Akash vukoti: అదరహో ఆకాశ్‌!

ఆంధ్రా బాలుడు అమెరికాలో అదర కొడుతున్నాడు. ప్రతిష్టాత్మక స్క్రిప్ట్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ - బీ కార్యక్రమంలో ఈ చిన్నారి అలవోకగా ఆంగ్ల పదాలకు స్పెల్లింగ్‌లు చెబుతూ విజేతగా నిలుస్తూ వస్తున్నాడు.

Published : 08 Jul 2024 01:04 IST

ఆంధ్రా బాలుడు అమెరికాలో అదర కొడుతున్నాడు. ప్రతిష్టాత్మక స్క్రిప్ట్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ - బీ కార్యక్రమంలో ఈ చిన్నారి అలవోకగా ఆంగ్ల పదాలకు స్పెల్లింగ్‌లు చెబుతూ విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. ఈ పోటీల్లో పాల్గొన్న అతిచిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించాడు. ప్రముఖ కంపెనీలకు ముఖ్య ఉపన్యాసకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో ఆదాయమూ సమకూరుతోంది. ప్రపంచంలో అత్యధికంగా ఆదాయ పన్ను చెల్లించే వంద మంది పిల్లల్లో ఒక్కడిగా నిలిచాడు! తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆదర్శంగా నిలిచాడు. ఇటీవల ఆ చిరుత తన తండ్రితో కలిసి గుంటూరు జిల్లా వచ్చాడు. ఆయా కళాశాలల్లో ఏర్పాటు చేసిన సదస్సుల్లో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన ఆంగ్ల పదాలకు అలవోకగా స్పెల్లింగ్‌ చెబుతూ అబ్బుర పరిచాడు. ఈ సందర్భంగా ‘హాయ్‌బుజ్జీ’తో మాట్లాడాడు. ‘ఇంతకీ ఆ చిచ్చరపిడుగు ఎవరబ్బా?’ అని తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి సరేనా!

చిత్తూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఉకోటి కృష్ణ, చంద్రకళ దంపతులు కొన్నేళ్ల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. వారికి రెండో సంతానంగా 2009 మే 29న ఆకాశ్‌ జన్మించాడు. రెండో ఏడాది నుంచి బొమ్మలతో ఆడుకోకుండా పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు! వాషింగ్టన్‌లో ప్రతి సంవత్సరం 14 ఏళ్లలోపు పాఠశాల పిల్లలకు స్క్రిప్ట్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ - బీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వాటిలో రెండేళ్ల వయస్సులో పాల్గొన్న అతి చిన్న వయస్కుడిగా ఆకాశ్‌ రికార్డు సృష్టించాడు. ఆరేళ్ల వయసులో మరో సారి స్పెల్లింగ్‌ - బీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. అక్కడ నుంచి అతడి జీవితం మలుపు తిరిగింది. ఇలా ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు. తల్లిదండ్రుల సాయంతో టాలెంట్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. దాని ఆధ్వర్యంలో ఆకాశ్‌ ఉకోటి.. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పని చేస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకాశ్‌కు సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు.

తండ్రి తోడుగా...

ప్రస్తుతం ఆకాశ్‌కు 15 ఏళ్లు. టెక్సాస్‌లోని సెంట్రల్‌ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలం క్రితమే అమెరికాలోని స్క్రీన్‌ యాక్టర్స్‌ గ్రీన్‌ (హాలీవుడ్‌ సినిమా సంఘం)లో సభ్యుడిగా చేరాడు. అక్కడ ప్రముఖ కంపెనీలకు ముఖ్య ఉపన్యాసకుడిగా పని చేస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో డాక్యుమెంటరీ ఫిలిం చేశారు. ఈ క్రమంలో కొద్ది కాలంలో ఆకాశ్‌ సంపాదన కోట్ల రూపాయలకు చేరింది. ప్రపంచంలో ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించే 100 మంది పిల్లల్లో ఆకాశ్‌ స్థానం సంపాదించాడు. ఏ కార్యక్రమానికి వెళ్లినా, తోడుగా తన తండ్రి కృష్ణ వెళ్లేవారు.

సత్తా చాటుతా..

‘హార్వర్డు యూనివర్సిటీలో సీటు సంపాదించి ఉన్నత చదువులు చదవడమే ఆశయం. అమెరికా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పార్లమెంటు సభ్యుడిగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నా. నందమూరి తారకరామారావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు స్ఫూర్తి. గతంలో ఒకసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అభినందనలూ అందుకున్నాను’ అంటున్నాడు ఆకాశ్‌. భవిష్యత్తులో ఈ అన్నయ్య మరిన్ని విజయాలు అందుకోవాలని మనమూ మనసారా కోరుకుందామా!

యర్రంనేని హరిబాబు, న్యూస్‌టుడే, మేడికొండూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని