Clarks Nutcracker: పిట్ట కొంచెం.. జ్ఞాపకశక్తి ఘనం!

హాయ్‌ ఫ్రెండ్స్‌. మనకు పరీక్షలంటే చాలా భయం కదా. చదివినవి సరిగ్గా సమయానికి గుర్తుకు వస్తాయో.. రావో అని తెగ హైరానా పడుతుంటాం కదూ!

Published : 27 Mar 2023 00:25 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌. మనకు పరీక్షలంటే చాలా భయం కదా. చదివినవి సరిగ్గా సమయానికి గుర్తుకు వస్తాయో.. రావో అని తెగ హైరానా పడుతుంటాం కదూ! కానీ ఓ పక్షికి మాత్రం తెగ జ్ఞాపకశక్తి. ఇంతకీ దాని పేరేంటి? అదెక్కడుంటుందో.. తెలుసుకుందామా.

ఆ పక్షి పేరు క్లార్క్స్‌ నట్‌క్రాకర్‌. ఇంకా దీన్ని క్లార్క్స్‌ కాకి, వడ్రంగిపిట్ట కాకి అని కూడా పిలుస్తుంటారు. ఇది ఉత్తరఅమెరికాలోని పర్వతప్రాంతాల్లో నివసిస్తుంటుంది. ప్రపంచంలో మరే పక్షికీ లేనంత జ్ఞాపకశక్తి దీనికి సొంతం.

దాస్తుంది... తీస్తుంది...

ఈ క్లార్క్స్‌ నట్‌క్రాకర్‌ పక్షి వేసవిలో విత్తనాలను నేలలో పాతి పెడుతుంది. చలికాలంలో వాటిని ఎంచక్కా నేల నుంచి తవ్వి తీసుకుని తింటుంది. కానీ ఇవి ఉడుతల్లా మాత్రం అస్సలు మరిచిపోవు. పైగా ఆ విత్తనాలన్నింటినీ ఒకే చోట అస్సలు దాయవు.

బుజ్జి బొజ్జ కోసం..

ఒక్క క్లార్క్స్‌ నట్‌క్రాకర్‌ పక్షి ఒక్కో సీజన్‌లో దాదాపు 98,000 విత్తనాలను సేకరిస్తుంది. నేలను తవ్వి వేరువేరు చోట్ల 1 నుంచి 15 వరకు విత్తనాలను దాచిపెడుతుంది. చలికాలం రాగానే ఆహారానికి కొరత ఏర్పడుతుంది. అప్పుడు ఈ పక్షులు వేసవికాలంలో తాము దాచుకున్న విత్తనాలను వెలికితీసి తినేస్తాయి. ఇలా తమ బుజ్జి బొజ్జ నింపుకొంటాయి.

పురుగుల్నీ కరకర...

ఈ పక్షులు కేవలం విత్తనాలే కాకుండా చిన్న చిన్న పురుగుల్నీ తింటాయి. శీతాకాలంలో మాత్రం ఎక్కువగా విత్తనాలపై ఆధారపడతాయి. ఈ పక్షులు కేవలం 27 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుంటాయి. బరువేమో 106 నుంచి 161 గ్రాముల వరకు ఉంటాయి. రెక్కలు చాచినప్పుడు పక్షి వెడల్పు దాదాపు 61 సెంటీమీటర్లు ఉంటుంది.

గూడును కట్టి.. గుడ్లను పెట్టి...

ఈ బుజ్జి పిట్ట ఎంచక్కా చెట్ల కొమ్మలపై గూళ్లను కట్టుకుంటుంది. ఆడ పక్షి రెండు నుంచి నాలుగు గుడ్లను పెట్టి, వాటిని 16 నుంచి 18 రోజుల వరకు పొదుగుతుంది. తర్వాత వాటి నుంచి బుజ్జి బుజ్జి పక్షిపిల్లలు బయటకు వస్తాయి. వాటిని కంటికి రెప్పల్లా కాపాడి పెద్ద చేస్తాయి. తర్వాత అవి కూడా వేసవిలో విత్తనాలు దాస్తాయి. చలికాలంలో అస్సలు మరిచిపోకుండా వాటిని ఆహారంగా తీసుకుంటాయి. నేస్తాలూ...! మొత్తానికి ఇవీ ఈ క్లార్క్స్‌ నట్‌క్రాకర్‌ పక్షి విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని