పప్పీలకూ ఓ దాబా.!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పప్పీలంటే చాలా ఇష్టం కదూ! రోజూ ఉదయం బడికి వెళ్లేముందూ, సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే వాటికి ఏదో ఒకటి ఆహారంగా పెడుతుంటాం.

Updated : 28 Feb 2023 01:13 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పప్పీలంటే చాలా ఇష్టం కదూ! రోజూ ఉదయం బడికి వెళ్లేముందూ, సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే వాటికి ఏదో ఒకటి ఆహారంగా పెడుతుంటాం. బయటకు వెళ్లినప్పుడు మనతోపాటు సరదాగా వాటిని కూడా తీసుకెళ్తాం. కానీ, హోటల్‌లాంటి కొన్ని ప్రదేశాల్లో మన పప్పీల వల్ల ఇతరులు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోటల్‌ అయితే ప్రత్యేకంగా కుక్కల కోసమే ఏర్పాటు చేశారు. ఆ వివరాలే ఇవీ..

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరం పరిశుభ్రతకు మారుపేరు. గత నాలుగైదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ‘స్వచ్ఛ నగరం’గా అవార్డూ అందుకుంటోంది. అయితే, ఈ నగరం శుభ్రతతోపాటు జంతు సంరక్షణ విషయంలోనూ సరికొత్త కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తోంది. ఇటీవల ఓ అన్నయ్య నగరంలోని తన ఇంటినే ‘డాగీ దాబా’గా మార్చేశారు. కుక్కల ఆకలి తీర్చేందుకే ఈ సరికొత్త దాబాను ప్రారంభించారట.

లాక్‌డౌన్‌లో ఆలోచన

బాల్‌రాజ్‌ జాలా అనే అన్నయ్య ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. స్వతహాగా జంతు ప్రేమికుడు కావడంతో, రోజూ రాత్రి విధులు ముగిసిన తర్వాత.. మిగిలిన ఆహారాన్ని తీసుకెళ్లి వీధి కుక్కలకు వేసేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఆకలితో అవి పడిన ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాడు. ఆ సమయంలోనే కుక్కల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. అలా రెండేళ్ల క్రితం భార్య సహాయంతో తన ఇంటినే ‘డాగీ దాబా’గా మార్చేశాడు.

ఇంటికే పంపిస్తూ..

ఈ దాబాలో రూ.7 నుంచి రూ.700 వరకూ ఖరీదైన ఆహారం దొరుకుతుందట. అంతేకాదు.. పెంపుడు కుక్కల పుట్టినరోజుకు అవసరమైన కేకులను తయారు చేయడంతోపాటు పార్టీలూ నిర్వహిస్తుంటారు. శాకాహార, మాంసాహార వంటకాలతోపాటు సప్లిమెంట్స్‌ కూడా అందిస్తారట. కుక్కలకు వ్యాయామంతోపాటు నీటిలో, ఇసుకలో ఆడుకునేందుకూ అనువైన ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎక్కడి నుంచైనా పప్పీల కోసం ఆహారాన్ని ఆర్డర్‌ కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజూ దాదాపు 500 ప్యాకెట్ల వరకూ డెలివరీ చేస్తుంటారట. ఇందుకు ఓ వాహనాన్నీ సిద్ధం చేశారు. ఈ దాబా ఏర్పాటు చేసేందుకు తనకు రూ.3 లక్షల ఖర్చు అయిందని చెబుతున్నాడీ అన్నయ్య. ప్రస్తుతం ఒకటీ రెండు పార్కుల వద్ద రూ.7కే కుక్కల కోసం ఆహార ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. దీన్ని త్వరలోనే నగరవ్యాప్తంగా అమలు చేస్తారట. ఆహారం పెట్టడంతోపాటు ఇక్కడ వాటి బాగోగులు కూడా చూస్తుంటారు. పనుల మీద ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు.. తమ పెంపుడు శునకాలను ఇక్కడ వదిలిపెట్టొచ్చు. కాకపోతే కాస్త ఛార్జీ వసూలు చేస్తారు మరి.. నేస్తాలూ.. మొత్తానికి ఈ ‘డాగీ దాబా’ భలే ఉంది కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని