Published : 09 Jan 2023 01:16 IST

మిమిక్రీ పక్షిని నేను!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా.. నా పేరు లైర్‌. నేనో పక్షిని. అలా అని సాదాసీదా పక్షిని కాదండోయ్‌! నేను మిమిక్రీ చేయగలను. ఇంకా నా ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలని ఉందా? అవి చెప్పడానికే ఇదిగో ఇలా మీ ముందుకొచ్చా. మరి ఆ విశేషాలు తెలుసుకుంటారా..

న్ను ఈ మధ్య మహారాష్ట్రలోని మెల్ఘాట్‌ అటవీ ప్రాంతంలో గుర్తించారు. నన్ను చూడగానే పరిశోధకులంతా అవాక్కయ్యారు. ఎందుకంటే నేను భారతదేశానికి చెందిన పక్షిని కాదు మరి. నేను ఆస్ట్రేలియాలో మాత్రమే నివసిస్తాను. కానీ మీ దేశానికెలా వచ్చానో నాకైతే గుర్తులేదు. అది తెలుసుకునే ప్రయత్నంలోనే మీ శాస్త్రవేత్తలున్నారు. తెలిసిన వెంటనే మీకు వాళ్లు చెబుతారులెండి.

వింటే.. వెంటనే...!

మా లైర్‌ పక్షుల్లో ప్రధానంగా రెండు రకాలుంటాయి. మేం మిమిక్రీకి ప్రసిద్ధి. ఏదైనా ఒక శబ్దాన్ని వింటే వెంటనే దాన్ని అనుకరిస్తాం. దాదాపుగా ఆ శబ్దాన్ని పలికే ప్రయత్నం చేస్తాం. అడవిలో వినిపించే శబ్దాలతోపాటు కృత్రిమ ధ్వనులనూ మేం అనుకరించగలం. ఇది మాకు ప్రకృతి ప్రసాదించిన వరం.

నెమలి లక్షణాలు!

నాలో కొన్ని నెమలి లక్షణాలూ ఉన్నాయి. మాలో మగవి నెమలి పింఛం విప్పినట్లుగా తమ తోకను విసనకర్రలా విప్పుతాయి. రెండు పెద్ద, మిగతావి చిన్న చిన్న ఈకలతో చూడడానికి భలే అందంగా ఉంటుందనుకోండి. అందుకే మాకు ‘పికాక్‌ వెర్న్స్‌’ అనే పేరు సైతం ఉంది. మేం ఆస్ట్రేలియాకు చెందిన పురాతన ప్రాణులం. ప్రాచీన కాలం నుంచి మేమంతా ఆస్ట్రేలియాలో జీవిస్తున్నాం.

రివ్వున ఎగరలేం...!

మేం పెద్దగా ఎగరలేం. నేలమీదే జీవిస్తాం. మా కాళ్లు, పాదాలు చాలా బలంగా ఉంటాయి. మాకు చిన్న చిన్న రెక్కలుంటాయి. ఇవి ఎగరడానికి పెద్దగా సహకరించవు. కానీ వీటి సాయంతో మేం గ్లైడింగ్‌ మాత్రం చేస్తుంటాం. మాలో ఆడవి 74 నుంచి 84 సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. మగవేమో 80 నుంచి 98 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. మేం కిలో కన్నా కాస్త తక్కువ బరువే తూగుతాం.

మాకు సిగ్గెక్కువ!

మాకు చాలా సిగ్గు. ఎవరైనా మనుషులు, ఇతర జీవులు కనిపిస్తే వెంటనే దాక్కుంటాం. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాం. మేం ఎక్కువగా బొద్దింకలు, పురుగులు, ఈగలు, లార్వాలు, సాలీళ్లు, జెర్రులు, వానపాములను ఇష్టంగా తిని బతుకుతాం. బల్లులు, కప్పలు, విత్తనాలనూ అప్పుడప్పుడు ఆరగిస్తాం. మీ దగ్గర కోళ్లు నేలను తవ్వి పురుగుల్ని తిన్నట్లే, మేమూ చేస్తాం. అన్నట్లు చెప్పడం మరిచిపోయా, ఆస్ట్రేలియా ప్రభుత్వం 1932లోనే నా చిత్రంతో పోస్టల్‌ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది తెలుసా! అంతే కాదండోయ్‌.. నాణేలు, కరెన్సీ నోట్ల మీద కూడా నా బొమ్మను ముద్రించారు. మా జీవిత కాలం కాస్త ఎక్కువే. ఎంచక్కా.. మేం దాదాపు 20 సంవత్సరాల వరకు జీవించగలం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు