Updated : 17 Sep 2019 02:03 IST

సాగర తీరాలు... ఎన్నెన్నో వర్ణాలు!

ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్లారా? అక్కడ ఇసుక ఏ రంగులో ఉంది? కాస్త తెల్లగానో... లేకపోతే గోధుమరంగులోనొ అంటారా? మనం మన దగ్గర ఎక్కువగా ఇలాంటి వాటినే చూస్తుంటాం. కానీ, ప్రపంచం మొత్తంలో రంగు రంగుల బీచ్‌లు బోలెడున్నాయి... ఊదా, పచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు...ఇలాగన్నమాట! వాటిలో కొన్నింటి గురించి చదివేద్దాం రండి మరి...

పగడాలు పరచినట్టు...!

ఎర్రటి సముద్ర తీరం అనగానే స్పెయిన్‌లోని కిక్కోని రెడ్‌ బీచ్‌ పేరే వినిపిస్తుంది. ఇది అక్కడి సంతోరి ద్వీప తీరం. 
* అగ్ని పర్వతాలు పేలడం వల్ల బీచ్‌లు చాలా వరకూ నల్లగా తయారవుతాయి. కానీ ఒక్కోసారి అగ్నిపర్వత లావాల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. 
* అలాంటివి పేలినప్పుడు లావా పరుచుకునిపోయి ఎర్ర రంగులోనే నేలంతా తయారైపోతుంది. అలాగే ఇది ఏర్పడింది.

పచ్చలు చల్లినట్టు...!

అమెరికాలోని హవాయిలో మహనా బీచ్‌ అని ఒకటుంది. అక్కడ ఇసుకంతా ఎంచక్కా పచ్చగా ఉంటుంది. అందుకే ముద్దుగా అంతా దీన్ని గ్రీన్‌ సాండ్‌ బీచ్‌ అనేస్తారు. 
* ఇక్కడి ఇసుకలో అలివిన్‌ ఖనిజం ఎక్కువగా ఉంది. ఈ చుట్టుపక్కల గతంలో అగ్ని పర్వతాల పేలుళ్లు జరిగాయి. అప్పుడు భూ గర్భంలోని నీరు మాగ్మాతో కలిసిపోయింది. అందుకే ఇక్కడి ఇసుకలో చిన్న చిన్న అలివిన్‌ క్రిస్టల్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడ ఇసుక ఇలా ప్రత్యేకమైన రంగులో ఉంటుంది. 
* ఇలాంటి పచ్చ తీరాలు ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నాయట. వాటిల్లో ఇదీ ఒకటన్నమాట. 

కాటుక పెట్టినట్టు...!

తీరమంతా నల్లని కాటుక పెట్టుకుంటే ఎలాగుంటుంది? ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న బీచ్‌లాగే ఉంటుంది. ఇది అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉంది. దీని పేరు కైము బీచ్‌ పార్క్‌. 
* 1990ల్లో ఇక్కడున్న అగ్ని పర్వతం పేలింది. ఆ లావా ఇక్కడ పెద్ద ఎత్తున పేరుకుపోయింది. కొంత సముద్రంలోకి పారి చల్లబడి అక్కడే రాళ్లలా తయారయ్యింది. 
* అలల ఒరిపిడికి కొంత లావా చిన్న చిన్న రేణువుల్లా తయారైంది. దీంతో ఇక్కడి ఇసుక నలుపు రంగు సంతరించుకుంది. 
* సముద్రపు పచ్చ తాబేళ్లు ఇక్కడ బాగా కనిపిస్తుంటాయి.

గులాబీలు పోసినట్టు...!

కరీబియన్‌ దీవుల్లో బహమాస్‌ అని ఓ దేశం ఉంది కదా. అక్కడి హార్బర్‌ ఐలాండ్‌ లేత గులాబీ రంగు బీచ్‌కి ప్రసిద్ధి. ఇక్కడ అట్లాంటిక్‌ మహా సముద్రం పక్కగా ఉండే ఇసుక అంతా లేత గులాబీ రంగులో మెరిసిపోతుంటుంది. 
* దాదాపు మూడు మైళ్ల దూరం అంతా ఇలాంటి ఇసుకే కనిపిస్తుంటుంది.
* ప్రపంచంలోని అందమైన బీచ్‌ల్లో ఒకటిగా ఇది స్థానం సంపాదించుకుంది.
* ఫోరమినిఫెరా అని ఓ రకం ఏకకణ జీవులుఉన్నాయి. వీటిని కోరల్‌ ఇన్‌సెక్ట్స్‌ అనీ అంటారు. ఇవి ఇక్కడ ఇసుకలో కుప్పలుతెప్పలు. అవే ఈ రంగుకు కారణమయ్యాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు