Daksha jaya krishnan: భరత వేదముగ.. నిరత నాట్యముగ..!

హాయ్‌ నేస్తాలూ..! భరతనాట్యంలో మెలకువలేమీ తెలియకపోయినా.. మనందరం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం. చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో.. చేయడం అంతకంటే కష్టంగా ఉంటుందట.

Updated : 07 Jul 2024 03:10 IST

హాయ్‌ నేస్తాలూ..! భరతనాట్యంలో మెలకువలేమీ తెలియకపోయినా.. మనందరం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం. చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో.. చేయడం అంతకంటే కష్టంగా ఉంటుందట. మరి అందులో రికార్డు సాధించిన చిన్నారి గురించి తెలుసుకుందామా. అయితే.. వెంటనే ఈ కథనం చదివేయండి.

కేరళకు చెందిన దక్ష జయకృష్ణన్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి తనకు నాలుగేళ్లు ఉన్నప్పటి నుంచే.. భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించిదట. ఆ వయసు పిల్లలు.. ఒకచోట కుదురుగా కూర్చోలేరు, చెప్పిన పని కూడా చేయలేరు. కానీ దక్ష మాత్రం.. చాలా క్రమశిక్షణతో నాట్యం నేర్చుకునేదట.

సాధనతోనే..!

మన దక్ష తన ప్రతిభతో.. ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. 46 నిమిషాల 26 సెకన్లు ఆపకుండా నాట్యం చేసి.. రికార్డు సాధించింది. అంతసేపు ఏకధాటిగా నృత్యం చేయడమంటే.. మాటలు కాదు కదా నేస్తాలూ..! గతంలో 21 నిమిషాల 30 సెకన్లతో ఉన్న రికార్డును ఈ చిన్నారి బ్రేక్‌ చేసింది. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చిందట. పలు పోటీల్లోనూ పాల్గొని.. తన ప్రతిభను చాటుకుంది. మరో విషయం ఏంటంటే.. తనకు అయిదేళ్ల వయసున్నప్పడే భరతనాట్యానికి సంబంధించిన 57 ముద్రలను అతి తక్కువ సమయంలో చేసి.. వరల్డ్‌ రికార్డు సాధించింది. ఇదంతా తను గంటల తరబడి ప్రాక్టీస్‌ చేయడం వల్లనే సాధ్యమైందని చెబుతోంది దక్ష. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని