మోగిస్తే మోతే... ఊరంతా ఉర్రూతే!

నేస్తాలూ... మనం ఏదైనా జాతరకో, బొమ్మల దుకాణానికో వెళితే బుజ్జి బుజ్జి డ్రమ్స్‌, చిన్ని చిన్ని పియానోల వంటి ఆట వస్తువులు కొనివ్వమని మారాం చేస్తుంటాం కదా.

Published : 29 Mar 2023 00:14 IST

నేస్తాలూ... మనం ఏదైనా జాతరకో, బొమ్మల దుకాణానికో వెళితే బుజ్జి బుజ్జి డ్రమ్స్‌, చిన్ని చిన్ని పియానోల వంటి ఆట వస్తువులు కొనివ్వమని మారాం చేస్తుంటాం కదా. మనకు వాటిని సరిగా వాయించడం రాకున్నా... వాటితో ఆడుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తాం!  కానీ, ఓ చిన్నారి మాత్రం నిజమైన సంగీత పరికరాలపై తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

దక్షిణాఫ్రికాకు చెందిన పన్నెండేళ్ల బాలిక నాండీ బుషెల్‌ తన ప్రతిభతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. డ్రమ్స్‌ వాయిస్తూ.. పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందింది. తను డ్రమ్స్‌ వాయిస్తూ.. పాటలు పాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. డ్రమ్స్‌ ఒక్కటే కాదు నేస్తాలూ... గిటార్‌, పియానో, బాస్‌ గిటార్‌ వంటి వివిధ రకాల సంగీత పరికరాలను అలవోకగా వాయిస్తోంది.

ఏడేళ్ల వయసు నుంచే...

నాండీ బుషెల్‌కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఏలియన్‌ థీమ్‌ మ్యూజిక్‌ను రకరకాలుగా వాయించేది. అతి చిన్న వయసులోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. మహామహులే ఔరా.. అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఓ మ్యాగజైన్‌ నిర్వహించిన పోటీల్లో పాల్గొని, డ్రమ్స్‌ వాయించిన అతిచిన్న వయస్కురాలిగా నిలిచింది. అలాగే లండన్‌లో జరిగిన ప్లాటినమ్‌ జూబ్లీ ఆఫ్‌ ఎలిజిబెత్‌ కార్యక్రమంలో అతిథి ప్రదర్శన ఇచ్చింది. పదేళ్ల వయసులో క్లైమెట్‌ ఛేంజ్‌లపై తానే సొంతంగా పాటను రాసి.. దానికి మ్యూజిక్‌ను జత చేసింది. దీనికి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.

పదేళ్లకే ప్రతిష్ఠాత్మకమైన అవార్డు

ఇప్పటి వరకూ.. బుషెల్‌ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చింది. ప్రత్యేక ఆల్బమ్స్‌ కూడా చేసింది. తన రచనలు, ఆల్బమ్స్‌కుగాను గోల్డ్‌ బ్లూ పీటర్‌ బ్యాడ్జిని సొంతం చేసుకుంది. ఇది చాలా ప్రత్యేకమైన అవార్డు. ఎంతో అరుదైన సందర్భాల్లో మాత్రమే దీన్ని అందిస్తుంటారు. అంత తక్కువ వయసులో ఇంత ప్రతిభ కనబరచడం నిజంగా గ్రేట్‌ కదూ! మరి నాండీ బుషెల్‌ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని