భలే భలే సూట్‌కేసు..!

జపాన్‌ అంటేనే టెక్నాలజీకి, ఆవిష్కరణలకూ పెట్టింది పేరు. ఆ దేశ రాజధాని టోక్యోకు చెందిన 65 ఏళ్ల అలకావా అనే బామ్మ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 14 సంవత్సరాల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో ఆమె తన చూపును కోల్పోయారు.

Published : 07 Feb 2023 00:18 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బడికో, ప్రయాణానికో వెళ్లేటప్పుడు ఎంచక్కా బ్యాగులను సర్దుకొని హుషారుగా వెళ్తుంటాం కదా! ఆ బ్యాగుల్లోనూ ఎన్నో రకాలు చూసుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం చాలా స్మార్ట్‌. కళ్లు లేని వారు ఇతరుల సహాయం లేకుండా, కేవలం ఈ బ్యాగు తీసుకెళ్తే సరిపోతుంది. అదే ఎంచక్కా దారి చూపుతుంది.. మనల్ని అప్రమత్తం చేస్తుంది. ఆ వివరాలే ఇవీ..

జపాన్‌ అంటేనే టెక్నాలజీకి, ఆవిష్కరణలకూ పెట్టింది పేరు. ఆ దేశ రాజధాని టోక్యోకు చెందిన 65 ఏళ్ల అలకావా అనే బామ్మ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 14 సంవత్సరాల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో ఆమె తన చూపును కోల్పోయారు. కళ్లు కనిపించడకపోవడంతో ఆమె చిన్నతనం మొత్తం ఎన్నో కష్టాలు పడిందట. మరెన్నో ఆనందాలను కోల్పోయిందట. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎవరో ఒకరి సాయం కచ్చితంగా అవసరమయ్యేది. దాంతో ఈ సమస్యకు ఏదైనా కచ్చిత పరిష్కారం కనిపెట్టాలని అప్పుడే నిర్ణయించుకుంది.


ఆరేళ్ల క్రితం..

కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అంశాలపైన పట్టు ఉండటంతో 2017లో స్మార్ట్‌ సూట్‌కేసు రూపకల్పనకు శ్రీకారం చుట్టిందామె. చాలా ప్రయోగాల తర్వాత ఇంట్లో వాడకానికి మాత్రమే అనుగుణంగా ఉండేది తయారు చేయగలిగింది. కొన్ని ప్రముఖ సంస్థల సహకారంతో తన ఆలోచనను మరింత అభివృద్ధి చేసింది. అలా ఇటీవల ప్రయాణాల్లోనూ వినియోగించుకునేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో పనిచేసే ఓ స్మార్ట్‌ సూట్‌కేసును రూపొందించింది. చేతి కర్రలు, కుక్కల అవసరం లేకుండానే.. ఇతరుల అవసరం లేకుండానే.. చూపు లేని వాళ్లు బయటకు వెళ్లేందుకు ఇది ఎంతో తోడ్పడనుంది.


పరీక్షించుకోవచ్చట..  

అధునాతన సెన్సార్లు, శక్తివంతమైన నావిగేషన్‌ వ్యవస్థతో రూపొందిన ఈ సూట్‌కేసు.. దారిలో ఎదురయ్యే అడ్డంకులను అతి కచ్చితత్వంతో గుర్తించి మనల్ని హెచ్చరిస్తాయట. దీని పనితీరును ప్రత్యక్షంగా చూడాలనుకునే వారి కోసం ఈ సూట్‌కేసును ఓ మ్యూజియంలో అందుబాటులో ఉంచినట్లు అలకావా చెబుతున్నారు. అంతేకాదు.. సినిమాహాళ్లు, ఎయిర్‌పోర్టులు, షాపింగ్‌ మాళ్లలోనూ అద్దెకు అందుబాటులో ఉంటారట. నేస్తాలూ.. కళ్లు లేని వారికి ఇటువంటి సాధనాలు చాలా ఉపయోగపడతాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని