మనిషి

మణుగూరు నుంచి వచ్చే బస్సుకోసం ఎదురుచూస్తున్నాడు జయరామ్‌. అశ్వాపురం మండలం మొండికుంట బస్టాప్‌ అది. ఖమ్మం బస్సు కోసం అతని నిరీక్షణ. ఆవూళ్లో తమకు ఉన్న వ్యవసాయ భూముల పనుల నిమిత్తం ఉదయాన్నే...

Published : 02 Jul 2021 19:07 IST

- బద్దల రాజారాం
కథావిజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి (రూ.5 వేలు) పొందిన కథ

మణుగూరు నుంచి వచ్చే బస్సుకోసం ఎదురుచూస్తున్నాడు జయరామ్‌. అశ్వాపురం మండలం మొండికుంట బస్టాప్‌ అది. ఖమ్మం బస్సు కోసం అతని నిరీక్షణ. ఆవూళ్లో తమకు ఉన్న వ్యవసాయ భూముల పనుల నిమిత్తం ఉదయాన్నే ఇక్కడికి వచ్చాడు. సాయంకాలానికి పనులు ముగించుకుని ఆరుగంటలకు బస్టాప్‌కు చేరుకున్నాడు. తమ పొలం కౌలుకు చేసే పడిదం నారాయణతో ఇప్పటి వరకు మాట్లాడి తన సూచనలతో ముందు ముందు పొలానికి ఎలాంటి నీటిఎద్దడి సమస్య ఎదురవకుండా చేశాడు. ఈ సమస్యను అధిగమించేందుకు బాలనర్సయ్య బాబాయి సలహాలు... సహకారం బాగా ఉపకరించాయి.

దాదాపు ఏ బస్సు అయినా అశ్వాపురం హెవీవాటర్‌ ష్లాట్‌ గౌతమీనగర్‌ స్టాప్‌ వద్దనే నిండిపోతుంది. దేశంలోనే రెండోదిగా భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భారజల కర్మాగారం అది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తోన్న అతిపెద్ద కర్మాగారం ఖమ్మం జిల్లాకే మణిహారం లాంటిది. ప్లాంటులో పనిచేసే ఉద్యోగస్థుల రాకపోకలతో అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. సీట్లు దొరకడం కాదుకదా, ఒక్కోసారి నిలుచుని ప్రయాణం చేసేందుకు కూడా వీలుకాదు. ఈరోజు ఎలా ఉంటుందో మరి? ఇంకా చీకటి పడనందున అటువైపు నుంచి వస్తున్న ప్రతి వాహనం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చేది ఎక్స్‌ప్రెస్‌ బస్‌లాగే కనిపిస్తోంది. ఖమ్మం వెళ్లేదే అయి ఉంటుందని, కూర్చున్నవాడల్లా లేచి నిలుచున్నాడు జయరామ్‌.

ఇద్దరు, ముగ్గురు ప్యాసింజర్లు అతనితోపాటే లేచి నిలుచున్నారు. స్టేజీ వద్ద ఆగింది బస్సు. తను ఊహించినట్లుగానే అది ఖమ్మం బస్సే. దిగే వారు ఎవరూ లేరు. లోపల అంతా నిలుచునే ఉన్నారు. సీట్లుకాదు కదా, నిలుచునేందుకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు వెళ్లాల్సిందే! ఇప్పటికే సమయం ఆరుదాటి అరగంట కావస్తోంది. ఇక్కడి నుంచి మూడు గంటలు ప్రయాణం చేస్తేగాని ఖమ్మం చేరుకోలేం. అంటే ఇంటికి చేరేసరికి దాదాపు రాత్రి పది అవుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా బస్సెక్కాడు జయరామ్‌. పాల్వంచ వరకు ఎవరూ దిగరు. అక్కడి వరకు నిలుచుని ప్రయాణించాల్సిందే! అరగంట పైనే పడుతుంది. టికెట్‌ తీసుకుని కండక్టర్‌ సీటు పక్కనే బస్సు వెళ్లేదారికి అభిముఖంగా నిలుచున్నాడు జయరామ్‌. అడవి దాటి భద్రాచలం, క్రాస్‌రోడ్‌ చేరింది బస్సు. ముసలిమడుగు చేరేసరికి భద్రాచలం వెళ్లే రెండు బస్సులు ఎదురయ్యాయి. ఒకప్పుడు అక్కడి వరకు దట్టమైన అడవి ఉందేది. ఇప్పుడంతా మైదాన ప్రాంతంగా తయారైంది. లక్ష్మిపురం నుంచి ఆముదాలబంజర వరకు చిన్నచిన్న పరిశ్రమలతో ఓ పారిశ్రామికవాడలా తయారైంది.

పెద్దగా రొద చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది బస్సు. ఎవరి ఆలోచనలలో వారు ఉన్నారు బస్సులోని ప్యాసింజర్లంతా! సీట్లలో కూర్చున్న వారు హాయిగా కళ్లు మూసుకుని ఉన్నారు. నిలుచున్నవారు అటూ ఇటూ సర్దుకుంటూ పాల్వంచ ఎప్పుడొస్తుందా? అనుకుంటూ అసహనంగా కదులుతున్నారు. అలాంటి వారిలో తనూ ఒకడు.

అతనికి అభిముఖంగా నిలుచున్న మహిళ తనవైపు చూస్తున్నట్టుగా అనిపించిందతనికి! దాదాపు బస్సు మధ్యభాగంలో కడ్డీని ఆనుకుని నిలుచుందామె. ఆమె వైపు ఒకసారి పరికించి చూశాడు జయరామ్‌. వయసు నలభై అయిదుకు ఇటు ఇటుగా ఉంటుందేమో! చూడగానే దృష్టిని ఆకర్షించే రూపం ఆమెది! మనిషి తెల్లగా, గుండ్రని మోము, నుదుటన అందమైన బొట్టు, అందమైన చీరకట్టు, వేషధారణ, నాగరికత ఉట్టిపడేలా ఉంది ఆమెరూపం! తిరిగి ఆమె అతని వైపు చూసింది. మొదట ఆమె తననెందుకు చూస్తుంది అనుకున్నాడు కానీ.. ఆమె తనను చూస్తున్నది నిజమే! పాల్వంచ చేరేసరికి కనీసం ఓ నాలుగైదుసార్లు అయినా అతనివైపు చూసి ఉంటుందామె! తనూ ఆమెను చూస్తున్నాడు!

ఆకర్షణీయమైన అలంకరణ. ఏదో శుభకార్యానికి వెళ్లి వస్తున్నట్టుగా ఉంది. ఆమె గురించి అతను ఆలోచిస్తున్నాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. ఇది వరకు ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా తనవైపు పదేపదే చూస్తోందామె. తను ఆమె చూపు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు అనడం కంటే అందమైన ఆమె రూపం నుంచి దృష్టి మరలించలేక పోతున్నాడని అనడం సబబు!

బస్సు పెద్దమ్మగుడి సమీపిస్తోంది. ఇంకో పది నిమిషాల్లో పాల్వంచ వస్తుంది. దిగాల్సిన వారు సర్దుకుంటున్నారు. ఆమె నిలుచున్న ప్రక్కనే త్రీసీటర్‌ ఖాళీ అవుతున్నది. దానిలో కూర్చున్నవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారులా ఉంది. జయరామ్‌ అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను నిలుచున్న చోటు నుంచి ఎవరూ దిగేటట్లుగా లేరు. తనూ తొందరపడి వెనుక వైపున ఖాళీ అవుతున్న సీట్లలో ఏదో ఒకటి రిజర్వు చేసుకోవాలి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యపడటంలేదు. దిగేందుకు వస్తోన్న ప్రయాణికులకు దారి ఇవ్వడంతోనే సరిపోతోంది. పాల్వంచలో బస్సు ఆగింది.

బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టారు. చేతి రుమాళ్లు, ఇతరత్రా చిన్నచిన్న వస్తువులను ఖాళీ అవుతున్న సీట్లలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పై నుంచి (మొండికుంట) వస్తోన్న తనకు అవకాశం లేకుండా పోతోంది. ఎలా? కొత్తగూడెం చేరితే తప్ప సీటు దొరకదేమో! ఇంకో పావుగంటకు పైగానే నిల్చోవాలేమో అన్న నిర్ణయానికి వచ్చాడు జయరామ్‌.

దాదాపు పదిహేనుమంది దిగినట్లున్నారు. చేతిరుమాళ్లు, వాటర్‌బాటిళ్లు పరచిన వాళ్లు సీట్ల కోసం ఆతృతతో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగేవాళ్లకు ఇబ్బందిగా ఉంది. ఎవరి హడావుడిలో వారు! ఆమె నిలుచున్న పక్కసీటు మొత్తం ఖాళీ అయింది. అప్పటికే కిటికీ పక్కన సీటుకోసం కింద నిలుచున్న వ్యక్తి ఆమెతో వాదులాడుతున్నాడు. ఆమె అతనితో గట్టిగానే మాట్లాడుతోంది. పక్క సీటులో ఇప్పటి వరకు ఆమెతో పాటే నిలుచున్న వ్యక్తి కూర్చున్నాడు. ఒక్క సీటును ఆమె అట్టిపెట్టింది.

‘‘మా మనుషలే, మావాళ్లే ఉన్నారు..’’ అంటూ వాదులాడుతోన్న వ్యక్తిని అదమాయించిందామె. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరుగుతుండటంతో ముందుకు కదిలాడు జయరామ్‌.

‘‘మీ వాళ్లు ఎవరో చూపండి?..’’ మొండిగా వాదులాడుతున్నాడు కింద నిలుచున్న వ్యక్తి.

‘‘నీకు చూపించాల్సిన అవసరం లేదు. ఉన్నారు. అంతే!..’’ అతణ్ని గదమాయిస్తూ జయరామ్‌ వైపు చూసి ఇటు రమ్మన్నట్లుగా సైగ చేసిందామె.

అతనికి అంతా అయోమయంగా ఉంది. ఏంటీ? ఈమె నా కోసం సీటు రిజర్వు చేసి కూర్చొనేందుకు రమ్మంటుంది! అంతా కలలాగ ఉందే! మనసులోనే అనుకుంటూ సీటు దగ్గరికి చేరాడు. విండో సీట్లో ఆమె కూర్చుంది. ఆమె పక్కనే తను... 
‘‘ధ్యాంక్స్‌ అండీ. నాకోసం చాలా శ్రమతీసుకున్నారు’’ మర్యాదగా ఉంటుందని మాట కలిపాడు.
ఆమె నుంచి జవాబు లేకపోవడంతో ఇబ్బంది పడి ఇంకాస్త ఒదిగి కూర్చున్నాడు.
‘నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా. లేదే’ మనసులోనే అనుకున్నాడు. కాసేపు అక్కడ మౌనమే రాజ్యమేలింది. 
కళ్లు మూసుకుని కూర్చుందామె. ఆమె నుంచి సెంటు వాసన అతని ముక్కు పుటాలను తాకుతోంది. ఎంత ఒదిగి కూర్చున్నా ఒకరినొకరు తాకుతూనే ఉన్నారు. ఆ స్పర్శ తాలూకూ అనుభూతి అతణ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది! ఆమె అదంతా ఏమీ పట్టనట్టుగా కళ్లు మూసుకునే ఉంది. తను ఎంత ఒదిగి కూర్చున్నా బస్సు కుదుపులకు ఆమెను స్పృశిస్తూనే ఉన్నాడు. ఆ స్పర్శ ఒకింత ఇష్టంగా అనిపించినా... మర్యాద కాదు అని మనసు హెచ్చరిస్తున్నా.. ఆమెను గమనిస్తూ ఆమె అంతరంగాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు జయరామ్‌.
‘మంచి మనసుతో సాయం చేసిన వ్యక్తి గురించి ఏదేదో ఆలోచించడం తప్పుకాక మరేంటి?’ మనసులో ఎలాంటి వికార భావాలు రాకుండా ఉండేందుకు తనూ కళ్లు మూసుకున్నాడు జయరామ్‌.
కాసేపట్లో ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వచ్చింది. అక్కడ కొంతమంది దిగారు. బస్సు రెండు నిమిషాలు ఆగిందో లేదో ఉక్కపోత. కళ్లు తెరిచింది ఆమె. ఒదిగి కూర్చున్న అతణ్ని చూస్తూ ‘‘మంచిగా, సౌకర్యంగా కూర్చోండి...’’ అంటూ మొదటిసారిగా పెదవి విప్పింది.
‘‘ఫర్వాలేదండి.. సౌకర్యంగానే ఉన్నాను’’ అన్నాడు. 
‘‘నాకలా అనిపించడంలేదు..’’ మోముపై సన్నని చిరునవ్వు
నవ్వుతూ చక్కగా మాట్లాడుతోంది! తెల్లని పలువరుస. ఆ నవ్వులో ఇంకా అందంగా కనపడుతోంది! తనను తాను ఒకసారి చూసుకున్నాడు జయరామ్‌. ఆమె అందం, వేషధారణ ముందు తనెంత? ఒక్కసారిగా అతనిలో న్యూనత భావన. ఆమెను చూసి తనెందుకు ఇలా కుంచించుకుపోవాలి? సృష్టిలోని ప్రాణులన్నింటినీ ఆ భగవంతుడే సృష్టించాడు. అందమైన వాటిని అతడే సృష్టించాడు. అలాగే అందం లేని వాటిని సృష్టించాడు. అందరం ఆ భగవంతుడికి ఇష్టులమే! అలాంటప్పుడు నేనెందుకు తక్కువి అని భావించాలి? సృష్టిలో దేని అందం దానిదే! అలాగే నేను, ఆమె కూడా! తను మాట్లాడకుండా ఉంటే ఆమె ఇంకో విధంగా భావించే ప్రమాదం ఉందని..
‘‘మీరు మణుగూరు నుంచి వస్తున్నట్లున్నారు?’’ అన్నాడు.
‘‘లేదు అశ్వాపురం నుంచి. అక్కడి నుంచి పాల్వంచ వరకు నిలుచుని రావాల్సి వచ్చింది’’
‘‘అశ్వాపురంలో ఎవరున్నారు? ఏదైనా శుభకార్యానికి వెళ్లొస్తున్నారా?’’
‘‘అలాంటిదే అనుకోండి! మీరు మొండికుంటలో ఎక్కినట్లున్నారు?’’
‘‘అవును. మీరు బాగానే గుర్తుంచుకున్నట్లున్నారు’’
‘‘చూశాను కదా! అక్కడ ఎవరున్నారు మీకు? ఏదైనా పనిమీద వచ్చారా?’’
‘‘అక్కడ మాకు వ్యవసాయభూములున్నాయి..’’
‘‘అంటే వ్యవసాయ పనులు చూసేందుకు వచ్చారన్నమాట!’’
‘‘అవును. ఇంతకూ మీరు అశ్వాపురం ఎందుకొచ్చారో చెప్పలేదు’’
‘‘మా బంధువుల్లో ఒకరు అక్కడ మెడికల్‌ షాపు పెట్టారు. దాని ప్రారంభోత్సవానికి వచ్చాను’’
‘‘అలాగా! ఏదో శుభకార్యానికి వచ్చి ఉంటారని భావించాను. ఇంతకీ మీరు ఖమ్మంలోనే ఉంటారా?’’
‘‘లేదు. రాజేశ్వరపురం. మరి మీరు?’’
‘‘ఖమ్మంలోనే! ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్‌ అయ్యాం’’
‘‘ఉద్యోగం అంటున్నారు, ఏ డిపార్టుమెంట్‌లో చేస్తున్నారు?’’
‘‘టెలీకమ్యూనికేషన్స్‌’’
‘‘మీదేమైనా ఫీల్డ్‌ వర్కా’’
‘‘ఎందుకని అలా అడగుతున్నారు? లేదు. అడ్మినిస్ట్రేటివ్‌ బ్రాంచి. పెన్షన్‌ సెక్షన్‌లో పనిచేస్తాను’’
‘‘మా ఇంట్లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌ నెలలో రెండురోజులు పనిచేస్తే మహా ఎక్కువ. ఈ సెల్‌ఫోన్‌ లేకుంటే పరిస్థితి ఎలా ఉందేదో!’’
‘‘ఫీల్డ్‌ సిబ్బందికి చాలా సమస్యలుంటాయండీ! ఫాల్టులు అటెండ్‌ అయ్యేందుకు కావాల్సిన పరికరాలు, వస్తువులు సకాలంలో అందవు’’
‘‘వాళ్లు సరిగా పనిచేయరు అని మాత్రం అనరు! ఎంతైనా మీ మనుషులు కదా!’’
‘‘అలా అని కాదు. మీరన్నట్లు కొంతమంది ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు కదా!’’
‘‘అది సరే. ఇంతకూ ఖమ్మంలో మీరుందేది ఎక్కడ?’’
‘‘బైపాస్‌రోడ్‌, విజయనగర్‌ కాలనీ’’
‘‘అద్దె ఇల్లా. సొంత ఇల్లా?’’
‘‘సొంత ఇల్లేనండీ’’
ఆమె సంభాషణ కొనసాగిస్తూనే ఉంది. తన గురించిన వివరాలన్నీ అడిగింది. ఎంత రిజర్వుగా ఉంటుందో అనుకున్నాడు. చాలా కలివిడిగా మాట్లాడుతోంది! బస్సు సుజాతనగర్‌ దాటి ముందుకు సాగిపోతోంది.
దాదాపు ఇరవై నిమిషాల పాటు వారి మధ్య మౌనమే రాజ్యమేలింది. జూలూరుపాడులో కొంతమంది దిగి, మరికొంత మంది ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజువారీగా అప్‌ అంద్‌ డౌన్‌ చేస్తుంటారు కాబట్టి బస్సు నిండిపోయింది. ఇంకా కొంతమంది నిలుచునే ఉన్నారు. చాలా సేపటి నుంచి కూర్చుని ఉన్నందున కాస్తంత ఉపశమనం కోసం సీటు వెనక్కి వాలి ఉన్న ఆమె ముందు సీటుపై తలవాల్చేందుకు జరిగి కూర్చుంది, భారంగా ఊపిరితీసుకుంటూ..! ఆమె విడిచే శ్వాస అతని భుజానికి తాకింది. తనూ ఒకింత సర్దుకుని కూర్చున్నాడు.
‘‘ఏది ఏమైనా ఇంత దూరం బస్సులో ప్రయాణం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనేనండి’’ పెదవి విరిచింది ఆమె.
‘‘అవునండీ! కానీ మనకు వేరే అవకాశం లేదు కదా?’’
‘‘అదిసరే! మీరెప్పుడైనా విమాన ప్రయాణం చేశారా?’’
‘‘లేదు. ఎందుకని అలా అడుగుతున్నారు?’’
‘‘ఏం లేదు ఊరికే!’’ ముసిముసిగా నవ్వింది.
నవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో అతనికి అర్థంకాలేదు!
‘‘విమాన ప్రయాణం చేసే ముఖమా ఇది?..’’ అని తనను తక్కువ చేసి చూస్తున్నదేమో!
తిరిగి అతనిలో ఆత్మన్యూనతా భావం! ఆ మరుక్షణంలోనే తేరుకుని, ‘‘మీరేమైనా చేశారా..?’’ అనడిగాడు.
‘‘చేశాను. మా అబ్బాయి యూఎస్‌లో జాబ్‌ చేస్తున్నాడు’’
‘‘అలాగా! చాలా అదృష్టవంతులు మీరు’’
ఏన్మూరు స్టేజీ వచ్చినట్లుగా ఉంది. కండక్టరు కేకలు వేస్తున్నాడు. నలుగురైదుగురు దిగారు. ఒక్కరు మాత్రమే ఎక్కారు. తిరిగి బస్సు కదిలింది. రోడ్డంతా గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉండటంతో భారీ కుదుపులతో ముందుకు సాగుతోంది బస్సు. అదే స్పర్శ. అదే అనుభూతి అతనిలో!
ఆమె చాలా సౌకర్యంగా కూర్చుని ఉంది. ఆమెలో ఎలాంటి భావనలు లేనట్లుగా ఉంది. పరాయి వ్యక్తి తన పక్కన కూర్చున్నాడన్న బెరుకు గాని, వేరే భావనగాని ఉన్నట్లుగా లేవు! మరి తనే ఎందుకంతలా స్పందిస్తున్నాడు? తప్పుగా ఆలోచిస్తున్నాడా? 
టికెటింగ్‌ అయిపోవడంతో బస్సులోని లైట్లు తీశాడు డ్రైవరు. చుట్టూ చిక్కని చీకటి. దాదాపు సమయం రాత్రి ఎనిమిదిన్నర కావస్తోంది. తల్లాడ సమీపంలో ఉంది బస్సు. చీకట్లో సర్దుకుని కూర్చున్నారు ఇద్దరూ. ఒకరి భుజాలు ఒకరికి తాకుతున్నాయి. ఆమె మేని నుంచి వెలువడుతున్న సువాసనలను అతడు ఆస్వాదిస్తూనే ఉన్నాడు. నిద్రే వచ్చిందో, లేక కావాలని అలా చేసిందో తెలియదుగానీ అతని భుజంపై తలవాల్చింది ఆమె. అతనిలో మళ్లీ సంఘర్షణ. ఆమెను అంచనా వేయడం తనవల్ల కావడంలేదు. ఆ స్పర్శ అతనికి ఇష్టంగా అనిపిస్తోంది. అది తప్పో? ఒప్పో? అనే విషయం ఇపుడతని స్ఫురణకు రావడంలేదు. ఆమెను అలాగే తన భుజంపై తలవాల్చి ఉండనీయడం తప్ప అతను చేసేది ఏమీ లేదు! తల్లాడ బస్టాండ్‌ లోపలికి వెళుతూనే లైట్లు ఆన్‌చేశాడు డ్రైవర్‌. మెల్లిగా సర్దుకుని కూర్చుంది ఆమె. 
రెండు నిమిషాల్లో తిరిగి బస్సు కదిలింది. ఇక వైరా దాటితే ఖమ్మం వస్తుంది. ఏంటో ఈసారి ఖమ్మం చాలా తొందరగా చేరుకుంటున్నట్లుగా అనిపిస్తోందతనికి! సమయం తెలియడం లేదు. మూడు గంటలు కూర్చుని ఉండాలంటే ఎంతో కష్టంగా, అసౌకర్యంగా, ఇంకెప్పుడు ఖమ్మం వస్తుందా అనిపించేది! ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలనిపించింది జయరామ్‌కి.
‘‘చాలా అలసిపోయినట్లుగా ఉన్నారు. నిద్రలోకి జారుకున్నారు’’
‘‘దూర ప్రయాణం కదా. అలసిపోవడం మామూలే!’’
‘‘మీది రాజేశ్వరపురం అన్నారు కదా. మీ ఊరి పక్కనే షుగర్‌ ఫ్యాక్టరీ ఉంది కదా. మీకు అక్కడ వ్యవసాయ భూములున్నాయా?’’
‘‘ఓ పాతిక ఎకరాల మాగాణి ఉంది’’
‘‘అయితే పెద్ద వ్యవసాయమేనన్న మాట. మంచి స్థితిమంతులే!’’
‘‘ఒకరకంగా అలాగే అనుకోండి. అయినా ఇవన్నీ మన వెంట వస్తాయా? ఉన్నంత సేపు నాది నాది అనే ఆరాటమే తప్ప..’’
‘‘మానవ నైజం అది!..’’ నిర్వేదంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు జయరామ్‌
బస్సు వైరా దాటి కొణిఖర్ల సమీపం చేరింది. ఇంకో పదీ పదిహేను నిమిషాల్లో ఈ ప్రయాణం ముగుస్తుంది. ఇప్పటి వరకు తను ఆమె పేరు అడగలేదు. ఆమె కూడా తనను అడగలేదు. అవసరం అనిపించలేదేమో! ఉద్యోగం.. నివాసం.. అన్నీ అడిగిన ఆమె తన పేరును మాత్రం అడగలేదు ఎందుకనో? ఏదో కోల్పోతున్నానన్న వెలితి అతనిలో! ఆమె పేరును తెలుసుకోవాలన్న తపన. మనిషి అందంగా ఉంది కదా. పేరు కూడా అందంగానే ఉండవచ్చు. అడిగితే ఏమనుకుంటుందో? సభ్యతగా ఉంటుందో లేదో! ‘పిరికివాడా! దాదాపుగా మూడు గంటల నుండి ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నావ్‌! ఎంతో కలివిడిగా ఉన్న ఆమె తన పేరును అడిగితే నొచ్చుకుంటుందేమోనన్న సందేహమా? నీ మనసులో ఇంకేందో దాస్తున్నావ్‌! అందుకే అంతగా భయపడుతున్నావ్‌. నిజంగా నువ్వు పిచ్చోడివే! నువ్వేమీ చెయ్యలేని అసమర్థుడివి’ మనసు పరిహసిస్తోంది. 
‘నీ పేరు ఆమె అడగనప్పుడు ఆమె పేరుతో నీకేం అవసరం? పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కనబెట్టి ఓ సంస్కారవంతుడిగా ప్రవర్తించు’ మనసు హెచ్చరించింది.
‘‘తొమ్మిదిన్నర కావస్తోంది కదండీ. ఇప్పుడు ఎలా వెళతారు మీరు ఊరికి’ పలకరించాడు.
‘ఏదో ఒకలా! రాత్రి అయితే వెళ్లలేనా ఏంటి?’’ అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు.
‘‘నాకు తెలిసి ఆ రూటులో ఈ సమయంలో బస్సులు ఉన్నట్టుగా లేవు. ఇబ్బంది పడతారేమోనని..’’ ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయాడు అతను.
‘‘ఇబ్బంది పడితే మీకు బాధగా ఉంటుందా ఏమిటి?’’
‘‘సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే బాధగా అనిపించదా మరి!’’
‘‘ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానని మీకు చెప్పానా? ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయారు’’
‘‘రాత్రి అయింది కదా. మీరు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్లాలి కదా. ఎలా వెళతారోనన్న ఆందోళన...’’
‘‘అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదులెండి! మీరేమైనా ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారా?’’ అతని వైపు అదోలా చూస్తూ అంది ఆమె.
క్షణకాలం తలదించుకున్నాడు. ఏమైనా అతిగా మాట్లాడానా? మానసిక సంఘర్షణ. మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది.
ఆమె చూపులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడంలేదు! ఏమనుకుందో ఏమో, తిరిగి ఆమే మాట్లాడింది.
‘‘ఏవండీ’’... నిర్లిప్తంగా ఆమె వైపు చూశాడు జయరామ్‌, ఏం చెబుతుందోనని!

‘‘అశ్వాపురం నుంచి బయలుదేరేటప్పుడే మా వారికి ఫోన్‌ చేశాను. ఖమ్మంకు కారు పంపించమని, ఈ సమయానికి వచ్చే ఉంటుంది. హాయిగా ఇంటికి చేరుకుంటాను...’’ అందంగా నవ్వింది.

‘‘అయితే సంతోషం’’ తనలో తను గొణుక్కున్నట్టుగా అతను.

మనసును పరిపరి విధాలుగా పరుగెత్తించి ఏవో సుందర తీరాలకు పయనిస్తున్నామన్న భావన కలిగించిన ఆమె క్షేమంగా ఇంటికి చేరుతుందన్న విషయం తెలిసి మనసు ఒకింత కుదుటపడిందతనికి. కానీ అతనిలో ఏదో వెలితి, తన ఆత్మీయులు ఎవరో తన నుంచి దూరంగా వెళ్లిపోతున్నారన్న భావన! అంతకుమించి ఏదో మనసుకందని అస్పష్టమైన వేదన! ఆమెతో కలిసి ప్రయాణం చేసిన ఈ మూడు గంటల సమయంలోనే ఎన్నెన్ని అనుభూతులు! ఆ స్పర్శ.. ఆ కలుపుగోలుతనం.. ఆ చొరవ.. అన్నింటినీ మించి అందమైన ఆమె రూపం!

మనసు తెరల చాటున... మనోవికారాల మాటున దాగిన మరో మనిషిని సున్నితంగా హెచ్చరిస్తూ ‘మనిషి’గా ఉండమని, మనమంతా అలా ఉంటేనే ఈ సృష్టి మరింత అందంగా కలకాలం ఉంటుందని ఉద్బోధించినట్లుగా ఉంది ఆమె అందమైన నవ్వు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని