డాంగ్‌ టావో... అనే నేను!

నా పేరు డాంగ్‌ టావో. నన్ను డ్రాగన్‌ చికెన్‌ అని కూడా పిలుస్తారు. నేను వియత్నాంకు చెందిన అరుదైన కోడి జాతిని. నా జీవితకాలం కూడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే.

Updated : 09 Feb 2023 00:49 IST

హాయ్‌ నేస్తాలూ! ఏంటి విచిత్రంగా చూస్తున్నారు. నేను బొమ్మను కాదు. కోడినే. ‘మరేంటి ఇలా ఉన్నావు?’ అని అడగాలనుకుంటున్నారు కదూ! ‘అసలు ఆ కాళ్లేంటి అంత లావున్నాయి?’ అనే అనుమానమూ మీకు వచ్చి ఉంటుంది కదా! ఆ సంగతులన్నీ చెప్పడానికే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు డాంగ్‌ టావో. నన్ను డ్రాగన్‌ చికెన్‌ అని కూడా పిలుస్తారు. నేను వియత్నాంకు చెందిన అరుదైన కోడి జాతిని. నా జీవితకాలం కూడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. మాలో మగవి దాదాపు 5.89 కిలోగ్రాముల బరువుంటాయి. ఆడవేమో 4.53 కిలోల వరకు బరువు తూగుతాయి. సంవత్సరానికి కేవలం 60 గుడ్లు మాత్రమే పెడతాం. అంటే మిగతా కోళ్లతో పోల్చుకుంటే, చాలా తక్కువ. ఇందులోంచి పిల్లలు వచ్చే శాతం ఇంకా తక్కువ. అందుకే మేం చాలా అరుదైన కోడి జాతిగా పేరుగాంచాం.


చాలా కష్టం..!

మమ్మల్ని పెంచాలంటే నిజంగా చాలా కష్టం. వాతావరణంలో చిన్న చిన్న మార్పులను కూడా మేం తట్టుకోలేం.. ఏకంగా మా ప్రాణాలనే వదిలేస్తాం. వియత్నాం, అమెరికా.. ఇంకా చాలా తక్కువ దేశాల్లో మాత్రమే మేం పెరగగలం. అందుకే మమ్మల్ని పెంచి పెద్ద చేయడం చాలా ఖర్చు, ప్రయాసతో కూడుకున్న పని. అందుకే మా మాంసానికి కూడా ధర ఎక్కువ. చాలా ఖరీదైన రెస్టరంట్‌లలో మాత్రమే మా మాంసం దొరుకుతుంది. ధర కూడా వేల రూపాయల్లోనే ఉంటుంది.


ఆహా ఏమి రుచి...

మా మాంసానికి ధర ఎక్కువైనా.. భోజన ప్రియులు మాత్రం వెనక్కి తగ్గరు. దీనికి కారణం రుచి. అవును మా మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా మా కాళ్లు, తొడలంటే లొట్టెలేసుకు తినేస్తారు. పైగా వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిదట.


వేలల్లోనే...

మా సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ. కేవలం వేలల్లోనే మేం మిగిలి ఉన్నాం. మేం అంత భారీకాయంతో ఉన్నా.. చురుగ్గానే ఉంటాం. మా కాళ్లు చూడ్డానికి లావుగా, పొలుసులతో చాలా భయంకరంగా ఉంటాయి. అవి కాస్త డ్రాగన్‌ను పోలి ఉంటాయి కాబట్టే మాకు డ్రాగన్‌ చికెన్‌ అనే పేరు  వచ్చింది. ఇవీ నా విశేషాలు. సరే నేస్తాలూ... ఇక ఉంటామరి బై.. బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని