భళా బుడత.. భలే ఘనత!

ఈ చిన్నారిని చూస్తే మాటలు ఇంకా రాలేదేమో అన్నట్టు ఉంది కదా! కానీ కదిపి చూడండి..  బోలెడన్ని సంగతులు చెప్పేస్తోంది. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా రికార్డుల్లోకి ఎక్కేస్తోంది. ఇంతకీ ఎవరీ బుడతా? ఏమిటా ఘనత? తెలుసుకునేందుకు చదివేయండి....

Updated : 14 May 2022 10:58 IST

ఈ చిన్నారిని చూస్తే మాటలు ఇంకా రాలేదేమో అన్నట్టు ఉంది కదా! కానీ కదిపి చూడండి..  బోలెడన్ని సంగతులు చెప్పేస్తోంది. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా రికార్డుల్లోకి ఎక్కేస్తోంది. ఇంతకీ ఎవరీ బుడతా? ఏమిటా ఘనత? తెలుసుకునేందుకు చదివేయండి.

మిళనాడుకు చెందిన ఎస్‌.సఫ్ఫా ఆశ్మి. వయసు ముచ్చటగా మూడేళ్లు.

చకచకా చెప్పేస్తుంది..

మూడేళ్లకే ఎన్నో విషయాలు నేర్చుకుంది ఆశ్మి. దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎవరో, జాతీయ చిహ్నాలు ఏంటో అన్నీ టకటకా చెప్పేస్తుంది. తమిళనాడులోని జిల్లాల పేర్లు, తమిళవారాలు, నెలలు, తమిళ కవులెవరు.. ఇలా అన్నీ చెబుతోంది. అంతేకాదు తమిళ సంస్కృతి గురించి అడగండి.. తడుముకోకుండా  చెప్పేస్తుంది. ఇంకా భారతదేశాన్ని పరిపాలించిన రాజులు, స్వాతంత్య్రం కోసం పాటుపడిన సంఘ సంస్కర్తల ఫొటోలు చూపిస్తే వాళ్లను గుర్తుపట్టేస్తూ వాళ్ల పేర్లు చెబుతుంది. అన్నట్టు తమిళం, ఇంగ్లిష్‌ రైమ్స్‌ కూడా గడగడా చెబుతుంది ఆశ్మి.

జ్ఞాపకశక్తి ఎక్కువే!

ఆశ్మికి మాటలు రాగానే అమ్మానాన్న ప్రతీది నేర్పించారు. తనకు ఒక్కసారి ఏదైనా విషయం చెబితే అలా గుర్తుపెట్టుకుని చెబుతుందట. దాంతో మొదటగా జంతువులు, పక్షులను చూపిస్తూ వాటి పేర్లు ఆశ్మికి చెప్పారు. అలా చెప్పగానే ఇలా ఆశ్మి తిరిగి చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు. దాంతో ఆశ్మికి జ్ఞాపకశక్తి ఎక్కువ అని అర్థమైంది అమ్మానాన్నకు. ఇక అప్పట్నుంచి మిగతా అన్ని విషయాలను చెబుతూ సాధన చేయించారు. సరదాగా ఆడుతూ పాడుతూ అన్ని సంగతులూ నేర్చుకుని ప్రశంసలు అందుకుంటోంది ఆశ్మి. తన ప్రతిభకు మెచ్చి ‘కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో ఆశ్మి పేరు నమోదు చేశారు. అదన్నమాట సంగతి. మూడేళ్లకే రికార్డుల్లోకి ఎక్కి శభాష్‌ అనిపించుకుంటున్న ఆశ్మికి అభినందనలు తెలిపేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని