నా కాళ్లు చాలా పొడవోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌! బాగున్నారా? ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. పొడవైన, సన్నని కాళ్లతో ఉన్న నేను ఎవరనా? అది చెప్పడానికే ఇదిగో ఇలా వచ్చాను.

Published : 06 Feb 2023 00:51 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! బాగున్నారా? ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. పొడవైన, సన్నని కాళ్లతో ఉన్న నేను ఎవరనా? అది చెప్పడానికే ఇదిగో ఇలా వచ్చాను.

ఫ్రెండ్స్‌... నా పేరు మేన్డ్‌ వూల్ఫ్‌. పేరుకే నేను తోడేలును కానీ నిజానికి కాదు. నక్కను కూడా కాదు. వాస్తవానికి నేనో కుక్కను. కానీ నాకు పేరు మాత్రం మేన్డ్‌ వూల్ఫ్‌ అని పెట్టారు! మీరు నన్ను చూసి ఉండరు. ఎందుకంటే నేను మీ దేశంలో ఉండను కాబట్టి. నేను కేవలం అర్జెంటీనా, బ్రెజిల్‌, బొలివీయా, పెరూ, పెరుగ్వే, ఉరుగ్వే దేశాల్లో మాత్రమే కనిపిస్తాను. నిజానికి నేను ఉరుగ్వేలో చాలా అరుదుగా కనిపిస్తాను. ప్రస్తుతం ఈ దేశంలో దాదాపు అంతరించిపోయాను అనే చెప్పుకోవచ్చు!

పెద్దగా అరుస్తాను!

నా అరుపు చాలా గట్టిగా ఉంటుంది. నేను 20 నుంచి 30 కేజీల వరకు బరువు పెరుగుతాను. నా కాళ్ల పొడవు 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ కాళ్లు సన్నగా, పొడుగ్గా కనిపిస్తాయి. ఇవే నా ప్రత్యేకతలు. శరీరం పొడవు 100 సెంటీమీటర్లు ఉంటుంది. తోకేమో 45 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. చెవులు కూడా పెద్దగా ఉంటాయి. దాదాపు 18 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి.

ఏం తింటానంటే...

నేను చిన్న చిన్న జంతువులను తింటాను. నాకు కుందేళ్ల మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే వాటిని ఎక్కువగా వేటాడతాను. పక్షులు, వాటి గుడ్లు, బల్లులు, తొండలు, చేపలు, నత్తలు, చిన్న చిన్న పురుగుల్ని కూడా తింటాను. కొన్నిసార్లు ఏకంగా జింకల్ని కూడా వేటాడతాను. అలా అని కేవలం మాంసాహారిని మాత్రమే కాదు. వూల్ఫ్‌ ఆపిల్‌ అనే పండును కూడా ఇష్టంగా తింటాను. మీకు మరో విషయం తెలుసా.. చెరకును కూడా నేను తింటాను. కొన్ని రకాల మొక్కల వేర్లను కూడా తినేస్తా. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా సంగతులు. భలే ఉన్నాయి కదూ! సరే ఇక ఉంటా మరి... బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని