శెభాష్‌ అమిరా!

హాయ్‌ ఫ్రెండ్స్‌..‘ఆస్కార్‌’ అంటే సినీ ప్రపంచంలో అత్యున్నత అవార్డు అని మీకు తెలిసే ఉంటుంది కదా! తాజాగా జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డుల అందజేత కార్యక్రమంలో పురస్కారం గెలుచుకున్న వారితోపాటు 14 ఏళ్ల బాలిక కూడా వార్తల్లో నిలిచింది.

Published : 13 Mar 2023 00:15 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..‘ఆస్కార్‌’ అంటే సినీ ప్రపంచంలో అత్యున్నత అవార్డు అని మీకు తెలిసే ఉంటుంది కదా! తాజాగా జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డుల అందజేత కార్యక్రమంలో పురస్కారం గెలుచుకున్న వారితోపాటు 14 ఏళ్ల బాలిక కూడా వార్తల్లో నిలిచింది. ఇంతకీ తను ఏం సాధించిందో, ఆ విశేషాలేంటో చదివేయండి మరి..

అమెరికాలోని బ్రూక్లైన్‌ ప్రాంతానికి చెందిన అమిరా డియోర్‌ ట్రన్హం ఆర్టిస్‌ అనే బాలిక ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు, సెలబ్రిటీలకు అందించే గిఫ్టు ప్యాక్స్‌లో అమిరా డిజైన్‌ చేసిన స్నీకర్స్‌(బూట్లు) కూడా ఉండటం విశేషం.

తల్లి ప్రోత్సాహం..

అమిరాకు చిన్నతనం నుంచే కళలు, డిజైనింగ్‌ అంటే చాలా ఇష్టమట. మూడు సంవత్సరాల వయసులోనే కూతురులోని ప్రతిభను తల్లి గుర్తించింది. చెప్పులు, హ్యాండ్‌బ్యాగులు తదితర వస్తువులను డిజైన్‌ చేసేలా ప్రోత్సహించింది. కాలంతోపాటు ఈ నేస్తం కూడా డిజైనింగ్‌లో చాలా మెలకువలు నేర్చుకుంది. అలా 2021లో కూతురికి గ్రాఫిక్‌ డిజైన్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేసిందామె. ఆ సాఫ్ట్‌వేర్‌ సాయంతో కొత్త బూట్ల డిజైన్లను తయారు చేయమని తల్లి సూచించింది. అలా కొన్ని గంటలపాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని, అప్పటి వరకూ మార్కెట్‌లో లేని మోడల్‌ను డిజైన్‌ చేయాలనీ, రంగులు కూడా క్లాసీగా ఉండాలని అనుకుంది అమిరా.

సొంత బాటలో..

కొద్ది గంటల ప్రాక్టీస్‌ తర్వాత.. ఎట్టకేలకు ఒక డిజైన్‌ను తయారు చేసింది అమిరా. అది వాళ్ల అమ్మకూ నచ్చడంతో.. దాని తయారీ బాధ్యతలను ఇటలీలోని ఓ సంస్థకు అప్పగించారు. అంతటితోనే అయిపోదు కదా.. తన డిజైన్‌కు ‘లేన్‌ 1’ బ్రాండ్‌గా పేరు పెట్టింది. అంటే.. ‘తనదైన ప్రత్యేక బాట’ అనే అర్థం వచ్చేలా ఎంపిక చేసుకుంది. అదే బ్రాండ్‌ పేరుతో అమిరా డిజైన్‌ ఆధారంగా స్నీకర్స్‌ను తయారు చేసిందా ఇటలీ సంస్థ. తర్వాత న్యూయార్క్‌కు చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌తో కలిసి తన బూట్లను ఓ ప్రదర్శనలో ఉంచింది. వాటిని ఓ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులు చూసి.. డిజైన్‌ చేసిన అమిరాతోపాటు వాళ్లమ్మతోనూ మాట్లాడారు.

అతిథులకు అందించేందుకు..

ఆస్కార్‌లో వివిధ విభాగాల్లో నామినేట్‌ అయిన వారితోపాటు కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు అందించేందుకు 75 జతల స్నీకర్స్‌ కావాలని ఆ మేనేజ్‌మెంట్‌ సంస్థ వాళ్లు అమిరాను కోరారు. అంత గొప్ప అవకాశం రావడంతో తనూ సరేనంది. అకాడమీ అవార్డుల సందర్భంగా అతిథులకు ఇచ్చే బహుమతుల్లో ఈ నేస్తం తయారు చేసిన బూట్లను కూడా అందించారన్నమాట. అంతకుముందు కొన్ని శిక్షణ తరగతులకూ హాజరైందట. ఒకవైపు చదువుకుంటూనే, ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజైనింగ్‌ రంగంలో రాణిస్తోంది. ‘వయసుతో సంబంధం లేకుండా మన మీద మనకు నమ్మకం ఉండి, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని.. తనతోటి వారికి స్ఫూర్తిగా నిలవాలన్నదే తన ప్రయత్నమని చెబుతోంది అమిరా. భవిష్యత్తులో పెద్ద బిజినెస్‌ ఉమెన్‌ కావాలన్నది తన లక్ష్యమట. నేస్తాలూ.. ఆస్కార్‌లాంటి అత్యుత్తమ వేదికపైన తన బ్రాండ్‌కు స్థానం దక్కడమంటే మాటలు కదా కదా.. అందుకే, మనమూ అమిరాను అభినందించాల్సిందే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని