకాడాల్సిన పనిలా. మీ వాళ్లకు తాగుడుకు తినేందుకు ఎంత కర్సైనా పర్వాలా. నేను సూసుకొంటా’ అని అంటంటే, ఇది సత్తెమేనా లేక,  కలేమన్నా కంటాండానా అనిపించినాది. లేకపోతే నన్ను సర్పంచ్‌గా నిలబెట్టడమేంది, గెలిసేకి పైసలు ఎంకట్రెడ్డి కర్సుపెట్టడమేంది. నాకు మాటలురాలా. మూగెద్దుగా ఉండినా. పోసింది తాగినా పెట్టింది తిన్నా. రోజూ వస్తూ కనిపిస్తాండు. ప్రభాకర్‌గాడ్ని సూసినట్టుంటాది’ అన్నడు’’ ఎర్రోడు అక్కడ జరిగింది పూసగుచ్చినట్లు చెప్తుంటే, ఎంకట్రెడ్డి ఏం వలవిసుర్తున్నాడో అని భయమేసి ఓబులేసు వెంటనే తమ్ముడు ప్రకాష్‌కి, ప్రభాకర్‌కు ఫోన్‌ చేశాడు, జరిగింది చెప్పేందుకు.
***
ఎర్రోడ్ని, ఎంకట్రెడ్డి పిలుపించుకొన్న మరుసటి రోజే గోపాలం నాయుడు ఏకంగా ఆ వాడలోకి అడుగుపెట్టాడు. తమను చూస్తేనే అసహ్యించుకొంటూ దూరం నిలబడి మాట్లాడే గోపాలంనాయుడు తమ వాడకు రావడమే కాకుండా తన ఇంటి ముందు తనేసిన కుర్చీలో కూర్చోవడంతో గర్వపడిపోయాడు నల్లోడు.  
‘‘ఈడికి మీరు రావడమేంది. పిలిసింటే నేను వచ్చేవోన్ని కందా’’ వినయంగా చేతులు కట్టుకొని నిల్చోని, గోపాలం నాయుడు ఎందుకు వచ్చోడో, ఏం చెప్తాడో అని చుట్టు గుమికూడారు వాడలో పిల్లా జెల్లా.
‘‘ఎవరొస్తే ఏముండాదిలే. అట్టా పోతాంటి. ఎట్టా వచ్చినా చూసిపోదామని. ఏరా అబ్బిగా ఎట్టా ఉండారు? పిల్లోడేం సేస్తాడు? ఏరా సోముడూ! పొట్ట బాగా పడిందే. పనికి పోకుండా ఇంటిపట్టునే ఉండావా ఏంది?’’ అంటూ పేరు పేరునా పిలిచి పలకరిస్తుంటే పులకరించిపోసాగారు వాళ్లు.  
‘‘ఎప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు మీరు. అప్పుడప్పుడు కోపంలో మిమ్మల్ని ఏదన్నా అంటాంటాగాని,  మీరంటే అభిమానంరా నాకు. మీరులేందే మేమ్యాడుండాం. మా పొలాలు యాడుండాయి. ఇప్పుడు మీకు, మీ వాళ్లకు అంతో ఇంతో సగాయం సేసే అవకాశం వచ్చినాది నంద్యాలయ్య’’ నవ్వు ముఖంతో గోపాలం నాయుడు  అలా మాట్లాడుతుంటే గుంపులో కొంత మంది యువకులకు అర్థమయ్యింది, తనకేదో పనిపడి ఇక్కడికి వచ్చి నాటకాలాడ్తున్నాడని. ఎప్పుడూ నల్లోడా అని పిలిచే గోపాలం నాయుడు తనెప్పుడో మరచిపోయిన తన పేరుతో పిలవడంతో నల్లోడు మాత్రం తబ్బిబ్బు అయిపోయాడు.
‘‘సెప్పు సామి. నువ్వు సెప్పడం. నేను సేయకపోవడమా’’ అన్నాడు మరింత వినయంగా.
‘‘వాడలో అంతో ఇంతో పలుకుబడి ఉండోనివి, మంచి మర్యాద తెలిసినోడివి నువ్వొక్కడివే. వాడలోను పల్లెలోను అందుకే నిన్నీసారి సర్పెంచ్గా నిలబెడ్తామనుకొంటుండా’’
ప్రతి ఎలక్షన్లలో ఎంకట్రెడ్డి కుటుంబానికి గోపాలం నాయుడు కుటుంబానికీ పోటీ. వాళ్ల కుటుంబాలలో ఎవరో ఒకరు సర్పంచ్‌ కావడం చూస్తున్నారే తప్ప వేరే ఎవరూ కావడం చూడలా. అలాంటిది ఇప్పుడు తన వాడకు వచ్చి తనను సర్పంచ్గా పోటీకి నిలబెడ్తానంటే ఎర్రోడిలాగా నల్లోడికి అది కలో నిజమో అర్థంకాలేదు. అప్పుడే ఊహల్లో తేలిపోసాగాడు.
‘‘మీ వాడలో మొత్తం ఓట్లు నీకే పడేటట్టు సూసుకో. మాల వాడలో తాగుబోతు ఎర్రోడ్ని ఎంకట్రెడ్డి పోటీగా నిలబెడ్తాండాడని తెలిసినాది. నువ్వు ఏం సేస్తావో ఏమో, ఆడ ఓట్లుకూడా నీకే రావాలా. తాగేదానికి తినేదానికి డబ్బులకు ఏం భయపడాల్సిన పనిలే. ఎంతైనా కర్సుపెట్టు. ఆడ ఓట్లు సీల్చి నీకు పడేటట్టు సూసుకో. ఆ వాడలో ఓట్లు నువ్వు ఎన్ని పడేటట్టు సేసుకొంటావో నీకు సర్పంచ్‌ సీటు అంత గ్యారెంటీగా వచ్చినట్టే’’ అని ఊరించాడు. ్డ
‘‘నువ్వు సర్పంచ్‌ అయినాక నాకు పలకకుండా పోయేవు. నాకేదన్నా పడితే నంద్యాలయ్యా ఆ పని కాలే, కొద్దిగా సూడు అనే సెప్పే రోజు వస్తాదేమో’’ అని ఎక్కిసం ఆడాడు నవ్వుతూ. నంద్యాలయ్య పొంగిపోయాడు. ‘‘అదేంది  సామి అట్టాంటావు. నీకు పని సేయకపోవడమేంది’’ అన్నాడు. అప్పుడే సర్పంచ్‌ అయిపోయినట్లు ‘‘సూసినావా అప్పుడే నువ్వు సర్పంచ్‌ అయిపోయినవు. నీ కల సత్తెం కావాలంటే నువు అటు వాడలో ఓట్లు దండుకోవాల. వోళ్లకు తాపించి తినిపించు. నీ పక్కకు తిప్పుకో. అప్పుడే నువ్వు గెలుస్తువు’’ అంటూ చాలా సేపు నంద్యాలయ్యను ఊరించి పోతూ పోతూ ‘‘ఇయ్యాల్నించే పండగ సేసుకొండి’’ అంటూ ఓ పదివేల రూపాయల కట్ట నల్లోడికిచ్చాడు. 
***
‘‘ఎంకట్రెడ్డి ఇస్వాసమ లేనోడు. వోడి తరుపున నువ్వు నిలబడటమేంది. నేను నీ పక్కన నిలబడను. నిలబడితే సొంతగా నిలబడ్తానని ముఖం మీద చెప్పేసి రాకుండా ఆడ తిని తాగి వచ్చినవా’’ రంకెలేశాడు ప్రకాష్‌. ఎర్రోడి చిన్నకొడుకు ఓబులేసు ఫోన్‌ చేయడంతో వాడితో పాటు ప్రభాకర్‌ కూడా పల్లెకు వచ్చాడు. ప్రభాకర్‌ ఎర్రోడ్ని సమర్థించాడు . 
 ‘‘మీకు తెలియదురా. బావ మంచి పనే సేసిండు. ఎంకట్రెడ్డి మాటకు అడ్డుసెప్పి ఈడ బతకడం కట్టమని ఆయనకు తెలుసు కాబట్టే అట్టా సేసిండు’’
‘‘అట్టా సెప్పురా ఓ ఇది అయితాండాడు వొచ్చినాల్నించి’’ అని కొడుకు ప్రకాష్‌ మీద తన ఆక్రోశం వెళ్లగక్కాడు ఎర్రోడు.
‘‘ఏంది మావా అట్టా అంటావ్‌? ఇంగా ఎంత కాలమట్టా వోళ్లకు భయపడ్తూ బతకాల. ప్రభుత్వం అట్టా బతక్కూడదనే కదా రిజర్వేషన్లు పెట్తాండాది. వోళ్ల పక్కన మళ్లా నిలబడటమేంది’’ ప్రకాష్‌ అదే ఆవేశంతో అన్నాడు. 
‘‘రిజర్వేషన్లు పెట్తానే సరిపోతాదా. అది జరిగేట్టు సూడొద్దా. ఆడోళ్లకని, ఎస్సీలకని ఎస్టీలకని బీసీలకని రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టాలను  ఏస్తాండారు సరే యాడన్న ఒక ఎస్సీ సర్పంచో, బిసి సర్పంచో,ఆడ సర్పంచో  గట్టిగా తన సీటులో కూకోని పని సేసిదే  సూసినామా.  పేరుకే వోళ్లు సర్పంచ్లు కాని నడిపించేందంతా బలం బలగం ఉన్న పై వర్గం వోళ్లే కందా’’
‘‘అది తెలీక ఆ నల్లోడు అప్పుడే తనే సర్పంచ్‌ అన్నటు విర్రివీగి పోతాండాండు’’ అన్నాడు ఓబులేసు.
‘‘మనలో మనకే పోటీ పెట్టి పబ్బం గడుపుకొంటరు పెద్దోళ్లు. ఈతూరి అట్టా జరగకుండా సూడాల. నల్లోడన్నతో నేను మాటాడ్తా’’
‘‘నల్లోడు మన మాట యాడింటాడు మావా. గోపాలం నాయుడు ఇచ్చిన పైసల్తో తాగి తందానాలాడ్తాండారు వోడవోడ’’
‘‘మన ప్రయత్నం మనం సేద్దాం. నేను సెప్తే ఇంటాడని నమ్మకముండాది. ఆడ కుర్రోళ్లకు నా మీద గురి. మన ప్రకాషోడి మాదిరిగా వోళ్లు నాయుడోరి మీద రెడ్డోరి మీద కారాలు మిరియాలు నూరుతుండారు. నల్లోడన్నతో మనం మాటడబోయేది చాటుగా జరిగిపోవాల. అది  గోపాలం నాయుడు,  ఎంకట్రెడ్డిల సెవిన పడకుండా సేయాల.Ë లేకుంటే వోల్లు ఎదురు ప్లాను ఏస్తరు. అది జరక్కుండా సూడాల. అందుకే వోడ్ని ముక్కమైన పిల్లగాళ్లను పిలుచుకోని రాతిరి పొద్దుపోయినాక అంకాళమ్మ గుడికాడికి రమ్మని ఫోన్‌ సేసి సెప్తా. బావతో పాటు మీరు మరో నల్గురు వస్తే  కూకోని మాటడ్తాం’’
***
అంకాళమ్మ గుడి ఊరి బైట చెట్ల గుబుర్ల మధ్య ఉంది. అక్కడికి పగలే ఎవరూ పోరు. అయినా ఎందుకైనా మంచిదని ఎవరికీ తెలియకూడదని బుడ్డికూడా వెలిగించకుండా చిమ్మ చీకట్లోనే కూర్చున్నారంతా .  
ప్రభాకర్‌ అంటే రెండు వాడల్లోకి గురి. అదీగాక ప్రభాకర్‌ ఎంకట్రెడ్డిని నమ్మి మోసపోయి చచ్చి బతికాడని సానుభూతి. ప్రభాకర్‌ అనుకొన్నట్లే రెండు వాడల్లో ముఖ్యమైన వాళ్లు వచ్చారు. ప్రభాకర్‌ తను చెప్పాలనుకొన్నది చెప్పాడు.‘‘ఊర్లో పదహైదు వందల పై సిలుకు ఓట్లుండాయి. దాంట్లో మన రెండు వాడల్లో కలిసి అయిదొందల పైసిలుకు ఉంటే, కాపోళ్లయి నాయుడోళ్లయి మిగతా కులపోళ్లయి ఎయ్యి ఉంటాయి. ఆ ఎయ్యి ఓట్లు ఎంకట్రెడ్డి, గోపాలం నాయుడుకి సమంగా పడతాయి. అందుకే పల్లెలో వోళ్లిద్దరు సమ ఉజ్జీలుగానే ఉండారు. సర్పంచుగా గెలిపించాలన్నా, ఓడించాలన్నా మన ఓట్లే ముక్కెం వోళ్లకు. మాల వాడలో ఓట్లు ఎక్కువ కావడం, మాదిగ వోడ వోట్లు నా వల్ల సీలిపోయిందాన రెండు తూర్లు ఎంకట్రెడ్డి సర్పంచ్‌గా గెలిసిండు. అది మన బలం. మన ఓట్లతో గెలిసి మనల్ని హీనంగా సూస్తాండారు గోపాలం నాయుడు గాని, ఎంకట్రెడ్డిగాని. ఇప్పుడు సర్పంచు సీటు మనోళ్లకు వచ్చిందని తెలిసే నిన్ను గోపాలం నాయుడు , ఎంకట్రెడ్డి ఎర్రోడికి ఎర ఏసి పబ్బం గడుపుకోవాలని సూస్తాండారు. మీలో ఎవరు గెలిసినా ఒరిగేదేం లే. వోళ్ల కాళ్ల కాడ కూకోవాలిసినోల్లే కానీ, కుర్సీలో కూకోనీయరు. మనమిప్పుడు మారకుంటే ముందు మాదిరిగానే ఉంటాది. మనకొచ్చిన అవకాశం ఎందుకొదులుకోవాలా? అందుకే మనమంతా ఒక్కటి కావాల. ముందు మాదిరిగా జరక్కుండా సేయాల. మనకేం తక్కువ, గోపాలం నాయుడుకి ఎంకట్రెడ్డికి ఎన్ని ఓట్లుండాయో మనకూ అన్ని ఓట్లుండాయి. వోళ్లకు వార్డు మెంబర్లు ఇడి ఇడిగా ఎంత మందిని గెలుసుకొంటరో  మన రెండు వాడల్లో మనమంతమందిని గెలిపించుకోగలం. అట్టాంటప్పుడు వోల్లు సెప్పినట్లు మనమెందుకినాల. వోళ్లలాగా మనది ఒక వొర్గం. సర్పంచ్‌ సీటు మనమే తెచ్చుకోవాల. వార్డు మెంబర్లు మనోళ్లు కావాల. వైసు సర్పంచు కూడా మనం సెప్పినోడు కావాల. వోల్ల మోచేతి నీళ్లు తాగాల్సిన పనిలా. మన రోడ్లు మనమే బాగా  ఏయించుకొంటాం. కాంటాక్టులు మన వార్డుల్లో వచ్చేటియి మనమే సేసుకొంటాం. వచ్చిన లాభాలు పక్కన పెట్తాం.  మన దారికి వోల్లను తెచ్చుకొంటాం. అట్టా చక్రం తిప్పాలా. మనలో సర్పంచు నువ్వైనా పర్వాలా, ఎర్రోడు బావైనా  పర్వాలాగాని, గెలిసినోడు దయిర్నంగా కుర్సీలో కూకోవాలా. ఈ పనులన్నీ సేయాల. అట్టా దయిర్నం సేసోటోన్నే సర్పంచిగా నిలబెట్టుకొంటాం’’
‘‘ఇనే దానికి బాగుండాదిరా. కాని వోళ్ల మాట కాదని మనం యాడ బతుకుతాం’’ నల్లోడు తన భయం చెప్పాడు. ఎర్రోడు వాడికి వంత పాడాడు. 
‘‘మీ భయం సూసి వోళ్లు మనతో ఆడుకొంటాండారు. ఎంత కాలమని అట్టా సస్తా బతుకుతాం. తిరగబడ్దాం. ఏం సంపుతారా. ఎంత మందిని సంపుతారు. మనలో ఎవరికే అన్నాయం జరిగినా మనరెండు వాడల్లో వాళ్లు అంతా ఒక్కటిగా ఉందాం’’
‘‘వోళ్ల రాజకీయమే మనమూ సేస్తం. గోపాలం నాయుడు మనకేదన్నా నట్టం సేస్తే, బెదిరిస్తే ఎంకట్రెడ్డి పక్కనుంటాం. ఎంకట్రెడ్డి అట్టా సేస్తే గోపాలం నాయుడుతో కలుస్తాం’’ అన్నాడు మాదిగ వాడలో ఓ కుర్రోడు. 
‘‘వోళ్లను అంత తెలివ తక్కవ అంచనా వేసేదానికిలా. అవసరమైతే వోళ్లిద్దరు ఒక్కటైనా అయితరు. అట్టా వోల్లిద్దరు ఒక్కటైనా మనం దయిర్నంగా నిలబడగలగాలా. మనం లేందే వోల్లు లేరు. ఆ భయం వోళ్లకు కలగాల’’ అన్నాడు ప్రభాకర్‌ తనకు కలిగిన అనుభవంతో. 
‘‘మాకు ఎప్పుట్నుంచో ఉండాది తిరగబడాలని. ఇదో ఈ ముసిలోల్లే మాకు అడ్డం సెప్తాండారు. మనం కాయా కట్టం సేస్తూ ఎన్నాళ్లు వోళ్లకు దండాలు పెట్తూ వాళ్ల కాళ్ల కింద బతకాలా’’ ఉడుకు రక్తం పారేవాళ్లు ప్రభాకర్‌ మాటలకు రెచ్చిపోతూ అన్నారు.
‘‘ఆవేశపడితే ప్రయోజనం లే. మనం వోల్ను తెలివిగా దెబ్బకొట్టాలా. వోళ్ల మాట ఇనేటట్టు ఉండాలా. మనకు అన్నాయం సేస్తే తిరగబడ్తారనే బెయం వాళ్లలో ఉండాలా. బలగమూ పెంచుకోవాలా. మనం లేందే వోళ్లు లేరనే గ్నానం వోళ్లకు కలిగేలా సేయాలా...’’
‘‘ఈళ్ల వల్ల అది అయ్యేపని కాదన్నా, నువ్వే నిలబడు సర్పంచుగా. వోళ్ల ఆట కట్టించే దయిర్నం నీకే ఉండాది. నువ్వు సెప్పినట్టే సేస్తాం’’ అంటూ అందరూ ప్రభాకర్‌కి మద్దతు పలికారు. ప్రభాకర్‌ అలా జరుగుతుందనుకోలేదు. కొద్దిసేపు ఆలోచించి ‘‘సరే, నేనే నిలబడ్తా. ఈ వార్త ఎక్కడ పొక్కినా మనం సెడిపోతాం. మనల్ని బెదిరించి భయపెట్టి ఇడగొట్తారు. అంతా వోళ్లు సెప్పినట్టే ఇంటాడాలా’’ అని మరోసారి ఏమేమి చేయాలో వివరంగా చెప్పాడు ప్రభాకర్‌.  ప్రభాకర్‌ మాటల్తో కొత్త ఉత్సాహం పుట్టకొచ్చి అంతా ఇళ్లకు చేరుకొన్నారు. 
***
ఎంకట్రెడ్డి తరుఫున ఎర్రోడు, గోపాలం నాయుడు తరఫున నల్లోడు పోటీకి నిలబడేది నిశ్చయమైపోయింది. పల్లెలో ఎన్నికల వేడి రాజుకొంది. ఎవరికి వాళ్లే తమదే విజయం అనుకొంటూ అంచనాలు వేసుకోసాగారు గోపాలం నాయుడు ఎంకట్రెడ్డిలు. నోటిఫికేషన్‌ వచ్చి నామినేషన్‌ వేసే మొదటి రోజే నల్లోడు, మరుసటి రోజు ఎర్రోడు నామినేషన్లు వేశారు. గోపాలం నాయుడు, ఎంకట్రెడ్డి ఊహించని విధంగా నామినేషన్లు వేసే చివరి రోజు ఆఖరి గంటలో ప్రభాకర్‌ వచ్చి నామినేషన్‌ వేయడంతో ఆశ్చర్యపోయారిద్దరూ. 
అదే రోజు సాయంత్రం ప్రభాకర్ను పిలవనంపాడు ఎంకట్రెడ్డి. రానని చెప్పలేదు ప్రభాకర్‌. వెంటనే కలిశాడు. జరిగిందానికి నొచ్చుకొన్నాడు. తన వెంటే ఉండమన్నాడు. ఎర్రోడితో నామినేషన్‌ ఉపసంహరణ చేయిస్తా నువ్వే సర్పంచ్‌వి అని ఆకాశానికి ఎత్తేశాడు ఎంకట్రెడ్డి. సరేనని తలూపాడు ప్రభాకర్‌.
 అదే రోజు ప్రభాకర్‌ వెళ్లి ఎంకట్రెడ్డిని కలిశాడని తెలిసిన గోపాలం నాయుడు ప్రభాకర్‌ని రెచ్చగొట్తూ తన పక్క తిప్పుకోవాలని ఫోన్లో మాట్లాడాడు. ‘‘వోడు నిన్ను సంపేయాలని సూసిండు. సిగ్గులేకుండా మళ్లా వోడి పక్కనుంటావా? నా పక్కన నిలబడు నల్లోడ్ని విత్‌ డ్రా సేయిస్తా. మీ రెండు వాడలకు సపోర్టుగా ఉంటా’’ అని ఆశ చూపాడు. 
‘‘ఆ పక్కన నిలబడను నేనంతా సిగ్గులేనోడ్నా. ఓట్లు సీల్సేదానికే అట్టా నిలబడినా. నేను నిలబడిందానా ఓట్లు సీలిపోయి మా ఎర్రోడు మావ ఎట్టాగూ గెలవడు. ఒకేల నాకు ఓట్లు ఎక్కువ పడి నేను గెలిసినా గెలుపు నీదే. అట్టా కాకుండా ఎంకట్రెడ్డి నన్ను నమ్మి మా ఎర్రోడి బావ నామినేషన్‌ విత్‌డ్రా సేయిస్తే  నువ్వు నల్లోడి మావను విత్‌ డ్రా సేయించు. పైసా ఖర్చు లేకుండా పనైపోతాది. నీ పక్కనే నేను నిలబడ్తా నా పగ తీరినట్టుంటాది’’ అని బదులిచ్చాడు ప్రభాకర్‌.
నామినేషన్‌ వేసిన మూడు స్క్రూటినిలోను నిలిచాయి. ప్రభాకర్‌ను నమ్మకపోతే నష్టమే కలుగుతుందనుకొన్నాడు ఎంకట్రెడ్డి. ఒకవేళ వాడు నాయుడు పక్కన పోతే తను ఓడిపోవడం ఖాయం అని ఎంకట్రెడ్డి ప్రభాకర్‌ కోసం ఎర్రోడితో నామినేషన్‌ విత్‌ డ్రా చేయించాడు. ప్రభాకర్‌ రంగంలో ఉండటంతో నల్లోడి గెలుపు కష్టమని, ప్రభాకర్ను  నమ్మకపోవడం కన్నా నమ్మితేనే లాభమని ఎంకట్రెడ్డి అనుకొన్నట్లే గోపాలం నాయుడు అనుకొని ప్రభాకర్ను నమ్మి  నల్లోడ్ని విత్‌ డ్రా చేయించాడు. దాంతో ప్రభాకర్‌ ఏకగ్రీవమైపోయాడు. 
నల్లోడు కూడా విత్‌ డ్రా చేయడంతో ఎంకట్రెడ్డి అయోమయానికి గురై కలవరపడ్డాడు. గోపాలం నాయుడు  ప్రభాకర్‌ కలిసి నాటకమాడుతున్నారేమో అనిపించి తొందర పడినానేమో అనుకొన్నాడు. విత్‌డ్రాలు అయిపోయిన పది నిమిషాల్లోనే తప్పెట్లు మారుమోగుతుండగా మాల వాడ మొత్తం దండలు తీసుకొని ఎర్రోడు ముందుండి చిందులు వేస్తూ వస్తుండటంతో గోపాలం నాయుడుని ప్రభాకర్‌ బురిడీ కొట్టించిందాని వల్లే నల్లోడు విత్‌ డ్రా చేసింటాడని ఎంకట్రెడ్డి నవ్వుకొన్నాడు. కాని ఎర్రోడు వాడి వెంట వచ్చిన వాళ్లు తనను చూసి పట్టించుకోకుండా, తనకు ఒక దండకూడా వేయకుండా ప్రభాకర్‌ని దండల్తో ముంచెత్తుతుంటే ముఖం పాలిపోయింది. అదే సమయంలోనే మాదిగ వాడ తరుఫున నల్లోడు తప్పెట్లతో పూలదండల్తో వస్తుండటం చూచి తనకోసమే అని, ఎంకట్రెడ్డి మోసపోయాడనుకొంటూ మీసం మీద చేయి వేసి నవ్వుకొన్నాడు గోపాలం నాయుడు. కానీ, నల్లోడు వాళ్లు  ఒక్క దండకూడా తనకు వేయకుండా ప్రభాకర్‌ని కుర్చీలో కూర్చోపెట్టి దండలు వేయడంతో అతని ముఖమూ  పాలిపోయింది. మాల వాడలో గోపాలం నాయుడు, మాదిగ వాడలో ఎంకట్రెడ్డి తన వాళ్లంటూ నిలబెట్టిన వార్డు మెంబర్లు నామినేషన్లు విత్‌ డ్రా చేసేయడంతో మరింత మతిపోయింది ఇద్దరికీ.
ప్రభాకర్‌కి జరుగుతున్న సన్మానం జేకొడ్తున్న నినాదాలు చూసి పుట్టి బుద్ధెరిగి అలాంటి దృశ్యాన్ని కలలో కూడా ఊహించుకోలేని వాళ్లు నివ్వెరపోతూ చెరో మూల నిలబడిపోయారు పంచాయితీ ఆఫీసులో. 
పడమర పక్క సూరీడు ఆ రోజు ఎందుకో తీక్షణంగా మండుతూనే రేపటి రోజు కూడా తన ప్రతాపం చూపేందుకు సిద్ధపడుతూ... సూరీడ్ని ముంచేందుకు కమ్ముకొంటున్న మంచు భయపడి నీడ పక్కన నక్కేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని