చేపా.. చేపా.. నీకెందుకా రంగు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బుజ్జి బుజ్జి చేపలన్నా, వాటిని అక్వేరియాల్లో పెంచుకోవాలన్నా మనలో చాలామందికి ఇష్టం. సాధారణంగా చేపల శరీర లోపలి భాగం గోధుమ, బూడిద రంగులో ఉంటుంది.

Published : 11 Mar 2023 00:37 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బుజ్జి బుజ్జి చేపలన్నా, వాటిని అక్వేరియాల్లో పెంచుకోవాలన్నా మనలో చాలామందికి ఇష్టం. సాధారణంగా చేపల శరీర లోపలి భాగం గోధుమ, బూడిద రంగులో ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చేపలది మాత్రం నీలం రంగులో ఉంటుంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

త్తర అమెరికాలోని పశ్చిమ తీర సముద్ర జలాల్లో ‘లింగ్‌కోడ్‌’ అనే జాతి చేపలు కనిపిస్తుంటాయి. వాటిలో ప్రతి అయిదింటిలో ఒకదాని శరీరంతోపాటు లోపలి భాగమూ లేత నీలం రంగులో ఉంటుంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఆ జాతి చేపల్లోనే, అందులోనూ కొన్నే అలా నీలం రంగులో ఎందుకుంటాయో ఇంతవరకూ ఎవరూ చెప్పలేకపోతున్నారు.

కదిలితేే.. అంతే..  

ఈ ‘లింగ్‌కోడ్‌’ జాతి చేపలు నీటి అడుగు భాగంలోనే తిరుగుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉపరితలానికి వస్తాయట. అయితే, వీటికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ చేపలు దాదాపు 152 సెంటీమీటర్ల వరకూ పొడవు పెరుగుతాయి. నోరు కూడా పెద్దదిగా ఉండటంతో, వీటి ముందు కదులుతూ కనిపించిన ప్రతి జీవినీ తినే ప్రయత్నం చేస్తాయట. అందులోనూ నోటి ఆకారానికి సరిపోయే ఆహారాన్నే ఎంపిక చేసుకుంటాయి. అయితే ఈ జాతిలో ఆడ చేపలే ఎక్కువగా ఇలా నీలం రంగును కలిగి ఉంటాయట.

పరిశోధనలు జరిగితే కదా..

2016లో ఓ అమెరికా శాస్త్రవేత్త సముద్ర మార్గంలో పయనిస్తూ.. ఈ లింగ్‌కోడ్‌ జాతి చేపలను మొదటిసారి చూశాడట. అవి ఆసక్తిగా కనిపించడంతో.. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చాలా వెతికాడు. కానీ, అందుకు సంబంధించిన వివరాలేవీ దొరకలేదు. అంతకుముందు ఎవరూ ఈ జాతి చేపల గురించి పరిశోధనలు చేయకపోవడంతో ఏ సమాచారమూ లభించలేదు. కొన్ని మాత్రమే అలా నీలం రంగులో ఎందుకు ఉంటున్నాయో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరేమో న్యూక్లియర్‌ రేడియేషన్‌ వల్లేనని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో జన్యులోపాలని తేల్చేస్తున్నారు. నేస్తాలూ.. కారణమేదైనా, ఈ రంగులోనూ చేపలు ఉంటాయని మనకైతే తెలిసింది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని