Published : 04 Jan 2023 00:25 IST

ఇది పే...ద్ద సైకిలోచ్‌!

హాయ్‌ నేస్తాలూ...! మీకు సైకిల్‌ తొక్కడం వచ్చుకదా! రాకున్నా..ఫర్లేదు లే. వెంటనే నేర్చుకోవాల్సిన అవసరమూ లేదులెండి. నెమ్మదిగా దెబ్బలు తగలకుండా నేర్చుకోండి సరేనా. ఇప్పటికే సైకిల్‌ తొక్కడం వచ్చిన వాళ్లు జాగ్రత్తగా నడపండి. మరీ వేగంగా తొక్కకండి సరేనా! అసలు ఇప్పుడు ఈ సైకిల్‌ ప్రస్తావన ఎందుకో తెలుసా!

మనలాంటి పిల్లల కోసం పలు పరిమాణాల్లో బుజ్జి బుజ్జి సైకిళ్లు, పెద్ద వాళ్ల కోసం పెద్ద సైకిళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సైకిళ్లలోనూ చాలా మోడళ్లు, రకాలూ ఉన్నాయి. కానీ మీరు భారతదేశంలోనే అతిపెద్ద సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా! దాని గురించి ఎప్పుడైనా విన్నారా. ఆ సైకిల్‌ చండీగఢ్‌లో తయారైంది. దాన్ని రాజీవ్‌ కుమార్‌ అనే ఓ అంకుల్‌ తయారు చేశారు.

ఎంత ఎత్తో...!

ఇంతకీ ఈ సైకిల్‌ ఎత్తు ఎంతో ఇంకా చెప్పనేలేదు కదూ! ఒకటి కాదు, రెండు కాదు, మూడు కూడా కాదు.. ఏకంగా ఎనిమిది అడుగుల ఎత్తు. ‘అయ్య బాబోయ్‌! ఎనిమిది అడుగుల ఎత్తా?’ అని ఆశ్చర్యపోకండి. దీన్ని పది అడుగుల ఎత్తు వరకు కూడా పెంచుకోవచ్చంట మరి!

పదిలో మదిలో...

‘పదో తరగతి విద్యార్థులు ఏం చేస్తారు?’ అని ఎవ్వరైనా మిమ్మల్ని అడిగితే.. ‘బోర్డు పరీక్షల కోసం చక్కగా చదువుకుంటూ ఉంటారు’ అని సమాధానం చెబుతారు కదూ! కానీ ఈ రాజీవ్‌ కుమార్‌ అంకుల్‌ మాత్రం తాను పదో తరగతిలో ఉన్నప్పుడు సొంతంగా సైకిల్‌ తయారీ మీద ప్రయోగాలు చేశాడు. ముందుగా సైకిల్‌ సీటు ఎత్తును పెంచాడు. కానీ ఇలా పెంచితే సైకిల్‌ తొక్కడానికి కాళ్లు అందలేదు. అందుకే సైకిల్‌ చైన్‌ ఎత్తు కూడా పెంచాడు.

ముచ్చటగా మూడు!

సాధారణంగా సైకిళ్లకు ఓ చైన్‌ ఉంటుంది కదా! కానీ అంకుల్‌ తయారు చేసిన సైకిల్‌కు మూడు చైన్లుంటాయి. అసలు మీకో విషయం తెలుసా...! ఈ అంకుల్‌ 1999లోనే 13 అడుగుల ఎత్తున్న సైకిల్‌ను తయారు చేశాడు. కానీ నగరంలోని రోడ్ల మీద నడపడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో దాన్ని అప్పట్లోనే విప్పదీసి పక్కన పడేశాడు.

ఒకే ఒక్కడు!

రాజీవ్‌ కుమార్‌ అంకుల్‌ తయారు చేసిన ఈ ఎనిమిది అడుగుల సైకిల్‌ను ఎవ్వరూ నడపలేరు. దీని మీదకు చేరుకోవడం, దిగడం చాలా కష్టం. ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ ఎవ్వరూ ఈ సైకిల్‌ను నడపలేకపోయారు. రాజీవ్‌ కుమార్‌ అంకుల్‌ ఒక్కడే ఎంచక్కా ఈ సైకిల్‌ను తొక్కుతున్నాడు. అది కూడా ఈ వీధి చివరి నుంచి ఆ వీధి చివరకు, ఆ వీధి చివరి నుంచి, ఈ వీధి చివరకో అనుకునేరు. ఏకంగా వందల కిలోమీటర్లు ఈ సైకిల్‌ మీద ప్రయాణిస్తున్నాడు. చండీగఢ్‌ నుంచి లుథియానాకు దాదాపు వంద కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఆరు గంటల్లో సైకిల్‌ మీద చేరుకున్నాడు. 246 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీకి 16 గంటల్లో వెళ్లాడు. సిమ్లా నుంచి కల్కాకు మధ్య 104 కిలోమీటర్ల దూరం. దీన్ని కూడా ఆరు గంటల్లో ఈ సైకిల్‌ మీద చేరుకున్నాడు.

రికార్డుల మీద రికార్డులు...

ఇన్ని సాహసాలు చేశాడు కాబట్టే ఈ అంకుల్‌ ఇప్పటికే లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, యునిక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. భవిష్యత్తులో మరింత ఎత్తైన సైకిల్‌ తయారు చేసి, దాని మీద చండీగఢ్‌ నుంచి ముంబయి వరకు దాదాపు 1662 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకోవాలని ఆశయంగా పెట్టుకున్నాడు రాజీవ్‌ కుమార్‌ అంకుల్‌. మొత్తానికి భారతదేశంలోనే ఎత్తైన సైకిల్‌ సంగతులు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు