Story: చిలుక పాట.. కోయిల గెలుపు..!

నందనవనం పూలు, పండ్ల చెట్లతో కళకళలాడే ప్రాంతం. దండకారణ్యాన్ని పాలిస్తున్న మృగరాజుకి ఆ వనం అంటే చాలా ఇష్టం. అందుకే.. నందనవనాన్ని వేసవి విడిదిగా చేసుకుని, ఆ కాలంలో వేడి నుంచి ఉపశమనం పొందుతుండేది. ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేది. దాని గౌరవార్థం అక్కడ నివసించే పక్షులన్నీ.. మృగరాజుకి ఎదురెళ్లి స్వాగతం పలికేవి.

Updated : 31 May 2024 03:31 IST

నందనవనం పూలు, పండ్ల చెట్లతో కళకళలాడే ప్రాంతం. దండకారణ్యాన్ని పాలిస్తున్న మృగరాజుకి ఆ వనం అంటే చాలా ఇష్టం. అందుకే.. నందనవనాన్ని వేసవి విడిదిగా చేసుకుని, ఆ కాలంలో వేడి నుంచి ఉపశమనం పొందుతుండేది. ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేది. దాని గౌరవార్థం అక్కడ నివసించే పక్షులన్నీ.. మృగరాజుకి ఎదురెళ్లి స్వాగతం పలికేవి. వాటి వినయ విధేయతలకు మెచ్చిన మృగరాజు.. వసంతోత్సవాల పేరిట ఒక్కో సంవత్సరం ఒక్కో పోటీ నిర్వహించి, అడవి జీవుల్లో ఉత్సాహం నింపుతుండేది.

ఎప్పటిలాగే ఈసారి కూడా.. మృగరాజు వేసవి విడిదికి వచ్చింది. పక్షులన్నీ దానికి ఎంచక్కా స్వాగతం పలికాయి. కాసేపటి తర్వాత.. ‘మరో పది రోజుల్లో మీకు పాటల పోటీ నిర్వహిస్తాను’ అని చెప్పింది మృగరాజు. పాటల పోటీ అనే సరికి పక్షులన్నీ కోయిల వైపు తిరిగి.. ‘ఈసారి కూడా బహుమతి నీదే!’ అన్నట్లుగా చూశాయి. అక్కడే ఉన్న ఓ గుడ్లగూబ మాత్రం.. ‘ఈసారి కోయిలకు బహుమతి రాదు’ అని గట్టిగా చెప్పింది. దాంతో పక్షులన్నీ దాన్ని ఆశ్చర్యంగా చూశాయి. ‘ఏం.. నువ్వుగాని పాటల పోటీలో పాల్గొంటున్నావా?’ అని కాస్త వెటకారంగా అడిగింది చిలుక. ‘అంత వెటకారం వద్దు. ఈసారి పాటల పోటీలో కోయిలకు బహుమతి రాదని నేను పందెం కాస్తాను. మీలో ఎవరైనా నాతో పందేనికి సిద్ధంగా ఉన్నారా?’ అడిగింది గుడ్లగూబ. ‘నేను పందెం కాసేందుకు సిద్ధం’ అంది కొంగ. ‘నేను గెలిస్తే.. నువ్వు చిలుక గుడ్లను ఆహారంగా నాకు అందివ్వాలి’ అడిగింది గుడ్లగూబ. ‘నేను గెలిస్తే.. కోయిల గుడ్లు.. నువ్వు ఆహారంగా నాకివ్వాలి’ అంది కొంగ. ఆ మాటలు విని చిలుక, కోయిల అయోమయంలో పడ్డాయి.

అలా పది రోజులు గడిచిపోయాయి. పాటల పోటీ నిర్వహించే రోజు రానే వచ్చింది. అడవిలోని పక్షులన్నీ పోటీకి వచ్చాయి. కానీ కోయిల మాత్రం రాలేదు. అక్కడికి వచ్చిన జీవులన్నీ దాని గురించే చర్చించుకోసాగాయి. అప్పుడు గుడ్లగూబ.. ‘ఏది ఏమైనా పందెంలో మాత్రం గెలుపు నాదే! చిలుక గుడ్లు సిద్ధంగా ఉంచు’ అని కొంగతో గర్వంగా చెప్పింది గుడ్లగూబ. ‘కోయిల పోటీలోనే పాల్గొనలేదు. కాబట్టి మన పందెం రద్దయినట్లే’ అంది కొంగ. అక్కడే ఉన్న కాకి.. ‘ఈసారి కోయిలకు బహుమతి రాదని చెప్పావు. పాల్గొనడం గురించి మాట్లాడలేదు’ అంది. ‘పోటీ చివరి వరకు వేచి ఉండు. ఒకవేళ కోయిల వస్తుందేమో’ ఓటమిని అంగీకరించక ఆశగా చెప్పింది కొంగ. పాటల పోటీ చివరకు వచ్చింది. చిలుకను విజేతగా ప్రకటించింది మృగరాజు. ‘గెలుపు నాదేనని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?’ కొంగ దగ్గరకు వెళ్లి గట్టిగా చెప్పింది గుడ్లగూబ. ఇంతలో.. ‘ఈ గెలుపు నాది కాదు.. మిత్రురాలు కోయిలది’ అంటూ చిలుక బిగ్గరగా అరిచింది. ‘అదెలా? పాడింది నువ్వు కదా!’ ఆశ్చర్యంగా అడిగింది మృగరాజు.

‘పాటల పోటీ విషయంలో గుడ్లగూబ, కొంగల పందెం నన్ను ఆందోళనకు గురిచేసింది. గుడ్లగూబకి భయపడి పోటీలో పాల్గొనకుండా ఉండొద్దని చెప్పడానికి కోయిలను కలుద్దామని వెళ్లాను. అప్పటికే తన నివాసంలో కోయిల ఒళ్లంతా పీక్కుపోయి.. బిక్కు బిక్కుమంటూ దీనంగా కనిపించింది. తన పంతం నెగ్గించుకోవడానికి.. గుడ్లగూబ దాని మీద దాడి చేసిందని తెలిసింది. పోటీలో పాల్గొనే స్థితిలో లేకపోవడంతో.. కోయిల ఈ పది రోజుల్లో దానికి వీలైనప్పుడల్లా నాకు సంగీత పాఠాలు నేర్పింది. దాని వల్ల నేను ఈ రోజు పోటీలో గెలిచాను. అప్పుడు నా గెలుపు.. కోయిల గెలుపు అన్నట్లే కదా!’ అంది చిలుక. ఆ మాటలు విన్న మృగరాజు.. చెడు ఆలోచనలతో పందెంలో గెలవాలనుకున్న గుడ్లగూబను ఇంకెప్పుడూ ఇక్కడికి రావొద్దని హెచ్చరించి.. అడవి నుంచి బహిష్కరించింది.

బి.వి. పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని