రెక్కలు విరిగిన కాలం

విలువలు ఏమయ్యాయి? దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా లాభం లేదు. కాలంలో బోలెడు మార్పులు. ఒకప్పుడు ఏది నిజం అనుకుంటామో అది అబద్ధం ఇపుడు. ఎవరూ కాదనలేరు. మనిషి ఒక్కడే. నాగరికత పెరిగింది...

Updated : 03 Jul 2021 17:41 IST

విలువలు ఏమయ్యాయి? దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా లాభం లేదు. కాలంలో బోలెడు మార్పులు. ఒకప్పుడు ఏది నిజం అనుకుంటామో అది అబద్ధం ఇపుడు. ఎవరూ కాదనలేరు. మనిషి ఒక్కడే. నాగరికత పెరిగింది. నీతి ఒక అర్హత. నిజాయితీ ఒక విలువ. మాటంటే జరగాల్సిందే. వేరే కాగితాలు అనవసరం. నోటి మాట శిలాశాసనం. వెనక్కి తీసుకోలేం. ఇప్పుడైతే నాలుక ఎన్ని మడతలైనా తిరగొచ్చు. నిన్న చెప్పింది నేడు కాదు. సమర్ధింపులకు లోటుండదు. అన్నీ వ్యూహాలే. కలసి రావాలి అంతే. ఎవరేమనుకున్నా పర్వాలేదు. అన్యాయమైనా సరే. లబ్ధి ముఖ్యం. వెయ్యేళ్లో... ఇంకా అంతకు మునుపో... కాల యంత్రాన్ని వెనక్కి తిప్పితే..

వీరాస్వామి దూకుడుగా అడుగులేస్తున్నాడు. వెలుతురు నెమ్మదిగా జారిపోతోంది. చీకటి కమ్ముకుంటోంది. కళ్లు ఎర్రగా ఉన్నాయి. చేతిలో వంకరగా ఉన్న కందికర్ర. కొమ్మల కనుపులు చెక్కిన కర్ర. గాలిలో విన్యాసం చేస్తున్నట్టు ఊపుతున్నాడు. లేచిన వేళ మంచిదే. ఉదయాన రాహు కాలం చూసుకునే బయటకు వచ్చాడు. శివయ్య తప్పక కనిపిస్తాడు. ఈసారి నంగి నంగి మాటలకు లొంగ కూడదు. 

శివయ్య ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తే. సందేహం లేదు. మరెందుకు తాత్సారం చేస్తున్నాడు? వీరాస్వామి రెండు రోజులుగా ఎదురుచూస్తున్నాడు. శివయ్య కోసం. అతన్ని నిలదీయడం కోసం. తప్పించుకుని తిరుగుతున్నాడా? అట్లాంటి వాడు కాదే. 

శివాలయం. కాగడాల వెలుగు. నలుగురూ కూడి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. వీరాస్వామి ఆగాడు. ప్రతి ఒక్కరి తల మీదా తలపాగాలు. కొంతమందికి గిరజాల జుట్టులున్నాయి. చెవులకు కమ్మలున్నాయి. మీసాలున్నాయి. శివయ్య ఆ గుంపులో ఉన్నాడా?

వీరాస్వామి ఊహ నిజమే. శివయ్య ఉన్నాడు. భయంగా లేచి నిలబడ్డాడు. 

అయ్యా...తండ్రీ...ఇక్కడే ఉన్నావా? శివయ్యా...కనులు కాయలు కాచాయి, నాయనా...తమరు ఒకసారిలా వేంచేయండి ప్రభూ...×× వీరాస్వామి తెచ్చుపెట్టుకున్న గౌరవభావంతో వ్యంగ్యంగా అన్నాడు. 

శివయ్య లేచాడు. చేతులు కట్టుకుని వీరాస్వామి ముందు నేరం చేసినవాడిలా నిలబడ్డాడు. తల వంచుకున్నాడు. నేల చూపులు...కళ్లల్లో నీళ్లు...జరగబోయేది అవమానమే...అది ఖాయమే....

ఏమండీ...ఇక్కడున్నవారు వింటున్నారా? ఈ పెద్ద మనిషి నాకు కొంత రొక్కం బాకీ...గడువు దాటింది. ముఖం చాటేస్తున్నాడు. ఏం చేయాలి? ×× అని చెప్పి చేతిలో కందికర్రను శివయ్య చుట్టూ వలయం తిప్పాడు. గీత ఏర్పడింది. 

నా బాకీ ఎప్పుడిచ్చి చస్తావ్‌... చెల్లుబాటు చేసే ఈ గీత దాటాలి. దేవుని ఆజ్ఞతో చేస్తున్నాను ఈ పని. కట్టుబాటు తెలుసు కదా ×× అని వీరాస్వామి నడుం మీద చేయి వేసి నిలబడి తీవ్ర స్వరంతో అన్నాడు. అక్కడున్న అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. 

శివయ్య బిక్కచచ్చిపోయాడు. ఏదైతే జరగకూడదని అనుకుంటారో అదే జరగబోతోంది. 

బాబ్బాబు... గడువు ఇవ్వండి. మాసం చాలు. నా మాట నమ్మండి. గీత చెరిపేయండి. నన్ను బయటకు వెళ్లేలా అనుమతి ఇవ్వండి...బాబ్బాబూ...డబ్బులు ఎగ్గొట్టేవాడిని కాను. నా మీద విశ్వాసం ఉంచండి ×× కళ్ల నీళ్ల పర్యంతమై బతిమాలుకున్నాడు. కాళ్లకు నమస్కరించాడు. 

నువ్వు మళ్లీ చిక్కవు. బాకీ మొత్తం చెల్లించి బయటపడు...×× కఠినంగా అన్నాడు వీరాస్వామి.

మీరైనా చెప్పండి, అన్నలారా... ఒక్క మాసం...తల తాకట్టు పెట్టి తీరుస్తాను...××

అక్కడున్న వాళ్లలో వొక ముసలాయన వీరాస్వామి దగ్గరకొచ్చాడు. 

వీరాస్వామీ... శివయ్య తెలియని వాడు కాదు... అతను కోరినట్టు గడువు ఇవ్వకూడదా? ముఖం చూడు ...సిగ్గుతో ఎలా కుచించుకుపోయాడో...తప్పక ఇచ్చేస్తాడు...ఒక అవకాశం ఇయ్యి...కాస్త..×× పెద్దాయన మాటలు పూర్తవ్వలేదు.

మీరు పూచీ పడతారా? ఒక్కటే మాట...×× పెద్దాయన బదులివ్వలేదు. అంత శక్తి లేకపోవడంతో తటపటాయించాడు.     సరిగ్గా అదే సమయానికి శివయ్య బావమరది లింగయ్య అటు వచ్చాడు. పరిస్థితి గమనించాడు. సన్నటి వెలుతురులో దైన్యంగా గీతలో నిలబడ్డ శివయ్యను చూశాడు. 

లింగయ్యకు బావ శివయ్యతో తగాదాలున్నాయి. క్రితం రోజే తీవ్రంగా మాటామాటా అనుకున్నారు. ఒకళ్ళ మీద మరొకరు అరచుకున్నారు. మధ్యలో శివయ్య భార్య అడ్డుకున్నప్పటికీ వాగ్వాదం ఆగలేదు. మాటలు విసురుకుంటే ఏముంది వెనక్కి తీసుకోగలమా?     

లింగయ్య ఆదుకుంటాడనే ఆశ లేదు శివయ్యకు. నిర్లిప్తంగా ఆకాశం లోని నక్షత్రాలను చూస్తూ ఉండిపోయాడు. చెదురుగా పొరలు పొరలుగా ఉన్న మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి.     

లింగయ్య తిన్నగా వీరాస్వామి దగ్గరకెళ్ళాడు. పలకరించాడు. దణ్ణం పెట్టాడు. 

మీ డబ్బుకు నాదీ హామీ. మా బావ ఇవ్వకపోతే నేనిస్తాను. పూచీ నాది. వారం రోజుల్లో మీకు సరిపెడతాను. ఆ గీత చెరిపి మా బావను విడుదల చేయండి ×× అన్నాడు లింగయ్య ప్రాధేయపూర్వకంగా.     

ఇదిగో... శివయ్యను ఇక నేను అడగను. నీవే బాకీ అనే పక్షంలో...నాదేం పోయింది. ఒప్పుకుంటాను ... ఇంతమంది చూస్తున్నారు. నీవు మాట తప్పకూడదు. లేకపోతే నీకూ ఇదే గతి పడుతుంది...జాగ్రత్త..××

సరే... నేనే బాకీ ×× అన్నాడు లింగయ్య స్థిరంగా. శివయ్య ఊహించలేదు. కుటుంబం పరువు ముఖ్యం. మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలు కావు.     

"నేను పెట్టిన ఆన వెనక్కి తీసుకుంటున్నాను. నాకు శివయ్య బాకీ లేడు. బదలాయింపు జరిగింది. అతనికి బదులు లింగయ్య జవాబుదారీ. వారం రోజుల్లో చెల్లింపులు చేస్తానన్నాడు గనుక ఓ భగవంతుడా... ఈ హద్దు చెరిపేస్తున్నాను. శివయ్య ఇక బయటకు రావొచ్చు" అని చెప్పి గీసిన గీత ఆనవాలు లేకుండా చెరిపేసాడు. చేతులు జోడించి తల మీద పెట్టుకుని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నట్లు ఏదో గొణుక్కున్నాడు.     

శివయ్య అలాగే నిలబడిపోయాడు. ఊపిరి పీల్చుకున్నాడు. ఆప్యాయంగా లింగయ్య కేసి చూశాడు. అప్పటికే అతను అక్కడ్నుంచి కదిలాడు.     

మనిషి నీతి నియమాలు పోషించడానికి ఏ కాలానికి ఆ కాలం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. మనిషి చుట్టూ గీత గేస్తే డబ్బు చెల్లించేంత వరకు నిశ్చలంగా ఉండాల్సిందే. రాత్రి...పగలు..ఎండా వానా పట్టించుకోకుండా ఆ గీత లోనే ఉండాలి. ఒకవేళ మొండిగా ఆ గీత దాటితే వాడికి ఆ ఊళ్ళో గౌరవం ఉండదు. చీదరించుకుంటారు. చీత్కారాలు చేస్తారు. నేరగాడిగా పరిగణిస్తారు. ఎవరూ మాట్లాడరు. ఒకలాంటి వెలి....

మరో అయిదొందల ఏళ్ల తర్వాత..

దక్షిణ భారతదేశం. తమిళ భాషా ప్రాంతం. చిన్న గ్రామం. అంతా చేసి వందమంది జనాభా. ఎక్కువమంది వృత్తి వ్యవసాయం. మిగిలినవారు చిన్నా చితకా వ్యాపారం చేస్తారు . 

శంకరన్‌ దిగులుగా ఉన్నాడు. నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. తనను రక్షించేవారెవరు? కుటుంబం రోడ్డున పడకుండా కాపాడేదెవరు? 

పంట దెబ్బతింది. చేసే చిన్న వ్యాపారం కూలబడింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరల నిలదొక్కుకోవడం ఎలా? ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడేదెలా?     

గ్రామ పెద్ద సుందర మురుగన్‌. మంచివాడు. అందరి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. అందరి క్షేమం కోరుకుంటాడు. అవసరమైన వారికి సాయపడతాడు. భారం భగవంతుని మీద వేయడు. గ్రామంలోని వారందరూ కుటుంబసభ్యులుగా భావిస్తాడు. 

ఆ రోజు గట్టిగా వర్షం పడుతోంది. రెండురోజులుగా అదే పనిగా కురుస్తోంది. వర్షం...వర్షం...మున్నెన్నడూ చూడనంత వర్షం... కుండపోత.     

సాయంకాలానికి తగ్గింది. జల్లులు పడుతున్నాయి. తాటాకులతో నేసిన గూన వంటి గొడుగులు తలపై పెట్టుకుని వీధంటా నడుచుకుంటూ పోతున్నారు. వాతావరణం తడిగా చిరాకుగా ఉంది.     

సుందర మురుగన్‌ రోడ్డు మీదకు వచ్చాడు. దూరంగా శంకరన్‌ నడిచి వస్తున్నాడు. కొద్దిగా కుంటుతున్నట్టు నడుస్తున్నాడు. దగ్గరకు రాగానే ఆ వచ్చేది శంకరన్‌ అని గుర్తు పట్టాడు. పక్క సందు లోకి వెళ్ళబోతున్నాడు.

శంకరన్‌...శంకరన్‌  గట్టిగా పిలిచాడు. పిలుపు వినిపించింది. 

"దండాలయ్యా.." గొడుగు పక్కకు తొలగించి ముఖం కనపడేలా వంగి నిలబడి నమస్కరించాడు.  

శంకరన్‌ గురించి కొద్ది రోజులుగా వింటున్నాడు. కలిసి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు.  అతని శ్రమ వృధా అవుతోంది. మనిషి డీలా పడిపోయాడు. కళ్లు లోతుకు పోయాయి. మాట బలహీనం అయ్యింది. బతుకు భారమౌతుందన్న సంగతి తెలుస్తోంది. 

"శంకరన్‌ ... ఒకళ్ల జోలికెళ్లవు. నీ పని నీదే. నీ కష్టం నిన్ను ఒడ్డున పడేయడం లేదు. ఈ వర్షం కాస్త  తగ్గాక ఒకసారి కనపడు.." సుందర మురుగన్‌ అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చేడు. భరోసా ఇస్తున్నట్టు దగ్గరకు వచ్చి భుజం తట్టాడు. శంకరన్‌ అడిగిందేమీ లేదు. ఊళ్లో ఒక స్థాయిలో గౌరవంగా బతుకుతున్నాడు. ఇపుడు ఆర్థికంగా చతికిలపడ్డాడు. అందుకు ఎవరినీ నిందించలేడు. సుందర మురుగన్‌ సర్వం గ్రహించాడు. 

సుందర మురుగన్‌ తన ఆలోచనను అమలులో పెట్టాడు. ఊళ్లో వాళ్లకు చెప్పాడు. అందరూ సంతోషంగా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎవరూ వ్యతిరేకించలేదు. తర్జనభర్జనలు లేవు. ఇది గొప్ప విషయం. 

ఆదివారం భోజన కార్యక్రమం. శంకరన్‌ ఇంట ఏర్పాటు చేశాడు. అందుకు కావాల్సిన సరకులు శనివారం ఉదయం నుండే రావడం మొదలెట్టాయి. బియ్యం, కూరగాయలు, పాలు...

శంకరన్‌ ఆదివారం బ్రహ్మాండమైన భోజనం తయారు చేయించాడు. ఉల్లాసంగా కథలు, కబుర్లు చెప్పుకున్నారు. పాటలు పాడారు. ఒకే కుటుంబం అన్నట్టు మెలిగారు. 

నేల మీద కూచోడానికి బట్టలు పరచారు. అరటి ఆకుల్లో వడ్డనలు. కొసరి కొసరి తినిపించారు. అందరూ తృప్తిగా విందు ఆరగించారు. శంకరన్‌ సంతోషించాడు.     

ఆ ఊరికి ఒక ఆచారం ఉంది. కారణాంతరాల వల్ల చితికిపోయిన గృహస్థును ఆదుకునే సత్సంప్రదాయం అది. ముందు వ్యక్తిని గుర్తిస్తారు. భోజనానికి వస్తామని కబురు పంపుతారు. కావాల్సిన సరకులు ఆ ఇంటికి పంపుతారు. భోజనం చేస్తారు. భోజనం ముగించిన తర్వాత యథాశక్తి విస్తరి కింద కొంత సొమ్ము ఉంచుతారు. ఆరోజు అదే జరిగింది శంకరన్‌ విషయంలో.    

విస్తర్ల కింద కాసులు లెక్కించాడు శంకరన్‌. ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఊహించనంత మొత్తం. తన కష్టాల్ని గట్టెక్కించేంత సొమ్ము దఖలు పడింది. ఆకాశం వైపు సూర్యుడు ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేసాడు. ఊరి వారి ఔదార్యానికి మురిసిపోయాడు. మరల వ్యవసాయం మొదలెట్చొచ్చు. కొంత కాలం ఆగి వ్యాపారం చేసుకోవచ్చు. ఊరు సమిష్టి తలంపు....వ్యక్తి శ్రేయస్సు పట్ల సామాజిక బాధ్యత....

ఇప్పటికి ఏభై ఏళ్ల క్రితం.. అంటే 1970 దశకం ..    

రామ్మూర్తిరాజు అని ఒకడుండేవాడు. తెల్లటి గుబురు మీసాలు. నుదుట కుంకుమబొట్టు. ముంజేతికి కడియం. చూడగానే గౌరవం ఉట్టి పడుతుంది. ఉన్నదాంతో సంతృప్తి పడే పెద్ద మనిషి తరహా.     

ఎవరికైనా పదీ పరకా కావాలంటే రామ్మూర్తిరాజే దిక్కు. అలా రప్పించుకుని సాయపడటం సరదా. అవసరానికి ఆదుకునే మహానుభావుడు అంటారు సహాయం పొందినవారు. ప్రాంసరీ నోట్లు రాయించుకుంటాడు. సాక్షి సంతకాలు పెట్టించుకుంటాడు. మూడేళ్లు గడిస్తే తిరగ రాయించుకుంటాడు. ఇచ్చే డబ్బు వెయ్యి నుంచి అయిదు వేల వరకు. అదే గొప్ప అప్పుడు.     

తమ్ముడు పుల్లంరాజు. ఆస్తి పంపకాలు అయ్యాయి. ఉమ్మడిలో అప్పులిచ్చిన బాపతు ప్రాంసరీ నోట్లు పంచుకోలేదు. అప్పులివ్వడమే తప్ప వసూలు చేయడం లేదని తమ్ముడికి లోలోన బాధ ఉంది. అన్నగారిని అడగలేడు. నోరు రాదు. ఆయన ఎదురు నిలిచి మాట్లాడలేడు. చిన్నప్పట్నుంచీ అంతే. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది కూడా.     

తమ్ముడికి ఎదిగిన కొడుకు రవి. అప్పటికి కొత్త తరం. ఆవేశపరుడు.     

"ఎందుకు భయం? పెద బావజీని అడిగితే కొంపలంటుకుంటాయా? ఎందుకు నోట్లు మురగబెట్టుకోవడం? నేనడగనా?"  అన్నాడు రవి తండ్రితో.     

"వద్దు ... తప్పు...పెద్దల్ని అడగకూడదు. ఆయనిచ్చినపుడు తీసుకుందాం.."   

"మీ చాదస్తం మీదే...ఎన్నాళ్లయినా అంతేనా? మీరు అడగమన్నట్టు కాకుండా విషయం కదుపుతాను. మీ అన్నయ్యగారు మామూలు మనిషి కాదు. రక్షణనిధికి చేతి కడియం విరాళం ఇచ్చిన దానకర్ణుడు. ఇపుడు సాదా కంచు కడియంతో సరిపెట్టుకుంటున్నాడు"  అని వ్యంగ్యంగా అని వెళ్ళిపోయాడు. 

రామ్మూర్తిరాజు కముజు చర్మం వాలుకుర్చీలో కూర్చున్నాడు. చుట్ట అంటించాడు. గుప్పుమని పొగ వదులుతున్నాడు. కాళ్లు చిన్న టీపాయి మీద ఉన్నాయి. 

రవి బుద్ధిగా ఆయన కాళ్ళ దగ్గర కూచున్నాడు. అదీ ఇదీ మాట్లాడాడు. నెమ్మదిగా బాకీ నోట్ల గురించి ఆరా తీసాడు.     

"మెత్తగా ఉంటే యుగాలు గడిచిపోతాయి. ఒక్క లాయరు నోటీసు తగిలిస్తే దెబ్బకు దిగి వస్తారు. నా చేతికివ్వండి. నేనా పని చేస్తా"

"అందరూ మనక్కావాల్సిన వారే...వెసులుబాటు కలిగాక వాళ్లే ఇస్తారు రా" రవి కేసి చూసి అన్నాడు.    

మరుక్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఉన్నట్టుండి లేచాడు రామ్మూర్తిరాజు.     

గది లోకి వెళ్లాడు. బీరువా లోంచి ప్రాంసరీ నోట్లు కట్ట తెచ్చి రవి ముందు పడేసాడు.

"మొత్తం లెక్క కట్టు. సగం తీసుకుని పో... నా తరపున నీకు హక్కు భుక్తం రాసిస్తాను. మిగిలినవి అట్టి పెట్టు. అవి నా దగ్గరుంటాయి" అని చెప్పి వాలు కుర్చీలో కూచుని రాగం తీసాడు. మరో చుట్ట అందుకున్నాడు.    

రవి మంచి పద్దులు ఏరుకున్నాడు. చూపించాడు. తీసుకెళ్లాడు. 

నెల గడిచింది. రామ్మూర్తిరాజు ఒంట్లో నలతగా ఉంటోంది. 

పడుకునే మంచం మీద తలగడ కింద ఉన్న ప్రాంసరీ నోట్లు అలాగే ఉన్నాయి. వాటిని తిరిగి బీరువాలో పెట్టలేదు. తమ్ముడు కొడుకు వచ్చి వెళ్లిందగ్గర్నుంచీ మనసులో ఏదో తెలియని బాధ తొలుస్తోంది. 

'ఇన్నాళ్లూ ఎలా బతికాను? ఒకడితో మాట పడలేదు. ప్రాణం గుటుక్కుమంటే తర్వాత తరం వారు ఈ నోట్లను ఏం చేస్తారో? బాకీదార్ల దయ మన ప్రాప్తం. అలాగే ఉంటాను' అనుకున్నాడు. తన దగ్గరున్న ఆ నోట్లను చించి అవతల పారేశాడు. పైగా ఆ విషయాన్ని దాచలేదు. 

"జీవితంలో ఇప్పటికి ఎవరికైనా లాయరు నోటీసు ఇచ్చానా? మీకు కష్ట కాలంలో సొమ్ము ఇచ్చాను. మీరు ఏది ధర్మం అనుకంటారో అదే చేయండి. నా దగ్గరుంటే నా వారసుల వల్ల మీకు ఇబ్బందులు రావొచ్చు" ఎవరైతే బాకీ ఉన్నారో వారికి పనిగట్టుకుని వెళ్లి చెప్పి వచ్చాడు రామ్మూర్తిరాజు. 

మరో పదేళ్లు గడిచాక...

రామ్మూర్తిరాజు ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థికంగా మటుక్కి దివాలా తీసాడు. 

ఎంతమందికో సాయపడినవాడు. కష్ట కాలంలో ఆదుకున్నవాడు. ప్రస్తుతం అప్పు అడగాల్సిన పరిస్థితి. చేసిన సాయం ఊరికే పోలేదు. కాదనకుండా ఇచ్చారు. పరపతి మహత్తు అది. వాళ్లకు హామీగా ప్రాంసరీ నోట్లు రాసిచ్చాడు.     

సంవత్సరాలు గడుస్తున్నాయి. సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయాడు. 

మనోవ్యథ. వ్యాకులత. మనసు లోపల నొప్పి. ఇంత బతుకూ బతికీ..

బాకీ తీర్చకుండా ప్రాణం పోతే ఎలా? తీర్చి తీరాలి. ఈ జన్మలో ఎవరికీ బాకీ ఉండడానికి వీల్లేదు.  గట్టిగా నిర్ణయించుకున్నాడు.     

పిల్లలు ప్రయోజకులు కాలేదు. పెళ్లిళ్ళు మాత్రం చేశాడు. ఆ  సందర్భంగా అప్పులు చేయాల్సి వచ్చింది. అవే తలకు మించి పెరిగిపోయాయి. ఇక లాభం లేదు.     

తనకు మిగిలిన మూడెకరాల కొండ్ర అమ్మకానికి పెట్టాడు. కుటుంబం లబోదిబోమంది. మట్టిని నమ్ముకున్న వాళ్ల ఆక్రోశం, ఆవేదన తీరనిది. రామ్మూర్తిరాజు తన మీద మచ్చ ఉండకూడదనుకున్నాడు.

వడ్డీలు కట్టలేదు. అసలు జమ చేసాడు. డబ్బులు ఇచ్చినవారు లోలోపల మథనపడినా మారు మాట్లాడకుండా తీసుకున్నారు. ఒక్క  కొండ్రాజు మాత్రం ఊరుకోలేదు. అంతెత్తు ఎగిరాడు. 

"వడ్డీ అంటే ఏమిటి? నీ అవసరం తీరినందుకు ప్రతిఫలం. ఉత్తినే ఇచ్చేది కాదు. న్యాయబద్ధమైన వ్యవహారం ఇది. పెద్దలు ఏర్పాటు చేసిందే.." అంటూ కొండ్రాజు ఆగ్రహం వెలిబుచ్చాడు. అసలు తీసుకోడానికి నిరాకరించాడు. రామ్మూర్తిరాజు చిన్న బుచ్చుకున్నాడు.

కొండ్రాజు పలికిన మరో మాట మరింత తీవ్రంగా బాధించింది. తల వంచుకుని వచ్చేసాడు. పదే పదే అదే మాట చెపుల్లో గింగుర్లుకొడుతోంది. 

"రామ్మూర్తీ వెళ్లెళ్లు... నా సొమ్ము తిన్నవాడు ఎవడూ బాగు పడడు. కుక్కై పుట్టి నా ఇంటికి కాపలా  కాస్తావ్‌.. తమాషాగా ఉందా? ఇది జరిగి తీరుతుంది" శాపం పెట్టినట్లుగా అనిపించింది. 

రామ్మూర్తిరాజు భయపడ్డాడు. ఇంత బతుకూ బతికీ...

ఇంటికి వచ్చాడు. కిందా మీదా పడి సర్దుబాటు చేసుకుని వడ్డీ వేసి పంపాడు. శాపం వెనక్కి తీసుకోమని  కోరాడు. శాంతించిన కొండ్రాజు అలాగే చేసాడు. 

కొండ్రాజు ఏదో వాక్సుద్ధి ఉన్నవాడని కాదు. భయం...నోటి మాట పట్ల భయం...తలవంపు... సమాజం వెలెత్తి చూపిస్తుందనే భయం....

ఇప్పుడు...ఇప్పుడే...ప్రస్తుతకాలంలో...

"ఊరికే ఇచ్చాడా? వడ్డీ దొబ్బడా? ఇస్తాం...ఇచ్చినపుడు తీసుకోవాలి. డబ్బులు చెట్టుకు కాస్తాయా? అవసరానికి ఇచ్చావ్‌. కాదంటున్నానా?" ఎదురుగా ఉన్నప్పటికీ పరోక్షంలో మాట్లాడుతున్నట్టు. 

కాదురా బాబూ... నాకిపుడు కావాలి. నా అవసరాలు కూడా తీరాలి కదా. ఆవేళ ఇబ్బందుల్లో ఉన్నావనే కదా. నీకు దండం పెడతాను. ఎలాగోలా సర్దుబాటు చేయి నీకు పుణ్యం ఉంటుంది దైన్యం మూర్తీభవించి...ప్రాధేయపడుతూ...

"ఏం చేసుకుంటావో చేసుకో...ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నీ దిక్కున్న చోట చెప్పుకో. కోర్టు కెళతావా? వెళ్లు...చీటికి మాటికీ దారికి అడ్డంపడి నలుగురిలో పరువు తీస్తే ఊరుకోను. తెగిస్తే అసలుకే మోసం వస్తుంది తెలుసుకో. ఏమైనా చేస్తాను. గుర్తించుకుంటే మంచిది. లేకపోతే...సరి...నాక్కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంట్లో దూరి కత్తికి పని చెబుతా... ఆనక బాధపడి ఉపయోగం లేదు" తీవ్రంగా అంటున్నాడు...ఎవరితోనో అన్నట్టు...

ఈ కాలాన్ని ఏమనాలి? యుగధర్మం అనాలా?

రెక్కలు విరిగిన కాలం అంటే సరిపోతుందేమో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు