చెట్టు చెప్పిన పాఠం!

ఓ అడవిలోని చెరువు పక్కన రెండు చెట్లు ఉండేవి. అందులో ఒక చెట్టేమో నిటారుగా, చాలా ఎత్తు ఉంటే.. దాని పక్కనే ఉన్న మరో చెట్టు మాత్రం వంకరటింకరగా చెరువు వైపునకు వంగి ఉండేది. నిటారుగా ఉన్న చెట్టు ఎప్పుడూ వంకరటింకర చెట్టును ఆటపట్టిస్తూ ఉండేది. ‘

Published : 24 Dec 2022 00:16 IST

ఓ అడవిలోని చెరువు పక్కన రెండు చెట్లు ఉండేవి. అందులో ఒక చెట్టేమో నిటారుగా, చాలా ఎత్తు ఉంటే.. దాని పక్కనే ఉన్న మరో చెట్టు మాత్రం వంకరటింకరగా చెరువు వైపునకు వంగి ఉండేది. నిటారుగా ఉన్న చెట్టు ఎప్పుడూ వంకరటింకర చెట్టును ఆటపట్టిస్తూ ఉండేది. ‘ఓయ్‌.. వంకరటింకర చెట్టూ... ఏంటి ఇలా అసహ్యంగా ఉన్నావు? నేను చూడు పైనుంచి కింది వరకూ ఒకేలా ఎంత అందంగా ఉన్నానో! నీవల్ల ఉపయోగం ఏంటి? నన్ను చూడు.. ఆకాశానికి అందేలా ఉన్నాను’ అంటూ ఎగతాళి చేస్తుండేది. ఆ మాటలన్నీ పడుతూ మౌనంగా ఉండిపోయేది వంకరటింకర చెట్టు. దాని మౌనాన్ని చూసి.. ఇంకా కోపం పెంచుకుంది నిటారు చెట్టు. ఆ అహంకార మాటలకు వంకరటింకర చెట్టు ఏమీ స్పందించకపోయినా, దాని మీద గూడు కట్టుకున్న గిజిగాడు పక్షికి మాత్రం ఎక్కడలేని కోపం వచ్చేది. నిటారు చెట్టు మాట్లాడే మాటలను విని బాధ పడేది.
ఒకరోజు ఉండలేక గిజిగాడు కోపంతో... ‘ఓ చెట్టూ.. నీకిది భావ్యమా! పాపం అమయకురాలైన ఈ వంకరటింకర చెట్టును ఎప్పుడూ నీ మాటలతో అవహేళన చేస్తావేందుకు? అది మంచి పద్ధతి కాదు’ అని నిటారు చెట్టుతో అంది. దానికి అది బదులిస్తూ.. ‘ఓయ్‌ పిట్టా... దాన్ని అంటే నీకెందుకు ఉలుకు? పిట్టవు పిట్టలా ఉండు. నేను అన్నదాంట్లో తప్పు కానీ అబద్ధం కానీ ఏమైనా ఉందా? ఉన్న మాటే కదా అన్నాను. ఇంకోసారి మా మధ్యలోకి రాకు!’ అంటూ హెచ్చరించింది. గిజిగాడికి కోపం వచ్చి... ‘ఓయ్‌ చెట్టూ.. ఏం చూసుకొని అంతలా విర్రవీగుతున్నావు? ఇక ఆపు నీ అహంకారపు మాటలు. ఒకరిలోని లోపాన్ని ఎత్తిచూపడం, అవహేళన చేయడం తప్పు. నువ్వు ఆకాశానికి అందుకునేలా ఉన్నా.. నాకు మాత్రం నేలను చూస్తున్న ఈ వంకరటింకర చెట్టు అంటేనే ఇష్టం. అందుకే, ఈ చెట్టుపైనే గూడు కట్టుకున్నాను. ఇలా ఉంటేనే నా గూడుకు రక్షణ ఉంటుంది. నీ అహంకారంతో ఏ పక్షికీ నీ కొమ్మల మీద చోటివ్వవు. నీవల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఇంకోసారి అవమానకరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నోరు జాగ్రత్త!’ అంటూ హెచ్చరించింది.
ఆ మాటలకు బిత్తరపోయిన నిటారు చెట్టు.. ‘ఓయ్‌ పిట్టా.. గుప్పెడంత లేని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీ ఇద్దరి సంగతి చూస్తా!’ అంటూ గట్టిగా అరిచింది. ఇదంతా చూస్తున్న వంకరటింకర చెట్టు.. ‘గిజిగాడూ.. మూర్ఖుడితో వాదన సరికాదు. అహంకారం ఎప్పటికైనా అనర్థమే. ఆ విషయం దానికే తెలిసి వస్తుంది’ అంటూ వారించింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ అడవిలోకి చెట్లను కొట్టేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అంతా తిరుగుతూ అనువైన చెట్ల కోసం వెతకసాగారు. ఆ క్రమంలో చెరువు పక్కనే ఉన్న నిటారు చెట్టు వాటికి కనిపించింది. ‘ఒరేయ్‌.. ఈ చెట్టు చూడు.. ఎంత పొడుగ్గా ఉందో.. దీన్ని నరికి అమ్ముకున్నామంటే డబ్బులే డబ్బులు’ అన్నాడు అందులో ఒక వ్యక్తి. ‘అవునురా.. ఈ చెట్టును కొట్టేద్దాం. కానీ, పక్కన ఉన్న చెట్టు వంకరటింకరగా ఉంది. ఇది వంట చెరకుకు తప్ప దేనికీ పనికిరాదు’ అన్నాడు మరొకరు.
తనను నరకడానికి సమాయత్తం అవుతున్న వారిని చూసి నిటారు చెట్టు భయపడింది. ‘అయ్యో.. నా జీవితం ఇలా ముగిసిపోవాల్సిందేనా. ఇక నాకు చావే దిక్కా? ఈ గండం నుంచి ఎలా బయటపడాలి?’ అనుకుంటూ లోలోపలే బాధ పడసాగింది. నిటారు చెట్టుకు ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని వంకర చెట్టు పసిగట్టింది. ఎలాగైనా దాన్ని రక్షించాలని అనుకుంది. బాగా ఆలోచించగా.. దానికో ఉపాయం తట్టింది. క్షణం ఆలస్యం చేయకుండా విషయాన్ని గిజిగాడుకు చెప్పింది.
ఆ ఉపాయాన్ని గిజిగాడు తక్షణమే అమలు చేసింది. తుర్రున ఎగురుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న ఓ తేనెతుట్టెను కదిపింది.
ఇంకేముంది... తేనెటీగలన్నీ చెల్లాచెదురయ్యాయి. నిటారు చెట్టును నరికేందుకు సిద్ధమవుతున్న ఆ ఇద్దరిపైన దాడి చేశాయి. దెబ్బకు బెదిరిపోయిన వాళ్లు.. సామగ్రిని అక్కడే వదిలేసి వెనుతిరిగి చూడకుండా పారిపోయారు.
తన ఉపాయం ఫలించినందుకు వంకర చెట్టు ఎంతో సంతోషించింది. ప్రాణాపాయం తప్పటంతో ఊపిరి పీల్చుకున్న నిటారు చెట్టు.. ఇన్నాళ్లూ వంకర చెట్టుతో తాను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడింది. ‘మిత్రమా.. నన్ను క్షమించు. నిజంగా నేను చూసేందుకు నిటారుగా కనిపిస్తున్నా.. నాదే వంకరబుద్ధి. నీలాంటి మంచి మనసు ఉన్న మిత్రుడిని ఇన్నాళ్లు అవహేళన చేశాను. అందుకు ఇప్పుడు సిగ్గు పడుతున్నాను’ అంటూ ఏడ్చింది. నిటారు చెట్టులో కలిగిన మార్పునకు వంకర చెట్టు పొంగిపోయింది. ఆ రోజు నుంచి ఆ రెండూ మంచి స్నేహితులయ్యాయి. గిజిగాడు పక్షి కూడా రెక్కలు ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు