Moral story: గోపాలుడి వైద్యసేవలు..!

రంగాపురంలో ఉండే రాఘవాచారి చాలా పెద్ద వైద్యుడు. అతని కుమారుడు గోపాలుడు.. చదువుతో పాటుగా చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు.

Published : 23 Jun 2024 00:18 IST

రంగాపురంలో ఉండే రాఘవాచారి చాలా పెద్ద వైద్యుడు. అతని కుమారుడు గోపాలుడు.. చదువుతో పాటుగా చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు. అతను కూడా బాగా వైద్యం చేస్తాడు. చదువు పూర్తవ్వడంతో, ఒకరోజు వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి.. ‘నేను ఏదైనా పల్లెకు వెళ్లి, అక్కడ ప్రజలకు వైద్యం చేయాలని అనుకుంటున్నాను నాన్నా!’ అన్నాడు. దానికి.. ‘వేరే ఎక్కడికో వెళ్లడం ఎందుకు గోపాలా.. నా తర్వాత ఈ వైద్యశాల చూసుకోవాల్సింది నువ్వే కదా! అందుకే ఇక్కడే ఉండి.. ఆ సేవలు అందించు’ అని బదులిచ్చాడు రాఘవాచారి. ‘నిజమే కానీ.. ప్రస్తుతానికి మీరు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు కదా! కాబట్టి మీకు సహాయకుడిగా ఎవరైనా ఒకరు ఉంటే చాలు. పల్లెల్లో సరైన వైద్యం అందక.. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే నేను కొంత కాలం అలాంటి పల్లెలకు వెళ్లి.. ప్రజలకు సేవలందించాలి అనుకుంటున్నాను. ఈసారికి నా మాట కాదనకండి. మీకు నా అవసరం కలిగినప్పుడు వెంటనే వచ్చేస్తాను’ అన్నాడు గోపాలుడు. కొడుకు మాటకు ఎదురు చెప్పలేక సరేనన్నాడు రాఘవాచారి. తన దగ్గర ఉన్న కొన్ని ముఖ్యమైన మూలికలు, మందులు.. అన్నీ ఒక సంచిలో పెట్టి ఇచ్చాడు. అలా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు గోపాలుడు.

జానకిరామపురంలో చిన్న ఆసుపత్రిలో పని చేసే మంగమ్మ, అక్కడి గ్రామాధికారిని కలిసి.. ‘అయ్యా! మన వైద్యశాలకు తగిన వైద్యుడు లేడు.. సరైన మందులూ లేవు. ప్రజలకు ఏ అనారోగ్యం కలిగినా.. నగరానికి వెళ్లడం తప్ప, మరొక మార్గం కనిపించడం లేదు. మీరే చొరవ చేసి ఒక వైద్యుణ్ని నియమించండి. లేకపోతే.. ప్రజల ప్రాణాలకు చాలా ప్రమాదం. కొన్ని వ్యాధులకు తక్షణ వైద్యం చేయకపోతే రోగులు మరణించే అవకాశం ఉంది.. అందుకే ముందుగానే స్పందించడం మంచిది’ అని చెప్పింది. ‘నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఈ విషయమై మనం నగరంలో ఉండే అధికారికి లేఖ రాశాం.. ఆయన స్పందించలేదు. ఇంకేం చేయగలం. అయినా ప్రజలు కూడా అలవాటు పడ్డారు. ఏ జబ్బు చేసినా నగరానికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయి’ అన్నాడు గ్రామాధికారి.

ఇక చేసేదేం లేక.. మంగమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు సాయంత్రమే గ్రామాధికారి భార్యకు అనుకోకుండా ఆరోగ్య సమస్య వచ్చింది. వెంటనే మంగమ్మకు కబురు పెట్టాడు గ్రామాధికారి. ఆమె పరీక్షించి.. ‘అయ్యా! ఇదేదో పెద్ద సమస్యలానే ఉంది. వెంటనే నగరానికి తీసుకెళ్లడం మంచిది. లేదంటే.. ప్రాణాలకే ప్రమాదం’ అంది. ‘మీరు చెప్పినా నా బాధ్యత మరచి ప్రవర్తించాను. ఒక మంచి వైద్యుణ్ని నియమించి ఉంటే.. ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు’ అనుకుంటూ.. అప్పటికప్పుడు ఎడ్ల బండిలో తన భార్యను తీసుకొని నగరానికి పయనమయ్యాడు గ్రామాధికారి. కొంత దూరం వెళ్లేసరికి మబ్బులు కమ్ముకున్నాయి. చిన్నగా వర్షం కూడా మొదలైంది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో.. బండి చక్రం గోతిలో పడి ఆగిపోయింది. దాంతో తన భార్యను ఎలా రక్షించుకోవాలో తెలియక.. సతమతమయ్యాడు గ్రామాధికారి. అప్పటికే ఆమె స్పృహ తప్పింది. అప్పుడే అటుగా వస్తున్న గోపాలుడు అక్కడ ఆగి.. ‘అయ్యా బండి నెట్టడంలో సహాయం చేయనా?’ అని అడిగాడు. ‘సమయానికి వచ్చావు నాయనా! నా భార్య ఆరోగ్యం బాగోలేదు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. కాస్త సాయం చేయి’ అన్నాడు గ్రామాధికారి. ‘అయ్యో! అలాగా.. నేను వైద్యుణ్నే. నన్ను ఒకసారి చూడనివ్వండి’ అంటూ ఆమెను పరిశీలించి.. ఆ వ్యాధికి తగ్గ మందులు ఇచ్చాడు గోపాలుడు. కాసేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది. తర్వాత మరో మందు ఇచ్చాడు. ‘ఇక ఈమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. మరికొన్ని మందులు ఇస్తాను. వాటిని క్రమం తప్పకుండా వాడితే జబ్బు పూర్తిగా నయం అవుతుంది’ అన్నాడు.

‘సమయానికి వచ్చి నా భార్యను రక్షించావు. మా ఊరిలో వైద్యశాల ఉంది.. కానీ వైద్యులు లేరు. నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాము. అక్కడికి వచ్చి.. నీ వైద్య సేవలు అందించగలవా?’ అడిగాడు గ్రామాధికారి. ‘నేను కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండే.. ప్రజలకు వైద్య సేవలు అందించాలనే బయలుదేరాను. తప్పకుండా మీ గ్రామానికి వస్తాను’ అని బదులిచ్చాడు గోపాలుడు. అలా జానకిరామపురంలోని వైద్యశాలలో చేరిన.. తక్కువ కాలంలోనే, మంచి పేరు తెచ్చుకున్నాడు గోపాలుడు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా తన దగ్గరకే వచ్చి వైద్యం చేయించుకోసాగారు. కుమారుడికి వైద్యుడిగా మంచి పేరు రావడంతో రాఘవాచారి కూడా సంతోషించాడు.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని