కస్తూరీ పరిమళం
‘‘నీకు మైనుద్దీన్ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె నుంచొచ్చి, నీ కోసం కాచుక్కూర్చుని ఉంటే, తీరిగ్గా అర్ధగంట తరవాత దాపురిస్తావు. నీ కోసం నాకిష్టమైన కడక్ చాయ్ కూడా తాగకుండా ఈ టీ పార్లర్లో గుటకలు మింగుతూ..
కథా విజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి (రూ.5 వేలు) పొందిన కథ
‘‘నీకు మైనుద్దీన్ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె నుంచొచ్చి, నీ కోసం కాచుక్కూర్చుని ఉంటే, తీరిగ్గా అర్ధగంట తరవాత దాపురిస్తావు. నీ కోసం నాకిష్టమైన కడక్ చాయ్ కూడా తాగకుండా ఈ టీ పార్లర్లో గుటకలు మింగుతూ కూర్చున్నాను’’ పార్లర్‌లోనికి వచ్చిన మిత్రుడు మైనుద్దీన్‌పై చిందులు తొక్కాడు శ్యామశాస్త్రి.
‘‘అది కాదు భాయ్, నీ ఫోన్‌రాగానే పెళ్లివంటను మా ఆద్మీకప్పగించి బయల్దేరుతూ ఉన్నానా, పెళ్లి విందుకు కావలసిన బాదూషా, డబుల్ కా మీటా స్వీట్లు పూర్తిచేసి వెళ్లమని మా మేనేజర్ నా కాళ్లా వేళ్లా పడ్డాడు. వారికెంతసేపు మటన్లూ, చికెన్లూ వండటం వచ్చు కానీ, మా కేటరింగ్ సిబ్బందిలోని వారికెవ్వరికీ ఈ స్వీట్లు వండటం రాదు. వారి కోసం ఆదరా బాదరా ఆ తీపి వంటకాలు చేసి బయల్దేరాల్సి వచ్చింది’’ శ్యామశాస్త్రి గడ్డం పట్టుకొని బతిమలాడుతున్న ధోరణిలో ప్రాధేయపడ్డాడు మైనుద్దీన్.
‘‘సరే, ముందు రెండు టీలు ఆర్డరివ్వు’’ అని కోపంగానే బదులిచ్చాడు శాస్త్రి.
‘‘ప్లేట్ పకోడీ తినకుండా దమ్‌చాయ్ ఎలా తాగగలం, అరే బాబూ, టీప్లేట్ పకోడీ లావో’’ అని సర్వర్‌ను కేకేశాడు మైన్.
‘‘మధ్యాహ్నం పన్నెండౌతూ వుంటే పకోడీ ఏంటి? చాయ్ చాల్లే’’ అన్న మిత్రుడి మాటలకు చిరునవ్వు నవ్వి,
‘‘అసలీ పకోడీపై తిరుపతి వేంకట కవులు చమత్కారంగా ఒక పద్యం చెప్పారు తెలుసా? చెప్తాను విను.
శనగపిండి ఉల్లిపాయ చిన్న మిర్రకాయలన్
జొనిపి అందు అల్లమింత దొనిపి ముద్ద చేసియున్
అనల తప్తమైన నేతియందు వైచివేచినన్
జను పకోడి అనెడు చక్కనైన ఖాద్యమౌ!
ఈ పద్యానికి చిలకమర్తి వారే చిత్తయ్యారు’’ మైనుద్దీన్ పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించిన తీరుకు శ్యామశాస్త్రే గాక పార్లర్‌లోని మరో ఇద్దరు, ముగ్గురు కూడా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు.
సర్వర్ ప్లేట్‌లో తెచ్చిన పకోడి కరకరా నములుతూ శ్యామశాస్త్రి, ‘‘పెద్ద సమస్య వచ్చి పడింది భాయ్’’ అన్నాడు.
‘‘నీకంటికి ప్రతిదీ పెద్ద సమస్యలాగా అగుపించటం నాకేమీ కొత్త కాదు కదా! ఈ మాయలఫకీరు భూతంలాటి ఎంత గడ్డు సమస్యనైనా సాంబ్రాణి ధూపం పెట్టి చిటికెలో తోలేస్తాడు. అదేంటో చెప్పు’’
ప్లేటు ఖాళీ చేస్తూ చెప్పాడు మైనుద్దీన్.
‘‘బ్రాహ్మణ వీధిలో మా పినతల్లి కూతురు మాలతి ఉంది తెలుసు కదా, పాపం భర్త పోయినా, బాధ దిగమింగుకొని కంపాషనేట్ గ్రౌండ్స్‌పై ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆవిడ కూతురు రాధకు ఈ నెల ఇరవై అయిదో తేదీన పెళ్లి చూపులు. మగదిక్కు లేని సంసారం కాబట్టి, నేను చూపులప్పుడు దగ్గరుండాలని మొన్ననే ఫోన్ చేసి చెప్పింది’’ అన్నాడు శాస్త్రి.
‘‘మరింకేం, చెల్లెమ్మకు ఆమాత్రం సాయం చేయలేవా?’’ టీ ఆర్డరిచ్చి కర్చీఫ్‌తో ముఖం తుడుచుకొని అన్నాడు మైనుద్దీన్.
‘‘చెయ్యవలసిందే, కానీ అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లాలో తమిళనాడు బోర్డరు దగ్గర రామకుప్పం అనే ఊర్లో పురాణ ప్రవచనానికి ఒప్పుకుని అల్లాడానే’’ విచారంగా చెప్పాడు శ్యామశాస్త్రి.
మైనుద్దీన్ మౌనంగా కాసేపు టీ చప్పరిస్తూ ఉండిపోయాడు.
‘‘సరే, ఏం చేద్దాం. మా చెల్లెలినే ప్రోగ్రాం రెండు రోజుల వాయిదా వేసుకోమని అడిగి చూస్తాను’’ నన్ను వాళ్లింటి వరకూ నీ వాహనంలో డ్రాప్ చెయ్యి’’ అన్నాడు శ్యామశాస్త్రి.
‘‘పదా, నేను వస్తాను. ఆవిణ్ని చూసి చాలా కాలమైంది’’ బిల్లు కౌంటర్లో చెల్లించి చెప్పాడు మైనుద్దీన్.
ముప్పె ఏళ్ల కిందట వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కోర్సులో కొత్తగా జాయినయినప్పుడు శ్యామశాస్త్రికి క్లాస్‌మేట్‌గా పరిచయమయ్యాడు మైనుద్దీన్. ఇద్దరూ ఒకే జిల్లా వాళ్లు కావడంతో పాటూ, ప్రాచీన సాహిత్యం పట్ల వారికి గల అభిరుచి వారి మధ్య సాన్నిహిత్యం పెంచటానికి తోడ్పడింది. అనతి కాలంలోనే వారిద్దరూ అనుంగు మిత్రులయ్యారు.
మైనుద్దీన్ తండ్రి ఫక్రుద్దీన్‌కు ప్రొద్దుటూరులో ఫాన్సీషాపు ఉంది. శ్యామశాస్త్రిది కడప పక్కన ఉన్న చెన్నూరు. అతని తండ్రి కూడా హైస్కూల్లో తెలుగు పండితుడే. కడప నుంచి తిరుపతిలోని యూనివర్సిటీకి వెళ్లే సమయంలో, తిరుగు ప్రయాణంలో ఇద్దరూ ప్రాచీన సాహిత్యంలోని ఆణిముత్యాల్లాంటి పద్యాలను నెమరువేసుకొనేవారు. ఆ సమయంలో ప్రొద్దుటూరులో నివసించిన పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యరికం కొంతకాలం చేసినందున మైనుద్దీన్‌కు బాల్యంలోనే తెలుగుభాషపై మంచిపట్టు, మక్కువ ఏర్పడ్డాయి. ఆ మక్కువే తెలుగులో ఎంఏ చేరేలా అతణ్ని పురిగొల్పింది.
తెలుగు సాహిత్యం కాకుండా వాళ్లిద్దరి మధ్య ఎక్కువగా దొర్లే మరో అంశం వంటలు. అదే పాకశాస్త్రం. దోసావకాయ ఆవ పెట్టి ఎలా వండాలో లేదూ గుమ్మడికాయ ధప్పళం చేసే విధానం శ్యామశాస్త్రి చెబుతూ ఉంటే మైనుద్దీన్ చెవి కోసుకునేవాడు. అలాగే, మైసూరుపాకు పాకం ఎలా పట్టాలో, తమ వీధిలో నివసించే నూర్‌సాబ్ నోరూరించే జిలేబీ ఎలా తయారు చేస్తాడో మైనుద్దీన్ వివరించి చెప్పేవారు. ఏ పెళ్లిళ్లకో వెళ్తే, ఇద్దరూ వంటవాళ్ల దగ్గరికి వెళ్లి పెళ్లి భోజనంలోని వంటకాల గురించి వారికి కొంతసేపు క్లాసు పీకి, వాళ్ల నుంచి కొన్ని వంటకాల గురించి తెలుసుకొనేవాడు.
క్లాసులో, లైబ్రరీలో, సాయంత్రం గ్రౌండులో, మెస్సులో, తిరుపతి పురవీధుల్లో ఇద్దరూ కలిసే తిరిగేవారు, కొందరు మిత్రులు వారికి జంటకవులని పేరు పెట్టి, ఆశువుగా కొన్ని పద్యాలు చెప్పించుకొని వినేవాళ్లు.
పీజీ పూర్తయ్యాక శ్యామశాస్త్రి బీఈడీ చేసి తెలుగు ఉపాధ్యాయుడిగా చేరితే, మైనుద్దీన్ కడప చేరుకొని కేటరింగ్ బిజినెస్ ప్రారంభించాడు. పాకశాస్త్రం పట్ల అతనికి గల అవగాహన, అభిరుచి మేరకు అతని బిజినెస్ దినదినాభివృద్ధి చెందింది. నలుగురు హెడ్‌కుక్స్, పదిమంది వంటవాళ్లు, ఎనిమిది మంది సప్లయర్లతో ఒక బృందం ఏర్పాటు చేసుకొని ఏ పెద్ద ఫంక్షను జరిగినా కేటరింగ్ ఆర్డరు సంపాదించుకొని, ఆహుతుల జిహ్వకు సరిపడే వంటకాలు తయారు చేయించి, అందరి ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. శ్యామశాస్త్రి జిల్లాలోని ఎన్నో జెడ్పీ స్కూళ్లలో పనిచేసి, స్వగ్రామం చెన్నూరులో ఇల్లు కట్టుకొని స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. ఇంకా అతనికి ఆరేళ్ల సర్వీసు ఉంది.
శ్యామశాస్త్రి కడపకు వచ్చినప్పుడంతా మైనూను కలసి వెళ్లడం, మైనుద్దీన్ నెలకొకసారైనా చెన్నూరుకు వెళ్లి శాస్త్రినీ, అతని కుటుంబాన్ని పలకరించి రావడం రివాజుగా మారింది.
‘‘రాక రాక అమ్మాయికి మంచి సంబంధం కుదురుతూ ఉందంటే, నువ్వు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమంటే ఎలా? పెళ్లికొడుకు తండ్రి కోపిస్టిలా కనిపిస్తున్నాడు. ఈ వంకతో సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుంది చెప్పు, నువ్వే నీ ప్రవచనం వాయిదా వేసుకో’’ అంది మాలతమ్మ
‘‘అలా అన్నావు బాగుందమ్మా. నేనూ అదే పొద్దున్నుంచి మనవాడితో మొత్తుకుంటున్నా’’ అన్నాడు మైనుద్దీన్.
శ్యామశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. కార్తీక మాసం సందర్భంగా తాను చెప్పబోయే పురాణ కాలక్షేపం కోసం ఆ పల్లెలోని వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు తాను హఠాత్తుగా వెళ్లకపోతే వారందరూ నిరాశ పడవచ్చు.
‘‘సరేనమ్మా నేనింకొక మార్గం వెతుక్కుంటాను. పెళ్లి చూపుల సమయంలో కచ్చితంగా ఇక్కడుంటాను’’ అన్నాడు శ్యామశాస్త్రి. అతని మాటలకాయన చెల్లెలి మనసు కుదుటపడింది.
‘‘కడపలో నీకు చాలా మంది మిత్రులున్నారు కదా, ఇరవై అయిదో తేదీన నా బదులు రామకుప్పం వెళ్లి ఆ కథాకాలక్షేపం చెప్పి రాగలవాళ్లెవరైనా ఉంటే చూడు. వారికి దారి ఖర్చులతో బాటు మంచి సంభావన ఇప్పించే పూచీ నాది’’ బస్సు కోసం వేచి ఉన్నప్పుడు మైనుద్దీన్‌తో చెప్పాడు శ్యామశాస్త్రి.
‘‘అలాగే, నువ్వు నిశ్చింతగా ఉండు’’ అన్నాడు మైనుద్దీన్.
రెండు రోజుల తరవాత శ్యామశాస్త్రి మైనుద్దీన్‌కు ఫోన్ చేశాడు.
‘‘నేను చెప్పిన పని ఏం చేశావు? నాకు టెన్షన్‌తో కాళ్లూ చేతులూ ఆడకుండా ఉంది?’’ అన్నాడు శాస్త్రి గాబరాగా.
‘‘ఈ రోజు సాయంత్రం మైదుకూరులో ఒక ఫంక్షన్లో మేము క్యాటరింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం నేను చెన్నూరులో మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడి మైదుకూరు వెళ్లిపోతాను’’ అన్నాడు మైన్.
శ్యామశాస్త్రికి ఏం చేయాలో తోచడం లేదు. అతడి తోటి ఉపాధ్యాయులెవరికీ పురాణ ప్రవచనాలు చేయగలిగినంత పరిజ్ఞానం లేదు. ఒకరిద్దరు మిత్రులకున్నా వారు అంతదూరం వెళ్లమనీ, తమకేవో పనులున్నాయనీ తప్పించుకున్నారు.
మధ్యాహ్నం రెండింటికి మైనుద్దీన్ శ్యామశాస్త్రి ఇంటికి వచ్చాడు. శాస్త్రి కొడుకు గ్లాసులో చల్లటి మంచి నీళ్లు తెచ్చిచ్చాడు. అవి తాగి ఆ అబ్బాయి చదువు గురించి వాకబు చేశాడు మైన్.
శాస్త్రి ఉండబట్టలేక, ‘‘ఇంతకూ నేను చెప్పిన విషయం ఏం చేశావు బాబూ, నా దారికి నన్ను వదిలేసి నువ్వు హాయిగా వంటలు చేసుకుంటూ కూర్చుంటావా?’’ అని నిలదీశాడు మైనుద్దీన్.
‘‘ఈ మాత్రం దానికి ఇంత బీపీ, టెన్షను పడ్డం ఏమి? అంతా నాకొదిలేసి నువ్వు మీ చెల్లెలింట్లో అంతా సజావుగా సాగేలా చూడు’’ అన్నాడు నవ్వుతూ మైనుద్దీన్.
‘‘అయితే నీకు నా బదులు రామకుప్పం వెళ్లే మనిషి దొరికాడా?’’ సంబరంగా ప్రశ్నించాడు శ్యామశాస్త్రి.
‘‘దొరకడమేమిటి? నీ ముందే కూర్చుని ఉంటే’’ అని ముసి ముసి నవ్వులు రువ్వాడు మైనుద్దీన్.
‘‘ఏమిటేమిటీ? నువ్వు ఆ ఊరికెళ్లి శివపురాణం చెప్పి వస్తావా?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు శ్యామశాస్త్రి.
‘‘దానికింత ఆశ్చర్యమేమిటి భాయ్. ఎవరినడిగినా నాకాపనుందీ, ఈ పనుందీ అని తప్పించుకున్నారు. సంస్కృతంలో, పురాణాల్లో నాకు నీకున్నంత పట్టు లేకపోవచ్చు గానీ, నేను మరెవరికీ తక్కువగాదు. మా గురువుగారు పుట్టపర్తి వారి శిష్యరికంలో శివతాండవం గ్రంథం యావత్తూ కంఠతా పట్టాను, అందులోంచి రెండు పద్యాలు చదివితే చాలు, జనాలు ఆనందంతో తాండవం చేస్తారు’’ అన్నాడు మైనుద్దీన్.
‘‘అది కాదు. అదీ...’’ అని నసుగుతూ కూర్చున్నాడు శ్యామశాస్త్రి.
‘‘ఓహో నేను ముస్లింననా నీ సందేహం! నీకు మహాభారతం టీవీ సీరియల్‌కు మాటలు రాసిందెవరో తెలుసునా? రాహిమాసుం రాజా అనే ముసల్మాను సంస్కృత పండితుడు. ఏ హైందవుడికీ తీసిపోనంత పురాణ జ్ఞానం ఉందాయనకు. బొంబాయి జుహూ బీచ్‌లో సలీం, జావేద్ పురాణగాథలు వినిపిస్తూ ఉంటే వినేందుకు జనాలు విరగబడేవారు. నా సహాధ్యాయి, ఇటీవలే దివంగతుడైన రచయిత శశిశ్రీ సంస్కృత పద్యాలను అలవోకగా ఎన్నో సభల్లో వినిపిస్తూ ఉంటే ఆయన ధారణకూ, ఉచ్చారణకూ ఎందరో జోహార్లు అర్చించేవారు. జన్మతః ముసల్మాన్నెనా ఆయనకూ మా గురువుగారి శిష్యరికంలో అన్ని పురాణాలపైనా పట్టు దొరికింది. నీకెందుకు ప్రొద్దుటూరు పంతులు నా బదులు వస్తున్నారని వారికి కబురు పెట్టు, నేను వెళ్లి దిగ్విజయంగా పని ముగించుకొని వస్తాను. కానీ ఒకటే చిక్కు..’’ అన్నాడు మైనుద్దీన్.
‘‘ఏమిటది?’’ గాబరగా అడిగాడు మైనుద్దీన్‌ని శ్యామశాస్త్రి.
‘‘ఇరవై అయిదో తేదీ కడపలో సాయంత్రం ఒక ఫంక్షన్లో మేము కేటరింగ్ చేస్తామని ఒప్పుకుని ఉన్నాం. మా వాళ్లు అన్ని వంటలూ చేస్తారు కానీ, స్వీట్లు చేయడం వారికి చేతకాదు. దానికి ఏం ఏర్పాట్లు చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను’’ అన్నాడు మైనుద్దీన్.
శ్యామశాస్త్రి పెద్దగా నవ్వి, ‘‘నీ సిగదరగా, దీనికింత ఆలోచన దేనికోయ్. దేవుడి దయవల్ల నాకు అన్ని రకాల స్వీట్లు చేయడం వచ్చు. ఆ ఫంక్షన్లో ఏ తీపివంటకాలు కావాలో మీ వాళ్లు చెబితే నేను వండిపారేస్తాను’’ అన్నాడు.
మైనుద్దీన్ కూడా ఆశ్చర్యపోయాడు.
‘‘ఆ వాసనలూ అవీ నీకు పడవు గదా, మరి...’’
‘‘అవన్నీ నీకెందుకోయ్, ఉదయం మా చెల్లెలింట్లో పెళ్లిచూపుల కార్యక్రమం ముగించుకొని భోంచేశాక పెళ్లి జరిగే ఫంక్షను హాలుకు వెళ్లిపోతాను, ముక్కుమూసుకునో, మరో గదిలోనో ఉండి స్వీట్లు చేసి వెళ్లిపోతాను. నాకింత సాయం చేసేవాడికి ఆ మాత్రం సహాయపడలేనా’’ అన్నాడు శ్యామశాస్త్రి.
‘‘నీకంత శ్రమ అక్కర్లేదు. మా ఆఫీసు పక్కనుండే వంట గదిలో నీకు వంట సరంజామా అన్నీ సిద్ధం చేయమని మా వాళ్లకు చెబుతాను. నువ్వు బాసుందీ, కేసరి, గులాబ్‌జాం అక్కడే చేసి ఇంటికెళ్లిపో. మా వాళ్లు అవి పెళ్లికి తీసికెళ్లిపోతారు’’ హుషారుగా చెప్పాడు మైనుద్దీన్.
‘‘డన్’’ బొటన వేలితో థంప్సప్ సైన్ చూపుతూ అన్నాడు శాస్త్రి.
ఇరవై అయిదో తారీఖు ఉదయం పంచెకట్టు, ఖద్దరు చొక్కా వీబూధి రేఖలతో బస్సులోంచి దిగిన మైనుద్దీన్‌ను ‘‘రండి, ప్రొద్దుటూరు పంతులు గారూ’’ అని సాదరంగా ఆహ్వానించారు రామకుప్పంలోని నిర్వాహకులు.
ఉదయం పదకొండింటికి ప్రారంభించిన మార్మండేయ పురాణ కాలక్షేపాన్ని సమయానుకూలంగా పద్యాలు, పాటలు, ఉదంతాలు, పిట్టకథలతో రంజింపజేస్తూ, అందరినీ తన వాగ్ధాటితో, పాండిత్య పటిమతో కట్టిపడేశాడు మైనుద్దీన్.
పుట్టపర్తి వారి శివతాండవంలోంచి ఆయన పాడిన పద్యాలకు ప్రేక్షకుల్లోంచి కొందరు ఆనందోత్సాహాలతో పైకిలేచి కేరింతలు కొట్టారు. పిట్టకథలు, జోకులకు కొందరు పడీ పడీ నవ్వారు. విషాద ఘట్టాల్లో మహిళలూ, పెద్దవాళ్లు కన్నీరు పెట్టారు. పద్యాలు పాడుతూ ఉంటే భక్తిపారవశ్యంలో అందరూ ఓలలాడారు. మొత్తానికీ పురాణ కాలక్షేపం ఆసాంతం విజయవంతం చేసి, భోజనం చేశాక మైనుద్దీన్ నిర్వాహకులిచ్చిన సంభావన తీసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించాడు.
ఆ రోజు రాత్రి పొద్దు పోయాక మైనుద్దీన్‌కు శాస్త్రి నుంచి ఫోన్ వచ్చింది.
‘‘చూస్తుంటే నన్నే మించిపోయేలా ఉన్నావే మైన్. నీ పాటలకూ, పద్యాలకూ జనాలు చప్పట్లు ఆపలేదట. శివరాత్రికి తప్పకుండా ఆయన్ని మా ఊరికి ప్రవచనం కోసం పంపండి అని ఇందాకే రామకుప్పం నుంచి నిర్వాహకుడు నరసింహం ఫోన్ చేశాడు’’ ఆనందంగా చెప్పాడు శ్యామశాస్త్రి.
‘‘నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా? నువ్వు చేసిన బాసుందీ, హల్వాలు జనాలు లొట్టలేసుకుంటూ తిన్నారట. ఈ బిజినెస్‌లో మాకు కాంపిటీషనౌతావా ఏంటి?’’ అని శాస్త్రిని అడిగాడు మైనుద్దీన్. శాస్త్రి గట్టి నవ్వాడు.
‘‘అన్నట్లూ, చెల్లెమ్మ కూతురి పెళ్లి చూపుల విషయం ఏమైంది?’’ కుతూహలంగా అడిగాడు మైనుద్దీన్.
‘‘గ్రాండ్ సక్సెస్, కట్నం లేకుండానే సంబంధం చేసుకుంటున్నట్లు ఇందాకే పెళ్లికొడుకు తండ్రి ఫోన్ చేసి చెప్పాడు’’ అన్నాడు శ్యామశాస్త్రి.
‘‘ఇంకేం! త్వరలోనే మాకు మరో పెళ్లి విందు ఉందన్నమాట’’ నవ్వుతూ అన్నాడు మైనుద్దీన్.
ఇద్దరు మిత్రులూ మనసారా నవ్వుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YS Sharmila: పార్టీ విలీనంపై సెప్టెంబరు 30లోపు నిర్ణయం
-
Supreme Court: సుప్రీం కోర్టులో అరుదైన ఘట్టం.. దివ్యాంగ న్యాయవాది కోసం సైన్ లాంగ్వేజ్ నిపుణుడు
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు