Story: అమ్మ చెప్పిన పెన్సిల్‌ పాఠం..!

వేసవి సెలవులు ముగిసి.. పాఠశాలలు తెరచుకున్నాయి. మాలతి కాస్త మొండి అమ్మాయి. తను నాలుగో తరగతి నుంచి అయిదో తరగతికి వచ్చింది.

Published : 16 Jun 2024 00:28 IST

వేసవి సెలవులు ముగిసి.. పాఠశాలలు తెరచుకున్నాయి. మాలతి కాస్త మొండి అమ్మాయి. తను నాలుగో తరగతి నుంచి అయిదో తరగతికి వచ్చింది. బడి మొదటి రోజు హుషారుగా నిద్ర లేచింది. గబాగబా తయారైంది. స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమైంది. వాళ్లమ్మ ఇచ్చిన బ్యాగ్, లంచ్‌ బాక్స్‌ తీసుకొని స్కూల్‌ బస్సు ఎక్కింది. తొలి రోజు స్నేహితులతో సరదాగా గడిపి.. సాయంత్రం ఇంటికి వచ్చేసింది. వస్తూ వస్తూనే కూతురు విచారంగా ఉండటం గమనించింది తల్లి. వెంటనే.. ‘ఏమైందమ్మా! ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా?’ అని చిన్నగా అడిగింది. చేతిలో ఉన్న బ్యాగ్‌ సోఫాలో పెడుతూ.. ‘అమ్మా! ఈ రోజే నాకు కొత్త స్కూల్‌ బ్యాగ్‌ కావాలి. అప్పటి వరకు నేనేమీ తినను’ అంది మాలతి. ‘అలా అంటే ఎలాగమ్మా? ఈ బ్యాగ్‌ మొన్ననే కదా ఊరెళ్లినప్పుడు కొన్నది. ఒకటి ఉండగా.. మరొకటి ఎందుకు? చూడు ఎంత బాగుందో!’ అని బుజ్జగించింది వాళ్లమ్మ. ‘లేదు! మా క్లాస్‌లో చాలా మంది కొత్త బ్యాగ్స్‌తో వస్తున్నారు. అవి చాలా బాగున్నాయి. వాటితో పోల్చుకుంటే.. నాది అస్సలు బాలేదు. కొత్తది కొనిస్తేనే.. నేను రేపటి నుంచి స్కూల్‌కి వెళ్తాను’ అంటూ కాస్త కోపంగా చెప్పింది మాలతి. వాళ్లమ్మ ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అస్సలు వినలేదు. 
అంతలోనే.. ‘మాలతీ..!’ అంటూ స్నేహితురాలు రిషిత వచ్చింది. వారిద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లూ ఒకే చోట ఉండటంతో స్కూల్‌కి కూడా కలిసే వెళ్తారు. తనని చూసి.. ‘ఏంటి రిషిత?’ అని అడిగింది మాలతి. ‘ఉదయం బడిలో నాకు రాసుకోవడానికి పెన్సిల్‌ లేదంటే.. ఇచ్చావు కదా! మళ్లీ తిరిగివ్వడం మర్చిపోయాను. అది ఇద్దామనే వచ్చాను’ అందామె. ఆ పెన్సిల్‌నే చూస్తూ.. వెటకారంగా నవ్వింది మాలతి. దాంతో ఆమెను విచిత్రంగా చూడసాగింది రిషిత. ‘ఏమైంది నీకు. ఎందుకలా వెటకారంగా నవ్వుతున్నావు?’ అడిగింది వాళ్లమ్మ. ‘అమ్మా! నా దగ్గర ఇంకో పెన్సిల్‌ ఉంది కదా! అందుకే ఇది పాతదైపోయిందని పడేయాలనుకున్నాను. కానీ రిషిత దగ్గర లేదంటే.. తనకు ఇచ్చాను. కానీ, రాసుకోవడం పూర్తయ్యాక పడేయమని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడదే తీసుకొచ్చి ఇస్తుంటే నవ్వొచ్చింది’ అని బదులిచ్చింది మాలతి. 
ఆ పెన్సిల్‌ను చేతిలోకి తీసుకుంటూ.. ‘కొత్తగా ఉన్నప్పుడు పెన్సిల్‌ రంగు భలేగా ఉంది. చాలా చక్కగా రాస్తోందని మురిసిపోతూ చెప్పావు. కానీ ఇంకో కొత్తది రాగానే.. దీన్ని పక్కన పెట్టేయాలని చూస్తున్నావు. పూర్తిగా వాడకుండా పడేయటం తప్పు. పెన్సిల్‌ పాతదే.. అయినా అది ఇంకా చక్కగా రాస్తోంది. కాస్త మాసిపోయినంత మాత్రాన దాన్ని పక్కన పడేయడం సరికాదు. ఒకవేళ నీకు కొత్త పెన్సిల్‌ కొనివ్వకపోతే.. దీన్నే చక్కగా ఉపయోగించుకునేదానివి కదా!’ అంది మాలతి వాళ్లమ్మ. ‘అది కాదమ్మా! నాకు కొత్త పెన్సిల్‌తో రాయడమే నచ్చుతుంది’ బదులిచ్చింది మాలతి. ‘ఏ వస్తువునైనా మనం పూర్తిగా ఉపయోగించాలి. ఇక పనికి రావని అనుకున్నప్పుడే పడేయాలి. లేకపోతే.. మనం డబ్బులు వృథా చేసినట్లే. బ్యాగ్‌ విషయంలోనూ నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు.. అది తప్పు. ఇంకో విషయం.. ఎదుటి వాళ్ల వస్తువులు బాగున్నాయి.. నా దగ్గరున్నవి అస్సలు బాగాలేవని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అది మనలో అభద్రతా భావాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా?’ అంది వాళ్లమ్మ. ఆ మాటలు విన్న రిషిత.. ‘భలేగా చెప్పారు ఆంటీ. మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలాగే చెబుతుంటుంది’ అంది. కాసేపు మౌనంగా కూర్చొని.. ‘అలాగేనమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను. ఏ వస్తువునూ వృథాగా పడేయను. ఈ బ్యాగునే స్కూల్‌కి తీసుకెళ్తాను. చక్కగా వాడుకుంటాను’ అంది మాలతి.

కె.వి.లక్ష్మణ రావు  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని