మా పూలు కోస్తే...పెద్ద పుట్టుక...

మీ దక్షిణ భారత దేశంలో మేం తక్కువ. చలి ప్రాంతాలంటేనే మాకిష్టం. అందుకే మీ ఉత్తరాది రాష్ట్రాల్లో మేం ఉన్నాం. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం, పశ్చిమ్‌బంగలాంటి రాష్ట్రాల్లో మా ఉనికి ఉంది...

Updated : 08 Dec 2022 21:24 IST

నేనే...  చెర్రీ చెట్టును. గుర్తొచ్చాను కాదు. ఎర్రని నా పండ్లు, రంగుల నా పూలు తెలియదేవారికిలెండి. అక్కడక్కడ నేనున్నా అంతటా నా పేరు మార్మోగిపోతూనే ఉంటుంది మరి.

పుట్టుక

* మీ దక్షిణ భారత దేశంలో మేం తక్కువ. చలి ప్రాంతాలంటేనే మాకిష్టం. అందుకే మీ ఉత్తరాది రాష్ట్రాల్లో మేం ఉన్నాం. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం, పశ్చిమ్‌బంగలాంటి రాష్ట్రాల్లో మా ఉనికి ఉంది. హిమాలయ పర్వత సానువుల్లోనూ ఉన్నాం.
* మా పుట్టిళ్లు ఐరోపా, ఆసియా ఖండాలు. జపాన్‌ అడవుల్లో పుట్టామనీ చెబుతుంటారు. అందుకే జపాన్‌, కొరియాలాంటి దేశాల్లో ఎక్కువగా
పెరుగుతుంటాం. ఇక్కడి నుంచి ఇతర ఖండాల్లోకీ మా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాం.
* అన్నట్టు మా గురించి ఓ గొప్ప సంగతి
చెప్పమంటారా? అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో మా పువ్వుల్ని ఎవ్వరూ ముట్టుకోడానికి లేదు. అవి ఫెడరల్‌ ప్రోపర్టీ. అంటే ప్రభుత్వ ఆస్తి. వాటిని కోసినా అది ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం నేరం కిందికి వస్తుంది. అందుకు ఉరి శిక్ష అయినా వేసే అధికారం కోర్టుకు ఉంటుంది.

చెట్లు...

* మాలో వందకు పైగా రకాలున్నాయి.
* చాలా రకాలు 16 నుంచి 20 ఏళ్లే బతుకుతాయి. బ్లాక్‌ చెర్రీ ట్రీలాంటివి మాత్రం 250 ఏళ్ల వరకూ జీవించేయగలవు.
* బొమ్మలు, ఫర్నిచర్‌ తయారీలోనూ మా కలపను ఉపయోగిస్తారు.
* కొరియాలో మా చెక్కని విల్లుల తయారీలో వాడతారు.
* దీని నుంచి వచ్చే జిగురు పదార్థాన్ని బబుల్‌ గమ్‌ల తయారీలో వాడతారు.

పూలు...

* మాలో రకాల్నిబట్టి గులాబీ, తెలుపు రంగుల్లో పువ్వులుంటాయి.
* పూత దశలో ఉన్నప్పుడు మాకు ఆకులు తక్కువగా కనిపిస్తాయి. నిండా పూలతో మెరిసిపోతుంటాం. మంచి రంగుల్ని నిండా నింపుకొని అందరినీ ఆకర్షించేస్తాం.
* అలా పువ్వులు ఉన్నప్పుడే చెర్రీ బ్లోసమ్స్‌ ఫెస్టివల్స్‌ అంటూ మీరు పండుగలు జరుపుకొంటుంటారు. మమ్మల్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి మా దగ్గర వాలిపోతుంటారు. అమెరికా, జపాన్‌, కొరియాల్లో అయితే మరీనూ.

పండ్లు...


* మా పండ్లు కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఉంటాయి. అలాగే మాలో కొన్ని రకాల చెట్లు అచ్చంగా పుల్లటి లేదా తియ్యటి కాయల్నే ఉత్పత్తి చేస్తుంటాయి.
* మేం కాపుకొచ్చినప్పుడు ఒక్కో చెట్టూ సరాసరిన 7,000 కాయల్ని ఉత్పత్తి చేస్తుందట.
* మా పండ్లు తినడం వల్ల తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుంది.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని