Giraffe Chess: ఎత్తు వేస్తే.. ప్రత్యర్థి చిత్తే!

సాధారణంగా చెస్‌ (చదరంగం) ఆట మనకు తెలుసు.. అందులో తరచూ గేమ్‌ డ్రా అవుతుండడం వింటూనే ఉంటాం. అలా డ్రా అవుతుంటే గెలుపోటములు ఎలా తెలుస్తాయి మరి? అందుకే డ్రా కాకుండా గెలవడం లేదా ఓడిపోవడం మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది?

Updated : 16 Jun 2024 06:46 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..  మీకు జిరాఫీ చెస్‌ తెలుసా? ‘జిరాఫీ తెలుసు.. చెస్‌ తెలుసు.. మరి ఇదేంటి కొత్తగా..’ అని అనుకుంటున్నారా? ఆ ఆట ఏంటో..  అందులో ఓ చిన్నారి చూపుతున్న ప్రతిభ ఏంటో.. మీరే చదివేయండి మరి..

సాధారణంగా చెస్‌ (చదరంగం) ఆట మనకు తెలుసు.. అందులో తరచూ గేమ్‌ డ్రా అవుతుండడం వింటూనే ఉంటాం. అలా డ్రా అవుతుంటే గెలుపోటములు ఎలా తెలుస్తాయి మరి? అందుకే డ్రా కాకుండా గెలవడం లేదా ఓడిపోవడం మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఉద్దేశంతోనే ‘జిరాఫీ చెస్‌’ను కనిపెట్టారు. ఈ ఆట ఇంటర్నేషనల్‌ జిరాఫీ చెస్‌ ఫెడరేషన్‌ (ఐజీసీఎఫ్‌) గుర్తింపు పొందింది. 68 గడుల బోర్డు మీద ఆడే ఈ ఆటే మనకు కొత్త అనుకుంటుంటే.. అందులో పతకాల పంట పండిస్తున్నాడు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తొమ్మిదేళ్ల పి.సుజన్‌కుమార్‌ రెడ్డి. తల్లిదండ్రులు సునీల్‌కుమార్‌ రెడ్డి, వసుంధర. వీళ్లది చిరు వ్యాపారం.   

భిన్నంగా ఉండాలని..  

పాఠశాలలో నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో సుజన్‌కుమార్‌ కచ్చితంగా పాల్గొనేవాడు. తన తండ్రి ద్వారా జిరాఫీ చెస్‌ గురించి తెలుసుకొని.. మూడో తరగతి నుంచే శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. అక్కడితో సరిపోదు కదా.. పాఠశాల నుంచి వచ్చాక, సెలవు రోజుల్లో క్రమం తప్పకుండా సాధన చేసేవాడు. దాంతో తక్కువ సమయంలోనే ఆటపై పట్టు పెంచుకున్నాడు. మెలకువలూ నేర్చుకున్నాడు. సాధారణ చదరంగంలో 64 గడులుంటే.. జిరాఫీ చెస్‌లో ఇంకో నాలుగు ఎక్కువ. సాధారణ చెస్‌ బోర్డులో ఉండే పావులకు అదనంగా ఇందులో రెండు జిరాఫీలు ఉంటాయి. అవి ‘టూ ప్లస్‌ స్టెప్‌’తో ‘ఎల్‌’ ఆకారంలో కదులుతాయి. దీని వల్ల ఆట డ్రా కాకుండా ఉంటుంది. గెలవడం లేదా ఓడిపోవడం మాత్రమే జరుగుతుంది. అందుకే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో దీనిపై మక్కువ పెంచుకున్నాడు సుజన్‌. బడిలో పీఈటీల ప్రోత్సాహంతో మరిన్ని మెలకువలు నేర్చుకొని ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. వయసులో తనకంటే పెద్దవాళ్లనూ ఓడిస్తూ ‘ఔరా’ అనిపిస్తున్నాడు. 

వరస పురస్కారాలు.. 

ఇప్పటికే ఈ బాలుడికి వివిధ స్థాయిల్లో అవార్డులూ దక్కాయి. రెండేళ్లుగా అనేక పోటీల్లో పాల్గొని 100 పాయింట్లతో ‘బెస్ట్‌ స్కాలర్‌’గా నిలిచాడు. తాజాగా ఈ ఏడాది కడపలో జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించిన అండర్‌-17, అండర్‌-19లో డబుల్స్‌ రన్నరప్‌గా నిలిచి ట్రోఫీ అందుకున్నాడు. ఏప్రిల్, మేలో జరిగిన అండర్‌-11, అండర్‌-13 పోటీల్లో సింగిల్స్‌లో వరస పురస్కారాలు గెలుచుకున్నాడు. ఆటలతో ఏకాగ్రత పెరగడంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందనీ.. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని అంటున్నాడు సుజన్‌. మరి ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా! 

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్, కడప 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని