మళ్ళీ మామూలే..

ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదుగానీ మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగుల్తోంది. వాన వెలిసినట్టుంది. ఏం వాన. మూడ్రోజుల్నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే..

Updated : 02 Jul 2021 20:08 IST

- తంగెళ్ల రాజగోపాల్‌
కథా విజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదుగానీ మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగుల్తోంది. వాన వెలిసినట్టుంది. ఏం వాన. మూడ్రోజుల్నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప. లేచీ లేవగానే హడావుడిగా వంటింట్లోకొచ్చేశాను. మా ఇంటి తర్వాత రెండు ఖాళీ స్థలాలు, ఆ అవతల కంకర్రోడ్డుకి ఆనుకుని వెంకటరత్నం పాక. దానవతల పోలిశెట్టోరి తోట. మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది. 

‘‘మళ్లీ ఏమీ చేసుకోలేదు కదా’’ అన్నాను వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్న అమ్మతో. 

‘‘ఊహూ...లేదులే’’ అంది.  

‘‘అయితే రాత్రి చేసుకుందనే అంటావా?’’

‘‘ఏమో. మొహం కడుక్కునిరా. కాఫీ తాగుదూగాని’’ అంది అమ్మ.

మొహం కడుక్కుందామని బ్రష్షు పట్టుకుని నూతి పళ్లెం దగ్గరికి వెళ్లగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ల ముందు కదలడం మొదలుపెట్టింది. రాత్రి ఎనిమిది అయ్యుంటుందేమో. పొద్దున్నుంచీ రాస్తున్నాను కోడ్‌. అంతా బానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్‌ ఉంది. ఇక ఇవాళ దొరకదు అని అర్థమయిపోయింది నాకు. 

అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది. ‘‘పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందిట’’

‘‘ఆ..ఆ..’’ అంటూ సిరికింజెప్పడు పద్యంలోలాగా, ఎక్కడివి అక్కడ వదిలేసి హాల్లోకి ఒచ్చేశారు ఇంట్లో అందరూ.

‘‘ఎలా. ఎప్పుడూ. ఉందా, పోయిందా?’’ ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు తాతగారు చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకుని. 

‘‘ఏమో. పక్కతోట్లో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటీ హడావుడి అని వంటింట్లోంచి బయటికెళ్లేను. అప్పుడంది లక్షింగారు, ముసలమ్మ నూతిలో పదిపోయిందంటండీ బాబా’’ అని.

పోలిశెట్టోరి తోటలో టార్చిలైట్లు పరిగెడుతున్నాయ్‌. వర్షం అలా తెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. గొడుగులేసుకుని గుమిగూడారు పాక చుట్టూ జనం. 

నేనూ నాన్నా చెరో గొడుగూ పట్టుకుని అక్కడిదాకా వెళ్లాం. అప్పటికే పెద్ద మగాళ్లు ఇద్దరు నూతిలోకి తాడు దింపారు.  

‘‘ఇదిగో... ఓయ్‌... తాడు.. తాడు.. పట్టుకో.. లాగేత్తాం... ఏవవ్వదు.. బయపడకా.. తాడట్టుకో’’ అని కేకలేస్తున్నారు. 

‘‘ఇది జరిగే పనికాదు. నిచ్చెనేసుకుని నూతిలోకి దిగాల్సిందే’’ అని పోలిశెట్టోరి పెదబాబు వాళ్లు నిచ్చెన కోసం పెద్దింట్లోకి పరిగెత్తేరు. ఆడామగా, పిల్లాజల్లా వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు. లోపల ముసలమ్మ ఎలా ఉందో, ఏవైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ. అసలే నూతిలోకి మాట వినపడదు. లోతెక్కువ. దానికి తోడు ముసలమ్మకి చెవుడు కూడా. ఇంకోపక్క కుండపోతకింద వర్షం. 

ఎలాగరా దేవుడా అని కంగారుపడుతుంటే, ఎలా పట్టుకుందో ఏమోగానీ మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడుపట్టుకుంది. ‘‘అంతే.. గట్టిగా పట్టుకో.. గట్టిగా’’ అంటూ ఒక్క దెబ్బలో లాగి ఇవతల పడేశారు కాపుల కుర్రాళ్లు నలుగురు. 
‘‘బతికే ఉంది. హమ్మయ్య’’ అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు అందరూ. 

ఆడాళ్లు నలుగురు ముసలమ్మని లోపలికి తీసుకెళ్లి కాస్త పొడిబట్ట అదీ కట్టి ఊరుకోబెట్టేరు. 

‘‘పడిపోయావా చీకట్లోనీ? ఏం కంగారుపడకా. మేమున్నాం కదా. ఏడమాకా. అయ్యో... ఎందుకూ? ఊరుకో. ఊరుకో..’’ అని కాస్త ధైర్యం చెప్పేరు.

అప్పటి దాకా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆఖరి బంతి చూస్తున్న వాళ్లలాగా ఉగ్గబట్టుకుని ఉన్న జనం కాస్తా ముసలమ్మ బతికేసింది అని తెలియగానే, ఉన్నట్టుండి సీఐడీ ఏజెంట్ల అవతారాలు ఎత్తేరు. 

‘‘నిజంగా పడిపోయిందంటారా...?’’ అని మెల్లిగా తుప్పలో నిప్పు రాజేశారు వెనకింటి రిటైర్డు పోస్టు మాస్టారు.

‘‘అబ్బే, దూకితే బతకరండే. పొడిపోయుంటాది. అసలే నుయ్యి నేల మట్టానికి ఉంటాది కదా. గోడా అయ్యీ ఏంలేవు. చీకట్లో ఆనుండదు పాపం’’ అన్నాడింకో ఆయన. 

‘‘దెబ్బలు గట్టిగానే తగిలుంటాయ్‌. లోపల ఒరలు అయీ గీసుకుపోయినియ్యి. చేతులూ కాళ్లూ బాగా కొట్టుకుపోయినియ్యి’’ ఇవీ గొడుగుల కింద జనాల మాటలు.

అంతలో లక్షింగారు వాళ్ల ఆయన జనంలోకొచ్చి ‘‘ఇందాక, మాయమ్మగారిని దింపి ఇలా తోటమ్మటి నడుచుకుంటా ఒత్తంటే సన్నగా ‘అమ్మో ...బాబో...’ అని మూలుగినిపించిందండే. ఎక్కడా ఏటీ.. అనీ అటూ ఇటూ పరిగెత్తి చూత్తే అప్పుడర్థమైందండి నూతి కాడ్నుంచి అనీ. గబగబా ఒచ్చి నూతిలోకి చూత్తే అందులో ఈ ముసల్ది పడిపోయి ఉంది. పాపం కాళ్లు గోడకి తన్నిపెట్టుకుని అలా నిలబడి ఉంది’’ అప్పుడింక పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారినీ ఆళ్లనీ పిలిచేనన్నమాటింక. కాళ్లు దడొచ్చేయండి బాబ..’’ అంటూ చెప్పుకొచ్చాడు. 

‘‘ఇంకా నూకలు ఉన్నాయండి ముసల్దానికి. లేకపోతే ఇంత చీకట్లో, ఇంత వానలో ఈ పక్కకి ఎవడొత్తాడు. మీరుగాని సూసుండకపోతే అంతే సంగతి. అనకూడదుగానీ పొద్దునకి శవమై తేలేది పైకి’’ అని అనకూడనిది కాస్తా అనేసి లెంపలేసుకున్నాడో పెద్దమనిషి. 

‘‘కుర్చోపెట్టి పింఛను ఇస్తుంది గవర్నమెంటు. తిండికీ బట్టకీ లోటు లేదు. అసలంత దూకాల్సిన అవసరమేమొచ్చిందండీ?’’ అని మళ్లీ పాయింటుని ఆయనకి కావల్సిన చోటకి తీసుకొచ్చాడు పోస్టు మాస్టారు.  

‘ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేహిందంటారేంటండే?’’ అని నిలదీసేడు లక్షింగారు వాళ్లాయన.

‘‘దాని చిన్నప్పట్నుంచీ ఈ దొడ్లోనే పెరిగింది. ఆ నూతికెప్పుడూ గోడలేదు. ఇయాల కొత్తా ఏటి చీకటీ, వానా? ఎప్పుడైనా పడిందేటీ. ఇడ్డూరం కాపోతే’’ అని మళ్లీ నసుగుతున్నాడు పోస్టు మాస్టారు.

‘‘నీతో వాదించలేమయ్యా బాబు. తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావ్‌ నువ్వు’’ అని నలుగురూ ఓ గదుము గదిమేటప్పటికి ఇంక నోరు మూసేశాడు. ఇది ఇప్పుడప్పుడే తెమిలే పంచాయితీ కాదని నేనూ నాన్నా ఇంటికి ఒచ్చేశాం. 

గుమ్మంలో అడుగెట్టగానే  ‘‘ఏరా  ఏమైంది. లాగేరా బయటకీ. ఉందా పోయిందా. ఆ..?’’ అని మళ్లీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు.  

నాకు చిర్రెత్తుకొచ్చి ‘‘ఎందుకు అంత కంగారు? చెప్తాం కదా. ఉంది. బతికింది. పోలేదు. చాలా’’ అన్నాను. 

‘‘రేయ్‌ తప్పు’’ అన్నట్టు సైగ చేశారు నాన్న. 

‘‘లేకపోతే ఏంటి నాన్నా?’’ అని మళ్లీ గింజుకున్నాను.

ఈ అరుపులు విని ఈలోపు మా మామ్మ ఒచ్చేసింది ‘‘ఏంటీ ఏవైందీ?’’ అంటూ.

మా మామ్మకి ఓ ఎనభై అయిదు ఉంటాయ్‌. మామూలు చెవుడు కాదు. బ్రహ్మచెవుడు.

‘‘ముసలమ్మ.... పాకలో ముసలమ్మ.. నూతిలో పడిపోయిందిట..’’ అని అరవడం మొదలెట్టేరు తాతగారు, ఆవిడకి మొదలుకాడ్నుంచీ మళ్లీ చెప్తూ.

‘‘అయ్యెయ్యో. ఏలాగ మరిప్పుడు. మీరు దిగి తీయండి. వెళ్లండి’’ అంది మామ్మ.
‘‘నేనా! నేను దిగితే ఇంక రాను. నన్ను లాగడానికి నువ్వు గానీ రావాలి’’
‘‘ఇవాళ పొద్దునే కదా, కుళాయి నీళ్లు పట్టుకోడానికి వచ్చింది మనింటికి. అంతలోనేనా?’’ 
‘‘ఆ.. అంతలోనే లేదు.. ఇంతలోనే లేదు.. క్షణం చాలు పుట్టినా గిట్టినా...’’
‘‘ఇంతకీ తీశారా లేదా?’’ 
‘‘హా. తీశారు. బానే ఉందిట. అదిగో నీ మనవడు చెప్పేడు కదా...’’ ఇలా సాగుతోంది వాళ్లిద్దరి సంభాషణ.
‘‘మీరు అరవకండి బాబూ’’ అని అమ్మ చెప్తూనే ఉంది. తాతగారూ, మామ్మా వాళ్ల మానాన వాళ్లు మాటాడుకుంటూనే ఉన్నారు.
‘‘స్నానాలు చేసి రండి. భోజనాలు పెట్టేస్తాను’’ అంది అమ్మ.
‘‘పెద్దాళ్లవి అయిపోయాయా?’’ అనడిగారు నాన్న.
‘‘లేదు. మీరు ఒచ్చేక చేస్తాం అన్నారు. రండి గమ్ముని’’ అంది మళ్లీ.
గబగబా రెండు చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేశాం నేనూ నాన్నా. భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్లీ ముసలమ్మ గురించే మాటలు. ‘‘ఒకప్పుడు ఆ పాకచుట్టూ అరెకరం పొలం దాని పేరనే ఉండేదిట’’ అని మొదలెట్టేరు తాతగారు. ‘‘పొలమా?’’ అని ఆశ్చర్యపోతూ అడిగా నేను. 
‘‘ఇవన్నీ పొలాలే మరి ఒకప్పుడు. ఇక్కడ్నుంచీ మన వీధి చివర కాలవ దాక పొలాలే. తర్వాత్తర్వాత ఇళ్ల స్థలాలైపోయాయ్‌’’  అన్నారు నాన్న. 
అంతలో తాతగారు మళ్లీ ‘‘ఎప్పుడో పదహారేళ్లకే పెళ్లైపోయిందిట. పెళ్లైన అయిదేళ్లకే మొగుడు పోయాడు. పాపం పిల్లా జల్లా ఎవరూ లేరు. ఎప్పటి మాటా.. ఎప్పుడో యాభై యేళ్ల కిందటి నాటి మాట ఇది. అప్పట్నుంచీ ఒక్కర్తే ఈ పాకలో పడి ఉంటోంది’’
‘‘ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేం చూస్తాం అని ఆస్తి రాయించేసుకున్నారు. పాపం పిచ్చిది రాసేసింది. ఆస్తి చేతిలో పడ్డాక ఇదెవడికి కావాలింక. ఒదిలేసి పోయారు ఎదవలు’’
‘‘ఇవాళ సెంటు పది లక్షలు ఉంటుంది ఇక్కడ’’ అన్నారు నాన్న. 
‘‘పదా. పన్నెండా. తెగనమ్మితే అయిదు కోట్లొస్తుంది ఇవాళ్రోజున’’ అని తాతగారు.
‘‘అయితే ముసలమ్మ కోటీశ్వరురాలు అనమ్మాట’’ అన్నాను నేను. 
‘‘ఏదైతేనేం. ఆ పాకలో బిక్కు బిక్కుమని పడి ఏడుస్తోంది ఒక్కర్తీ’’ 
‘‘తొక్కిపెట్టుకుని కుర్చొవల్సింది నాన్నా. ఆస్తి ఎవడికీ రాయకుండా. చచ్చినట్టు చూద్దురు అప్పుడు’’
‘‘అప్పుడు మనిషినే మాయం చేసెయ్యగలరు. ఆస్తి రాసేసింది కాబట్టే, దీని బతుకు దీన్ని బతకనిచ్చి వదిలేశారు’’ 
‘‘అంతకు తెగిస్తారంటారా?’’
‘‘ఏమో ఏమైనా జరగొచ్చు. ఏం చెప్పగలం. ఆశ మనిషిచేత ఏమైనా చేయిస్తుంది’’
అంతలో అమ్మ ‘‘మొన్న మొన్నటిదాకా ఆ సైకిలు షాపువాడి కుటుంబం కుడా ఈవిడ పాకలోనే ఉండీవారు కదా’’
‘‘వాడు మేనల్లుడే ఆమెకి. అర్ధరాత్రి వాళ్ల ఇల్లు కూలిపోతే నేనూ ఒక్కదాన్నే కదా నాతో ఉండండ్రా అని ఉంచుకుంది. మూడొంతులు పాక వాళ్లకే ఇచ్చేసి ఓ మూల గదిలోకి సర్దుకుంది’’
‘‘వాళ్లు తర్వాత ఇల్లు కట్టుకుని పోయారు. ఇదేమో ఒక్కర్తీ అయిపోయింది’’

‘‘ఎవడి బతుకు వాడిది. ఏం చేస్తాం. ఏదో ఆ ప్రభువ్వ పింఛను అదీ పట్టుకుని బతుకుతోంది. ఇంతలో ఏమొచ్చిందో...’’ అంటూ చేతులు కడుక్కుని లేచిపోయారు తాతగారు.  
‘‘మన వెనకింటి పోలిశెట్టోరి పెద్దనాగమణి గారుంది కదా, ఆవిడ రోజూ ఏదో ఒక కూర అదీ ఇచ్చి పంపీది పాపం. ఆ కూర పట్టికెళ్లి, అందులోకి కాస్త అన్నం ఉడకేసుకుని ఎంగిలిపడీది’’ అంది అమ్మ. 
‘‘పోలిశెట్టోరికీ ఈవిడికీ చుట్టరికం కూడా ఉందంటావా అమ్మా?’’ అని అడిగేను.
‘‘ఏమో. ఏవైనా దూరపు చుట్టరికం ఉందేమో తెలీదు మనకి’’

‘‘వాళ్ల ఇంట్లో మనవరాలికి కొడుకు పుట్టేడు కదా మొన్నామధ్య. ఆ చంటాడికి నీళ్లు పోసిపెట్టమని ఈవిణ్ని అడిగేరుట. అంతకన్నానా అమ్మా అనీ, రోజూ వెళ్లి పిల్లాడికి లాలపోసి ఒచ్చీదిట. కాళ్ల మీద బోర్లా పడుకోబెట్టుకుని భలే సుకుమారంగా స్నానం చేయించీదండి అని చెప్పీది నాగమణిగారు’’ 
‘‘జళ్ళు కూడా వేసీదిరేయ్‌. లక్షింగారు వాళ్ల పిల్లలిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందంటే నేను ముందని దాని దగ్గర చేరిపోయీవారు జడేయించుకోడానికి. ఓపక్క కాలేజీ టైమైపోతోంది రండర్రా బాబూ అనీ వాళ్లమ్మ ఒకటే గొడవ’’
‘‘మళ్లీనూ, ఆ ఎదర పెంకుటింట్లో వడ్రంగోళ్ల అబ్బాయేమో, వాళ్లతోబాటూ ఈవిడక్కూడా ఓ పాలపేకెట్టు తెచ్చిపెట్టీవాడు పొద్దునపూట. అలా ఏదో జనాల్నట్టుకుని కాలక్షేపం చేసీది’’
‘‘మొన్న తుఫానొచ్చినప్పట్నుంచీ పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టీది పాపం’’

‘‘చూరులోంచి వర్షపునీరు కారిపోతందీ, దూలాలవీ చెదపట్టేసినియ్యీ, రోకలిబండలూ అయ్యీ పుట్టలు పుట్టలు పెట్టేసినియ్యీ. కొంచెం పాక నేయించి పెట్టండ్రా బాబా అనీ బతిమాలిందిట అన్నదమ్ముల పిల్లల్నీ వాళ్లనీ. ఎవ్వడూ పట్టించుకున్న పాపాన పోలేదు’’ 
‘‘ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి. చాలా జాగర్తగా ఉంటుందిరోయ్‌ మళ్లీ. వెలుతురు ఉండగానే బయటిపని అంతా చేసేస్కుని కూర్చుంటుంది. చీకట్లో ఇంక పాక గట్టు కూడా దిగదు మమూలుగా అయితే. ఏం అవసరం ఒచ్చి బయటికొచ్చిందో, వానకి వీధిలైట్లు కూడా పనిచెయ్యట్లేదు కదా. చిమ్మ చీకట్లో కనిపించి ఉండదు నుయ్యి. పాపం దెబ్బలు గట్టిగా తగిలుంటాయి’’ చెప్పుకొచ్చింది అమ్మ. 

మా అన్నాలైపోయాక, ‘‘ఇంక మిగతా పనంతా పొద్దున చూసుకుందాం. పదండి పోయి పడుకుందాం. ఇప్పటికే పొద్దుపోయింది’’ అంది. ఏం పడుకున్నామో, ఎప్పుడు పడుకున్నామో తెలీదు గానీ, ఇదిగో లేచేడప్పడికి తెల్లారిపోయింది. మొహం కడుక్కుని వంటింట్లోకి వచ్చాను.
అమ్మ కూర తరుక్కుంటోంది. ‘‘ఆయాసం తట్టుకోలేకపోయిందిటరా’’ 

‘‘ఏం చెయ్యాలో తెలవలేదండి. ఒంటి ముండని. నేనుంటే ఎంత, పోతే ఎంత అనిపించిందమ్మా’’ అని కళ్లమ్మట నీళ్లు పెట్టుకుందిపాపం’’ అంది అమ్మ. 

‘‘నువ్వెళ్లి కలిశావా పొద్దున?’’ అనడిగాను.

‘‘ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాసు పాలు పట్టికెళ్లి ఇచ్చాను. టీనో కాఫీనో పెట్టుకుంటుందని’’

నేను కుడా కాఫీ తాగుతూ మళ్లీ కిటికీలోంచి బయటికి చూశాను. ‘‘మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటికొచ్చింది. వెదురు బద్దకి తెల్ల చీర కట్టుకున్నట్టు ఉంది మనిషి. చూరుకింద ముక్కాలిపీట వేసుకుని దాని మీద కూర్చుంది. కూర్చుని ఎటో చూస్తోంది. ఎందుకో నన్నే చూస్తోందేమో అనిపించింది నాకు.

‘నూతిలోంచంటే బయటికి లాగిపడేశారుగానీ, ఈ ఒంటరితనంలోంచి బయటికి లాగగలిగిన వారెవ్వరు?’ అని నన్ను అడుగుతున్నట్టనిపించింది. ఏం మారింది.. ఏదీ మారలేదు. మామూలే...మళ్లీ అంతా మామూలే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని